పశ్చిమ దేశాలు, రష్యా మధ్య ఖైదీల మార్పిడి ఎలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గారెత్ ఎవాన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా నుంచి శుక్రవారం (ఆగస్టు 2) విడుదలైన ముగ్గురు అమెరికన్ ఖైదీలు స్వదేశానికి చేరుకున్నారు. వారికి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్వాగతం పలికారు. అదేవిధంగా వివిధ దేశాల్లోని జైళ్ల నుంచి విడుదలైన 10 మంది రష్యా ఖైదీలు మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కో విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు.
ఒక రష్యన్ ‘హంతకుడు’, మరొక అమెరికన్ వార్తాపత్రిక కరస్పాండెంట్ గురువారం తుర్కియేలో వేర్వేరు విమానాలను ఎక్కారు. ఇది రష్యా, పశ్చిమ దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా రహస్యంగా, నాటకీయంగా సాగిన ఖైదీల మార్పిడి ఒప్పందానికి సాక్ష్యంగా నిలిచింది.
22 మంది ఖైదీల విడుదల కోసం 2022లో ప్రారంభమైన ఈ చర్చలు రష్యా, అమెరికా, నాలుగు యూరోపియన్ దేశాల మధ్య రహస్యంగా జరిగాయి.
అయితే, ఈ ఏడాది ఆరంభంలో చర్చలు ఊపందుకున్నాయి. ఈ చర్చలు కొన్నిసార్లు ఆయా దేశాలకు పరీక్షగా మారాయి. యుక్రెయిన్‌లో యుద్ధం విషయంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అవరోధాలు ఎదురయ్యాయి.


ఫొటో సోర్స్, Getty Images
నెలల తరబడి, పలు దఫాలుగా..
"ఇది నెలల తరబడి పలు దఫాలుగా సాగిన సంక్లిష్ట చర్చల ఫలితం’’ అని ఖైదీల మార్పిడి తర్వాత ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సల్లివన్ అన్నారు.
ఖైదీల మార్పిడి సాగిన తీరును గురువారం వైట్‌హౌస్ సీనియర్ అధికారులు మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి మాస్కో నుంచి 2022 చివరలో మొదటి సానుకూల సంకేతం వచ్చిందని తెలిపారు.
2022లో రష్యాలో ఉన్న సమయంలో అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రినెర్ మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యారు. బ్రిట్నీ విడుదల కోసం అమెరికా, రష్యాలు చర్చలు జరిపాయి.
ఏడాది తరువాత, రష్యన్ ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను బ్రిట్నీ కోసం అమెరికా విడుదల చేసింది. కానీ ఆ చర్చల సమయంలో బెర్లిన్ పార్క్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపినందుకు జర్మనీలో జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న వాడిమ్ క్రాసికోవ్‌ను విడిపించాలని రష్యా కోరినట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
ఆ విషయంపై జాక్ సల్లివన్ జర్మనీతో మాట్లాడగా, తన గడ్డపై దారుణ హత్యకు పాల్పడిన క్రాసికోవ్‌ను విడుదల చేయడానికి జర్మనీ ఇష్టపడలేదని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, US Government
అమెరికన్ జర్నలిస్ట్ అరెస్టుతో..
సల్లివన్‌కు జర్మనీ నుంచి ఖచ్చితమైన స్పందన రాలేదు. అయినప్పటికీ, 2022లో అమెరికా, రష్యాతో పాటు అమెరికా, జర్మనీల మధ్య జరిగిన చర్చలు సంక్లిష్ట ఒప్పందానికి వేదికగా నిలిచాయి. అవి తుర్కియేలో ఖైదీల మార్పిడికి దారితీశాయి. ఇరువర్గాలు తమ ఇష్టాయిష్టాలపై కొంతమేరకు సంకేతాలిచ్చాయి.
రష్యాకు క్రాసికోవ్ అవసరమని అమెరికా స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా కేవలం నావల్నీనే కాదు, గూఢచర్యం ఆరోపణలపై 2018 నుంచి రష్యా జైలులో ఖైదీగా ఉన్న మాజీ మెరైన్ అధికారి పాల్ వీలన్‌ను కూడా విడుదల చేయాలని కోరింది.
2023 మార్చి చివరలో న్యూజెర్సీకి చెందిన 31 ఏళ్ల వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్కోవిచ్‌ను వార్తల సేకరణలో ఉండగా రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును అమెరికా, దాని మిత్రదేశాలు ఖండించాయి.
వీలన్‌తో పాటు రిపోర్టర్‌నూ ఒప్పందంలో కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సల్లివన్‌ను ఆదేశించారు. రిపోర్టర్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజే బైడెన్ ఈ ఆదేశాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యాతో అమెరికా ప్రత్యక్ష చర్చలు
ఖైదీల మార్పిడి కోసం అమెరికా నేరుగా రష్యాతో సంప్రదింపులు జరిపింది. సంబంధిత విదేశీ వ్యవహారాల మంత్రులు ఫోన్ ద్వారా మాట్లాడారు.
కానీ చర్చలు విదేశీ దౌత్యవేత్తల నుంచి సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధికారుల వద్దకు మారాయి. అయితే, ఈ విషయంలో సీఐఏ కల్పించుకోవడాన్ని అమెరికా ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్లే ఇవాన్ గెర్ష్కోవిచ్ గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అందుకే, ఈ వ్యవహారం వేరే కోణంలో వెళుతుందని అమెరికా సందేహపడింది.
ఈ సంక్లిష్టమైన చర్చలు 2023 చివరి వరకు కొనసాగడంతో ఒప్పందం ముందుకు కదలాలంటే క్రాసికోవ్ విడుదల కీలకమని అమెరికా అర్థం చేసుకున్నట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారులు వివరించారు. క్రాసికోవ్ (58) విడుదల లేని డిమాండ్లను రష్యా తిరస్కరిస్తూ వచ్చింది.
ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రాసికోవ్ జర్మనీలో ఖైదీగా ఉన్నారు. ఆయనను విడుదల చేస్తామన్న అధికారం అమెరికాకూ లేదు.
సల్లివన్ జర్మన్ ప్రతినిధితో 2023 చివరిలో, 2024 జనవరిలో చర్చలు జరిపారు. క్రాసికోవ్ విడుదలపై మాట్లాడారు. రష్యాతో ఖైదీల మార్పిడి ఒప్పందం విజయవంతం అవ్వడం అన్నది జర్మనీ క్రాసికోవ్‌ను విడుదల చేయడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైట్‌హౌస్ అధికారులు వారికి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందడుగు వేసిన అమెరికా
గూఢచర్యం ఆరోపణలతో జైల్లో ఉన్న అమెరికన్లకు బదులుగా ఆయా దేశాల్లో ఉన్న రష్యన్ గూఢచారులను అప్పగించాలనేది మాస్కో డిమాండ్. అమెరికా దీనిపై అడుగులు వేసింది. గూఢచారులను గుర్తించే ప్రయత్నం చేశారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, బందీలుగా ఉన్న గూఢచారులను విడిపించడానికి సిద్ధంగా ఉన్న మిత్రదేశాలలో అమెరికా అధికారులు, దౌత్యవేత్తలు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆయా దేశాల్లో పర్యటించారు. రష్యా గూఢచారులు జైలులో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
అమెరికా ప్రయత్నంతో దాని మిత్రదేశాలు రష్యా గూఢచారులను విడుదల చేశాయి. పోలాండ్, స్లోవేనియా, నార్వేలలోని జైళ్ల నుంచి రష్యన్ గూఢచారులు విడుదలవడంతో వాటి ఫలితం గురువారం (ఆగస్టు 1) కనిపించింది.
ఖైదీల మార్పిడిని చర్చించేందుకు 2024 ఫిబ్రవరిలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షాల్జ్ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌ను కలిశారు.

ఆ ఇంటర్వ్యూలో..
గురువారం వైట్ హౌస్ అధికారులు అందించిన జాబితా ప్రకారం ఖైదీల మార్పిడి చర్చల్లో క్రాసికోవ్, నావల్నీ, వీలన్, గెర్ష్‌కోవిచ్‌లు ఉన్నారు.
దీనిపై రష్యా నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయి. ఫిబ్రవరి ప్రారంభంలో మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్‌సన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖైదీగా ఉన్న గెర్ష్‌కోవిచ్ విడుదల గురించి వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు.
"గెర్ష్కోవిచ్ తన స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు. నేను తిరస్కరించను" అని పుతిన్ అన్నారు.
రష్యా ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇది స్పష్టంగా ఉందని బీబీసీ రష్యన్ ఎడిటర్ స్టీవ్ రోసెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.
2024 ఫిబ్రవరి 16న.. పుతిన్ ఇంటర్వ్యూ అయిన కొన్ని రోజుల తర్వాత, బైడెన్, జర్మనీ అధ్యక్షుడు ఓలాఫ్ మధ్య వైట్ హౌస్ సమావేశం జరిగిన మరుసటి రోజు ఖైదీల మార్పిడి ఒప్పందానికి బీటలు వారాయి. ఆ రోజు అలెక్సీ నావల్నీ (47) సైబీరియన్ జైలులో మరణించారు.

ఫొటో సోర్స్, EPA
కమలా హారిస్ చర్చలు
నావల్నీ మృతికి పుతిన్ కారణమని పలువురు విదేశీ నేతలు, నావల్నీ బంధువులు, మద్దతుదారులు ఆరోపించారు. అయితే, నావల్నీ సహజ కారణాలతో మరణించారని రష్యా అధికారులు తెలిపారు.
అంతకుముందు వరకు ఖైదీల మార్పిడి చర్చల గురించి ఎటువంటి సమాచారం బయటికి రాలేదు. అయితే క్రాసికోవ్‌కు బదులుగా నావల్నీని విడుదల చేసే ప్రతిపాదన ఆమోదానికి దగ్గరగా ఉందని నావల్నీ సహోద్యోగి మరియా పెవ్‌సిక్ బహిరంగంగా చెప్పారు. బీబీసీ ఆ సమయంలో పెవ్‌సిక్ వాదనలను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. ఇంతలో ఆ ఒప్పందం కుదిరిందనే వాదనను రష్యా బహిరంగంగా ఖండించింది.
కానీ ఒప్పందంలో నావల్నీని చేర్చే ప్రయత్నం జరిగినట్లు గురువారం వైట్ హౌస్ ధృవీకరించింది. నావల్నీ మరణంతో చివరికి ఆయనతో కలిసి పనిచేసిన ముగ్గురి విడుదలకు దారితీసింది.
నావల్నీ మరణాన్ని ప్రకటించిన రోజు వైట్ హౌస్‌లో గెర్ష్‌కోవిచ్ తల్లిదండ్రులు సల్లివన్‌ను కలిశారు. నావల్నీ మృతి చర్చలను మరింత కష్టతరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని మళ్లీ రూపొందించాల్సి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తర్వాత రెండు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించారు.
ఫిబ్రవరి మధ్యలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరయ్యారు. అక్కడ క్రాసికోవ్ విడుదల ప్రాముఖ్యతను జర్మనీ ఛాన్సలర్ స్కోల్స్‌కు ఆమె వివరించారు.
స్లోవేనియాలో ఇద్దరు రష్యన్ ఖైదీలుండటంతో ఆ దేశ ప్రధానిని కూడా కమలా హారిస్ కలిశారు. వారి విడుదలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని రష్యా చెప్పడంతో అమెరికా స్లోవేనియాతో మాట్లాడింది. వారిద్దరూ గురువారం విడుదలయ్యారు.
జర్మనీ గ్రీన్ సిగ్నల్
కొత్త ఒప్పందం వైట్ హౌస్‌లో రూపుదిద్దుకుంది. జూన్‌లో క్రాసికోవ్‌ను విడుదల చేయడానికి జర్మనీ అంగీకరించింది.
"మీ కోసమే నేను దీన్ని చేస్తున్నాను" అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జర్మన్ ఛాన్సలర్ అన్నారు. ఆ ఒప్పందాన్ని రష్యాకు అందించారు. 2024 జులై మధ్యలో ఆ ఒప్పందానికి రష్యా ఆమోదం తెలుపుతూ, జాబితాలో ఉన్నవారిని జైళ్ల నుంచి విడుదల చేయడానికి అంగీకరించింది.
కానీ చర్చలు చివరి దశకు చేరుకున్నప్పుడు, అమెరికాలో రాజకీయాలు మారిపోయాయి. అధ్యక్షుడిగా బైడెన్ పోటీకి డెమొక్రటిక్ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది.
సల్లివన్ ప్రకారం, బైడెన్ జులై 21న పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడానికి ఒక గంట ముందు, స్లోవేనియన్ అధికారులతో ఖైదీల మార్పిడికి చివరి చర్చలు జరిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














