‘కెటామైన్ క్వీన్’ అనిపించుకున్న జస్వీన్ సంఘా ఎవరు? నటుడు మాథ్యూ పెర్రీ మరణంలో ఆమెపై ఆరోపణలేంటి?

జస్వీన్ సంఘా

ఫొటో సోర్స్, Jasveen Sangha's social media

ఫొటో క్యాప్షన్, జస్వీన్ ఫ్రెండ్స్ మాథ్యూ పెర్రీకి కెటామైన్ డ్రగ్ ఇచ్చారని, అది ఆయన మరణానికి దారితీసిందని అభియోగపత్రం పేర్కొంది.
    • రచయిత, మలు కర్సినో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా పాపులర్ టెలీవిజన్ షో ‘ఫ్రెండ్స్’లో నటుడైన స్టార్ మాథ్యూ హఠాన్మరణానికి కారణమైన డ్రగ్స్‌ను సరఫరా చేయడంలో కీలకమైన వ్యక్తి జస్వీన్ సంఘా అనే మహిళ అని అమెరికా పోలీసులు చెబుతున్నారు.

జస్వీన్ నిర్వహించే డ్రగ్స్ నెట్‌వర్క్‌ను చూసిన అమెరికా ప్రాసిక్యూటర్లు ఆమెను ‘కెటామైన్ క్వీన్’గా అభివర్ణిస్తున్నారు.

మాథ్యూ పెర్రీకి డ్రగ్స్ వ్యసనం ఉందని, దాన్ని జస్వీన్ సంఘా, ఇంకా ఆమె గ్రూప్ తమ సంపాదన కోసం ఉపయోగించుకుందని అధికారులు చెబుతున్నారు. అధికంగా మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల మాథ్యూ పెర్రీ మరణించినట్లు తేలింది.

అమెరికన్, బ్రిటీష్ పౌరసత్వం ఉన్న జస్వీన్‌పై తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో కెటామైన్ పంపిణీకి కుట్ర పన్నడం, మరణానికి కారణమైన డ్రగ్ పంపిణీ వంటివి ఉన్నాయి. జస్వీన్ గురువారం కోర్టుకు హాజరయ్యారు, అయితే ఆమె నేరాన్ని అంగీకరించలేదు.

అదే క్రమంలో బెయిల్ కోసం జస్వీన్ చేసిన అభ్యర్థనను అమెరికా అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అక్టోబర్‌ కోర్టు వాయిదా వరకు కస్టడీలోనే ఉంటారు.

వాట్సాప్
మాథ్యూ పెర్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాథ్యూ పెర్రీ (ఫైల్ ఫొటో)

ఏమిటీ కెటామైన్?

2023 అక్టోబర్ 24న మాథ్యూ పెర్రీకి జస్వీన్ కెటామైన్ ఇచ్చారని, అది ఆయన మరణానికి దారితీసిందని అభియోగపత్రం పేర్కొంది.

అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కెటామైన్ అనేది ఒక మత్తు మందు. ఇది తీసుకున్న వారికి హ్యాలూసినేషన్స్‌ (చిత్తభ్రమ) కలిగిస్తుంది. వాళ్లు చూసేది, వినేది అంతా వాస్తవం కాదన్నట్లు అనిపిస్తుంది. తమ పరిసరాల నుంచి డిస్‌కనెక్ట్ అయినట్లు నియంత్రణలో లేని అనుభూతిని కలిగిస్తుంది. దీనిని వ్యక్తులు, జంతువులకు మత్తుమందుగా ఉపయోగిస్తారు.

వైద్యుడు మాత్రమే కెటామైన్‌ను ఇవ్వాలని విచారణ అధికారులు తెలిపారు. అది చాలా హానికరం కాబట్టి దానిని తీసుకునే రోగులకు నిపుణుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. జస్వీన్ 2019 నుంచి కెటామైన్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

జస్వీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్

ఫొటో సోర్స్, US District Court

ఫొటో క్యాప్షన్, జస్వీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్

‘ఆమె ఇల్లే ఒక డ్రగ్ స్టోర్’

నార్త్ హాలీవుడ్‌లోని జస్వీన్ ఇల్లు ‘ఒక డ్రగ్స్ స్టోర్’ అని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ అటార్నీ మార్టిన్ ఎస్ట్రాడా అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలీసులు ఆమె ఇంటిలో సోదాలు చేసినపుడు 80కి పైగా కెటామైన్ సీసాలు(వయల్స్), వేలాది మాత్రలు కనుగొన్నారు. అందులో మెథాంఫెటమైన్, కొకైన్, జానాక్స్‌ కూడా ఉన్నాయి.

అభియోగపత్రంలో జస్వీన్ ఇంటిని ‘సంఘా స్టాష్ హౌస్’ అని సంబోధించారు. అక్కడ ఆమె డ్రగ్స్ ప్యాకింగ్, పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

‘ఉన్నతస్థాయి వ్యక్తులు, సెలబ్రిటీలతో మాత్రమే జస్వీన్ డీల్ చేస్తారు’ అని ఆమె సహ నిందితుల్లో ఒకరైన ఎరిక్ ఫ్లెమింగ్ చెప్పినట్లు అభియోగపత్రంలో పోలీసులు పేర్కొన్నారు.

జస్వీన్ సంఘా

ఫొటో సోర్స్, Jasveen Sangha's social media

ఫొటో క్యాప్షన్, 2023 నవంబర్ 14న (పెర్రీ మరణించిన కొన్ని వారాల తర్వాత) ఇన్‌స్టాగ్రామ్‌లో జస్వీన్ 'జపాన్ 23' పేరుతో ఒక పోస్టు పెట్టారు.

విలాసవంతమైన జీవితం..

జస్వీన్ విలాసవంతమై జీవితం గడుపుతారు. తరచూ ఖరీదైన విహారయాత్రలు చేస్తుంటారు. దానికి సంబంధించిన వివరాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.

‘జస్వీన్ సెలబ్రిటీలతో కలిసిపోయారు. గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్స్ వంటి ఈవెంట్‌లకు కూడా హాజరయ్యారు’ అని డెయిలీ మెయిల్‌ వార్తాసంస్థకు ఆమె స్నేహితులలో ఒకరు తెలిపారు.

మాథ్యూ పెర్రీకి ఓవర్ డోస్ ఇచ్చిన రోజే ఆమె తన విలాసజీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో జపాన్, మెక్సికో టూర్లకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి.

అరెస్టుకు ముందురోజు జస్వీన్ సెలూన్‌కు వెళ్లి జుట్టుకు రంగు వేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి.

ఈ పోస్టులను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆమెదేనని అమెరికా అటార్నీ ఆఫీస్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.

మాథ్యూ పెర్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాథ్యూ పెర్రీ (ఫైల్ ఫొటో)

పెర్రీతో పరిచయం ఎలా ఏర్పడింది?

ఈ కేసులో జస్వీన్‌తోపాటు నిందితుడైన డాక్టర్ సాల్వడార్ ప్లాసెన్సియా ముందుగా ఆయనకు కెటామైన్ ఇంజెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారని, తర్వాత జస్వీన్ ఆ డ్రగ్‌ను సరఫరా చేసేవారని లాయర్లు చెప్పారు. అప్పటి నుంచి జస్వీన్ యాక్టర్ మాథ్యూ పెర్రీకి డ్రగ్ ఇవ్వడం కొనసాగించారు. ఆయనకు ఈ డ్రగ్ ఇచ్చిన వారిలో డాక్టర్ మార్క్ చావెజ్ లివ్-ఇన్ అసిస్టెంట్ కెన్నెత్ ఇవామాసాలు కూడా ఉన్నారు.

2023 అక్టోబర్ నుంచి జస్వీన్ ఇవామాసాకు కెటామైన్ సరఫరా ప్రారంభించారని, ఆ డ్రగ్ ప్రమాదకరమని ఆమెకు తెలుసునని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఈ నిందితులు ఫెర్రీ ఆరోగ్యం గురించి కంటే ఆయన నుంచి డబ్బు సంపాదించడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపారని కాలిఫోర్నియా అటార్నీ మార్టిన్ ఎస్ట్రాడా అన్నారు. పెర్రీకి మాత్రమే కాకుండా జస్వీన్ మరికొందరికి కూడా కెటామైన్‌ సరఫరా చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

పెర్రీ కేసులో జస్వీన్‌పై మోపిన అన్ని అభియోగాలు ఆమెను దోషిగా తేల్చితే ఆమెకు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చు.

2019లోనే ఒకరు మృతి

2019లో జరిగిన ‘ఓవర్ డోస్ మృతి’లో కూడా జస్వీన్ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభించాయని అమెరికా అధికారులు చెబుతున్నారు.

కోడి మెక్‌లౌరీ అనే కస్టమర్‌కు కెటామైన్ విక్రయించారని, ఆ డ్రగ్ అధిక మోతాదులో తీసుకోవడంతో మెక్ లౌరీ మరణించారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది.

మెక్‌లౌరీ కుటుంబ సభ్యులలో ఒకరు జస్వీన్‌కు "మీరు అమ్మిన కెటామైన్ నా సోదరుడిని చంపింది.’ అని మెసేజ్ పంపారు.

ఇది జరిగిన కొన్నిరోజుల తర్వాత ‘మరణానికి కారణమయ్యే డ్రగ్స్ జాబితాలో కెటామైన్ ఉందా?" అని తాను గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు జస్వీన్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)