ఖైదీల మార్పిడి: 8 మంది రష్యన్‌ల కోసం 16 మంది అమెరికా, యూరప్ ఖైదీల విడుదల

అమెరికా

ఫొటో సోర్స్, US Government

ఫొటో క్యాప్షన్, విడుదలైన ఖైదీల ఫోటోను అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
    • రచయిత, రాబర్ట్ గ్రీనల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రచ్ఛన్న యుద్ధ సమయం తర్వాత, రష్యా - పాశ్చాత్య దేశాల మధ్య గురువారం అతిపెద్ద ఖైదీల మార్పిడి జరిగింది. ఈ మార్పిడి ఒప్పందంలో భాగంగా 24 మంది ఖైదీలు విడుదలైనట్లు అమెరికా ధ్రువీకరించింది.

విడుదలైన ఈ ఖైదీల్లో 16 మంది యూరప్, అమెరికాలకు తిరిగి వస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. వారిలో వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్కోవిచ్ కూడా ఉన్నారు.

ఇందుకు బదులుగా అమెరికా, నార్వే, జర్మనీ, పోలాండ్, స్లొవేనియా జైళ్ల నుంచి 8 మంది రష్యన్ ఖైదీలను విడుదల చేశారు. వీరిపై గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారితో పాటు ఖైదీల ఇద్దరు పిల్లలు కూడా రష్యాకు తిరిగి వచ్చారు.

తుర్కియేలోని అంకారా విమానాశ్రయంలోని రన్‌వేపై గురువారం తెల్లవారుజామున ఈ ఖైదీల మార్పిడి జరిగింది.

అమెరికా మెరైన్ నిపుణులు పాల్ వీలన్, రష్యన్-అమెరికన్ జర్నలిస్ట్ అల్సు కుర్మషెవా, అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ రష్యన్ -బ్రిటిష్ కార్యకర్త వ్లాదిమిర్ కారా - ముర్జా అమెరికాకు తిరిగి వస్తున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు.

ఈ ఒప్పందంపై 18 నెలలకు పైగా చర్చలు జరుగుతున్నాయి. వాడిమ్ క్రాసికోవ్‌ను తిరిగి పంపాలన్న రష్యా డిమాండ్ ఇందులో ప్రధానంగా వినిపించింది. బెర్లిన్‌లోని ఒక పార్కులో జరిగిన హత్యకు పాల్పడిన కేసులో జర్మనీలో జీవిత ఖైదు అనుభవిస్తున్న క్రాసికోవ్ ఇప్పుడు రష్యాకు తిరిగొచ్చారు.

క్రాసికోవ్‌ను ''భయంకరమైన వ్యక్తి''గా అమెరికా సీనియర్ అధికారులు అభివర్ణించారు. రష్యన్లు కోరుకునే ''అతిపెద్ద చేప'' అని వారు పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో గౌరవ వందనంతో తమ దేశానికి తిరిగొచ్చిన రష్యన్లను కలిశారు.

గతంలో జరిగిన ఖైదీల మార్పిడి చర్చల్లో అప్పట్లో జైలుశిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైతం ఉన్నారు. కానీ, ఫిబ్రవరిలో ఆయన మరణించడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

ఆయన భార్య యూలియా ఈ ఖైదీల మార్పిడిని స్వాగతించారు.

"ఒక్కో రాజకీయ ఖైదీ విడుదల ఒక విజయం, దీనికి వేడుకలు చేసుకోవాలి’’ అని ఆమె తన ఎక్స్‌ పోస్ట్‌లో రాశారు.

"పుతిన్ చేతిలో ఎవరూ బందీ కాకూడదు, చిత్రహింసలకు గురికాకూడదు, వాళ్లను జైళ్లలో చనిపోనివ్వకూడదు" అని ఆమె పేర్కొన్నారు.

అమెరికా - రష్యా చరిత్రలో ఈ ఒప్పందం అత్యంత సంక్లిష్టమైనదని వైట్‌హౌస్‌ అధికారులు అభిప్రాయపడ్డారు.

బైడెన్ దీనిని "దౌత్యవిజయం"గా పేర్కొన్నారు. "నా అభ్యర్థన మేరకు చాలా దేశాలు ఈ చర్చల్లో భాగస్వాములయ్యాయి. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా" అన్నారు.

''వారిని నామమాత్రంగా విచారించి దోషులుగా నిర్ధారించారని, ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండా సుదీర్ఘమైన జైలు శిక్షలు విధించారు'' అన్నారు.

ఖైదీల విడుదలను, ముఖ్యంగా బ్రిటిష్ పౌరసత్వం కలిగిన కారా-ముర్జా, వీలన్ విడుదలను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ స్వాగతించారు.

మరోవైపు, విదేశీ జైళ్లలో ఉన్న రష్యన్లను తిరిగి రప్పించేందుకు 13 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, రష్యా విడుదల చేసిన వారి జాబితాలో పాట్రిక్ స్కోబెల్, హెర్మన్ మోజెస్ అనే ఇద్దరు జర్మన్ల పేర్లు ఎందుకు లేవనే దానిపై వివరణ లేదు.

బెలారస్‌లో మరణశిక్షను ఎదుర్కొంటూ, ఈ వారం మొదట్లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో క్షమాభిక్ష పొందిన జర్మన్ పౌరుడు రికో క్రీగర్‌నూ విడుదల చేశారు.

రష్యన్ రాజకీయ ఖైదీలు ఇలియా యషీన్, ఒలేగ్ ఓర్లోవ్‌లూ ఈ జాబితాలో ఉన్నారు.

"ఇది సరైన నిర్ణయం, మీకు ఏవైనా సందేహాలుంటే విడుదలైన వారితో మాట్లాడితే తొలగిపోతాయి" అని జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అన్నారు.

రష్యా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అంకారా విమానాశ్రయంలో ఈ మార్పిడి జరిగినట్లు తుర్కియే ప్రభుత్వం ధ్రువీకరించింది

అంతకుముందు, అంకారా విమానాశ్రయంలో ఇరుపక్షాలకూ చెందిన ఖైదీలను తుర్కిష్ భద్రతాధికారుల పర్యవేక్షణలో తమ తమ దేశాలకు వెళ్లే విమానాల్లో ఎక్కించారని తుర్కియే అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

ఈ మార్పిడిలో 26 మంది వ్యక్తులు ఉండగా, వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు ఆర్టియోమ్ దుల్ట్‌సేవ్, అన్నా దుల్ట్‌సేవాతో కలిసి రష్యాకు తిరిగి వెళ్లినట్లు అమెరికా అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ రష్యన్ జంట స్లోవేనియాలో గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

రష్యాలో జైలు శిక్ష అనుభవిస్తున్న అనేక మంది అసమ్మతివాదులు, జర్నలిస్టులను వారి జైలు గదుల నుంచి గుర్తు తెలియని ప్రదేశాలకు తరలించడంతో వివిధ దేశాల మధ్య ఖైదీల మార్పిడి జరగొచ్చనే ఊహాగానాలు వచ్చాయి.

రష్యాలో రహస్య జైలు బదిలీలు సర్వసాధారణమైనా, ఇలా ముఖ్యమైన ఖైదీలు అదృశ్యం కావడం మాత్రం అసాధారణ విషయం.

2022 డిసెంబరులో అమెరికన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు బ్రిట్నీ గ్రైనర్‌ను 12 ఏళ్లుగా అమెరికా జైలులో ఉన్న, పేరుమోసిన రష్యన్ ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌తో అబుదాబి విమానాశ్రయంలో మార్పిడి చేసుకున్నారు.

2010లో వియన్నాలో రష్యాలో డబుల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని, అమెరికాలో ఉన్న 10 మంది రష్యన్ గూఢచారులతో మార్పిడి చేసుకున్నారు. వారిలో మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి సెర్గీ స్క్రిపాల్, 2018లో సాలిస్‌బరీలో నెర్వ్ ఏజెంట్ నోవిచోక్ విషప్రయోగంతో మరణించారు.

ఇటీవలి కాలంలో మాస్కో, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. మరీముఖ్యంగా ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత మరింత తీవ్రతరమయ్యాయి.

వీడియో క్యాప్షన్, అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అతి పెద్ద ఖైదీల మార్పిడి