‘నాన్నే మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించాడు’.. ఆస్ట్రేలియాలో ‘గృహహింస’ నేరాలు పెరుగుతున్నాయా?

ఫొటో సోర్స్, ABC
- రచయిత, హనా రిచీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జరిగిన సంఘటన గురించి వివరిస్తుంటే ‘ఈవ్’ గొంతు వణికింది. వెస్ట్రన్ సిడ్నీలోని తన లివింగ్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుతున్నపుడు, ఆమె కిటికీలోంచి పొరుగున కాలి బూడిదైన ఇల్లు కనిపిస్తోంది. కాలిపోయిన ఆ ఇల్లు ఆస్ట్రేలియా వార్తలలో ప్రముఖంగా కనిపించింది.
జూలై 7వ తారీఖు తెల్లవారుజామున అంతా ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో, హఠాత్తుగా ఈవ్ పక్కన ఇంట్లో మంటలు చెలరేగాయి.
ఈ మంటలలో 5 నెలల పసిపాపతో సహా ముగ్గురు పిల్లలు చనిపోగా, వాళ్ల అమ్మతో పాటు మరో నలుగురు పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.
ఈ మంటల వెనుక ఆ పిల్లల తండ్రి ఉన్నారని, ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ పిల్లలు చేసిన ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.


న్యూ సౌత్ వేల్స్ పోలీసులు లాలోర్ పార్క్ హౌస్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదాన్ని గృహ హింసకు సంబంధించిన నేరంగా పేర్కొంటున్నారు.
దీనికి సంబంధించి, 28 ఏళ్ల వయసున్న ఏడుగురు పిల్లల తండ్రి అత్యంత తీవ్ర ఆరోపణలను ఎదుర్కొనే అవకాశం ఉందని న్యూ సౌత్ వేల్స్ నేత ఒకరు తెలిపారు.
ఆస్ట్రేలియాలో ఇప్పటికే గృహహింసకు సంబంధించి కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఒక పరిశీలన ప్రకారం, ఇక్కడ తల్లిదండ్రుల చేతిలో దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక చిన్నారి (బాలిక లేదా బాలుడు) చనిపోతున్నారు.
ఇటీవలి ఘటనలో పిల్లలు మరణించడంపై ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇది తన హృదయాన్ని కలచి వేసిందని, ఇలాంటి ఘటనలను ఆపడానికి చాలా చేయాల్సి ఉందని, అయితే దీనికి సమయం పడుతుందని అంగీకరించారు.

‘ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన తండ్రి’
భద్రతా కారణాల దృష్ట్యా తన పేరును మార్చమని ఈవ్ కోరారు. జరిగింది ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఈవ్ అన్నారు.
"లోపల పిల్లలు ఉన్నారని తెలుసుకోలేకపోయినందుకు మేము సిగ్గు పడుతున్నాం" అని ఆమె అన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన తీరును బీబీసీకి వివరిస్తున్నపుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
పిల్లల మరణాలను అడ్డుకోలేకపోయినందుకు ఆమె తనను తాను నిందించుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లకు పొరుగున ఉన్న జారోడ్ హాకిన్స్ వచ్చి వాళ్లకు ఈ ప్రమాదం గురించి చెప్పడంతో ఆమె, తన భర్త అప్రమత్తమయ్యారు.
నిద్రలో ఉన్న హాకిన్స్ తాను పెద్ద శబ్దం విని ఉలిక్కిపడి లేచినట్లు చెప్పారు. తన కారుకు ఏమైనా అయిందేమో అని ఆయన బయటకు వెళ్లి చూడగా, వెంటనే మంటలు కనిపించాయి.
ఆయన మరో ఆలోచన లేకుండా పరిగెత్తి, ఆ తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు.
హాకిన్స్ అతి కష్టం మీద ఆ ఇంట్లోకి ప్రవేశించి, ముగ్గురు పిల్లలను బయటకు తీసుకురాగలిగారు. వారిలో ఏడు, నాలుగు ఏళ్ల వయసున్న ఇద్దరు మగపిల్లలు, ఓ తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఉన్నారు.
కొద్ది సేపటి తర్వాత పోలీసులు వచ్చి, ఒక 11 ఏళ్ల బాలుణ్ని రక్షించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరు, రెండు ఏళ్ల ఇద్దరు మగపిల్లలను రక్షించి ఆసుపత్రిలో చేర్చగా, కొద్దిసేపటి తర్వాత వాళ్లు మరణించారు.
ఈవ్‌ను, ఆమె భర్తను హాకిన్స్ నిద్ర లేపడంతో ఆమె అధికారులకు ఫోన్ చేశారు.
ఈవ్ భర్త మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చారు.
ఆ సమయంలో ప్రమాదం నుంచి బయటపడిన ఒక అబ్బాయి, "మా నాన్నే మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు." అని ఈవ్‌తో అన్నారు.
ఇరుగుపొరుగు వారు సైతం స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ప్రాణాలతో బయటపడిన పిల్లలు, వాళ్ల నాన్నే వాళ్లను చంపడానికి ప్రయత్నించారని తమతో అన్నట్లు చెప్పారు.
ప్రమాదం నుంచి తప్పించుకున్న నాలుగేళ్ల పిల్లాడు తన ఇంటి వైపు చూస్తూ, తన బొమ్మలు లోపల బాగున్నాయా అని అడుగుతుంటే ఈవ్ కన్నీటి పర్యంతమయ్యారు.
"పిల్లల తండ్రిని పోలీసులు ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లడం నేను చూశాను" అని ఆమె బీబీసీకి తెలిపారు.
ఆదివారం ఉదయం డిటెక్టివ్ సూపరింటెండెంట్ డానీ డోహెర్టీ మీడియాతో మాట్లాడుతూ, "పిల్లలను లోపలే ఉంచాలనే ఉద్దేశ్యంతో తండ్రి పోలీసులను, ఇరుగుపొరుగువారిని కాలిపోతున్న ఇంట్లోకి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించారు’’ అని తెలిపారు.
తండ్రే పిల్లల మరణాలకు కారణంగా కనిపిస్తోందన్నారు.

ప్రస్తుతం ఫ్రీమాన్ స్ట్రీట్‌లో మరణించిన పిల్లల కోసం ఒక తాత్కాలిక స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. అక్కడ పువ్వులు, మరణించిన పిల్లలకు నివాళులు తెలిపే కార్డులు కనిపించాయి.
"ఆ పిల్లలు చాలా మంచివాళ్లు. అందరికీ గౌరవం ఇచ్చేవాళ్లు. ఎప్పుడూ ఆడుకుంటూ కనిపించేవాళ్లు." అని హాకిన్స్ అంతకు ముందు ఏబీసీ న్యూస్‌కు చెప్పారు.
ఈ విషాదం తనలో లోతైన గాయం చేసిందని ప్రీమియర్ క్రిస్ మిన్స్ అన్నారు.
ప్రమాదం నుంచి బయటపడిన వారికి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తుందని అన్నారు.
ఆస్ట్రేలియాలో గృహ సంబంధిత నేరాలలో ప్రాణాలు కోల్పోవడానికి ఫిలిసైడ్( తల్లిదండ్రులలో ఒకరు ఉద్దేశపూర్వకంగా తమ బిడ్డను చంపడం) రెండో అతి పెద్ద కారణమని గుర్తించారు.
ఇలాంటి కేసులలో పిల్లలపై లైంగిక దాడులు, సన్నిహిత భాగస్వామి హింస లేదా ఈ రెండూ కనిపిస్తున్నాయని జాతీయ పరిశోధనా సంస్థ చేపట్టిన తాజా అధ్యయనం తెలిపింది.
“ఈ హింసను అంతం చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మార్పును మనం కలిసి సాధించవచ్చు" అని ఆల్బనీస్ మంగళవారం అన్నారు.
ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటున్న మహిళలు, పిల్లల కోసం 2027 నాటికి 720 అత్యవసర సురక్షిత గృహాలను నిర్మించాలనే తమ మునుపటి నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
అయితే, విమర్శకులు మాత్రం ఈ సంక్షోభాన్ని పరిశీలిస్తే, దీనికి కేటాయించిన నిధులు, నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవని అంటున్నారు.
“ఇలాంటి సందర్భాల్లో ఆశ్రయం కోరుకునే వారిలో 3 శాతం మంది స్త్రీలు, పిల్లలకు మాత్రమే వసతి కల్పిస్తాయి. అదీ కాకుండా, ఈ సౌకర్యాలు అందుబాటులోకి రావడానికి మూడేళ్లు వేచి చూడాల్సి వస్తుంది.” అని ఆస్ట్రేలియన్ గ్రీన్స్ సెనేట్ నాయకురాలు లారిస్సా వాటర్స్ అన్నారు.
లాలోర్ పార్క్‌లో ఈ అనూహ్య ఘటన నుంచి బయటపడిన నలుగురు పిల్లలు, వాళ్ల అమ్మ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండగా, పోలీసుల అదుపులో ఉన్న తండ్రి కోమాలో ఉన్నారు.
ఆ పిల్లల తల్లి కాలిపోయిన తమ ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్మారక చిహ్నాన్ని సందర్శించి, మరణించిన తన పిల్లలకు కన్నీటి నివాళులు అర్పించారు.














