డర్టీ ఫ్యూయల్: భూమి మీద మంచును వేగంగా కరిగిస్తున్న ఈ ఆయిల్ ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించే, అత్యంత మురికిగా ఉండే ఇంధనంపై విధించిన నిషేధం ఆర్కిటిక్ జలాల్లో అమల్లోకి వచ్చింది. ఇక్కడి జలాల్లో తిరిగే పడవల్లో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు.
హెవీ ఫ్యూయల్ ఆయిల్ (హెచ్‌ఎఫ్‌ఓ) అనే ఈ ఇంధనం తారులాగా, చిక్కగా ఉంటుంది. మిగతా ఇంధనాలతో పోలిస్తే చాలా చౌకగా దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్‌లో, ముఖ్యంగా ట్యాంకర్ షిప్పులలో ఈ ఆయిల్‌ను విస్తృతంగా వాడుతున్నారు.
హెచ్‌ఎఫ్‌ఓ వల్ల ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలో పర్యావరణానికి బాగా నష్టం జరుగుతోంది. ఇంధనం మండినప్పుడు వెలువడే నల్లరంగు కార్బన్ల వల్ల మంచు వేగంగా కరుగుతోంది.
ఈ నిషేధాన్ని పర్యావరణ కార్యకర్తలు స్వాగతించినప్పటికీ, ఇది అమల్లోకి రావడం వల్ల తక్షణ ప్రభావం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీన్ని అమలు చేయడంలో ఉన్న లొసుగుల కారణంగా 2029 వరకు పెద్ద సంఖ్యలో ఓడలు ఈ ఇంధనాన్ని వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు.

చమురు శుద్ధిలో ఏర్పడిన వ్యర్థాల నుంచి తయారైన హెచ్‌ఎఫ్‌ఓ వల్ల సముద్రాలకు, ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతానికి భారీ ముప్పు పొంచి ఉంది.
బురదలా మందంగా ఉండే ఈ ఆయిల్ నీళ్లలో ఒలికిపోతే శుభ్రం చేయడం దాదాపు అసాధ్యం.
చల్లటి నీళ్లలో ఈ చమురు విచ్ఛిన్నం కాదు. ముద్దల్లాగా నీళ్లలో మునిగిపోయి అవక్షేపంగా మారి పర్యావరణానికి ముప్పుగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
వాతావరణం విషయానికొస్తే హెచ్‌ఎఫ్‌ఓను మరింత ప్రమాదకారిగా భావిస్తున్నారు నిపుణులు. హెచ్‌ఎఫ్‌ఓ మండినప్పుడు భూఉష్ణోగ్రతను వేడెక్కించే వాయువును భారీ మొత్తాల్లో విడుదల చేయడమే కాకుండా, బ్లాక్ కార్బన్లను వెదజల్లుతుంది.
‘‘ఈ బ్లాక్ కార్బన్లు ఆర్కిటిక్ ప్రాంతంలో రెట్టింపు ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయి. వాతావరణంలోని వేడిని గ్రహించి, తర్వాత మంచు మీద స్థిరపడి, అది వేగంగా కరిగేలా చేస్తున్నాయి.’’ అని క్లీన్ ఆర్కిటిక్ అలయన్స్ అనే పర్యావరణ కార్యకర్తల బృందానికి చెందిన డాక్టర్ సియాన్ ప్రియర్ చెప్పారు.
అంటార్కిటికా ప్రాంతంలో 2011లో ఈ చమురు వాడకం, రవాణాపై నిషేధం విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చమురు వాడకంపై నిబంధనలను ఉత్తర జలాల (నార్తర్న్ వాటర్స్) వరకు విస్తరించాలని ఏళ్లుగా పర్యావరణవేత్తలు కృషి చేస్తున్నారు. చివరకు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ)లో పాల్గొనే దేశాలు ఈ నిషేధాన్ని అమలు చేయాలంటూ 2021లో కోరారు.
ఆర్కిటిక్ జలాల్లో నిషేధం అమల్లోకి రావడం ఒక ముందడుగేనని అంగీకరించిన పర్యావరణ కార్యకర్తలు, ఈ నిషేధం వల్ల కలిగే ప్రభావాలను పరిమితం చేసే లొసుగులు బోలెడు ఉన్నాయని అంటున్నారు.
నిషేధానికి సంబంధించిన నియమాల ప్రకారం, ప్రొటెక్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న ఓడలకు దీన్నుంచి మినహాయింపు ఇస్తారు. అంటే, ఆ ఓడల్లో ఈ చమురు వాడుకోవచ్చు.
ఆర్కిటిక్ సరిహద్దుల్లో ఉండే దేశాలకు కూడా ఈ మినహాయింపు ఉంటుంది. ఆ దేశాలకు తమ ప్రాదేశిక జలాల్లో ఈ నిషేధం వర్తించదు.
ఆ రీజియన్‌లోని ప్రధాన దేశాల్లో ఒకటైన రష్యా, ఉత్తర జలాల్లో 8 వందలకు పైగా ఓడలను నడుపుతోంది. ఈ కొత్త ఐఎంఓ నిబంధనను ఈ ప్రాంతంలోని దేశాలు అమలు చేయడం లేదు.
2029 వరకు ఆయా దేశాలకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఇప్పుడు హెచ్‌ఎఫ్‌ఓ వాడుతున్న ఓడల్లో దాదాపు 74 శాతం ఓడలు 2029 వరకు ఇదే చమురును వాడుకునే వీలుంటుందని క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్కిటిక్‌లో ఈ చమురును వెలికి తీసే ప్రయత్నాలు పెరగడం వల్ల అక్కడి జలాల్లో హెచ్‌ఎఫ్‌ఓ వాడకం స్థాయిలు తగ్గకపోగా, ఇంకా పెరగొచ్చని కొందరు పరిశీలకులు అంటున్నారు.
‘‘భారీ స్థాయిలో హెచ్‌ఎఫ్‌ఓను చమురు, గ్యాస్ ట్యాంకర్లలో వాడుతున్నారు. రష్యన్ ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో మరిన్ని గ్యాస్, చమురు ప్రాజెక్టులను చూడబోతున్నాం. అంటే, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు వాడకం పెరగడం వల్ల హెచ్‌ఎఫ్‌ఓ వినియోగం కూడా పెరుగుతుంది’’ అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌కు చెందిన డాక్టర్ ఎలెనా ట్రేసీ చెప్పారు.
ఈ నిషేధాన్ని ఆర్కిటిక్ షిప్పింగ్ దేశాలు, నౌకా పరిశ్రమ సీరియస్‌గా తీసుకోవాలని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు.
ఇందుకు నార్వేను ఉదాహరణగా తీసుకోవాలని చెబుతున్నారు.
స్వాల్‌బార్డ్ ద్వీపసమూహం చుట్టూ హెచ్‌ఎఫ్‌ఓ వాడకంపై నార్వే ప్రభుత్వం పటిష్టంగా నిషేధాన్ని అమలు చేసింది.
ఈ మధ్యకాలంలో, ఆ రీజియన్‌లో హెచ్‌ఎఫ్‌ఓను వాడిన ఒక ఐరిష్ ఓడను పట్టుకుని రూ.77 లక్షల (93,000 డాలర్లు) జరిమానా విధించింది.
ఆర్కిటిక్ రీజియన్‌లోనూ ఈ తరహా చర్యలే తీసుకోవాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














