మైదామ్‌లు: ఇవి ఇండియన్ పిరమిడ్‌లా? యునెస్కో గుర్తించిన ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎక్కడుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సచిన్ గొగోయి
- హోదా, బీబీసీ మానిటరింగ్
మధ్య యుగాల కాలంలో అస్సాంలో అహోం రాజవంశీకులు ఎవరైనా మరణిస్తే వారితో పాటు సేవకులను, అంగరక్షకులను వారితో పాటే ‘మైదామ్’లలో సమాధి చేసేవారు.
ఈ అస్సాం మైదామ్‌లను ఇటీవలే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో చేర్చారు.
కొద్దిరోజుల కిందట నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అస్సాం మైదామ్‌లను ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చాలన్న భారతదేశ నామినేషన్‌ను ఆ సమావేశంలో ఆమోదించారు.
అస్సాం అంతటా మైదామ్‌లు కనిపిస్తుంటాయి. ఇవి వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి.
అయితే, నాగా కొండల దిగువన ఉన్న చరాయీదేవ్ ప్రాంతంలో అస్సాం రాజవంశీకులు, అప్పటి ప్రముఖుల సమాధులను కలిగిన ఉన్న మైదామ్‌లను ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చేర్చారు.


ఫొటో సోర్స్, Nabul Konwar
పిరమిడ్‌లకు వీటికి పోలికలేంటి? తేడాలేంటి
ఈ మైదామ్‌లలోకి వెళ్లేందుకు చిన్నపాటి సొరంగంలా ప్రవేశ మార్గం ఉంటుంది. అర్ధగోళాకారంలో ఉండే వీటిపై మట్టితో కప్పి ఉంటుంది.
చుట్టూ అష్టభుజి ఆకారంలో ప్రహరీ ఉంటుంది. ఈ ప్రహారీకి గేటు ఉంటుంది.
మైదామ్‌లలోకి ప్రవేశించే మార్గాలను మొదట్లో కర్ర స్తంభాలతో నిర్మించేవారు. తరువాత కాలంలో రాళ్లు, ఇటుకలు వాడడం ప్రారంభించారు.
చనిపోయినవారి సామాజిక స్థాయిని బట్టి మైదామ్‌ల భారీతనం, ఇతర హంగులు ఉంటాయి. కొన్ని మామూలు చిన్న మట్టి మైదామ్‌లు కాగా మరికొన్ని బహుళ అంతస్తుల మైదామ్‌లు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
598 ఏళ్లు నిరాటంకంగా పాలించిన ఘనత అహోం రాజుల సొంతం
ఈ మైదామ్‌లు అహోం రాజులకే ప్రత్యేకం. దేశంలో 1228 నుంచి 1826 వరకు సుదీర్ఘ కాలం అవిచ్ఛిన్నంగా ఒక సామ్రాజ్యాన్ని పాలించిన వంశంగా అహోంలకు పేరుంది.
దేశంలో మరే రాజవంశం ఇలాంటి తరహా సమాధులను కలిగి లేదు.
తాయీ అహోంలు అని కూడా పిలిచే ఈ అహోంలు ప్రస్తుత చైనాలోని యూనాన్ రాష్ట్రంలో ఉన్న మాంగ్ మావో ప్రాంతం నుంచి వచ్చినవారు.
అహోం రాజు రుద్ర సింగ కంటే ముందు వీరికి ప్రత్యేకమైన మతాచారాలు, దేవతామూర్తులు ఉండేవి. 39 మంది అహోం రాజులలో రుద్ర సింగ 30వ రాజు.
అయితే రుద్ర సింగ హిందూ మతాన్ని స్వీకరించారు. 1696 నుంచి 1714 వరకు రుద్రసింగ పాలించిన కాలంలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఆయన ప్రోత్సహించారు.
అహోంలు హిందూ మతాన్ని స్వీకరించిన తరువాత కూడా మైదామ్‌ల నిర్మాణం కొనసాగిందని, అయితే.. మైదామ్‌లలో మృతదేహాలను ఉంచడం కాకుండా అస్తికలు ఉంచడం ప్రారంభించారని స్థానిక చరిత్ర పుస్తకాలు కొన్ని చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, Nabul Konwar
ఈజిప్ట్ పిరమిడ్‌లతో పోలిక
ఈ మైదామ్‌లను కొందరు ఈజిప్ట్ పిరమిడ్‌లతో పోల్చుతుంటారు. రెండూ సమాధి స్థలాలే.
అయితే, రెండింటి నిర్మాణ శైలి, నిర్మాణ సామగ్రి భిన్నమైనవి. అంతేకాదు.. రెండూ వేర్వేరు కాలాలకు చెందిన నిర్మాణాలు.
పిరమిడ్‌లు క్రీస్తు పూర్వం 2700 నుంచి క్రీస్తు పూర్వం 1500 మధ్య కాలపు నిర్మాణాలు కాగా మైదామ్‌లు క్రీస్తు శకం 1228 నుంచి 1826 మధ్య నిర్మించినవి.
అహోంలు మృతదేహాలను పిరమిడ్లలోని మమ్మీల్లా కాకుండా స్థానికంగా దొరికే కొన్ని మూలికల సాయంతో ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా చేసేవారు.

ఫొటో సోర్స్, Nabul Konwar
రాజులు, రాణులతో పాటు సేవకులు, అంగరక్షకులూ సమాధిలోకి..
అహోంలు మైదామ్‌లలో ఖననం చేసిన తమ పాలకుల కోసం వాటిలో సేవకులను, అంగరక్షుకులను, ఒక్కోసారి పశువులను కూడా ఉంచేవారు.
పాలకులు చనిపోయినప్పుడు మైదామ్‌లలో వారిని ఖననం చేసేముందు వారితో పాటు ఖననం చేయడానికి కొందరు సేవకులు, అంగరక్షకులను, పశువులను చంపేవారని కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
అలాకాకుండా రాజును మైదామ్‌లలో ఖననం చేశాక, కొందరు సేవకులు, అంగరక్షకులను లోపల ఉంచి తాళం వేసేసేవారన్న వాదనలూ ఉన్నాయి.
‘సేవకులు, అంగరక్షకులు రాజు పట్ల విధేయతతో స్వచ్ఛందంగానే ముందుకొచ్చేవారని, మైదామ్‌లలో రాజు లేదా రాణితో పాటే సమాధి కావడానికి సిద్ధమయ్యేవారని చారిత్రక పత్రాలు సూచిస్తున్నాయని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తాయీ స్టడీస్ అండ్ రీసెర్చ్’ డైరెక్టర్, చరిత్రకారుడు గిరిన్ ఫుకాన్ చెప్పారు.
అయితే, ఈజిప్ట్ ఫారో చక్రవర్తులు పిరమిడ్‌లలో ఇలాంటి ఆచారమేమీ పాటించేవారు కాదు.
అంతేకాదు.. భారీతనం, హంగులలో కూడా పిరమిడ్ల కంటే మైదామ్‌లు బాగా చిన్నవి.
ఈ మైదామ్‌లలోని రాజులు, రాణుల సమాధులలో భారీగా బంగారం, ఇతర విలువైన వస్తువులూ ఉంచేవారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సమాధులను కొల్లగొట్టించిన ఔరంగజేబు’
మొఘల్ రాజు ఔరంగజేబు 1662లో తన జనరల్ మీర్ జుమ్లాను అస్సాంపై దాడికి పంపించడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారుడు హితేశ్వర్ బర్బారువా తన ‘అహోమొర దిన్’ పుస్తకంలో రాశారు.
మైదామ్‌లను దోచుకోవడమనేది మీర్ జుమ్లాతోనే మొదలైంది. ఆ తరువాత బర్మావాళ్లు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కూడా అస్సాం అంతటా అనేక మైదామ్‌లను కొల్లగొట్టారు.
అనంతర కాలంలో అహోం రాజులు కూడా కొందరు మైదామ్‌లను తవ్వి సమాధుల నుంచి తమ పూర్వీకుల అస్తికలను తీసి గంగలో కలిపారని హితేశ్వర్ రాశారు.
అహోం రాజుల్లో చివరివాళ్లలో ఒకరైన పురందర సింగ మైదామ్‌లను తవ్వమని ఆజ్ఞాపించారని హితేశ్వర్ తన పుస్తకంలో రాశారు.
‘చారిత్రక విలువ ప్రకారం మైదామ్‌లు పిరమిడ్‌ల కంటే ఏమాత్రం తక్కువ కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో ఇప్పటికే ఉన్న అస్సాం కజరంగ నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్‌లతో ఇప్పుడు చరాయిదేవ్ మైదామ్ స్థలం చేరింది. ఈ మూడు గొప్ప ప్రదేశాలతో పాటు పర్యటకులను ఆకర్షించేందుకు అస్సాంలో మరెన్నో ఆకర్షణీయ స్థలాలున్నాయి’ అని అస్సాం పర్యటక మంత్రి జయంత మల్ల బారువా ‘బీబీసీ’తో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













