కన్యాకుమారిలో 45 గంటలు ధ్యానం చేసేందుకు ప్రధాని మోదీ సెలవు తీసుకున్నారా, లేక అది పనిలో భాగమా, ఆర్టీఐ దరఖాస్తుకు పీఎంవో ఏం చెప్పిందంటే..

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కన్యాకుమారిలో ప్రధాని మోదీ '45 గంటలు' ధ్యానం చేశారు.
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మే 30, జూన్ 1వ తేదీల మధ్య కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తూ '45 గంటలు' గడిపారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశలో ఉన్న రోజులవి.

కన్యాకుమారిలో ప్రధాని మోదీ గడిపిన 45 గంటలు ప్రభుత్వ రికార్డుల్లో ఎలా నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) బీబీసీ కోరింది.

ఈ దరఖాస్తుపై పీఎంవో స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఎలాంటి సెలవు తీసుకోలేదని పేర్కొంది. ‘ప్రధాని నిత్యం విధి నిర్వహణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు.

2014 మేలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆయన కార్యాలయం బీబీసీకి తెలిపింది.

నరేంద్ర మోదీ కంటే ముందు భారత మాజీ ప్రధానులు కొందరు తమ పదవీ కాలంలో సెలవు తీసుకున్నారు. ఆ విషయాలను బహిరంగంగానూ పంచుకున్నారు.

అలా సెలవు తీసుకున్నవారి జాబితాలో జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజపేయీ కూడా ఉన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రకారం మాజీ ప్రధానుల సెలవుల గురించి పీఎంవో వద్ద సమాచారం లేదు.

గతంలో ప్రధాని లేని సమయంలో పనులకు ఆటంకం కలగకుండా ఓ సీనియర్ మంత్రికి బాధ్యతలు అప్పగించేవారు.

"భారతదేశంలో ప్రధాని సెలవు కోసం దరఖాస్తు చేయడం లేదా సెలవు కోసం అడిగే వ్యవస్థ లేదు. గతంలో ప్రధానమంత్రులు తమ కోసం సమయం కేటాయించాల్సి వస్తే ఈ విషయాన్ని చెప్పేవారు. రాష్ట్రపతి, క్యాబినెట్ సెక్రటరీలకు సమాచారం ఇచ్చేవారు’’ అని మాజీ క్యాబినెట్ సెక్రటరీ కేఎం చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.

చంద్రశేఖర్ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశారు. ఇది బ్యూరోక్రసీలో అత్యున్నత పదవి.

కన్యాకుమారి వెళ్లే ముందు ప్రధాని మోదీ ఏ మంత్రికైనా బాధ్యతలు అప్పగించారా లేదా రాష్ట్రపతికి ఏమైనా సమాచారం ఇచ్చారా అనేది స్పష్టంగా తెలియదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాని నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, ANI

అధికారిక ప్రకటన చేశారా?

కన్యాకుమారిలో ధ్యానం చేసే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా లేదు, కానీ పీఎం మోదీ ధ్యానానికి సంబంధించిన వీడియోలు ఆయన యూట్యూబ్ ఛానల్, ఏఎన్ఐ వార్తాసంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు టీవీ ఛానెల్‌లు కూడా ప్రసారం చేశాయి.

మే 30న సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ప్రధాని మోదీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తారని మే 30న డీడీ న్యూస్ రిపోర్టు చేసింది. ప్రధాని మోదీ ధ్యానంలో బిజీగా ఉంటారని, రాత్రి ధ్యాన మండపం లోపల ఈ సాధన చేస్తారని ఏఎన్ఐ వార్తాసంస్థ మే 31వ తేదీ కవరేజీలో పేర్కొంది.

చాలామంది బీజేపీ నాయకులు ఆయన కార్యక్రమాన్ని ప్రశంసించారు, మోదీ ధ్యానం వీడియోను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో 'మోదీజీకి ధ్యానం ద్వారా దైవిక శక్తి లభించింది' అని రాశారు.

అయితే, ఇది రాజకీయ కార్యక్రమం అని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు దీన్ని నిర్వహించారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్రమోదీ

విధి నిర్వహణ ఎలా అవుతుంది?

సంజయ బారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. ఆయన మన్మోహన్ సింగ్ పదవీకాలంపై 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ డా. మన్మోహన్ సింగ్' అనే పుస్తకాన్ని రాశారు.

"కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం తన అధికారిక విధిలో భాగమని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు ధ్యానం చేస్తే అది విధి నిర్వహణ ఎలా అవుతుంది? ఒక కంపెనీ అలా పరిగణనలోకి తీసుకుంటుందా? ప్రధాని అందుబాటులో లేనప్పుడు ప్రభుత్వ వ్యవహారాలను నడిపే మరొక మంత్రికి బాధ్యత ఇవ్వడం ఆయన బాధ్యత’’ అని సంజయ బారు బీబీసీతో అన్నారు.

'హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్' అనే పుస్తకంలో ప్రధానమంత్రుల పని తీరును సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి విశ్లేషించారు. ప్రధాని మోదీ సాధనను విధిగా పీఎంవో పేర్కొనడం విచిత్రంగా అనిపించిందని నీర్జా చౌదరి చెప్పారు.

"ప్రధానమంత్రికి ప్రార్థించే హక్కు ఉంది. కానీ ఈ విధంగా సాధనను అధికారిక విధిగా పేర్కొనడం నా అవగాహనకు అందడం లేదు. ఆయన ధ్యాన సమయాన్ని విధి నిర్వహణగా పేర్కొనడంలో నాకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదు" అని నీర్జా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Youtube/Devendra fadnavis

ఫొటో క్యాప్షన్, మోదీ ధ్యానం వీడియోను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు

తప్పేం లేదు: సుధీంద్ర

సుధీంద్ర కులకర్ణి... అటల్ బిహారీ వాజ్‌పేయీకి సలహాదారుగా ఉన్నారు. ప్రధాని మోదీ సాధనను అధికారిక విధిగా పేర్కొనడంలో ఎలాంటి తప్పూ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సెలవులను గుర్తు చేసుకుంటూ కులకర్ణి "2000లో కేరళలో ఉండగా వాజ్‌పేయీకి తీరిక దొరకడంతో సెలవు తీసుకున్నారు. ఆ సమయంలో ప్రధానిని కలవడానికి సీఎం, కొందరు అధికారులు వచ్చినట్లు నాకు గుర్తుంది. ప్రధాని సెలవులో ఉంటే, అది పూర్తిగా సెలవుగా భావించడం తప్పు. మీరు, నేను సెలవు తీసుకుంటే మన పనిని సంస్థలోని మరొకరికి అప్పగించొచ్చు, కానీ ప్రధాని స్థాయిలో అది వర్తించదు’’ అన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

మన్మోహన్ ఏం చేశారు?

ప్ర‌ధాన మంత్రి సెల‌వులో ఉన్నా లేకున్నా ఆయ‌న‌ వద్ద అందరూ ఉంటారని మాజీ క్యాబినెట్ సెక్ర‌ట‌రి చంద్రశేఖ‌ర్ అంటున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తే, మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించే బాధ్యతను సీనియర్ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీకి అప్పగించారు.

‘‘మన్మోహన్ సింగ్ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నాకు తెలియదు’’ అని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్‌ అన్నారు.

మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో నాయర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు.

జో బైడెన్, కమలా హారిస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

విదేశాల్లో ఎలా ఉంటుంది?

కాగా, విదేశాలలో ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ తమ సెలవులను బహిరంగంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధ్యక్షులు తమ సెలవులను వేర్వేరు ప్రదేశాలలో గడుపుతారు, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోంది.

చరిత్రకారుడు లారెన్స్ నట్సన్ తన వ్యాసంలో "ఇవాళ అమెరికన్ అధ్యక్షుడు సెలవుపై వెళ్లాలనుకుంటే, ఎయిర్ ఫోర్స్ వన్‌లో వెళతారు. ఆయన కమ్యూనికేషన్ సిబ్బంది, రహస్య సేవలు, పోలీసులు, మీడియా సిబ్బంది ఆయనకు మరీ అంత దూరంగా ఉండరు. వాళ్లు ప్రతి విషయాన్నీ ప్రెసిడెంట్‌కు తెలియజేస్తారు. ప్రెసిడెంట్ గోల్ఫ్ స్టేడియంలో ఉన్నా, పడవలో ఉన్నా లేదా పర్వతంపై ఉన్నా తన ఆఫీసులో ఉన్నట్లే సమాచారం, కమ్యూనికేషన్‌ను పొందగలరు’’ అని తెలిపారు.

సెలవుల గురించి సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయని నట్సన్ చెప్పారు. తరచుగా సెలవులు పెట్టడం, వాటికి పెట్టే ఖర్చుల గురించి ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంది. అయినా కూడా "అధ్యక్షుడు సెలవు తీసుకోవడం కొనసాగిస్తున్నారు" అని తెలిపారు.

బ్రిటన్ గురించి మాట్లాడితే అక్కడ కూడా అలాగే ఉంటుంది. ప్రధాని సెలవుల గురించి మాట్లాడతారు.

ప్రధానమంత్రి సెలవులో ఉండగా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నప్పటికీ, అక్కడికి వెళ్లే ముందు, రోజువారీ పనిని నిర్వహించే బాధ్యతను ఒక మంత్రికి అప్పగిస్తారు. రిషి సునక్ పదవీలో ఉండగా కుటుంబంతో కలిసి సెలవుపై వెళ్లినప్పుడు ఇదే విధమైన ఏర్పాటు చేశారు.

అయితే, రాజకీయ నాయకులు వారి సెలవుల గురించి చెబుతుంటారని, వారి మద్దతుదారులు ఆ సెలవును ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని నీర్జా చౌదరి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)