యుక్రెయిన్‌కు ప్రధాని మోదీ... రష్యాకు కోపం వస్తుందా, అసలు యుక్రెయిన్‌తో మన సంబంధాలు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Reuters
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న యుక్రెయిన్ పర్యటనకు వెళుతున్నారు. గతనెలలో ఆయన రష్యా పర్యటనకూ వెళ్ళారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోగానే మోదీ ఆలింగనం చేసుకున్నారు.
పుతిన్, మోదీ ఆలింగనం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియన్‌స్కీకి నచ్చలేదు. దీనిపై పాశ్చాత్య మీడియాలోనూ విమర్శలు వచ్చాయి.
జులై 9, 2024న దీనిపై జెలియన్‌స్కీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ , "ఈ రోజు రష్యా యుక్రెయిన్‌లోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 37 మంది మరణించారు, వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాంటి రోజు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ప్రపంచంలోనే అతి పెద్ద హంతకుడిని, నేరస్థుడిని కౌగిలించుకోవడం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న వారికి నిరాశ కలిగించింది’’ అని అన్నారు.
ఒక భారత ప్రధాని యుక్రెయిన్‌లో పర్యటించడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
మోదీ యుక్రెయిన్ పర్యటనపై రష్యా అంత సంతోషంగా లేదనేది చాలా మంది అభిప్రాయం, అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనతోనూ భారత్ అంత సంతోషంగా లేదనే అభిప్రాయమూ ఉంది.
యుక్రెయిన్ ఇటీవల రష్యా సరిహద్దుల్లోకి ప్రవేశించి దాడులను తీవ్రతరం చేస్తున్న సమయంలో మోదీ యుక్రెయిన్ పర్యటనకు వెళుతున్నారు.
రష్యాలోని కొన్ని ప్రాంతాలను యుక్రెయిన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, రష్యా యుక్రెయిన్‌పై భారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ యుక్రెయిన్‌కు ఎందుకు వెళుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.


ఫొటో సోర్స్, Reuters
సరైన సమయమేనా?
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ, ‘‘ప్రధాని మోదీ ఆగస్టు 23న యుక్రెయిన్ పర్యటనకు వెళ్లడం సరైన సమయం కాదు, ఈ పర్యటన ఉద్దేశమూ స్పష్టంగా లేదు. యుక్రెయిన్ దూకుడు, కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బ తీసింది. యుక్రెయిన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ భారత ప్రధానీ అక్కడ పర్యటించలేదు. ప్రధాని మోదీ యుక్రెయిన్‌కు వెళ్లేందుకు నిర్దుష్టమైన కారణాలేవీ లేవు. ముఖ్యంగా యుద్ధం కారణంగా ఉద్రిక్తత పెరిగిన ఈ సందర్భంలో.’’ అని ట్వీట్ చేశారు.
జేఎన్‌యూలో ప్రొఫెసర్ హ్యాపీమాన్ జాకబ్, ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటనకు ఎందుకు వెళుతున్నారన్న దానికి సమాధానంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పుస్తకం 'ది ఇండియా వే'లోని ఒక పేరాను ఉటంకించారు.
"అభివృద్ధి చెందుతున్న శక్తులు ప్రపంచ వైరుధ్యాల ద్వారా కలిగే అవకాశాలను గుర్తించి, వాటిని తమ జాతీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాయి." అన్నది ఆ పేరా సారాంశం.
"ఈ సమయంలో మోదీ యుక్రెయిన్ పర్యటన మంచిది కాకపోవచ్చు, యుక్రెయిన్ చొరబాటు తర్వాత రష్యా భారీ దాడికి సిద్ధమౌతోంది. ఇక్కడ కాల్పుల విరమణపై అమెరికాకు ఆసక్తి లేదు.’’ అని బ్రహ్మ చెలానీ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
యుక్రెయిన్‌తో 28వేల కోట్ల వ్యాపారం
గత 25 ఏళ్లలో భారత్, యుక్రెయిన్ మధ్య వాణిజ్య సంబంధాలు పెరిగాయి.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 28వేల కోట్ల రూపాయలు. అదే భారత్, రష్యాల మధ్య దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది.
2030 నాటికి భారత్, రష్యాల మధ్య 8 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుందని అంచనా. యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, రష్యాతో భారత్ వాణిజ్యం పెరిగింది.
యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఎప్పుడూ ఖండించలేదు, ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాలకు మద్దతు ఇవ్వలేదు. అదే సమయంలో భారత్ యుక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తోంది.
యుక్రెయిన్‌కు భారత్ సుమారు 135 టన్నుల వస్తువులను సహాయంగా పంపుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ లాల్ తెలిపారు. వీటిలో మందులు, దుప్పట్లు, టెంట్లు, వైద్య పరికరాలు, జనరేటర్లు ఉన్నాయి.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు అక్కడ భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిని అక్కడి నుంచి తరలించడంలో పోలాండ్ ముఖ్యపాత్ర పోషించింది. యుక్రెయిన్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ పోలాండ్‌లోనూ పర్యటించనున్నారు. 40 ఏళ్ల తర్వాత పోలాండ్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ.

ఫొటో సోర్స్, EPA
రష్యా,యుక్రెయిన్‌పై భారత్ వైఖరి ఏమిటి?
2023లో భారత్‌లో జీ-20 సదస్సు జరిగినప్పుడు, ఒత్తిడి ఉన్నా భారత్ యుక్రెయిన్‌ను ఆహ్వానించలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సదస్సుకు హాజరు కాలేదు.
అదే సమయంలో, జెలియన్‌స్కీ పాశ్చాత్య దేశాలలో జరిగిన అనేక సమావేశాలలో పాల్గొన్నారు.
అక్టోబరు 2022లో, రష్యా యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించడానికి, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం దానికి దూరంగా ఉంది.
జులై 2024లో, రష్యాతో యుద్ధాన్ని ఆపడానికి సంబంధించిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ జరిగింది, అప్పుడూ భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది.
ఫిబ్రవరి 2022 నుంచి ఇప్పటి వరకు, రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలకు భారతదేశం దూరంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి.
పాశ్చాత్య దేశాల నుంచి వ్యతిరేకత ఎదురైనా, భారతదేశం రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా సందర్భాలలో సమర్థించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరుదేశాలతోనూ భారత్ సంబంధాలను కొనసాగించగలదా?
రష్యాతో భారత్‌కు చారిత్రక సంబంధాలున్నాయి. రక్షణ అవసరాల కోసం భారత్ చాలా కాలంగా రష్యాపై ఆధారపడుతోంది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యాను భారతదేశ దీర్ఘకాలిక, కాలపరీక్షకు నిలిచిన భాగస్వామిగా అభివర్ణించింది. చరిత్రలో దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
1965లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించడంలో సోవియట్ యూనియన్ మధ్యవర్తి పాత్ర పోషించింది. 1971లో భారతదేశం పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగినప్పుడు, ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి మద్దతుగా సోవియట్ యూనియన్ వీటోను ప్రయోగించింది.
1971లో భారత్- సోవియట్ యూనియన్ మధ్య శాంతి, స్నేహం, సహకార ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు, ఆ ఒప్పందం 1993 జనవరిలో ఇండో-రష్యన్ స్నేహం, సహకార ఒప్పందంగా మారింది.
యుక్రెయిన్‌తో పాటు సోవియట్ యూనియన్ దురాక్రమణపై భారత్ మౌనం వహించిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అది 1956లో హంగేరీ కావచ్చు లేదా 1968లో చెకోస్లోవేకియా కావచ్చు లేదా 1979లో అఫ్గానిస్తాన్ కావచ్చు. యుక్రెయిన్ విషయంలోనూ భారత్ వైఖరి భిన్నంగా ఏమీ లేదు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరి వైపూ కనిపించడం లేదు. ఒకవైపు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు యుక్రెయిన్‌కూ సహాయం చేస్తోంది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ వైపు ఉన్నాయి. ఈ దేశాలు ఇతర దేశాల నుంచీ దానినే ఆశిస్తున్నాయి. కానీ గత రెండున్నరేళ్లలో భారత్‌పై ఈ ఒత్తిడి కనిపించలేదు.
యుద్ధ సమయంలో భారత్, రష్యాల మధ్య పెరిగిన వాణిజ్యం ఇందుకు నిదర్శనం.
ప్రొఫెసర్ జాకబ్ ఒక వ్యాసంలో, "యుక్రెయిన్‌పై దాడులు రష్యా, అమెరికా, పాశ్చాత్య దేశాల సమస్య, భారతదేశ సమస్య కాదు. నాటో విస్తరణ రష్యా సమస్య, భారతదేశ సమస్య కాదు. భారతదేశ సమస్య - చైనా. ఈ సమస్యను ఎదుర్కోవటానికి భారతదేశానికి అమెరికా, రష్యా, పాశ్చాత్య దేశాలు అవసరం.’’ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















