ప్రధాని మోదీ యుక్రెయిన్‌ నుంచి వచ్చాక జెలియెన్‌స్కీ ఏమన్నారు?

ఈ నెలలో యుక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ నెలలో యుక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ పర్యటనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగస్టు 26న ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా యుక్రెయిన్‌ పర్యటన గురించి చర్చించారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తన యుక్రెయిన్ పర్యటన గురించి బైడెన్‌కు ప్రధాని మోదీ వివరించారు.

చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం కనుగొనాలనే తన వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి పూర్తి మద్దతును ప్రకటించారు.

అదే సమయంలో భారత్ చేస్తున్న మానవతా సహాయాన్ని, శాంతి కోసం చేస్తున్న కృషిని బైడెన్ ప్రశంసించారు.

అయితే, ప్రధాని మోదీ తన యుక్రెయిన్ పర్యటన గురించి ప్రకటించినప్పటి నుంచే దానిపై చర్చలు మొదలయ్యాయి.

మొదట, యుక్రెయిన్‌లో మోదీ పర్యటన చేస్తున్న సమయం, ఉద్దేశ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

యుక్రెయిన్‌ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు తిరిగి వచ్చాక, మీడియా సమావేశంలో యుక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ మాట్లాడిన తీరును నిపుణులు తప్పుబడుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాలెన్స్ కోసం జెలియెన్‌స్కీ ఆలింగనం

ప్రధాని మోదీ యుక్రెయిన్‌లో దిగినప్పుడు, ఆయన జెలియెన్‌స్కీని ఆలింగనం చేసుకున్నారు.

జులైలో రష్యా పర్యటన సందర్భంగా మోదీ పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు, జెలియెన్‌స్కీ దాన్ని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి జెలియెన్‌స్కీని మోదీ ఆలింగనం చేసుకున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.

యుక్రెయిన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మీడియా సమావేశంలో “మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో, ప్రజలు ఒకరినొకరు కలిసినప్పుడు కౌగిలించుకుంటారు. మీ సంస్కృతిలో ఇది భాగం కాకపోవచ్చు. కానీ, మా సంస్కృతిలో భాగం. ప్రధాని అదే విధంగా అధ్యక్షుడు జెలియెన్‌స్కీని కౌగిలించుకున్నారు.’’ అని అన్నారు.

జెలియెన్‌స్కీని మోదీ ఆలింగనం చేసుకుని ఉండొచ్చు. కానీ, ఆయన భారతదేశానికి బయలుదేరిన వెంటనే, జెలియెన్‌స్కీ ప్రకటనలు వేరే సంకేతాలు ఇచ్చాయి.

జెలియెన్‌స్కీతో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెలియెన్‌స్కీతో మోదీ

జెలియెన్‌స్కీ ఏమన్నారు?

ఆగస్టు 23న భారతీయ జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెలియెన్‌స్కీ చేసిన పలు వ్యాఖ్యలు భారత్‌ను అసౌకర్యానికి గురి చేశాయి.

"భారత్‌లో ప్రపంచ శాంతి సదస్సును నిర్వహించొచ్చు నేను ప్రధాని మోదీతో అన్నాను. భారత్ ఒక పెద్ద దేశం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ, మొదటి శాంతి సదస్సులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పాల్గొనని దేశంలో మేం శాంతి సదస్సు నిర్వహించలేం.’’ అని జెలియెన్‌స్కీ అన్నారు.

యుక్రెయిన్‌లో శాంతిని ఆకాంక్షిస్తూ స్విట్జర్లాండ్‌లో ఒక సదస్సు జరిగింది.

ఈ సదస్సులో భారత్ వైపు నుంచి అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) పవన్ కపూర్ పాల్గొన్నారు.

ఈ సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనకు భారత్ దూరంగా ఉంది.

చమురు కొనుగోళ్ల పైనా విమర్శలు

ఇదే కాకుండా, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపైనా జెలియెన్‌స్కీ మాట్లాడారు.

‘‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే రష్యా తీవ్ర ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని జెలియెన్‌స్కీ అన్నారు.

యుక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఈ చమురు చౌకగా లభించడంతో భారత్ లాభపడింది.

చైనా-భారత్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా, "పుతిన్ చర్యలను సమర్థిస్తే, దాని పర్యవసనాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తాయి. అవి సరిహద్దు నిబంధనల ఉల్లంఘన రూపంలో ఉంటాయి." అని జెలియెన్‌స్కీ అన్నారు.

"రష్యా పట్ల భారత్ తన వైఖరిని మార్చుకుంటే యుద్ధం ఆగిపోతుంది. చాలా దేశాలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేసినా భారత్ మాత్రం కొనసాగిస్తోంది. రష్యా సైన్యాన్ని బలోపేతం చేసే చర్యలను నిలిపేయాలి." అని జెలియెన్‌స్కీ అన్నారు.

ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అనేక తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది.

రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ వేదికలపైనా భారత్ ఎక్కడా కనిపించలేదు.

జెలియెన్‌స్కీ, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెలియెన్‌స్కీని హత్తుకున్న మోదీ

జెలియెన్‌స్కీ వైఖరిపై నిపుణుల అభ్యంతరం

యుక్రెయిన్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై గతంలోనూ విమర్శలు వ్యక్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్‌లు సైనిక సహాయం అందించడంలో ఆలస్యం చేస్తున్నాయంటూ జెలియెన్‌స్కీ గతంలో అనేకసార్లు ఆరోపించారు.

గత ఏడాది జులైలో నాటి బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ జెలియెన్‌స్కీపై వ్యాఖ్యానిస్తూ, "మనకు ఇష్టమున్నా, లేకపోయినా, ప్రజలు కొంచెం ఎక్కువ కృతజ్ఞతను కోరుకుంటారు. మీరు నాకు ఒక జాబితాను ఇవ్వగానే డెలివరీ ఇవ్వడానికి మేం అమెజాన్ కాదని నేను అంతకుముందే చెప్పాను.’’ అని అన్నారు.

జెలియెన్‌స్కీ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి, రష్యాలో భారత రాయబారి కన్వాల్ సిబల్ కూడా స్పందించారు.

“మోదీ పర్యటన తర్వాత జెలియెన్‌స్కీ వ్యాఖ్యలు సరైనవి కావు. ఎన్నో నెలలుగా భారత్ ఎటువైపు ఉన్నది చెబుతున్నా, ఆయన చమురు కొనుగోలుపై భారతదేశాన్ని విమర్శించారు. మోదీ పర్యటనను, రష్యా బాంబు దాడితో ముడిపెట్టడం నీచ రాజకీయం.’’ అని సిబల్ అన్నారు.

‘‘రష్యా, యుక్రెయిన్ మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండటాన్ని భారత్ పక్కనబెట్టి, యుక్రెయిన్ వైపు రావాలని జెలియెన్‌స్కీ అన్నారు. ఇది పరిపక్వ రాజకీయం కాదు. మంచి ఉద్దేశంతో మోదీ యుక్రెయిన్ వెళ్లారు.’’ అని సిబల్ అన్నారు.

భారత మాజీ దౌత్యవేత్త, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎం.కె. భద్రకుమార్ రష్యన్ వెబ్‌సైట్ ఆర్‌టీ కోసం రాసిన ఒక వ్యాసంలో, "యుక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిపై జెలియెన్‌స్కీకి అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. రష్యాతో భారత్ సంబంధాల విషయంలో అమెరికా, యుక్రెయిన్‌లకు అర్థం కాని విషయాలు ఉన్నాయని మోదీ తాజా పర్యటన తెలియజేస్తోంది.’’ అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ మాట్లాడుతూ, "మోదీ యుక్రెయిన్‌లో పర్యటించిన సమయం సరైనది కాదు. ఈ సమయంలో జెలియెన్‌స్కీ మోదీని విమర్శించారు. ఆయన భారతదేశ మధ్యవర్తిత్వ సలహాను తిరస్కరించడమే కాకుండా, చమురు కొనుగోలు అంశం, ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌లో భారతదేశం గైర్హాజరు కావడాన్నీ తప్పుబట్టారు.’’ అని అన్నారు.

జెలియెన్‌స్కీ, మోదీ

ఫొటో సోర్స్, X/MODI

రష్యా-యుక్రెయిన్ యుద్ధం

దాదాపు మూడు దశాబ్దాల దౌత్య సంబంధాలలో యుక్రెయిన్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ.

ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల యుక్రెయిన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించి కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించింది.

ఈ యుద్ధంలో అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్‌కు అండగా నిలిచి, రష్యాపై ఆంక్షలు విధించాయి.

అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలును కొనసాగించింది.

దీనిపై పాశ్చాత్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినా, భారత్ తన వైఖరిని మార్చుకోలేదు. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు, భారత్ దానికి దూరంగా ఉంది.

మరోవైపు యుక్రెయిన్‌కూ భారత్‌ మానవతా సాయం అందిస్తోంది.

అయితే, ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ప్రధాని మోదీ చాలా సందర్భాలలో చెప్పారు. మోదీ ఇదే విషయాన్ని 2022లో పుతిన్‌తోనూ చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సైన్యాల చొరబాటుతో దీని భద్రతకు ముప్పు తలెత్తిందంటున్న రష్యా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)