సముద్రాలు మన మీదకు దూసుకొస్తున్నాయ్, తస్మాత్ జాగ్రత్త... హెచ్చరించిన ఐక్య రాజ్య సమితి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేటీ వాట్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ప్రపంచంలో అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలు దాని నియంత్రణకు కూడా బాధ్యత తీసుకోవాలి. లేదంటే ప్రపంచం మొత్తం ముప్పును ఎదుర్కోవాల్సిందే.’’ అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్ హెచ్చరించారు.
“ప్రస్తుతం ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రం ఎక్కువగా ముప్పును ఎదుర్కొంటోంది. పసిఫిక్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అందుకే నేను ఇక్కడకు వచ్చా.” అని టోంగా లో జరుగుతున్న పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన బీబీసీతో అన్నారు.
“ఇక్కడుండే చిన్న దీవుల వల్ల వాతావరణ మార్పులేమీ జరగవు. అయితే వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న పరిణామాలు ఇక్కడ రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.” అన్నారాయన.
రానున్న రోజుల్లో “పెరుగుతున్న సముద్ర మట్టాలు మనందరినీ చేరుకుంటాయి.” అని ఆయన హెచ్చరించారు. సముద్ర మట్టాలు పెరుగుతున్న తీరు, వాటివల్ల పసిఫిక్ ఐలాండ్ దేశాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఐక్యరాజ్యసమితి రెండు ప్రత్యేక నివేదికలు విడుదల చేసింది.
పసిఫిక్ నైరుతి ప్రాంతం ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కొంటోందని ఒక నివేదిక తెలిపింది. పెరుగుతున్న సముద్ర జలమట్టాలు, సముద్రపు నీటిలో పెరుగుతున్న వేడి, సముద్రపు నీటిలో పెరుగుతున్న ఆమ్లీకరణ (ఎసిడిటీ) అనేవి ఈ మూడు సమస్యలని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ది సౌత్ వెస్ట్ పసిఫిక్’ నివేదిక తెలిపింది.
“కారణం ఏంటనేది సుస్పష్టం. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాలు మన భూగోళాన్ని ఉడికించేస్తున్నాయి.” అని గ్యుటెరిస్ తన ప్రసంగంలో చెప్పారు. ఈ వేడినంతా సముద్రాలు భరిస్తున్నాయని అన్నారు.
‘మార్పుని ఎదుర్కొందాం’ అనేది ఈ సమావేశపు థీమ్. ఈ నినాదానికి పరీక్ష అన్నట్లుగా కార్యక్రమం ప్రారంభరోజున సమావేశం జరుగుతున్న ఆడిటోరియంలోకి వరద నీరు పోటెత్తింది. భూకంపం కారణంగా ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఖాళీ చేయాల్సి వచ్చింది.
“మన ప్రాంతంలో అస్థిరమైన పరిస్థితులు ఎంత బలంగా ఉన్నాయనేదానికి, ప్రతీ దానికి మనం సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.” అని పసిఫిక్ 350 డైరెక్టర్ జోసెఫ్ సికులు బీబీసీతో అన్నారు.
సమావేశాల వేదికకు కాస్త దూరంలో వీధుల్లో నృత్యకారులతో ఒక ప్రదర్శన జరిగింది.
“మనం మునిగిపోవడం లేదు, పోరాడుతున్నాం’’ అని, ‘‘సముద్ర మట్టం పెరుగుతోంది. అలాగే మనం కూడా.” అని రాసి ఉన్న బ్యానర్లు ఆ ప్రదర్శనలో కనిపించాయి. ఈ ప్రాంత ప్రతినిధులైన టోరెస్ స్ట్రెయిట్ ఐలాండ్ వాసులు, టోంగా వాసులు, సమోవా వాసులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
“వేడెక్కుతున్న భూగోళం మీద సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.” అనే పేరుతో ఐక్యరాజ్య సమితి యాక్షన్ టీమ్ ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచాన్ని తుడిచి పెట్టగల సవాళ్లను ఈ నివేదిక ప్రస్తావించింది. గత 3వేల ఏళ్లతో పోలిస్తే ప్రపంచ సముద్ర మట్టాల సగటు ఇంతకు ముందెన్నడు లేనివిధంగా పెరుగుతోందని పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
గత 30 ఏళ్లలో సముద్ర మట్టం 9.4 సెంటీమీటర్లు పెరిగింది. పసిఫిక్ ప్రాంతంలో ఇది 15 సెంటీమీటర్లని నివేదిక తెలిపింది.
“ఈ విషయాలు తెలుసుకోవడం దేశాధినేతలకు చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా, అయోటెరోవా వంటి దేశాల నాయకులు ఈ విషయాలను స్వయంగా చూడటం అవసరం. అలాగే మా ప్రజల పోరాట స్ఫూర్తిని కూడా వాళ్లు చూడాలి.” అని సికులు అన్నారు.
"కష్టాల్లో ఆనందంగా ఉండగలగడం టోంగా సంస్కృతిలో భాగం. మేము అలాగే మా జీవితాల్ని సాగిస్తాం. వాటిని అనుభవిస్తాం." అని ఆయన చెప్పారు.
పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్ లీడర్స్ మీటింగ్‌లో సెక్రటరీ జనరల్ గ్యుటెరిస్ పాల్గొనడం ఇది రెండోసారి. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మరో 18 పసిఫిక్ దీవుల నాయకులు హాజరయ్యారు.
సమావేశాల కోసం నాయకులు ఇక్కడకు చేరుకున్న తర్వాత భారీ వర్షాలు, వాటివల్ల వరదలు వచ్చాయి. తర్వాత కాసేపటికే టోంగా ప్రాంతంలో రిక్టర్ స్కేలు మీద 6.9 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్ 2019లో తువాలు వెళ్లారు. సముద్ర మట్టం పెరుగుతున్న తీరు గురించి ఈ ప్రాంతవాసులను హెచ్చరించారు. ఐదేళ్లలో తాను నిజమైన మార్పును చూశానని అన్నారు.
"వాతావరణ మార్పులవల్ల ఏర్పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి అపారమైన నిబద్ధత మనకు అన్నిచోట్లా కనిపిస్తోంది." అని ఆయన బీబీసీతో అన్నారు.
"పసిఫిక్ దీవులకు మరో పెద్ద అన్యాయం కూడా జరుగుతోంది. కష్టాల్లో ఉన్న దేశాలకు అండగా నిలిచేందుకు ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల దగ్గర ఇలాంటి దేశాల కోసం ఎలాంటి ప్రణాళికలు లేవు.” అని ఆయన చెప్పారు.
సముద్రమట్టం పెరగడం వల్ల జీవనోపాధి ముప్పు ఎదుర్కొంటున్న స్థానిక కమ్యూనిటీ ప్రజలను గ్యుటెరిస్ కలిశారు. సముద్రం అంచున గోడ నిర్మాణానికి నిధుల మంజూరు నిర్ణయం కోసం వాళ్లు ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.
అంతర్జాతీయ ఆర్ధిక విధానాల వైఫల్యం, ముఖ్యంగా ఇలాంటి చిన్న, అభివృద్ధి చెందుతున్న దీవుల విషయంలో ఎందుకు ఎక్కువగా జరుగుతుందో ఆయన వివరించారు. ‘‘ఇది చిన్న దీవి, ఎక్కడో దూరంగా ఉంది. పైగా ఇక్కడున్న సంక్లిష్ట పరిస్థితులు, అధికారుల తీరు, అంత తొందరేమీ లేదన్న భావన దీనికి ప్రధాన కారణాలు.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే నిధులను పెంచుతామని వాగ్దానం చేస్తున్నా. అయితే ఈ దేశాలు ఉనికిలో ఉండటానికి అవసరమైన మద్దతు అందించడంలో మనం బాగా వెనకబడి ఉన్నాం.” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/ Katy Watson
ఈ సమావేశానికి హాజరైన పసిఫిక్ దీవుల అధినేతలంతా ఈ ప్రాంతంలో అత్యధిక నిధులు అందించే, అలాగే కాలుష్యాన్ని వెదజల్లే ఆస్ట్రేలియాను ఏకాకిని చేశారు.
శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలన్న కట్టుబాటుకు భిన్నంగా గ్యాస్ వెలికితీత, వినియోగాలను 2050 వరకు లేదా ఆపైన కూడా కొనసాగిస్తామని ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.
స్థానికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆస్ట్రేలియా లాంటి దేశాల గురించి ప్రస్తావించగా “కాలుష్యాన్ని అధికంగా వెదజల్లుతున్న దేశాలకు తప్పనిసరి బాధ్యత ఉంటుంది.” అని గ్యుటెరిస్ బీబీసీతో అన్నారు.
అలా చెయ్యకుంటే భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీలోపు ఉండేలా నియంత్రించాలన్న 2015 నాటి పారిస్ ఒప్పందాన్ని ప్రపంచం ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ శతాబ్ధం చివరి నాటికి గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీలు లోపుకు పరిమితం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.
“ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల లోపు ఉండేలా నియంత్రించగలిగితేనే గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటిక్ మంచు పొరలు కూలిపోవడాన్ని ఆపలిగేలా పోరాడే అవకాశాలు సజీవంగా ఉంటాయి.” అని గ్యుటెరిస్ అన్నారు.
“దానర్థం కాలుష్య ఉద్గారాలను 2019తో పోలిస్తే 2030 నాటికి 43 శాతం 2035 నాటికి 60 శాతం తగ్గించాలి.” అన్నారాయన.
అయితే , గతేడాది కూడా కర్బన ఉద్గారాలు ఒక శాతం పెరిగాయి.
“ప్రపంచంలో 80 శాతం ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్న జీ 20 దేశాలకు బాధ్యత ఉంది. ఇకనైనా కాలుష్య కారకాలను తగ్గించేందుకు అవన్నీ ఏకతాటిపైకి రావాలి” అని గ్యుటెరిస్ స్పష్టం చేశారు.
ప్రపంచంలో కాలుష్యాన్ని అధికంగా వెదజల్లుతున్న దేశాలు, సంస్థలకు ఆంటోనియో గ్యుటెరిస్ ఒక సూచన కూడా చేశారు.
“ప్రస్తుత ట్రెండ్‌ను మార్చేందుకు వారికి స్పష్టమైన బాధ్యత ఉంది. ‘జరిగింది ఇకచాలు’ అని అనుకోవాల్సిన సమయమిది.’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














