ఏనుగులు మనుషుల్లాగే పేర్లు పెట్టి పిలుచుకుంటాయా?

ఏనుగులు, వైల్డ్‌లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలో రెండు రకాల ఏనుగులే ఉన్నాయి. అవి ఆసియా ఏనుగులు (ఏషియన్ ఎలిఫెంట్స్), ఆఫ్రికా ఏనుగులు (ఆఫ్రికన్ ఎలిఫెంట్స్).

ఆఫ్రికన్ ఏనుగులు మనుషుల్లాగే ఒకదానినొకటి పేరుపెట్టి పిలుచుకుంటాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసర్చర్ మైకేల్ బార్టో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రియన్ ఏనుగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించింది.

అయితే, ఆసియా ఏనుగులు కూడా అలాగే చేస్తాయా? అవి ఒకదానితో మరోటి ఎలా మట్లాడుకుంటాయి? వాటి సామాజిక నిర్మాణం ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు
ఏనుగులు, వైల్డ్‌లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

'ఇతరులకు హాని కలిగించని జీవి'

' ఈ ప్రకృతిలో ఏనుగు అనేది ఒక అద్భుతం. ఇతరులకు హాని తలపెట్టని ఏకైక జీవి' అని 15వ శతాబ్దానికి చెందిన ఒక ఇంగ్లిష్ కవి రాశారు.

పై వాక్యాలు చదివిన తర్వాత, ఏనుగులు మనుషులపై దాడి చేయడం, వెంటపడి తరమడం తాము చూశామని కొందరు అనుకోవచ్చు. ''ఎన్నో ఏళ్ల అనుభవంతో చెప్తున్నా, మనుషులతో కలిగిన గత అనుభవాలను బట్టి ఏనుగుల ప్రవర్తన ఉంటుంది'' అని రచయిత, వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్, బయాలజిస్ట్ సంగీత అయ్యర్ చెప్పారు.

ఆసియా ఏనుగుల సంరక్షణ కోసం సంగీత 2016లో ''వాయిసెస్ ఫర్ ఏషియన్ ఎలిఫెంట్స్'' అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏనుగులపై పరిశోధనలు చేస్తోంది.

''సంతానోత్పత్తి సమయంలో మగ ఏనుగులు మాస్ట్ అనే శ్లేష్మాన్ని విడుదల చేస్తాయి. ఆ సమయంలో ఏనుగులు చాలా క్రూరంగా ఉంటాయి. ఏవి అడ్డొచ్చినా నాశనం చేసుకుంటూ ముందుకు సాగిపోతాయి. మేం అలాంటి ఒక మగ అడవి ఏనుగును ఎదుర్కోవాల్సి వచ్చింది'' అని సంగీత చెప్పారు.

సంగీత అయ్యర్, వైల్డ్‌లైఫ్

ఫొటో సోర్స్, @Sangita4eles/X

ఫొటో క్యాప్షన్, సంగీత అయ్యర్

తన వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ కోసం సంగీత ఈ ఏడాది ప్రారంభంలో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు.

''మా బృందం వెళ్తున్న వాహనానికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఏనుగు ఆగింది. దాని చెవుల నుంచి నీరు వస్తోంది. చాలా దూకుడుగా కనిపిస్తున్న ఆ ఏనుగు మావైపు కదిలింది. మేం వాహనం ఇంజిన్ ఆపేసి చూస్తున్నాం. వెదురు చెట్లను తినుకుంటూ మా వైపు వచ్చింది. మేం భయపడలేదు, అరవలేదు'' అంటూ ఆ రోజు ఏం జరిగిందో సంగీత చెప్పారు.

తమపై దాడి చేసేందుకు అన్నట్లుగా నటిస్తూ దాదాపు 18 నిమిషాల పాటు రోడ్డుకి అడ్డంగా ఆ ఏనుగు నిలబడిందని ఆమె గుర్తు చేసుకున్నారు.

''ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయింది. బురదలో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన ఏనుగు దాడి చేయకుండా ఎలా వెనుదిరిగిందా అని ఆ వీడియో చూసిన చాలా మంది జంతు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అందుకే చెప్తున్నా, మనతో వాటికి ఎదురైన అనుభవాలను బట్టి వాటి స్పందన ఉంటుంది'' అని సంగీత అన్నారు.

ఏనుగులు, వైల్డ్‌లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఏనుగులు ఎలా మాట్లాడుకుంటాయి?

మైకేల్ బార్టో బృందం 1986 నుంచి 2022 మధ్య కెన్యాలోని నేషనల్ పార్కులు, అటవీ ప్రాంతాలు, సవన్నా అడవుల్లోని దాదాపు 625 ఏనుగుల స్వరాలను విశ్లేషించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాటిని విశ్లేషించారు.

మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా మరో ఏనుగును పేరుపెట్టి పిలిచి, దానికి సందేశం ఇస్తాయని ఆ విశ్లేషణ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఈ బృందం గతంలో చేసిన పరిశోధనల్లో ''డాల్ఫిన్లు ఒకదానితో మరోటి నిర్దిష్టమైన విజిల్ శబ్దంతో అనుకరిస్తాయి. చిలుకలు మరో నిర్దిష్ట చిలుకను అలాగే అనుకరిస్తాయి'' వంటి ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి.

కానీ, ఏనుగులపై జరిపిన అధ్యయనంలో, అవి విభిన్నమైన కిచకిచమనే శబ్దాలు చేస్తాయని తేలింది.

ఏనుగులు ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన ఒక శబ్దాన్ని ఉపయోగించడమే కాకుండా, వాటి కోసం చేసిన శబ్దాలకు అవి ప్రతిస్పందిస్తాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.

దీనిని ధ్రువీకరించుకోవడానికి బార్టో బృందం 17 ఏనుగుల ముందు వారు రికార్డ్ చేసిన శబ్దాలను ఉపయోగించారు. అప్పుడు ఆ ఏనుగుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను కూడా వారు గమనించారు.

నిర్దిష్ట ఏనుగు 'పేరు' పిలిస్తే, ఆ ఏనుగు ఉత్సాహంగా శబ్దం వచ్చిన వైపు పరుగెత్తుతోంది. ఆ శబ్దంపై ఆ ఒక్క ఏనుగు మాత్రమే శ్రద్ధ చూపుతోంది. ఇతర ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదని అధ్యయనం పేర్కొంది.

ఏనుగులు, వైల్డ్‌లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఆసియా ఏనుగులకూ వర్తిస్తుందా?

''ఏనుగులు తొండంతో అరవడం, గుసగుసలతో పాటు మనుషులు వినలేని ఇన్‌ఫ్రాసోనిక్ శబ్దాలతో కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. కాబట్టి ఈ అధ్యయన ఫలితాలు మాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు'' అని వైల్డ్‌లైఫ్ రీసర్చర్ డాక్టర్ లక్ష్మీనారాయణన్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ, ''ఏనుగులు తమ గుంపులోని ఇతర ఏనుగులను చూసి అన్నీ నేర్చుకుంటాయి. ఇవి కేవలం శబ్దాల ద్వారా మాత్రమే కాకుండా మూత్రం, లాలాజలం, పేడ ద్వారా కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి'' అన్నారాయన.

మైకేల్ బార్టో బృందం ఆఫ్రికన్ ఏనుగులపై చేసిన అధ్యయనం ఏషియన్ ఏనుగులకూ వర్తిస్తుందని, భారత్‌లోనూ ఏనుగుల సంభాషణలపై అధ్యయనాలు నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

''ఎక్కడైనా మనుషులు ఉంటే, ముందున్న ఏనుగు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఏనుగులు వీలైనంత వరకూ మనుషులకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాయి'' అని లక్ష్మీనారాయణన్ చెప్పారు.

ఏనుగులు, వైల్డ్‌లైఫ్
ఫొటో క్యాప్షన్, రామకృష్ణన్ 23 ఏళ్లుగా ఏనుగులపై అధ్యయనం చేస్తున్నారు

ఏనుగుల సామాజిక నిర్మాణం

''ఒక్కో ఏనుగు రోజుకు 250 కిలోల ఆహారం తీసుకుంటుంది. 150 లీటర్ల నీరు తాగుతుంది. కాబట్టి ఒక్కరోజులో అంత ఆహారం, నీరు దొరక్కపోతే అవి 40 కి.మీ నుంచి 50 కి.మీ. ప్రయాణిస్తాయి. మందను ఆడ ఏనుగు నడిపిస్తుంది'' అని పి.రామకృష్ణన్ చెప్పారు.

ఊటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వైల్డ్‌లైఫ్ విభాగంలో 12 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు రామకృష్ణన్. ఆయన 23 ఏళ్లుగా ఏనుగులపై అధ్యయనం చేస్తున్నారు. ఏనుగుల మూలాలపై పరిశోధించిన రామకృష్ణన్ పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు.

‘‘మందను ముందుండి నడిపించే ఆడ ఏనుగుకు తన మంద కాకుండా ఇంకా ఆ ప్రాంతంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయో కచ్చితంగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలోకి కొత్త ఏనుగు వచ్చినా అది కనిపెడుతుంది. అవి పేరు పెట్టి పిలుచుకోవడంతో పాటు చాలా పద్ధతుల్లో కమ్యూనికేషన్ చేసుకుంటాయి'' అని రామకృష్ణన్ చెప్పారు.

''చిన్న మందలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగులు కలిసే ఉంటాయి. మగ ఏనుగులు ఏకాంతాన్ని ఇష్టపడతాయి. కానీ ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించే సమయంలో అవి కూడా మందలో కలిసిపోతాయి. మూడు, నాలుగు చిన్న మందలు కలిసి ప్రయాణం సాగిస్తాయి.

ఏనుగు గర్భంతో ఉన్నప్పుడు, మిగిలిన ఏనుగులు దాని చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడతాయి. ఒకవేళ ఏదైనా ఏనుగు మంద నుంచి విడిపోతే ఆ మందకు నేతృత్వం వహిస్తున్న ఏనుగు ప్రత్యేక శబ్దాలు చేయడాన్ని మేం చాలాసార్లు గమనించాం'' అని ఆయన చెప్పారు.

భారత్‌లో ఏనుగులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాలని ఆయన అంటున్నారు.

''2010లో కేంద్ర ప్రభుత్వం ఏనుగును 'జాతీయ వారసత్వ జంతువు'గా ప్రకటించిన తర్వాత ఏనుగుల సంరక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే, గత కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏనుగులను రక్షించడమంటే ప్రకృతిని రక్షించడమనే విషయాన్ని మనం మరచిపోకూడదు'' అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)