30 ఏళ్ళ తరువాత యుక్రెయిన్‌కు భారత ప్రధాని.. రక్షణ రంగ నిపుణులు ఏమంటున్నారు?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్‌స్కీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఈ వారం యుక్రెయిన్ వెళుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘‘యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలియన్‌స్కీ ఆహ్వానం మేరకు ఆగస్టు 23న(శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలో అధికారికంగా పర్యటిస్తారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి(పశ్చిమ) తన్మయ్ లాల్ చెప్పారు.

‘‘ఇది చాలా ముఖ్యమైన, చరిత్రాత్మక పర్యటన. మన దౌత్య సంబంధాలు ఏర్పాటైనప్పటి నుంచి 30 ఏళ్లలో ఒక భారత ప్రధాని యుక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి’’ అని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రష్యా-యుక్రెయిన్ ఘర్షణ విషయంలో, ‘‘భారత్ చాలా స్పష్టమైన, స్థిరమైన వైఖరిని కొనసాగించింది. దౌత్యం, చర్చల ద్వారానే ఈ ఘర్షణ పరిష్కారమవుతుంది. ఇది శాంతిని నెలకొల్పగలదు. అందుకే, చర్చలు అత్యంత అవసరం’’ అని తన్మయ్ లాల్ అన్నారు.

‘‘ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన మార్గాల ద్వారా మాత్రమే శాంతి స్థాపన సాధ్యమవుతుంది. చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించవచ్చు’’ అని చెప్పారు.

‘‘ఈ సంక్షిష్టమైన సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు అవసరమైన సహాయ, సహకారాలన్నీ అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్, యుక్రెయిన్ నేతల మధ్య చర్చల ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం లేదా ఊహాగానాలు ప్రచారం చేయడం సరైంది కాదు’’ అని తెలిపారు.

యుక్రెయిన్ కంటే ముందు, ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా పోలాండ్‌కు వెళతారని తన్మయ్ లాల్ చెప్పారు.

‘‘పోలాండ్ ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి(ఆగస్టు 21, 22న) పోలాండ్‌లో పర్యటిస్తారు. 45 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి పోలాండ్ వెళుతున్నారు’’ అని కార్యదర్శి తన్మయ్ లాల్ చెప్పారు.

‘‘ఇరు దేశాల మధ్యన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ పోలాండ్‌ను సందర్శిస్తారు’’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

యుక్రెయిన్ ఏమంటోంది?

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

‘‘ఆగస్టు 23న యుక్రెయిన్ జాతీయ జెండా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్‌లో అధికారికంగా పర్యటిస్తారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాటైన తర్వాత భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి’’ అని తన ప్రకటనలో పేర్కొంది.

‘‘ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకార అంశాలపై మోదీతో అధ్యక్షుడు జెలియన్‌స్కీ చర్చిస్తారు. ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి’’ అని తెలిపింది.

మోదీ పర్యటనపై ఎవరి స్పందన ఏమిటి?

2022 ఫిబ్రవరిలో రష్యా-యుక్రెయిన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత, ఇటలీ, జర్మనీల్లో జరిగిన జీ-7 సదస్సులలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీని ప్రధాని మోదీ కలిశారు.

కానీ, ఇప్పటి వరకు మోదీ ఎప్పుడూ యుక్రెయిన్ వెళ్లలేదు.

ఇటలీలో జెలియన్‌స్కీని కలిసినప్పుడు, యుక్రెయిన్ సంక్షోభంలో శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు భారత్ తన శక్తి మేరకు కృషి చేస్తుందని మోదీ చెప్పారు.

ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటన ప్రకటన వెలువడిన వెంటనే చాలామంది తీవ్రంగా స్పందించారు.

‘‘ఈ సమయంలో యుక్రెయిన్‌లో మోదీ పర్యటించడం చాలా దారుణంగా ఉంటుంది. యుక్రెయిన్ చొరబాటు తర్వాత, రష్యా దానిపై భారీ దాడికి సిద్ధమవుతోంది. యుద్ధ విరమణ విషయంలో అమెరికా కూడా ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు’’ అని రక్షణ నిపుణులు బ్రహ్మ చెలానీ సోషల్ మీడియా ఎక్స్‌‌లో స్పందించారు.

బంగ్లాదేశ్‌ను ఉదహరిస్తూ భారత్‌లోని ప్రస్తుత సవాళ్లపై మోదీ దృష్టి సారించాలని బ్రహ్మ సూచించారు.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది జూన్‌లో జీ-7 సదస్సులో హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ

భారత్‌పై ఒత్తిడి ఉందా?

ఇంతకుముందు, జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశం కావడంపై యుక్రెయిన్ అధ్యక్షుడు పలు ప్రశ్నలను లేవనెత్తారు

‘‘ఇది నన్ను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ప్రపంచంలో అత్యంత రక్తపిపాసి, నేరస్తుడిని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత మాస్కోలో ఆలింగనం చేసుకోవడం చూసిన తర్వాత శాంతియుత పరిష్కారాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అనిపించింది’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జెలియన్‌స్కీ స్పందించారు.

యుక్రెయిన్‌లో మోదీ పర్యటనపై దౌత్య నిపుణులు కృష్ణన్ శ్రీనివాసన్ కూడా పలు ప్రశ్నలను లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ‘ది వైర్’ ద్వారా ఒక వీడియో పోస్టు చేశారు.

‘‘ప్రధాని మోదీ యుక్రెయిన్‌లో పర్యటించనున్నారని తెలిసి చాలా నిరాశకు గురయ్యాను. దీని నుంచి ఎలాంటి అనుకూల ఫలితం వస్తుందని అనుకోవడం లేదు. అంతేకాక, భారత ప్రస్తుత విధానాలకు చాలా వినాశకరమని ఇది రుజువు చేస్తుంది’’ అని కృష్ణన్ శ్రీనివాసన్ అన్నారు.

భారత్ ప్రస్తుత విధానం సరైనదే అని అంగీకరించిన శ్రీనివాసన్, ఇండియా స్వతంత్ర విధానాన్ని అవలంబిస్తోందని, అయినా ఈ పర్యటన తర్వాత భారత్‌పై పాశ్చాత్య దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చూపించడం కష్టమవుతుందన్నారు.

విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

‘స్వతంత్ర విధానంలో భాగమే’

‘‘జులైలో ప్రధాని మోదీ రష్యాను సందర్శించినప్పటి నుంచి, త్వరలోనే యుక్రెయిన్‌లోనూ పర్యటిస్తారని అనిపించింది. భారత్ ప్రపంచానికి యుద్ధాన్ని కాదు బుద్ధుడిని ఇచ్చిందన్నది నిజం. రష్యాలో మోదీ పర్యటించిన తర్వాత, అమెరికా నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ఇది భారత ప్రధాని యుక్రెయిన్‌లో పర్యటించడంపై ప్రభావం చూపించవచ్చు. కానీ, భారత స్వతంత్ర రక్షణ వ్యూహాల్లో ఇది ఒక భాగమని నేను నమ్ముతున్నా’’ అని జేఎన్‌యూ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్వర్ణ్ సింగ్ ఓ ప్రైవేటు న్యూస్ చానల్ చర్చలో చెప్పారు.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత, పాశ్చాత్య దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.

కానీ, భారత్, చైనా లాంటి మిత్ర దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాయి.

ఈ యుద్ధంపై రష్యాను భారత్ నేరుగా నిందించలేదు.

రష్యా దీనిని ఓ ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌గా పిలుస్తుంటే, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఘర్షణకు పరిష్కారం కనుగొనాలని ఇండియా విజ్ఞప్తి చేసింది.

‘‘ఒకవేళ యుక్రెయిన్‌లో మోదీ పర్యటిస్తే, దాన్ని మేం స్వాగతిస్తాం’’ అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు స్పందించారు.

పుతిన్‌తో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్‌తో మోదీ

మోదీ రష్యా పర్యటనపై విమర్శలు

జులై 8,9 తేదీలలో మోదీ రష్యాలో పర్యటిస్తున్న సమయంలో, రష్యా చేసిన క్షిపణి దాడుల వల్ల యుక్రెయిన్‌లో పదుల సంఖ్యలో మరణించారు. వీరిలో కొందరు పిల్లలు చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అదే సమయంలో వాషింగ్టన్‌లో ప్రత్యేక నాటో సమావేశం జరుగుతోంది. దానికి జెలియన్‌స్కీ హాజరయ్యారు.

మోదీ రష్యాలో పర్యటించడం సందోర్భచితం కాదని, ఆయన పర్యటన తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్, స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి డోనాల్డ్ లూతో సహా పలువురు అమెరికా అధికారులు పేర్కొన్నారు.

దీని తర్వాత, దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జేక్ సులివాన్‌తో మాట్లాడారు.

మోదీ, పుతిన్ ఆలింగనంపై జెలియన్‌స్కీ కూడా మండిపడ్డారు.

రష్యాలో మోదీ పర్యటన వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంటోందని ‘ది హిందు’ పత్రిక తెలిపింది.

మోదీ, జెలియన్‌స్కీ సమావేశం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జీ-7 సదస్సు సందర్భంగా కలుసుకున్న మోదీ, జెలియన్‌స్కీ

భారత్, యుక్రెయిన్ సంబంధాలు

భారత్, యుక్రెయిన్ మధ్య సంబంధాలు చాలా పాతవి. రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి ముందు, చదువుల కోసం చాలా మంది విద్యార్థులు యుక్రెయిన్ వెళ్లేవారు.

అంతేకాక, భారత్, యుక్రెయిన్ మధ్యలో పరస్పర వాణిజ్య సంబంధాలున్నాయి. యుక్రెయిన్ నుంచి చాలా వస్తువులను భారత్ కొనుగోలు చేస్తుంది.

‘‘ద్వైపాక్షిక ఒప్పందాలలో టెన్షన్లు, ఐక్యరాజ్య సమితిలో రష్యాను విమర్శించేందుకు భారత్ నిరాకరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో తొలిసారి యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా భారత్‌లో పర్యటించారు’’ అని ‘ది హిందు’ కథనం పేర్కొంది.

స్థానిక, అంతర్జాతీయ అంశాలపై, శాంతియుత పరిష్కారాలపై తమ అభిప్రాయాలను కులేబాతో విస్తృతంగా చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.

అత్యంత శక్తిమంతమైన అంతర్జాతీయ గొంతుకగా, అలాగే ముఖ్యమైన ప్రపంచ శక్తిగా భారత్‌ను యుక్రెయిన్ చూస్తున్నట్టు కులేబా చెప్పారు.

ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా అంతకుముందు 2022 ఆగస్టులో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయడంపై భారత్‌పై కులేబా విరుచుకుపడ్డారు.

రష్యా నుంచి భారత్ పొందుతున్న ప్రతి బ్యారల్ క్రూడాయిల్‌లో యుక్రెయిన్ రక్తం ఉందని ఆయన అన్నారు.

అదే సమయంలో, రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన, బహిరంగ సంబంధాలున్నాయని, రష్యా దాడుల తర్వాత అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు యుక్రెయిన్ సాయం చేసిందని తెలిపారు.

2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరు దేశాల(రష్యా, యుక్రెయిన్)ను సందర్శిస్తున్న అతికొద్ది మంది నేతలలో మోదీ కూడా ఒకరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)