నాలుగేళ్ల పిల్లాడి ‘క్యూరియాసిటీ’.. 3,500 ఏళ్లనాటి జాడీని ముక్కలు చేసింది

Boy accidentally smashes 3,500-year-old jar on museum visit

ఫొటో సోర్స్, Hecht Museum staff

    • రచయిత, జాక్ బర్జెస్
    • హోదా, బీబీసీ న్యూస్

అది 3,500 సంవత్సరాల కిందటి జాడీ. ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజియంలో భద్రపరిచిన ఆ జాడీని నాలుగేళ్ల పిల్లాడు అనుకోకుండా పగులగొట్టేశాడు.

పగిలిపోయిన జాడీ కాంస్య యుగానికి చెందినదని, క్రీస్తు పూర్వం 2200-1500 మధ్య కాలం నాటిదని హైఫాలోని ‘ది హెక్ట్’ మ్యూజియం నిర్వాహకులు బీబీసీతో చెప్పారు.

అంత ప్రాచీనమైనదైనా ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉందని, ఇప్పుడది పగిలిపోయిందని చెప్పారు.

ఈ జాడీ మ్యూజియం ప్రవేశ ద్వారం దగ్గరే ఉండేది. అయితే, దానికి రక్షణగా గాజు పలకలు కూడా ఏమీ ఉండేవి కాదు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దాన్ని చూసే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మ్యూజియం దాన్ని ఎలాంటి రక్షణ లేకుండా ఉంచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎలా పగిలిపోయిందంటే..

ఈ ప్రాచీన జాడీ పగలడానికి కారణమైన బాలుడి తండ్రి అలెక్స్ మాట్లాడుతూ.. ‘ఈ జాడీలో ఏముందో చూడాలన్న ఆసక్తితో మా అబ్బాయి దాన్ని కొంచెం లాగి చూశాడు. అది కిందపడి పగిలింది’ అని చెప్పారు.

పగిలిన జాడీ పక్కన తన కొడుకును చూడగానే షాక్‌కు గురయ్యానని, తన కొడుకు ఆ పనిచేసి ఉండకపోవచ్చని మొదట అనుకున్నానని అలెక్స్ చెప్పారు.

అయితే, తన కొడుకే పగలగొట్టినట్లు తెలిసిన వెంటనే సెక్యూరిటీ గార్డుకు ఆ విషయం చెప్పినట్లు అలెక్స్ బీబీసీకి వివరించారు.

ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను చూడటానికి ఆ బాలుడిని కుటుంబంతో సహా ఆహ్వానించినట్లు ‘ది హెక్ట్ మ్యూజియం’ తెలిపింది.

‘మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను ఉద్దేశపూర్వకంగా పాడుచేసినసంఘటనలున్నాయి. అలా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పాడుచేస్తే తీవ్ర చర్యలు తప్పవు. అలాంటప్పుడు పోలీసుల జోక్యం కూడా ఉంటుంది’ అని మ్యూజియానికి చెందిన లిహి లాజ్లో ‘బీబీసీ’తో చెప్పారు.

ఈ జాడీని మునుపటిలా సిద్ధం చేయడానికి ఒక కంజర్వేషన్ స్పెషలిస్ట్‌ను కూడా మ్యూజియం నియమించింది. త్వరలోనే జాడీని పూర్వస్థితికి తీసుకొస్తామని చెప్పారు.

జాడీని బాగు చేస్తున్నందుకు తమకు సంతోషంగా ఉన్నప్పటికీ అది మళ్లీ మునుపటిలా ఉండదన్న బాధ మాత్రం తమకు ఉందని బాలుడి తండ్రి అలెక్స్ అన్నారు.

Boy accidentally smashes 3,500-year-old jar on museum visit

ఫొటో సోర్స్, Hecht Museum staff

అప్పట్లో వైన్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకెళ్లడానికి ఇలాంటి జాడీలను ఉపయోగించి ఉండొచ్చన్నది పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా.

తవ్వకాలలో ఇలాంటి ప్రాచీన వస్తువులు దొరికినప్పటికీ ఇలా చెక్కుచెదరకుండా ఉన్నవి దొరకడమన్నది చాలా అరుదని మ్యూజియం వర్గాలు తెలిపాయి.

కాగా ఈ హెక్ట్ మ్యూజియం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ హైఫాలో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)