ప్రపంచంలో ప్రస్తుతం బతికున్న పురుషుల్లో ఈయనే అందరికంటే పెద్ద

జాన్ టిన్నిస్‌వుడ్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, జాన్ టిన్నిస్‌వుడ్ యువకునిగా చాలా చురుగ్గా ఉండేవారు
    • రచయిత, గెమ్మా షెర్లాక్ & పీఏ మీడియా
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోని అత్యంత వృద్ధ పురుషుడు ఈయనే. ఇంగ్లండ్‌లోని మెర్సీసైడ్ ప్రాంతానికి చెందిన ఈయన పేరు జాన్ టిన్నిస్‌వుడ్.

112వ పుట్టినరోజును జరుపుకొంటున్న జాన్ టిన్నిస్‌వుడ్, తాను ఇంతకాలం జీవించడం వెనుక ప్రత్యేక రహస్యాలు ఏమీ లేవని అన్నారు.

జాన్ 1912, ఆగస్ట్ 26న లివర్‌పూల్‌లో జన్మించారు.

ఇంతకాలం జీవించడానికి కారణం తనకు అసలు తెలియదని ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌’కు జాన్ చెప్పారు.

సౌత్‌పోర్ట్‌లోని సంరక్షణ గృహంలో టిన్నిస్‌వుడ్ నివసిస్తున్నారు.

114 ఏళ్ల జువాన్ విసెంటే పెరెజ్ మోరా ఏప్రిల్‌లో మరణించాక, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా జాన్ టిన్నిస్‌వుడ్ గుర్తింపు పొందారు.

యువకుడిగా ఉన్నప్పుడు తాను చాలా చురుగ్గా ఉండేవాడినని, ఎక్కువగా నడిచేవాడినని ఆయన తెలిపారు.

తాను ఎవరికీ భిన్నం కాదని టిన్నిస్‌వుడ్ భావిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

టైటానిక్ నౌక మునిగిపోయిన సంవత్సరంలో జన్మించిన టిన్నిస్‌వుడ్ ఇప్పుడు తన 112వ పుట్టిన రోజును మిగతా అన్ని పుట్టిన రోజుల మాదిరే చూస్తానని అన్నారు.

"నేను ఇంత కాలం ఎలా జీవించగలిగానో అసలు తెలియదు. ఏవో ప్రత్యేక రహస్యాలు ఉన్నాయని నేను అనుకోను’’ అని అన్నారు.

“యువకునిగా ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడిని, ఎక్కువగా నడిచేవాడిని.. దానికి, ఎక్కువ కాలం బతకడానికి ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు’ అని చెప్పారు.

టిన్నిస్‌వుడ్‌ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్‌‌ను బాగా అభిమానిస్తారు. లివర్‌పూల్‌ క్లబ్‌ను స్థాపించిన 20 సంవత్సరాల తర్వాత ఆయన జన్మించారు.

స్కాటిష్ ఫుట్‌బాల్ ప్లేయర్ బిల్లీ లిడెల్, ఇంగ్లిష్ ఫుట్‌బాలర్ డిక్సీ డీన్‌లను అప్పట్లో మిద్దె పైకి ఎక్కి చూసేవాళ్లమని ఆయన గుర్తుకు చేసుకున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు టిన్నిస్‌వుడ్‌ వయసు రెండేళ్లు.

రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన తన 27వ పుట్టిన రోజును జరుపుకొన్నారు.

ఆయన ఆర్మీ పే కార్ప్స్‌లో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి వాళ్లలో జీవించి ఉన్నవారిలో అత్యంత వృద్ధుడు ఈయన.

టిన్నిస్‌వుడ్, ఆయన భార్య బ్లాడ్‌వెన్

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, టిన్నిస్‌వుడ్ బ్లాడ్‌వెన్‌ను 1942లో వివాహం చేసుకున్నారు

జాన్ టిన్నిస్‌వుడ్ తన భార్య బ్లాడ్‌వెన్‌ను లివర్‌పూల్‌లో ఒక డ్యాన్స్ వేడుకలో కలిశారు. వారు 1942లో వివాహం చేసుకున్నారు.

1943లో వాళ్లకు కుమార్తె సుసాన్ జన్మించింది. 1986లో టిన్నిస్‌వుడ్ భార్య చనిపోయారు.

ప్రపంచ యుద్ధం తర్వాత టిన్నిస్‌వుడ్ షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేశారు. 1972లో ఆయన ఉద్యోగ విరమణ పొందారు.

ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య పద్ధతులను తాను పాటించలేదని, నచ్చిన ఆహారాన్ని, చేపలను, చిప్స్‌ను ప్రతి శుక్రవారం తినేవాడినని ఆయన తెలిపారు.

"నాకు ఇచ్చేది నేను తింటాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ అదే తింటారు" అని ఆయన చెప్పారు. తనకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వరని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక కేర్ హోమ్‌లో ఉంటున్నారు.

ఆరోగ్యకరమైన జీవనం కోసం చేయాలనుకున్న, చేయగలిగే దానికంటే ఎక్కువగా ఎప్పుడూ చేయొద్దని ఆయన సూచిస్తున్నారు.

‘‘మనమంతా రకరకాల వ్యక్తులం. ఆ తేడాను మనం గ్రహించాలి. ఎవరికి తగ్గట్టు వారు నియమాలు పెట్టుకోవాలి. లేదంటే ఏదీ మనం అనుకున్నట్టు జరగదు’’ అని టిన్నిస్‌వుడ్ తెలిపారు.

టిన్నిస్‌వుడ్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, టిన్నిస్‌వుడ్ రెండు ప్రపంచ యుద్ధాలనూ చూశారు

2012లో ఆయనకు 100 ఏళ్లు నిండినప్పటి నుంచి, ప్రతి ఏడాది రాజు/రాణి నుంచి పుట్టిన రోజు కార్డును అందుకుంటున్నారు జాన్.

మొదట దివంగత క్వీన్ ఎలిజబెత్ II నుంచి (ఆమె ఆయనకన్నా దాదాపు 14 ఏళ్లు చిన్నవారు), ఆ తరువాత కింగ్ చార్లెస్ III నుంచి ఆయనకు పుట్టిన రోజు కానుక అందింది.

తన బాల్యం నాటి రోజులకు, ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయిందని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు పెద్దగా మారలేదని అన్నారు.

ప్రపంచంలో ఇంతవరకు అత్యంత ఎక్కువ కాలం జీవించిన పురుషుడు జిరోమన్ కిమురా. జపాన్‌కు చెందిన ఆయన 2013లో తన 116 సంవత్సరాల 54 రోజులు వయసులో మరణించారు.

ఇక ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్నవాళ్లలో అత్యంత పెద్ద వయసు వ్యక్తి జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా. ఆమె వయసు 116 ఏళ్లు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)