పొరుగుదేశాలు భారత్‌ నుంచి దూరం జరుగుతున్నాయా? 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం ఏమైంది....

ప్రధాని మోదీతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దాదాపు పదేళ్ల క్రితం నరేంద్ర మోదీ తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అనేక పొరుగు దేశాల అధినేతలను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కూ ఆహ్వానం అందింది.

భారత విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మోదీ ప్రభుత్వం మొదటి రోజు నుంచి చెబుతోంది.

ఈ విధానానికి అధికారికంగా 'నైబర్‌హుడ్ ఫస్ట్' లేదా 'పొరుగుదేశాలకు మొదటి ప్రాధాన్యత' అని పేరు పెట్టారు.

గత దశాబ్ద కాలంగా దిల్లీలోని ప్రభుత్వ మంత్రులు లేదా విధాన నిర్ణేతలు నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి మూలం ఇదే అని పదే పదే చెబుతున్నారు.

'నైబర్‌హుడ్ ఫస్ట్' ప్రధాన సారాంశం ఏమిటంటే, భౌగోళికంగా భారత్‌కు దూరంగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాసియాలోని తన పొరుగు దేశాలతో (శ్రీలంక, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ మొదలైన వాటితో) సంబంధాలకు, ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరులో ఇది ప్రతిబింబిస్తోందా?

దిల్లీ తరచూ పాశ్చాత్య దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళుతోంది. మరోవైపు చైనా విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మే 2014లో నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దిల్లీ వచ్చారు.

దూరమవుతున్న పొరుగు దేశాలు

తన మొదటి పర్యటన సందర్భంగా నరేంద్ర మోదీకి నేపాల్(ఆగస్టు, 2014), శ్రీలంక (మార్చి, 2015), బంగ్లాదేశ్‌లలో(జూన్, 2015) లభించిన భారీ స్వాగతం, సాధారణ ప్రజల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, ఆ తర్వాత కనిపించలేదు.

పాకిస్తాన్‌తోనూ సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు.

భారత్ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ అనే విధానాన్ని తీసుకొచ్చిన దశాబ్దం తర్వాత, తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం భారతదేశం నుంచి భారీ సహాయం పొందింది. ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దిల్లీని విస్మరించి, చైనా గూఢచారి నౌకకు తన పోర్టులో లంగరు వేయడానికి అనుమతించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నేపాల్‌లో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీని కూడా భారత వ్యతిరేకిగానే పరిగణిస్తున్నారు.

గత సంవత్సరం మాల్దీవుల ఎన్నికలలో భారత అనుకూల ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసిన అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ మయిజ్జు, వెంటనే తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు.

ఆయన పార్టీ ప్రారంభించిన 'ఇండియా ఔట్' ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో మయిజ్జు ఏ మాత్రం వెనుకాడకుండా చైనా వైపు మొగ్గు చూపుతున్నారు.

వ్యూహాత్మక, విదేశీ, ఆర్థిక, ఇలా దాదాపు అన్ని అంశాలలోనూ భారత్‌పైనే ఆధారపడిన భూటాన్ సైతం చైనాతో సరిహద్దు చర్చలు ప్రారంభించింది.

దౌత్య సంబంధాలను నెలకొల్పాలన్న చైనా ప్రతిపాదననూ ఆ దేశం నేరుగా తిరస్కరించలేదు.

భారత్‌తో పాటు ఇతర పొరుగు దేశాల జెండాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది

అఫ్గానిస్తాన్, మియన్మార్‌లలోని పాలక ప్రభుత్వాలతో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పలేం. తాలిబాన్‌తో భారత్ ఇంకా పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు.

ఈ రెండు దేశాలలోని వివిధ రంగాల్లో పెట్టిన వందల కోట్ల భారత పెట్టుబడులు ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నాయి.

ఈ జాబితాలో తాజా పేరు బంగ్లాదేశ్. గత ఒకటిన్నర దశాబ్దం పాటు అధికారంలో ఉంటూ, భారతదేశానికి సన్నిహితంగా మెలిగే ప్రభుత్వం రాత్రికి రాత్రే అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

ఇదే కాకుండా, సుమారు మూడున్నరేళ్ల కిందట మోదీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి.

బంగ్లాదేశ్‌లో ఇటీవలి రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలోనూ భారత వ్యతిరేక భావాలు కనిపించాయని పరిశీలకులు అంటున్నారు.

భారత విదేశాంగ విధానంలోని తీవ్రమైన కొన్ని లోపాల కారణంగానే పొరుగు దేశాలలో భారత వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయా? లేదా దక్షిణాసియా భౌగోళిక రాజకీయ నిర్మాణం కారణంగా భారతదేశానికి ఈ పరిస్థితి ముందుగానే నిర్ణయమైందా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు, బీబీసీ బంగ్లా భారత్ లోపల, బయట ఉన్న అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు, ప్రొఫెసర్లు, మాజీ రాయబారులు, దౌత్య నిపుణులతో మాట్లాడింది.

ప్రొఫెసర్ ఇర్ఫాన్ నూరుద్దీన్

ఫొటో సోర్స్, Wilson Center

ఫొటో క్యాప్షన్, డా. ఇర్ఫాన్ నూరుద్దీన్ అమెరికాలోని వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో భారత రాజకీయాల ప్రొఫెసర్.

‘భారత విదేశాంగ విధానంలో స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యత’

ఇర్ఫాన్ నూరుద్దీన్

నేను ప్రపంచంలోనే అతి తక్కువ సమన్వయం కలిగిన ప్రాంతం దక్షిణాసియా అని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం లేదా అంతర్జాతీయ సరిహద్దు సంబంధాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలాగే చాలా కష్టంగా, సంక్లిష్టంగా ఉంటాయి.

వాణిజ్యం విషయంలో సబ్-సహారా ప్రాంతంలోని పేద ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే వాణిజ్యంతో పోలిస్తే, దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్యం తక్కువగా ఉంటుంది.

ఏదేమైనా, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలలో 200 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారే సామర్థ్యం ఉంది.

కాబట్టి ఈ ప్రాంతంలోని అతి పెద్ద, అత్యంత ప్రభావవంతమైన దేశం మిగతా దేశాలతో తనకు సంబంధాలు సజావుగా లేవని అర్థం చేసుకోవడానికి ఎక్కువ పరిజ్ఞానం అవసరం లేదు.

మాల్దీవులు, శ్రీలంక లేదా నేపాల్ వంటి పొరుగు దేశాలతో దీర్ఘకాలిక సంబంధాలను నెలకొల్పుకోవడానికి భారత్ ఎప్పుడూ బహుముఖ విధానంతో ముందుకు సాగలేదని భారత విదేశాంగ విధానాన్నిబట్టి చూస్తే తెలుస్తుంది.

ఈ విషయంలో ఎప్పుడూ స్వల్పకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రస్తుత భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానానికి 'హిందూ ఐడెంటిటీ' మూలంగా ఉండాలనుకుంటోంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ వంటి అనేక ముస్లిం మెజారిటీ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన పౌరసత్వ చట్టం ప్రాథమిక లక్ష్యం భారతదేశాన్ని హిందువుల చివరి ఆశ్రయంగా చూపడం.

భారత నాయకులు, మంత్రులు అక్రమ ముస్లిం చొరబాటుదారుల విషయంలో 'బంగ్లాదేశీ' అనే పదాన్ని నిరంతరం ఉపయోగిస్తున్నారు. మరోవైపు వాళ్లు బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలోపేతం అయ్యాయని చెబుతుంటారు.

కానీ ఈ రెండు విషయాల మధ్య చాలా వైరుధ్యం ఉంది. దీనిని చాలా రోజులు దాచిపెట్టడం సాధ్యం కాదు.

గత దశాబ్దంలో అనేక దేశాలు భారతదేశం పట్ల స్నేహపూర్వక వైఖరిని అవలంబించేందుకు ప్రయత్నించడం చూశాను. కానీ అక్కడి సాధారణ ప్రజలు భారతదేశం పట్ల వ్యతిరేకతతో ఉడికిపోతున్నారు.

బంగ్లాదేశ్‌తో పాటు, నేపాల్, మాల్దీవులలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే సుస్థిరత కోసమో, ప్రజాస్వామ్యం కోసమో ఆ దేశప్రజల కోపాన్ని తొలగించే ప్రయత్నం భారత్ ఎప్పుడూ చేయలేదు.

దీనికి విరుద్ధంగా, ఆ దేశాల ప్రభుత్వాలకు సహకరిస్తే తమ ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయని భావిస్తోంది.

భారతదేశం ఎప్పుడూ పొరుగు దేశాలలో తన స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందుకు సాగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

అందుకే ఒకదాని తర్వాత ఒకటి అనేక దేశాలలో దీని ఫలితాలను ఎదుర్కొంటోంది.

ఇటువంటి పరిస్థితిలో, దక్షిణాసియాలోని చిన్న దేశాలు భారతదేశాన్ని ఒక ప్రాంతీయ ఆధిపత్య శక్తిగా భావిస్తున్నాయంటే దానికి కచ్చితమైన కారణం ఉంది.

భారతదేశం ఒక ప్రాంతీయ అగ్రరాజ్యంగా స్థిరపడాలని కోరుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది.

కానీ అలా జరగడానికి, పొరుగు దేశాల పట్ల కొన్ని బాధ్యతలను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. అప్పుడే బహుముఖ సంబంధం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం అది ఎక్కడా కనిపించడం లేదు.

డాక్టర్ ఎస్.డి.ముని

ఫొటో సోర్స్, SDMUNI

ఫొటో క్యాప్షన్, డా. ముని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీతో సహా ప్రపంచంలోని అనేక విద్యా సంస్థలలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆగ్నేయాసియాకు భారత ప్రత్యేక రాయబారిగా కూడా పని చేశారు.

‘భారత విదేశాంగ విధానం వైఫల్యం’

డాక్టర్ ఎస్.డి. ముని

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో మొదటి నుంచి లోపాలు ఉన్నాయి.

ఆ ప్రకటనకు ముందు సీరియస్‌గా ఆలోచించలేదని చెప్పొచ్చు. అది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలందరినీ ఆహ్వానించిన కొద్ది రోజులకే, పాకిస్తాన్ నుంచి దిల్లీకి వస్తున్న వ్యాపార ప్రతినిధి బృందాన్ని కశ్మీర్ హురియత్ నేతలను కలవడానికి అనుమతించలేదు.

అయితే, హురియత్ నేతలు అప్పటికే దిల్లీకి చేరుకుని, ఆ సమావేశం కోసం వేచి ఉన్నారు.

హురియత్ నేతలను పాక్ ప్రతినిధి బృందాన్ని కలవడానికి అనుమతించకపోతే, అసలు వారిని శ్రీనగర్ నుంచి దిల్లీకి రావడానికే అనుమతించి ఉండకూడదు.

ఒకవేళ భారత్‌ పాకిస్తాన్‌తో చర్చలు జరపకూడదనుకుంటే మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు.

పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం 'నైబర్‌హుడ్ ఫస్ట్' లక్ష్యం ఎప్పుడూ కాదని స్పష్టంగా అర్థం చేసుకోగలిగే ఇలాంటి అనేక ఉదాహరణలను నేను ఇవ్వగలను.

సూటిగా చెప్పాలంటే, ఇది 'నైబర్‌హుడ్ ఫస్ట్' కాదు, 'ఇండియా ఫస్ట్' విధానం.

నా అభిప్రాయం ప్రకారం, మోదీ పాలనలో భారతదేశం తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడంలో రెండు తీవ్రమైన తప్పులు చేసింది.

మొదటిది ఇంటెలిజెన్స్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడటం.

ఇంటెలిజెన్స్ సమాచారం అవసరమనేది నిజమే కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కళ్లతో పొరుగు దేశాన్ని చూసి, ఆ ప్రాతిపదికన ఒక విధానం లేదా వ్యూహం రూపొందించాలని ప్రయత్నిస్తే జరిగే ఫలితం అదే.

రెండవది, విదేశాంగ విధానాన్ని అమలు చేయడంలో అధికార పక్షం చురుగ్గా పాల్గొనడం మోదీ ప్రభుత్వానికి ముందు మనం ఎప్పుడూ చూడలేదు.

మోదీ ప్రభుత్వ మొదటి, రెండో పాలనా సమయంలోనూ నేపాల్, బంగ్లాదేశ్, మియన్మార్ లేదా పాకిస్తాన్‌లతో భారత్ ఏ విధానాన్ని అనుసరించాలో విదేశాంగ మంత్రికి బదులుగా ఆర్‌ఎస్‌ఎస్ నేత రామ్ మాధవ్ నిర్ణయించేవాళ్లు.

పొరుగు దేశాలతో భారతదేశ వ్యూహాన్ని నిర్ణయించే బాధ్యతను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు అప్పగించారు.

ఇప్పుడు దాని ఫలితం భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని స్పష్టమైంది.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని మనం చర్చిస్తే, భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యానికి చాలా కారణాలే ఉన్నాయి.

ఉదాహరణకు, ప్రధానమంత్రి షేక్ హసీనా సరైన మార్గంలో వెళ్లడం లేదని, సాధారణ ప్రజల్లో ఆమెపై ఆగ్రహం పెరుగుతోందని భారతదేశం ఎప్పుడూ ఆమెకు గుర్తు చేయలేదు.

ఆమె భారతదేశానికి మంచి స్నేహితురాలైతే, ఆమెకు ఈ విషయాన్ని వెంటనే చెప్పి ఉండాలి. కానీ ఇది చేయలేదు. ఇదే కాకుండా, తీవ్ర నిఘా వైఫల్యమూ ఉంది.

బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు ముందే, భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి తరలించాలని ఇందిరాగాంధీ రాజకీయ కార్యదర్శి పీఎన్ హక్సర్ ప్రతిపాదించారు.

దీనికి ఆయన సిద్ధపడలేదన్నది వేరే విషయం. అయితే ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భారత్‌కు తెలుసు. అయితే షేక్ హసీనా విషయంలో భారత్‌కు ఎలాంటి సమాచారమూ లేదు.

సౌమెన్ రాయ్

ఫొటో సోర్స్, Soumen Roy

ఫొటో క్యాప్షన్, సౌమెన్ రాయ్ అనేక దేశాల రాయబారిగా ఉన్నారు. ప్రధానంగా ఆయన మధ్యప్రాచ్యం, బంగ్లాదేశ్‌లపై పరిశోధన చేస్తున్నారు.

‘నాలుగు పొరుగు దేశాలలో భారత వ్యతిరేక ప్రభుత్వాలు’

సౌమెన్ రాయ్

భారతదేశపు పొరుగు దేశాలలో జరుగుతున్న సంఘటనలను నేను భారతదేశ విదేశాంగ విధాన వైఫల్యం లేదా 'నైబర్‌హుడ్ ఫస్ట్' వైఫల్యంగా పరిగణించను.

దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు వివిధ కారణాల వల్ల రాజకీయ గందరగోళంలో కూరుకుపోతున్నాయి. దక్షిణాసియా దీనికి మినహాయింపు కాదు.

ఇప్పుడు నేపాల్, మాల్దీవులు లేదా బంగ్లాదేశ్‌లో రాజకీయ ముఖచిత్రం మారినా లేదా అధికారంలో అనూహ్యమైన మార్పులు వచ్చినా, ప్రాథమికంగా ఆ దేశాల అంతర్గత పరిస్థితులే దీనికి కారణం.

ఈ దేశాలలో ఒకే వ్యక్తి చాలా కాలం అధికారంలో ఉన్నారని, అక్కడ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో, భారత్ లేదా దాని విదేశాంగ విధానం ఏం కోరుకున్నా, ఏమీ చేయలేం. ఆ దేశం దాని రాజకీయ స్థితి, దిశ ఆధారంగానే ముందుకు సాగుతుంది.

అలాగని, ఈ పొరుగు దేశాలన్నింటితో భారత సంబంధాలు అంతా బాగున్నాయని చెప్పాలనుకోవడం లేదు. ఈ సంబంధాలలో అనేక లోటుపాట్లున్నాయి. ఇవి కొన్నిసార్లు పెరుగుతాయి, తీవ్రమైన సమస్యలను సృష్టిస్తాయి.

కానీ భారత్‌తో ఈ దేశాల భౌగోళిక, సైనిక, ఆర్థిక శక్తిలో మార్పులు లేదా ఆయా దేశాలపై అంతర్జాతీయ ప్రభావం కారణంగా, ఈ భేదాభిప్రాయాలు కొనసాగుతాయి.

భారతదేశం, దాని పొరుగు దేశాలు ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి.

ఒక దేశంలో అనూహ్యమైన మార్పు వస్తే, ఇతర అంశాల కంటే అంతర్గత పరిణామాలే అతిపెద్ద పాత్ర పోషిస్తాయి.

ఇప్పుడు కాఠ్‌మాండూ, కాబూల్, మాలే లేదా ఢాకాలో ఏకకాలంలో నాలుగు భారత వ్యతిరేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయనుకుంటే, అది కేవలం యాదృచ్ఛికమే.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు దిల్లీకి వచ్చారు

వివిధ దేశాలతో భారత్ సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రస్తుతం మూడు, నాలుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా లేవు. కానీ ఇలాంటివి జరుగుతుంటాయి.

కానీ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. భారతదేశ పొరుగు దేశాలలో (పాకిస్తాన్ మినహా) ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, దిల్లీతో చర్చల మార్గాన్ని మాత్రం ఎప్పుడూ మూసేయలేదు.

మాల్దీవులలో మయిజ్జు ప్రభుత్వమూ భారతదేశ సహాయం కోరింది. ప్రతి దశలోనూ నేపాల్‌తో సహకారం కొనసాగుతోంది.

బంగ్లాదేశ్, దిల్లీ, ఢాకాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరస్పరం సంబంధాలు, సహకారం కొనసాగించాల్సి ఉంటుంది.

ఈ 'వర్కింగ్ రిలేషన్ షిప్'ని కొనసాగించడాన్ని నేను దిల్లీ విజయంగా భావిస్తున్నాను.

బంగ్లాదేశ్ విషయానికి వస్తే, భారతదేశం 'అన్ని గుడ్లను ఒకే బుట్టలో' పెట్టిందనే సామెతతో చాలామంది విమర్శిస్తున్నారు.

అంటే షేక్ హసీనా, అవామీ లీగ్‌లపై నమ్మకం ఉంచిన కారణంగా ఇవాళ భారతదేశం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

కానీ అలాంటి వారికి నా ప్రశ్న ఏమిటంటే, బంగ్లాదేశ్‌ విషయంలో భారతదేశానికి వేరే ప్రత్యామ్నాయం ఉందా?

సూటిగా చెప్పాలంటే గతంలోనూ, వర్తమానంలోనూ భారత వ్యతిరేక భావాలతో నిండిన రాజకీయ శక్తులతో చేతులు కలపడం దిల్లీకి సాధ్యం కాదు.

మీరు దీన్ని విధాన వైఫల్యం లేదా మరే పేరుతో పిలిచినా.. ఇది వాస్తవం.

సంజయ్ కె. భరద్వాజ్

ఫొటో సోర్స్, University of Delhi

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్‌తో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్న సంజయ్ భరద్వాజ్ ఆ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌గానూ పని చేశారు. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలపై సుదీర్ఘకాలం పరిశోధనలు చేసిన ఆయన చాలా కాలం బంగ్లాదేశ్‌లోనూ ఉన్నారు.

‘పొరుగుదేశాలతో సత్సంబంధాలే అన్ని ప్రభుత్వాల అజెండా’

సంజయ్ కె. భరద్వాజ్

భారతదేశం ఒక ప్రధాన ప్రాంతీయ సూపర్ పవర్. అది క్రమంగా ప్రపంచ శక్తిగా మారాలని కోరుకుంటోంది.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో పొరుగు దేశాలకు చాలా పెద్ద పాత్ర ఉంది. ఒక దేశానికి దాని భౌగోళిక ప్రాంతంలో పొరుగువారి గుర్తింపు లేదా గౌరవం లభించకపోతే, అది అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందడం కష్టం.

భారత విదేశాంగ విధానంలో ఇదే ఉంది. పొరుగు దేశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి విశ్వాసాన్ని పొందడం గురించి ఇది మాట్లాడుతుంది.

ఇప్పుడు మనం మాట్లాడుతున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం పూర్తిగా కొత్త విషయం కాదు.

మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ దక్షిణాసియాలో గుజ్రాల్ సిద్ధాంతాన్ని అనుసరించడం గురించి మాట్లాడారు. దాని ప్రాథమిక సూత్రం అన్యోన్యత. అంటే పొరుగు దేశం ఏం చేసింది, ఏం చేయలేదని ఆలోచించే బదులు ఏకపక్షంగా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేయాలి.

ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌ హయాంలో దీన్నే మరో రకంగా చెప్పారు. అప్పుడు పొరుగు దేశాల పట్ల ఉదారత చూపాలని అన్నారు. ఇది దానికదే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తుంది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో చారిత్రాత్మక భూ ఒప్పందం లేదా ప్రతిపాదిత ‘తీస్తా’ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనే తయారైందని గుర్తుంచుకోవాలి.

తర్వాత నరేంద్ర మోదీ హయాంలో ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ అనే పేరు పెట్టారు. కానీ పొరుగు దేశాలతో సంబంధాల ప్రాథమిక సారాంశం అదే.

ఇప్పుడు భారత్‌తో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, పొరుగు దేశాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం లేదా చైనాలాగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే ఆర్థిక సామర్థ్యం భారత్ దగ్గర లేదు.

అన్ని పొరుగు దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నప్పటికీ, వాటికి వాటి సొంత అంచనాలు, అభివృద్ధి అజెండా ఉన్నాయి. వాటిని తీర్చడానికి, చైనా ఆయా దేశాల కోసం తన ఖజానాను తెరిచింది.

పొరుగు దేశాలు భారతదేశానికి సాంస్కృతికంగా లేదా భౌగోళికంగా ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఆర్థిక అవసరాల కారణంగా అవి చైనాను కాదనలేకపోతున్నాయి. ఇలాంటి విషయాల్లో భారత్ అనుకున్నా, పెద్దగా ఏమీ చేయలేకపోతోంది.

 చైనా, బంగ్లాదేశ్ అగ్ర నేతల సమావేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 2024లో చైనా, బంగ్లాదేశ్ అగ్ర నేతల సమావేశం జరిగింది

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన హయాంలో అన్నింటినీ మార్చగలం కానీ, మన పొరుగువారిని మార్చలేమని అన్నారు. మనం ఆ భౌగోళిక వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు కదలాలి.

వివిధ దేశాల్లో భారత్‌పై అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, ఆచరణాత్మక అంశాలే కాకుండా, నిర్మాణాత్మక అంశాలు కూడా కారణమని నేనంటాను.

బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ దేశం. భారతదేశంలో ముస్లింలపై జరిగిన ఏ అఘాయిత్యమైనా అక్కడ అసంతృప్తికి దారి తీస్తుంది. అది ఒక ఆచరణాత్మక అంశం.

ఇదే కాకుండా, భారతదేశాన్ని పొరుగు దేశాలు ఒక ఆధిపత్య శక్తిగా చూస్తున్నాయి.

ఆ దేశాల్లోని కొన్ని శక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం భారతదేశ వ్యతిరేక సెంటిమెంట్‌కు ఆజ్యం పోస్తున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు.

కానీ పొరుగు దేశంలో భారత్‌పై ఆగ్రహం పెంచేందుకు భారత విదేశాంగ విధానంలో తప్పులు వెతకడం సరికాదని నా అభిప్రాయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)