సబీనా షోల్: చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య కొత్త ఘర్షణలకు కారణమైన ఈ ప్రదేశం ఎక్కడుంది? ఎందుకంత కీలకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెస్సా వాంగ్, జోయెల్ గింటో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య కొత్త వివాదం తలెత్తింది. రెండు దేశాలు మరోసారి ఘర్షణకు దిగాయి.
దక్షిణ చైనా సముద్రంలోని వివిధ ద్వీపాలు, ప్రాంతాలు తమవేనంటూ ఈ రెండు దేశాలు దేనికవే క్లెయిమ్ చేసుకుంటాయి.
దాంతో ఇక్కడ అనేక ఏళ్లుగా ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో రెండు దేశాల నౌకల మధ్య ఘర్షణలు, ఆయుధాలతో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత వారం చైనా, ఫిలిప్పీన్స్ నౌకలు ‘సబీనా షోల్’ సమీపంలో ఢీకొనడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.
ఉద్దేశపూర్వకంగా ఘర్షణకు కారణమయ్యారని రెండు వర్గాలు పరస్పరం నిందించుకున్నాయి.
చైనాలో షిన్‌బిన్ జియావో, ఫిలిప్పీన్స్‌లో ఎస్కోడా షోల్ అని పిలిచే ఈ ప్రాంతం ఫిలిప్పీన్స్ పశ్చిమ తీరానికి 75 నాటికల్ మైళ్లు, చైనా నుంచి 630 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.

అసలేం జరిగింది?
ఆగస్టు 19న చైనా, ఫిలిప్పీన్స్ నౌకలు వివాదాస్పద స్ప్రాట్లీ దీవులలోని సబీనా షోల్ సమీపంలో ఢీకొన్నాయి. చమురు, గ్యాస్ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం తమదేనంటూ రెండు దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి.
ఫిలిప్పీన్స్ ఓడ తమను "ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టింది’’ అని చైనా తీర రక్షక దళం ఆరోపించింది, అయితే చైనా నౌకలు దూకుడుగా ముందుకొస్తున్నాయని ఫిలిప్పీన్స్ వాదించింది.
ఆదివారం రెండోసారి ఘర్షణ జరగడంతో రెండు వర్గాలు మరోసారి ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో యూకే, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్‌లతో పాటు పలు దేశాలు చైనా తీరును విమర్శించాయి.
సబీనా షోల్ వద్ద నిలిపిన ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు నౌక ‘తెరెసా మాగ్బువానా’ కోసం "హ్యుమేనిటేరియన్ మిషన్" చేపట్టాలని అధికారులు భావించారు. అయితే ఆ మిషన్ చేపట్టనివ్వకుండా తమ రెండు పడవలను సోమవారం 40 చైనా నౌకలు అడ్డుకున్నాయని ఫిలిప్పీన్స్ ఆరోపించింది.
సబీనా షోల్ వద్ద భూమిని విస్తరించి, స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఫిలిప్పీన్స్ అనుమానిస్తోంది.
దీనికి సంబంధించి తమ వద్ద వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ వాదనలు నిరాధారమైనవని చైనా ప్రభుత్వ మీడియా ఖండించింది.
షోల్ వద్ద దీర్ఘకాలిక ఉనికిని కొనసాగించాలనేది ఫిలిప్పీన్స్ ప్రణాళిక. దీనిలో భాగంగా ఏప్రిల్‌లో తెరెసా మాగ్బువానా నౌకను సబీనాకు పంపారు.
చమురు, గ్యాస్ కోసం స్ప్రాట్లీ దీవులను అన్వేషించే ప్రయత్నాలకు ఇది కీలకమైనదిగా ఫిలిప్పీన్స్ భావిస్తోంది.

ఫొటో సోర్స్, UNCLOS, CIA
ఫిలిప్పీన్స్ సబీనా షోల్‌ను అధీనంలోకి తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తెరెసా నౌకను అక్కడ ఉంచిందని చైనా భావిస్తోంది.
దీనిపై చైనీస్ ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ఇటీవల ఒక కథనం ప్రచురించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి నౌకను 1999లో ఫిలిప్పీన్స్ సెకండ్ థామస్ షోల్ వద్ద ఉంచిందని, ఆ ఓడలో సైనికులు ఉన్నారని, వారికి అవసరమైన సామగ్రి అందించేందుకు జరుగుతున్న మిషన్లను ఆపేందుకు చైనా ప్రయత్నించిందని ఆ కథనం పేర్కొంది.
"25 ఏళ్లుగా నౌక అక్కడే ఉంది. షిన్‌బిన్ జియావో వద్ద కూడా ఇదే పరిస్థితిని పునరావృతం చేసేందుకు ఫిలిప్పీన్స్ స్పష్టంగా ప్రయత్నిస్తోంది. చైనా మళ్లీ ఫిలిప్పీన్స్ చేతిలో మోసపోదు" అని ఆ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONNETTE
వివాదాన్ని తీవ్రం చేస్తుందా?
ఇటీవల, వివాదాస్పద ప్రాంతాలైన సెకండ్ థామస్ షోల్, స్కార్‌బరో షోల్ వంటి వాటిపై రెండు దేశాలు తమ వాదనలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నందున ఘర్షణలు పెరుగుతున్నాయి.
బోట్లు ఒకదానికొకటి తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా శక్తిమంతమైన వాటర్ ఫిరంగులు, లేజర్‌లను ప్రయోగిస్తోంది.
చైనా తమ పడవల్లోకి వస్తోందని, తగాదాలకు కారణమవుతోందని, పడవలను పాడు చేస్తోందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది.
చైనా కోస్ట్ గార్డ్ సిబ్బంది కత్తులు, ఈటెలతో తమ నౌకల్లోకి ఎక్కి సైనికులను బెదిరించారని ఇటీవల ఫిలిప్పీన్స్ ఆరోపించింది.
బలమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, చైనా తీరును ప్రశ్నించాలని ఫిలిప్పీన్స్ డిఫెన్స్ చీఫ్ గిల్బెర్టో టియోడోరో అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
యుద్ధంగానే చూస్తాం: ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్
ఇప్పటివరకు ఈ ఘర్షణలో ఎటువంటి మరణాలు సంభవించలేదు, అయితే తమ సైనికులు కొందరు గాయపడ్డారని ఫిలిప్పీన్స్ చెప్పింది.
చైనా చర్యల కారణంగా ఎవరైనా ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు చనిపోతే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గతంలో హెచ్చరించారు. ఈ వివాదం దక్షిణ చైనా సముద్రంలో పెద్ద ఘర్షణలకు దారితీస్తుందనే ఆందోళనలు ఉన్నాయి.
కాగా, ఇటీవల సముద్రంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు ప్రయత్నించాయి. గత నెలలో సెకండ్ థామస్ షోల్‌లో ఫిలిప్పీన్స్ అవుట్‌పోస్ట్‌ను పునఃప్రారంభించటానికి అంగీకరించారు. అప్పటి నుంచి ఎటువంటి ఘర్షణలు జరగలేదు.
ఓ వైపు తీవ్రతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా సబీనా షోల్‌లోని తాజా సంఘటన ఎటువైపు తీసుకెళుతుందనే సందేహం ఉంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య వివాదాలు కొత్త ప్రదేశాలకు మారాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














