రైట్ టు డిస్‌కనెక్ట్: ఆఫీస్ అయ్యాక బాస్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనక్కర్లేదని చెప్పే ఈ రూల్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జువా డా సిల్వా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ నియమం అమల్లోకి వచ్చింది. ఈ నియమం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక, తమ బాస్ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోవాల్సిన లేదా వాళ్ల మెసేజ్‌లను చదవాల్సిన అవసరం లేదు.
కొత్త చట్టం ప్రకారం ఇలా డిస్‌కనెక్ట్ అయిన ఉద్యోగులను శిక్షించే అధికారం బాస్‌లకు ఉండదు.
గత సంవత్సరం ప్రచురితమైన ఒక సర్వే ప్రకారం...ఆస్ట్రేలియన్లు సంవత్సరానికి సగటున 281 గంటలు వేతనం లేకుండా అదనంగా పని చేశారు.
20 కంటే ఎక్కువ దేశాలలో ప్రధానంగా యూరప్, లాటిన్ అమెరికాలలో ఇలాంటి నియమాలు ఇప్పటికే ఉన్నాయి.
అయితే, ఆఫీసు పని అయ్యాక బాస్‌లు తమ ఉద్యోగులకు కాల్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించదు. దానికి ఉద్యోగులు స్పందించాలా లేదా అన్నది మాత్రం వారి ఇష్టం.
నిబంధనల ప్రకారం యజమానులు, ఉద్యోగులు వివాదాలను తమలో తాము పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వారు పరిష్కరించుకోలేకపోతే, ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ కమిషన్ (ఎఫ్‌డబ్ల్యూసీ)ను సంప్రదించవచ్చు.
పరిష్కారంలో భాగంగా పని గంటల తర్వాత ఉద్యోగిని సంప్రదించడం మానేయమని ఎఫ్‌డబ్ల్యూసీ యజమానిని ఆదేశించొచ్చు.
అలాగే, ఉద్యోగి స్పందించడానికి నిరాకరించడం అసమంజసమని భావిస్తే, కాల్స్ రిసీవ్ చేసుకోవాలని ఉద్యోగిని ఆదేశించవచ్చు కూడా.
ఎఫ్‌డబ్ల్యూసీ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఒక ఉద్యోగికి గరిష్టంగా సుమారు 19,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ( సుమారు రూ. 11 లక్షలు), సంస్థకైతే 94,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 54 లక్షలు) వరకు జరిమానా విధిస్తారు.
ఉద్యోగ సంఘాలు ఈ చర్యను స్వాగతించాయి.

ఈ నియమం పని తర్వాత తమను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, ఉద్యోగులు దానిని తిరస్కరించే అవకాశాన్ని ఇస్తోందని, వర్క్-లైఫ్ బ్యాలన్స్‌కు ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ తెలిపింది.
కొత్త నియమాలు యజమానులకూ ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు.
"సిబ్బందికి తగినంత విశ్రాంతి, వర్క్-లైఫ్ బ్యాలన్స్ ఉంటే వాళ్లు సిక్ లీవులు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే వాళ్లు సంస్థను విడిచిపెట్టే అవకాశమూ తక్కువే." అని స్విన్‌బర్న్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జాన్ హాప్‌కిన్స్ అన్నారు.
"ఉద్యోగికి ప్రయోజనం కలిగించే ఏదైనా, యజమానికీ ప్రయోజనాన్ని ఇస్తుంది." అని హాప్‌కిన్స్ అభిప్రాయపడ్డారు.
అయితే కొత్త చట్టంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
"ఇలాంటి చట్టాలు చాలా అవసరమని భావిస్తున్నా." అని అడ్వర్టయిజ్‌మెంట్ ఇండస్ట్రీలో పని చేసే రాచెల్ అబ్డెల్నౌర్ అన్నారు.
"మేము చాలా సమయం మా ఫోన్‌లు, ఈ-మెయిల్‌కు కనెక్ట్ అయి ఉంటాం. ఇలాంటి చట్టం లేకపోతే వాటిని డిస్‌కనెక్ట్ చేయడం చాలా కష్టమే." అని రాచెల్ అన్నారు.
అయితే, కొత్త నియమాల వల్ల పెద్దగా తేడా ఉండదని మరికొందరు భావిస్తున్నారు.
"ఇది మంచి ఆలోచనే. దీని వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నా. నిజంగా ఇది అమలవుతుందా అన్నదే సందేహం.’’ అని ఫైనాన్షియల్ రంగంలో పని చేసే డేవిడ్ బ్రెన్నాన్ అన్నారు.
‘‘మాకు మంచి జీతం ఇస్తారు కాబట్టి, 24 గంటలూ మా నుంచి రిజల్ట్స్ ఆశిస్తారు. అందువల్ల పని అయిపోగానే డిస్‌కనెక్ట్ కావడం కష్టం.’’ అని డేవిడ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
యూకేలోనూ ‘రైట్ టు డిస్‌కనెక్ట్’?
యూకే ప్రభుత్వం కూడా ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ రూల్‌ను సమర్ధిస్తోంది. ఆ హక్కును తీసుకొస్తామని హామీ ఇచ్చింది.
ఈ హక్కు ఉత్పాదకతకు కీలకమని, అది యూకే ఆర్థిక వృద్ధిని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
"ఇది ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.’’ అని ప్రధాన మంత్రి డిప్యూటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘‘మంచి యజమానులు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ వల్ల ఉద్యోగులలో ఉత్సాహం పెరుగుతుందని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని అర్థం చేసుకుంటారు.’’ అని ఆ ప్రతినిధి తెలిపారు.
లేబర్ పార్టీ ప్రతిపాదించిన కార్మికుల హక్కుల సంస్కరణల్లో ‘రైట్ టు స్విచ్ ఆఫ్’ ఒక భాగం.
నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగులు తమ యజమానులపై ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయవచ్చని లేబర్ పార్టీ ఈ సంస్కరణల్లో ప్రతిపాదించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














