ఆంధ్రప్రదేశ్‌: స్టేట్ హైవేల మీద కూడా టోల్ గేట్లు పెడతారా? పీపీపీ పద్ధతికి ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపుతోంది?

ఏపీ సీఎం చంద్రబాబు

ఫొటో సోర్స్, I&PR

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం చంద్రబాబు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"పాత గైడ్‌లైన్స్ పట్టుకుని కూర్చుంటే కుదరదు. స్టేట్ హైవేలన్నీ పీపీపీ పద్ధతిలో వెళ్లాలనేది నా ఆలోచన. ఎన్ని వీలైతే అన్నింటికీ ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేయాలి. వెయ్యి కిలోమీటర్లు అంటే చాలదు. మీరింకా పాత మూసలోనే ఉన్నారు, మారండి. వాళ్లెంత ఇస్తారు, మనమెంత ఇవ్వాలన్నది లెక్కలేసి అన్నీ కోట్ చేయండి." అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఆగస్టు 5వ తేదీన జిల్లాల కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనల మీద సీఎం ఇలా స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్టేట్ హైవేల నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలోకి మార్చాలని చంద్రబాబు ఆదేశించారు.

2016లోనే సన్నాహాలు:

రోడ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారుతోందంటూ కొన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని 2016లో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా అప్పట్లో ఏపీలోని మూడు రోడ్లను ప్రయోగాత్మకంగా పీపీపీ మోడల్‌లోకి తీసుకురావాలని అధికారులు సిద్ధమయ్యారు.

మొత్తం 31 రోడ్లను పరిశీలించి 3 రోడ్లకు వయబిలిటీ ఉంటుందని అంచనా వేశారు. ఆ జాబితాలో కొండమూరు-పేరేచర్ల, గుంటూరు-పర్చూరు, కాకినాడ-జొన్నాడ రోడ్లున్నాయి. అయితే ఆ ప్రతిపాదన ముందుకెళ్లలేదు.

ఆ తరువాత వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో కూడా కొన్ని స్టేట్ హైవేల మీద టోల్ వసూలు చేయాలన్న మాట వినిపించింది. కానీ, అది అమలుకి నోచుకోలేదు.

వాట్సాప్
పశ్చిమ గోదావరి జిల్లాలోని రోడ్డు
ఫొటో క్యాప్షన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక రోడ్డు (ఫైల్ ఫొటో)

ఈసారి అన్ని రోడ్లనూ..

అప్పట్లో కేవలం వయబిలిటీ పేరుతో మూడు రోడ్లను మాత్రమే పీపీపీలో నిర్వహించాలని ప్రతిపాదించగా, తాజాగా మొత్తం స్టేట్ హైవే‌లన్నీ అదే విధానంలోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.

పూర్తిస్థాయిలో విధానాల రూపకల్పనకు మరింత సమయం పడుతుందని ఆర్ అండ్ బీ అధికారులు బీబీసీకి తెలిపారు.

పీపీపీలో రోడ్లు తీసుకువచ్చేందుకు ప్రాథమికంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తెలిపారు.

"రోడ్డుపై రోజుకి కనీసంగా 600 వాహనాలకు తగ్గకుండా ప్రయాణించాలి. అప్పుడే నిర్వహణ భారం తగ్గుతుంది. రోడ్డు పొడవు కూడా 50 కిలోమీటర్ల పైబడి ఉన్న వాటిని గుర్తిస్తున్నాం. జిల్లా కేంద్రాలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే వినియోగం ఎక్కువగా ఉంటుంది. టూరిస్ట్ ప్లేసులను కలిపే రోడ్లను ప్రాతిపదికగా తీసుకున్నాం." అని కాంతిలాల్ దండే వివరించారు.

ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంది. కొన్ని రోడ్ల నిర్వహణ విషయంలో 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' కూడా ప్రభుత్వం ద్వారా సర్దుబాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.

తద్వారా అన్ని రోడ్లను పీపీపీ మోడల్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పీపీపీ ఎందుకు?

పీపీపీ పద్ధతిలో రహదారుల నిర్వహణ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.

‘‘జాతీయ రహదారుల విషయంలో పీపీపీ పద్ధతి చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రంలోని జాతీయ రహదారులను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. కానీ రాష్ట్ర రహదారులు మాత్రం మంచి స్థితిలో లేవు. కాబట్టి పీపీపీ పద్ధతిలో వాటిని మెరుగ్గా చేయాలి.’’ అని సీఎం అన్నారు.

రోడ్లు ఎక్కువ కాలం మన్నేలా కొత్త టెక్నాలజీలను కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అధికారులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రోడ్ల పొడవు 48,378 కి. మీ. అందులో స్టేట్ హైవేలు 12,653 కిలో మీటర్లు ఉన్నాయి.

"ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. అన్ని శాఖల్లోనూ అధికారులే ఉన్నారు, కింది స్థాయి సిబ్బంది సంఖ్య తగ్గిపోయింది. కొత్త నియామకాలు లేకపోవడంతో, రోడ్ల పరిస్థితిని పట్టించుకోలేకపోతున్నారు." అని ఆర్ అండ్ బీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం.ధనుంజయ్ రావు అన్నారు.

ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐ) పీపీపీ పద్ధతిలో జాతీయ రహదారులను నిర్వహిస్తోంది. ఆ రహదారులపై ప్రజల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం మొత్తం రోడ్లలో 11,038 కి.మీ. మేర ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతుల కోసం రూ.192 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నట్లు కాంతిలాల్ దండే వెల్లడించారు.

మరో రూ.284 కోట్లతో 7,067 కి. మీ పొడవునా గుంతలు పూడ్చాలని నిర్ణయించామని, ఆ పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు.

రూ.2,153 కోట్లతో 5,731 కి.మీ. రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయని చెప్పారు.

కాగా, ప్రభుత్వానికి సిబ్బంది కొరత, నిధుల సమస్య ఉంది. పీపీపీ పద్ధతిలో అయితే రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి. టోల్ ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు.

విజయవాడ రోడ్డు

ఇక రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు

పీపీపీ పద్ధతిలో రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు పెడతారు. అయితే ఇది ప్రజలకు భారమవుతుందన్న ఆందోళన కూడా ఉంది.

"ఇప్పటికే నేషనల్ హైవేల మీద టోల్ వసూలు చేస్తున్నారు. స్టేట్ హైవేల మీద కూడా పెడితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. లారీకి టోల్ ఫీజు పెరిగితే దాని భారం సరుకుల మీద పడుతుంది. ప్రైవేటు వాహనాలతోపాటు ఆర్టీసీ ప్రయాణీకుల మీద కూడా భారం ఉంటుంది." అని ప్రజా రవాణా రంగ నిపుణులు కె.లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.

రోడ్లను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం మంచిది కాదని ఆయన సూచించారు.

రోడ్ల నిర్వహణలో నాణ్యత, ఇతర జాగ్రత్తలు పాటిస్తే మన్నిక పెరిగి, ప్రభుత్వానికి భారం తగ్గుతుందన్న విషయాన్ని గుర్తించాలని లక్ష్మయ్య సూచించారు.

‘‘భారం పడకుండా చూస్తాం’’

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 12 వేల కిలోమీటర్లకు పీపీపీ పద్ధతిని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు.

అదే సమయంలో రహదారుల నిర్వహణ విషయంలో ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

"స్టేట్ హైవేలను మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నాం. రవాణాకు ఆటంకం లేకుండా చేస్తేనే అభివృద్ధి సులభం అవుతుంది. ప్రజలకు కష్టాలు తీరడంతో పాటు వారి మీద పెద్దగా భారం పడకుండా చూసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం.’’ అని మంత్రి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)