ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయా? తెలంగాణ, మహారాష్ట్రల్లో చేసిన రీసెర్చ్ ఏం తేల్చింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ – బెంగళూరు హైవేపై తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగంగా వెళుతోంది. నిద్ర ముంచుకు రావడంతో డ్రైవర్ రెప్పవాల్చారు. అలా రెండు సెకన్లు దాటిందంతే...బజర్ మోగింది!
మరో ఘటనలో హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. అది ఉన్నట్లుండి ముందు వెళ్తున్న వాహనానికి చాలా దగ్గరగా వెళ్లింది. అంతే....బీప్ బీప్ అంటూ అలర్ట్ శబ్దం వచ్చింది.
ప్రజా రవాణాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందిస్తున్న సహకారమిది.
ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ (ఐఆర్ఏఎస్టీఈ) పేరిట చేపట్టిన ఈ ప్రయోగం రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఆశాజనకంగా పనిచేసిందని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది.
ట్రిపుల్ ఐటీతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా తెలంగాణ, మహారాష్ట్రలలో రెండేళ్లపాటు అధ్యయనం చేసి, దాని ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి.


ఫొటో సోర్స్, UGC
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం దేశంలో 2022లో 4,46,768 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1,71,100 మంది చనిపోయారు. 4,23,158 మంది గాయపడ్డారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయే వారి సంఖ్యను 2025 నాటికి 50 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం 2021లో నిర్ణయించింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), మహీంద్రా అండ్ మహీంద్రా, ఐఎన్ఏఐ (అప్లయిడ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఏఐ, ట్రిపుల్ ఐటీ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)లు సంయుక్తంగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో మొదటగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.
నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ బస్సుల్లో 2021 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు ప్రయోగాలు జరిపారు.
మరొక ప్రాజెక్టులో 2022 జులై నుంచి 2024 జులై వరకు తెలంగాణలో 5 డిపోల పరిధిలోని 200 టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఏఐ ఆధారిత పరికరాలు అమర్చారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారులపై ఈ బస్సులు తిరిగేవి.
హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ, అదే సంస్థలోని ఐఎన్ఏఐ సెంటర్, తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ఆర్టీసీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు.

ఫొటో సోర్స్, UGC
ఐరాస్తే - అసలు ఏమిటీ ప్రాజెక్టు?
రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం ఐరాస్తే (ఐఆర్ఏఎస్టీఈ) ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఎడాస్), డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) వినియోగించారు.
వీటిలో ప్రోటోటైప్, సిమ్ కార్డ్, 4జీ మోడెమ్, మొబిలై అనే సెన్సర్ ఉంటాయి. జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. వీటిని బస్సులకు ముందు భాగంలో అమర్చి పరీక్షించారు.

ఫొటో సోర్స్, UGC
ఏం చేశారంటే?
ఎడాస్, డీఎంఎస్ పరికరాలు రహదారుల్లో బ్లాక్ స్పాట్ (ప్రమాద ప్రాంతం)లను గుర్తించడంతో పాటు ఎక్కడైతే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందో ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అప్రమత్తం చేస్తుంటాయి.
ఎడాస్ వ్యవస్థ నాలుగు రకాలుగా డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది.
- ముందున్న వాహనానికి బస్సు దగ్గరగా వెళ్లి, ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించి ఐదు సెకన్ల ముందు బజర్ సౌండ్ ఇచ్చి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. బస్సు కనీసం గంటకు 20 కిలోమీటర్లకు పైగా స్పీడులోవెళితే శబ్దం చేస్తుంది.
- బస్సు వెళ్తున్న దారిలో పాదచారులు రోడ్డు దాటుతుంటే అలర్ట్ చేస్తుంది. గంటకు 60 కి.మీ. స్పీడులో వెళ్లే సమయంలో ఈ ఆప్షన్ పనిచేస్తుంది.
- సిగ్నల్ వేయకుండా వాహనం ఒక లేన్ నుంచి మరో లేన్‌కు వెళితే, డ్రైవర్ పొరపాటును సూచిస్తూ బజర్ సౌండ్ వినిపిస్తుంది.
- బస్సు మోడల్ ఆధారంగా ఓవర్ స్పీడులో వెళ్తుంటే బీప్ శబ్దం ఇస్తుంది.
ఈ అలర్ట్స్ కోసం బస్సులో సిగ్నల్ లైట్లు, స్పీడో మీటర్, జీపీఎస్ వ్యవస్థతో ఏఐ పరికరాలు అనుసంధానించి ఉంటాయి.
డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ రెండు విధాలుగా డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.
- డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ రెండు సెకన్ల కంటే ఎక్కువ సమయం రెప్ప వాల్చితే అలారం మోగుతుంది.
- మూడు సెకన్లకు మించి పక్కకు తిరిగి చూసినా అలారం సౌండ్ ఇస్తుంది.

‘‘ఎడాస్‌ను నాగ్‌పుర్ కార్పొరేషన్‌లోని 150 బస్సులలో అమర్చాం. తెలంగాణలో ఎడాస్ టెక్నాలజీతో పాటు డీఎంఎస్ కూడా ఏర్పాటు చేశాం. 200 బస్సుల్లో ఎడాస్ పరికరాలు, 5 బస్సుల్లో డీఎంఎస్ పరికరాలు అమర్చాం.’’ అని ట్రిపుల్ ఐటీ ఐఎన్ఏఐ సెంటర్ ఆపరేషన్స్ మేనేజర్ పృథ్వీ జొన్నాడ బీబీసీకి వివరించారు.
ఐరాస్తే ప్రాజెక్టు అమలుతో తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం ప్రమాదాలు నియంత్రించగలిగామని పృథ్వీ చెప్పారు.
‘‘ప్రమాదాల నియంత్రణకు సంబంధించి మేం ఒక విశ్లేషణ చేశాం. ఐదు డిపోల పరిధిలోని బస్సుల్లో ఎడాస్, డీఎంఎస్ పరికరాలు అమర్చాం. ఈ పరికరాలు ఉన్న బస్సులు, అవి లేని బస్సులకు రెండేళ్లలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించాం. పరికరాలు అమర్చిన బస్సుల్లో 40 శాతం ప్రమాదాలు తగ్గినట్లు మా అధ్యయనంలో తేలింది’’ అని చెప్పారు.
ట్రిపుల్ ఐటీ ఇచ్చిన నివేదికపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు చెప్పారు .
‘‘ఐరాస్తే ప్రాజెక్టుకు సంబంధించి ఫలితాలు మాకు అందించారు. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాల నియంత్రణలో ఏఐ చాలా కీలకంగా మారింది. త్వరలోనే మరో 400 బస్సుల్లో ఏఐ పరికరాలు అమర్చాలనుకుంటున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది.’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఫలితాలు ఇలా..
మహారాష్ట్రలోని నాగ్‌పుర్, తెలంగాణలో ఐరాస్తే ప్రాజెక్టు ఫలితాలపై ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం నివేదిక రూపొందించింది.
ప్రమాదాల వివరాలతోపాటు తెలంగాణలోని రెండు హైవేల్లో 15 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ట్రిపుల్ ఐటీ నివేదిక ఆధారంగా 3 బ్లాక్ స్పాట్స్‌ను భారత జాతీయ రహదారుల సంస్థ సరిచేసింది. ఇవి కాకుండా మరో 60 గ్రే స్పాట్స్ (భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నవి) గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ సిటీలో ఎడాస్ పరికరాలు అమర్చిన బస్సుల్లో 41 శాతం మేర ప్రమాదాలు తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. అక్కడ 38 బ్లాక్ స్పాట్స్ గుర్తించగా, 8 ప్రాంతాలను సరిచేసినట్లు అందులో ఉంది.
ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘ఐరాస్తే ప్రాజెక్టుతో ఇంటెల్ కంపెనీ నన్ను సంప్రదించినప్పుడు, ఏఐతో ప్రమాదాలు నియంత్రించడం సాధ్యమేనా? అనే సంశయం ఉంది. అధ్యయనం తర్వాత 41 శాతం ప్రమాదాలు తగ్గడం సంతోషంగా ఉంది.’’ అని అన్నారు.

డ్రైవర్ల అభ్యంతరాలు ఏమిటి?
డ్రైవర్లు ఈ ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. మియాపూర్ డిపో-1కు చెందిన లక్ష్ము బీబీసీతో దీని గురించి మాట్లాడారు.
‘‘నేను గరుడ, గరుడ ప్లస్ బస్సులు నడుపుతుంటాను. ఐరాస్తే ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన పరికరాలు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నాయి. కానీ ప్రతిసారీ అలారం సౌండ్ కారణంగా రాత్రి వేళల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినవని చెప్పి సముదాయిస్తున్నాం.’’ అని లక్ష్ము చెప్పారు.
బస్సుల్లో ముందువైపు కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరి తప్పేంటో తెలుస్తుందన్నారు.
ఈ ప్రాజెక్టుపై మరో డ్రైవర్ బాబూరావు కూడా స్పందించారు.
‘‘వాహనాలు దగ్గరగా వచ్చినా, లేన్ మారినా.. వెంటనే అలారం మోగుతుంది. రాత్రివేళ డ్రైవింగ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంది.’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ప్రమాదాలు జరిగితే స్పందించేలా..
బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు, ఆటో డ్రైవర్లు, ఇతర స్థానికులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో పది చోట్ల యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ) క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.
బ్లాక్ స్పాట్ ప్రాంతంలో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను కాపాడేందుకు లేదా రక్తస్రావాన్ని త్వరగా ఆపేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమం పేరే ఏబీసీ.
ఈ క్లస్టర్స్ చుట్టుపక్కల 600 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రమాదాలు జరిగిన సమయంలో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించడమే ఆ వలంటీర్ల విధి.
ఇలా ఈ రెండేళ్లలో ముగ్గురి ప్రాణాలు కాపాడినట్లు ట్రిపుల్ ఐటీ ఐఎన్ఏఐ సెంటర్ ఆపరేషన్స్ మేనేజర్ పృథ్వీ జొన్నాడచెప్పారు. ప్రథమ చికిత్స అందించినవారికి ప్రోత్సాహకంగా బహుమతులు కూడా అందించామని తెలిపారు.
డ్రైవర్ల విషయానికి వస్తే ఎడాస్, డీఎంఎస్ నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా వారు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో అధికారులు గుర్తించారు.
మహారాష్ట్రలో 1337 మందికి ఈ టెక్నాలజీ వినియోగించడంపై శిక్షణ ఇవ్వగా, తెలంగాణలో దాదాపు 500 మంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు.
టెక్నాలజీ రావాలి : నిపుణులు
ప్రమాదాల నియంత్రణకు ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమలో ఏఐ వినియోగం పెరుగుతోంది. ఏఐ ఆధారంగా ఇతర దేశాలలోనూ ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయంపై ఉస్మానియా యూనివర్సిటీ రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కుమార్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రస్తుతం రవాణా రంగంలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్ (ఐటీఎస్) వినియోగిస్తున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీలో ఇప్పటికే ఈ తరహా అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో ఏఐ వినియోగం తక్కువగానే ఉంది. పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.’’ అని ప్రొఫెసర్ కుమార్ అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














