అంగారకుడిపై నీటి రిజర్వాయర్లను గుర్తించిన నాసా, ఆ గ్రహంపై నివాసం సాధ్యమేనా?

మార్స్, అంగారకుడు, నాసా,

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, నాసా ప్రయోగించినఇన్‌సైట్ ల్యాండర్‌తో పాటు వెళ్లిన సిస్మో మీటర్ పంపిన డేటా విశ్లేషణలో వెలుగులోకి కొత్త అంశాలు
    • రచయిత, విక్టోరియా గిల్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంగారక గ్రహం (మార్స్) ఉపరితలం నుంచి లోపలికి విస్తరించి ఉన్న రాతి పొరల్లో నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018లో నాసా ప్రయోగించిన మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్ పంపించిన డేటా తాజా విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది.

ల్యాండర్‌తో పాటు అంగారకుడి మీదకు వెళ్లిన సిస్మో మీటర్, నాలుగేళ్లుగా మార్స్ మీద భూకంపాలు, ఇతర అంశాల గురించిన డేటాను రికార్డు చేస్తోంది.

భూకంపాల విశ్లేషణ, మార్స్ కదలికల గురించి కచ్చితత్వం, మార్స్ మీద నీటి ఆనవాళ్ల గురించి సిస్మో మీటర్ వెల్లడించింది.

మార్స్, నాసా, అంగారక గ్రహం

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్,

మార్స్ మీద మార్టిన్ ధృవాల వద్ద నీరు గడ్డ కట్టడం, వాతావరణంలోకి నీరు ఆవిరైనట్లు ఆధారాలు ఉన్నాయి. మార్స్ మీద నీటిని గుర్తించడం ఇదే తొలిసారి.

ఈ అంశాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనర్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.

ల్యాండర్ నాలుగేళ్ల పాటు మార్స్ పల్స్‌ను నిశబ్ధంగా వింటూ కూర్చున్న తర్వాత, మార్స్ ఆనవాళ్లు కనుక్కునేందుకు నాసా తలపెట్టిన ‘ఇన్‌సైట్’ మిషన్ 2022 డిసెంబర్‌లో ముగిసింది.

నాలుగేళ్ల కాలంలో “ప్రోబ్” 1319 కంటే ఎక్కువ భూకంపాలను నమోదు చేసింది.

భూకంప తరంగాలు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో కొలవడం ద్వారా, భూకంపాల వల్ల భూమిలోని ఏ పదార్ధం ఎక్కువగా కదులుతోందో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

"నిజానికి ఇవి భూమిపై నీటిని అంచనా వేయడానికి లేదా చమురు, సహజవాయువు కోసం వెతకడానికి ఉపయోగించే అదే పద్ధతులు" అని పరిశోధనలో పాల్గొన్న కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖేల్ మాంగా వివరించారు.

ధృవాల వద్ద 6నుంచి 12 మైళ్ల లోతులో నీటి జలాశయాలు ఉన్నాయని విశ్లేషణ వెల్లడించింది.

"వాతావరణం, ఉపరితలం, అంతర్గత పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి మార్టిన్ నీటి చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం" అని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ వాషన్ రైట్ అన్నారు.

"గ్రహం పరిణామాన్ని రూపొందించడంలో నీరు అత్యంత ముఖ్యమైన అణువు" అని ప్రొఫెసర్ మంగా తెలిపారు. ఈ అన్వేషణ, "మార్టిన్ నీరు మొత్తం ఎక్కడికి పోయింది?" అనే పెద్ద ప్రశ్నకు సమాధానమిస్తుంది.

మార్స్ ఉపరితలంపై అధ్యయనాలు, దాని మీద కాలువలుస అలలుగా కనిపించే నేలను చూస్తే పురాతన కాలంలో అంగారకుడి మీద నదులు, సరస్సులు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే అంగారకర గ్రహం మూడు బిలియన్ సంవత్సరాలుగా ఎడారిగానే ఉంది.

మార్స్ తన వాతావరణాన్ని కోల్పోయినప్పుడు ఆ నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి పోయింది.

"భూ గ్రహం మీద నీరు చాలా వరకు భూగర్భంలో ఉంది. అంగారక గ్రహంపై కూడా అలా ఉండకపోవడానికి ఎటువంటి కారణం లేదు" అని ప్రొఫెసర్ మాంగా చెప్పారు.

మార్స్, మార్టిన్, నాసా, ల్యాండర్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, మార్స్ మీద పురాతన కాలంలో కాలువలు, సరస్సులు ఉన్నట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు

“ఇన్‌సైట్ ప్రోబ్” దాని పాదాల కింద ఉన్న ఉపరితలం నుంచి మాత్రమే నేరుగా రికార్డు చేయగలిగింది. అయితే మార్స్ అంతటా ఇలాంటి నీటి రిజర్వాయర్లు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే అంగారక గ్రహం మీద అర మైలు కంటే ఎక్కువ లోతులో మరో పొర ఏర్పాడటానికి అవసరమైనంత నీరు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, మార్స్ మీద మానవ నివాసాల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న బిలియనీర్లకు మార్టిన్ భూగర్భ జలాల అంశం గొప్ప శుభవార్తేమీ కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"ఇది ఉపరితలం నుంచి 10-20 కిలోమీటర్ల లోతులో ఉంది" అని ప్రొఫెసర్ మంగా వివరించారు.

"అంగారక గ్రహంపై 10 కిలోమీటర్ల లోతు రంధ్రం చెయ్యడం ఎలాన్ మస్క్‌కు కూడా కష్టంగా ఉంటుంది” అని మాంగా బీబీసీతో చెప్పారు.

తాజా విశ్లేషణ అంగారక గ్రహం మీద జీవం ఆనవాళ్లు ఉన్నాయనే ఆధారాల కోసం కొనసాగుతున్న పరిశోధనల్లో మరో లక్ష్యాన్ని నిర్దేశించింది.

వీడియో క్యాప్షన్, బీబీసీ ప్రత్యేక కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)