మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్: ఈ రీరిలీజ్‌ల ట్రెండ్‌కు కారణమేంటి?

ఫొటో సోర్స్, facebook
- రచయిత, మెరిల్ సెబాస్టియన్, శరణ్య హృషికేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
టాలీవుడ్‌లో రీ-రిలీజ్‍ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్ అయిన సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో సినిమాలు రీ-రిలీజ్‍లు అవుతున్నాయి. దీనికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇపుడు ఈ ట్రెండ్ దేశమంతా పాకింది.
చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ ఇలా చాలామంది నటుల చిత్రాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేశారు.
ఈ సినిమా రీరిలీజ్‌లో మూడు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిందని వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్‌లో ప్రకటించింది.
ఇదే నెలలో మహేశ్ బాబు సినిమా కూడా రీ రిలీజైంది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మురారిని రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
ఇపుడు పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఈ వరుసలోకి వచ్చింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రీ రిలీజ్‌లు కేవలం తెలుగులోనే కాదు, దేశంలో ఎక్కడ రిలీజైనా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొన్ని సినిమాలకైతే రిలీజైన సంవత్సరం వచ్చిన దానికంటే రీ రిలీజైన తర్వాత వచ్చిన వసూళ్లే ఎక్కువ.
ఆగస్టు 10 విడుదలైన లైలా మజ్ను (హిందీ) చిత్రం దీనికి నిదర్శనం.


ఫొటో సోర్స్, Balaji Motion Pictures/Instagram
ఆ రోజు నుంచే మారింది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సినీ పరిశ్రమల మాదిరిగానే భారత చలనచిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి కుదిపేసింది. సినిమా థియేటర్లు నెలల తరబడి మూసివేశారు. చాలామంది ఓటీటీలలో సినిమాలను చూడటం ప్రారంభించారు. ముఖ్యంగా బాలీవుడ్ సహా చాలా చిత్ర పరిశ్రమలు నష్టపోయాయి.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారత చిత్రం (పాన్ ఇండియా)గా నిలిచింది.
అయితే, అలాంటి విజయాలు చాలా అరుదుగా వస్తున్నాయి.
ఇటీవల విడుదలైన హారర్-కామెడీ హిందీ చిత్రం "స్త్రీ 2" ప్రేక్షకుల ఆదరణ పొందింది. దేశవ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయలను వసూలు చేసి, ఈ ఏడాది బాలీవుడ్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ ఏడాది పెద్ద స్టార్ల సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయాయి.
రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు ఇటీవల విడుదలయ్యాయి.
కానీ, ఆశించిన ఆదరణ దక్కలేదన్న విశ్లేషణలు వచ్చాయి. ఇండియన్ -2 సినిమాదీ ఇదే పరిస్థితి.
ఇక బాలీవుడ్ విషయానికొస్తే.. కరోనా తర్వాత ఆ ఇండస్ట్రీ నుంచి తక్కువ సంఖ్యలో హిట్‌లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా విశ్లేషణ ప్రకారం.. బాలీవుడ్ కొత్త సినిమాలకు ఈ సంవత్సరం కఠినంగా ఉంది.
విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరిగినప్పటికీ చాలామంది థియేటర్లకు వెళ్లకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆ సినిమాలు వచ్చే వరకు వేచి ఉంటున్నారు.
ప్రజలు సినిమాలు చూసే విధానం మారుతున్నందున దేశ చలనచిత్ర పరిశ్రమలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉదాహరణకు, ఈ సంవత్సరం టాప్ 10 చిత్రాలలో మూడు కేరళ నుంచే వచ్చాయి, ఇక్కడ సినిమాలను తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తుంటారు.
కాబట్టి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు ఇద్దరూ వారి సౌలభ్యం వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్యం లేదు.
మళ్లీ విడుదలవుతున్న చిత్రాల జాబితాను పరిశీలిస్తే, ఎంపికల వెనుక స్పష్టమైన ఫార్ములా ఏమీ లేదని సూచిస్తోంది.
గత ఏడాది చివరి నుంచి దేశ వ్యాప్తంగా రీ-రిలీజ్‌లు క్యూ కట్టాయి.
తెలుగులో వెంకీ, మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్.. హిందీలో దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, హమ్ ఆప్కే హై కౌన్, మై ఖిలాడి తూ అనాడీ, బాజీగర్, తమిళ్‌లో గిల్లీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, X/VyjayanthiFilms
‘వసూళ్లు సాధించకపోవడమే’
ఇటీవల విడుదలైన లైలా మజ్ను చిత్రం గురించి కోమల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు అయిన ఖర్చు వచ్చేసింది. రీరిలీజ్‌తో అప్పటి నష్టాలు తగ్గాయి’ అని చెప్పారు.
ఈ వసూళ్లు ఇతర నిర్మాతలు వారి వారి బాలీవుడ్ సినిమాలు రీ రిలీజ్ చేసేలా ప్రోత్సహిస్తాయని అభిప్రాయపడ్డారు.
కొత్త చిత్రాల కొరత, వచ్చిన చిత్రాలు బాక్సాపీసు వసూళ్లు సాధించలేకపోవడంతో ఈ రీ-రిలీజ్‌లు వాటి స్థానాలను భర్తీ చేస్తున్నాయని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు.
రీ-రిలీజ్‌లకు ఎటువంటి ప్రమోషన్ ఉండదు. పోస్టర్‌లు టిక్కెట్ బుకింగ్ సైట్‌లలో వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి.
"ఈ సినిమాలు పూర్తిగా ఇష్టం లేదా ఇప్పటికే కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రేక్షకుల అభిమానంతో నడుస్తాయి" అని ఆదర్శ్ అభిప్రాయపడ్డారు.
‘ఇది ఇప్పటి సూపర్‌స్టార్ 20 ఏళ్ల క్రితం సినిమా లేదా ఇప్పటికే హిట్ అయిన సినిమా’ అని దక్షిణాది చిత్ర పరిశ్రమలను ట్రాక్ చేసే విశ్లేషకులు శ్రీధర్ పిళ్లై చెప్పారు.
అయితే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న పాత చిత్రాలను థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు ఎందుకు చెల్లిస్తున్నారు?

ఫొటో సోర్స్, X/MangoMassMedia
ప్రేక్షకులు ఏమంటున్నారు?
ఆదర్శ్ ప్రకారం.. థియేటర్‌లో సినిమా చూసే అనుభవం ఆన్‌లైన్‌లో చూడటం కంటే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రేక్షకులు దానిని ఆస్వాదిస్తున్నారు.
పుణేకి చెందిన 30 ఏళ్ల శ్రుతి జెండే దీనిని అంగీకరిస్తున్నారు. గత ఏడాది నుంచి ఆమె కొన్ని రీ రిలీజ్ చిత్రాలను చూశారు.
‘రీ రిలీజ్‌లో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేది కథ కాదు, సినిమాని ఇష్టపడే ఇతర ప్రేక్షకులతో థియేటర్లో చూసే అనుభవం. ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలు లేదా డైలాగ్‌లకు ముందు ప్రతిస్పందించడం ప్రారంభిస్తారు, ఎందుకంటే తర్వాత సీన్‌లో ఏం జరుగుతుందో వారికి ఇప్పటికే తెలుసు. ఇది మనం వెంకీ, మురారి సినిమాల రీ రిలీజ్ సమయంలో చూశాం’ అన్నారు శ్రుతి.
2004లో విడుదలైన నాగార్జున మాస్ చిత్రం మళ్లీ ఈ వారం థియేటర్లో చూడాలనే ఉత్సాహంతో ఉన్నట్లు శ్రుతి చెప్పారు.
కానీ ఆమె చివరిగా చెప్పిన మాటలు చిత్రనిర్మాతలకు ఆశను కలిగిస్తున్నాయి.
‘’నేను ఏడాదికి ఒకటి లేదా రెండు రీ-రిలీజ్‌లను చూస్తాను. కొత్త సినిమాలు చూడటానికీ ఇష్టపడతాను’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














