కూతురికి ఇష్టంలేని పెళ్ళి చేసిన తల్లికి జైలు శిక్ష...ఆ అల్లుడు ఏం చేశాడంటే....

ఫొటో సోర్స్, Australian Federal Police
- రచయిత, హన్నా రిచీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కూతురికి ఇష్టం లేని పెళ్ళి చేసి, భర్త చేతిలో ఆమె హతమవడానికి కారణమైన తల్లి సకినా మొహమ్మద్ జాన్‌కు ఆస్ట్రేలియాలోని ఓ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.
ఆస్ట్రేలియా బలవంతపు వివాహాల నిరోధక చట్టం కింద జైలు శిక్ష పడిన తొలి మహిళ సకినా మొహమ్మద్ జాన్.
డబ్బు కోసం తాను చూపించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని 21 ఏళ్ల ఆమె కుమార్తె రుఖియా హైదరీపై జాన్ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
తల్లి బలవంతంతో రుఖియా తనకు ఇష్టం లేకుండానే 26 ఏళ్ల మహ్మద్ అలీ హలిమి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు. 2019లో ఈ వివాహం జరిగింది.
పెళ్ళయిన ఆరు వారాలకే హలిమి తన భార్య రుఖియాను హత్య చేశారు. ఈ నేరంలో ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది.
కూతురి ఇష్టంతో పనిలేకుండా
కూతురికి బలవంతంగా పెళ్ళి చేసిన కేసులో జాన్ కనీసం ఏడాదిపాటు జైలులో ఉండాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ఇష్టం లేని పెళ్ళి చేసుకోవాల్సిందిగా జాన్ తన కూతురి మీద భరించలేని ఒత్తిడి తెచ్చారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అయితే, జాన్ మాత్రం తాను నేరం చేశానని అంగీకరించడం లేదు.
ఆస్ట్రేలియాలో 2013లో బలవంతపు వివాహాల నిరోధక చట్టం తీసుకొచ్చారు.
ఈ చట్టం కింద గరిష్ఠ శిక్ష ఏడేళ్లు. ఇలాంటి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ చట్టం కింద నేరం నిరూపణ అయితే శిక్ష పడ్డ తొలి వ్యక్తి జానే.

ఇష్టం లేకుండా రెండు పెళ్ళిళ్లు
జాన్...అఫ్గాన్ హజారా శరణార్థి. తాలిబన్ల నుంచి తప్పించుకుని 2013లో తన ఐదుగురు పిల్లలతో కలిసి విక్టోరియా ప్రాంతానికి వలస వచ్చారు.
కూతురి మరణంతో ఆమె ఎంతో వేదనకు గురవుతోందని, ఇందులో తన తప్పేమీ లేదని, తాను అమాయకురాలని జాన్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
21ఏళ్ల వయసున్న కూతురికి ఇష్టం లేని పెళ్ళి జరిపించడమే కాదు, అంతకుముందు కూడా హైదరికి తల్లి జాన్ అనధికారికంగా ఓ వివాహం జరిపించినట్లు విచారణలో తేలింది.
15 ఏళ్ల వయసులో హైదరికి తల్లి జాన్ బలవంతంగా ఆ పెళ్ళి జరిపించారు. కానీ, రెండేళ్లకే ఆ బంధం ముగిసిపోయింది.
ఆ తర్వాత హైదరి మరో పెళ్ళికి నిరాకరించారు. 27, 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రెండో పెళ్ళి చేసుకోనని హైదరి తన తల్లికి చెప్పారు.
‘‘హైదరి చదువుకుని ఉద్యోగం చేయాలనుకున్నారు.’’ అని న్యాయమూర్తి ఫాల్ డాల్జియేల్ తన తీర్పులో వెల్లడించారు.
కూతురి మంచి కోసమే తాను అన్నీ చేస్తున్నట్టు జాన్ నమ్మినప్పటికీ, హైదరి ఇష్టాయిష్టాలను తల్లి ఎప్పుడూ పట్టించుకోలేదని, తల్లిగా తన అధికారాన్ని ఉపయోగించి తాను అనుకున్నది చేశారని న్యాయమూర్తి డాల్జియేల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షలో మినహాయింపు...
‘‘ తల్లి చూపించిన సంబంధం చేసుకోకపోతే తనకు, తన కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది హైదరికి తెలుసు.’’ అని న్యాయమూర్తి తీర్పు సమయంలో అన్నారు.
‘‘సమాజంలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి కూడా హైదరి ఆందోళన చెందింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
జాన్‌కు కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే, ఏడాది జైలుశిక్ష తర్వాత ఆమె విడుదల కావొచ్చు.
తీర్పు తర్వాత కోర్టు హాల్లో కూర్చున్న జాన్.. న్యాయమూర్తి తీర్పును తాను అంగీకరించడం లేదని తన న్యాయవాదితో చెప్పారు.
కోర్టు హాల్ నుంచి తరలిస్తున్న సమయంలోనూ ఆమె ఇవే మాటలు చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని ఓ కోర్టులో 2021లో హైదరి హత్య కేసు విచారణ జరిగింది. పెళ్ళి తర్వాత హైదరి, హలిమి ఆ ప్రాంతంలోనే నివసించారు.
భార్యపై హలిమి హింసకు పాల్పడ్డారని, ఆమెను దుర్భాషలాడారని, బలవంతంగా ఆమెతో ఇంటి పనులు చేయించారని విచారణలో వెల్లడైంది.
ఆస్ట్రేలియాలో బలవంతపు పెళ్ళి బానిసత్వంలాంటి నేరమని అటార్నీ జనరల్ మార్క్ డ్రేఫస్ ఓ ప్రకటనలో చెప్పారు.
ఒక్క 2022-23లోనే పోలీసుల దృష్టికి ఇలాంటి కేసులు 90 వచ్చాయని తెలిపారు.
బలవంతపు వివాహాల నిరోధక చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నప్పటికీ ఈ కేసులు తగ్గడం లేదు.
ఈ దారుణాలను రూపుమాపుతామని గతంలో అనేకమార్లు ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. అయితే, ఈ ఏడాది మే నెలలో యాంటీ స్లేవరీ కమిషనర్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














