నరేంద్ర మోదీ యుక్రెయిన్ పర్యటన: శాంతి కోసం రష్యాను భారతదేశం ఒప్పించగలదా?

ఫొటో సోర్స్, @Narendramodi/X
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుక్రెయిన్ పర్యటన ముగిసింది. ఇరు దేశాలు కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి.
వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, కమ్యూనిటీ సహాయ ప్రాజెక్టులు, సాంస్కృతిక రంగాల్లో కలిసి పని చేయాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి.
కియోవ్‌లో జెలియన్‌స్కీతో సమావేశమైనప్పుడు ఎన్నో ఉపయోగకరమైన అంశాలను చర్చించినట్లు మోదీ చెప్పారు. యుక్రెయిన్‌తో ఆర్థిక సంబంధాలను మరింత పెంచుకునేందుకు భారత్ ఆసక్తిగా ఉందన్నారు.
‘వ్యవసాయం, టెక్నాలజీ, ఫార్మా, ఇతర రంగాల్లో సహాయ, సహకారాలను మరింత పెంచుకునే మార్గాలపై చర్చించాం. సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు మేం అంగీకరించాం’’ అని మోదీ తెలిపారు.


ఫొటో సోర్స్, @Narendramodi/X
యుక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌లు.. అవేంటసలు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెలియన్‌స్కీకి 'భీష్మ క్యూబ్'లను అందజేశారు.
గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఈ క్యూబ్‌లు సాయపడతాయని భారత్ తెలిపింది.
ప్రతి భీష్మ క్యూబ్‌లో ప్రథమ చికిత్స అందించే పరికరాలు, గాయాల చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు ఉంటాయి.
చిన్న చిన్న ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన సర్జికల్ సాధనాలు కూడా వీటిలో ఉన్నాయి.
కాలిన గాయాలు, ఎముకలు విరగడం, రక్తస్రావం వంటి 200 అత్యవసర కేసులకు వైద్య చికిత్సను అందించే సామర్థ్యం ఈ క్యూబ్‌లకు ఉంటుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, @Narendramodi/X
మోదీ, జెలియన్‌స్కీ సమావేశం
సమావేశం సందర్భంగా యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియన్‌స్కీని ప్రధాని మోదీ హత్తుకున్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
యుక్రెయిన్ నేషనల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను మోదీ చూశారు.
రష్యా-యుక్రెయిన్ ఘర్షణలలో ప్రాణాలు కోల్పోయిన పిల్లలకు మోదీ నివాళులు అర్పించారు.
ఈ ఘర్షణలు ప్రధానంగా పిల్లలకు వినాశకరంగా మారాయని, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, @Narendramodi/X
‘భారత్ మీకు అండగా ఉంటుంది’ - మోదీ
రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, చర్చల ద్వారానే దీనికి పరిష్కారం దొరుకుతుందన్నారు.
‘‘రెండు దేశాలు కలిసి కూర్చుని, ఈ సంక్షోభం నుంచి బయటికి వచ్చే మార్గాలను కనుగొనాలన్నారు. ఇవాళ నేను యుక్రెయిన్ గడ్డపై శాంతిని నెలకొల్పేందుకు మీతో ప్రత్యేకంగా చర్చించాలనుకుంటున్నా’’ అని తెలిపారు.
‘‘శాంతి కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఒకవేళ వ్యక్తిగతంగా సహకారం అందించాల్సి వస్తే, అలా కూడా చేస్తాను. స్నేహితునిగా నేను మీకు ఈ హామీ ఇవ్వగలను’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ఏం చెప్పారు?
అంతకుముందు జులైలో రష్యాలో పర్యటించినప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మోదీ ఇదే మాదిరి సందేశం ఇచ్చారు. ఇది యుద్ధానికి సమయం కాదని పుతిన్‌కు చెప్పారు.
యుద్ధంతో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని, కేవలం చర్చలు, దౌత్యం ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని పుతిన్‌కు చెప్పినట్లు మోదీ తెలిపారు.
మోదీ రష్యాలో పర్యటించినప్పుడు తీవ్ర స్పందనలు వచ్చాయి.

ఫొటో సోర్స్, @Narendramodi/X
జెలియన్‌స్కీ ఏం చెప్పారు.
ఇది చాలా మంచి, చరిత్రాత్మక సమావేశమని మోదీతో భేటీ అయిన జెలియన్‌స్కీ అన్నారు.
మోదీ ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఒకవేళ శాంతి విషయంలో మోదీ ఏదైనా ఆలోచన చేస్తే, దానిపై తాము సంతోషంగా చర్చిస్తామన్నారు.
‘‘పుతిన్ కంటే మోదీ ఎక్కువగా శాంతిని కోరుకుంటున్నారు. కానీ, పుతిన్ అది కావాలనుకోకపోవడమే సమస్య’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, యుక్రెయిన్ విషయంలో భారతదేశ పాత్ర ఏంటి?
రష్యా, యుక్రెయిన్ విషయంలో భారతదేశం పాత్రను మీరెలా చూస్తారని రష్యా వ్యవహరాల నిపుణులు, జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ రంజన్ కుమార్‌ను బీబీసీ ప్రశ్నించింది.
‘‘ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుంచి అంటే 1991 నుంచి అఫ్గానిస్తాన్, సిరియా లేదా ఇరాక్ వంటి ఏ విషయంలోనూ భారత్ మధ్యవర్తిత్వం చేయలేదు’’
‘‘ఒకవేళ భారత్ ఇరు వర్గాలను కలిపేందుకు ఏదైనా ప్రయత్నాలు చేస్తే, ఇది భారత విదేశాంగ విధానంలో ముఖ్యమైన మార్పుగా మనం చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితిని తీసుకుంటే, అమెరికా కానీ, రష్యా కానీ కాల్పుల విరమణ గురించి మాట్లాడటం లేదు’’ అని తెలిపారు.
‘‘తుర్కియే, చైనా మాదిరి, భారత్ శాంతి ప్రతిపాదన గురించి మాట్లాడలేదు. దానికి ఎలాంటి ప్లాట్‌ఫామ్ కల్పించలేదు. ఒకవేళ మధ్యవర్తిత్వం జరిపితే భారత్ ఎలాంటి పాత్రను పోషించనుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు’’ అని తెలిపారు.
1991లో యుక్రెయిన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి.
2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది.
ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















