స్కర్దు: ఈ నగరం కోసం ఇండియా, పాకిస్తాన్‌లు 6 నెలలపాటు ఎలా యుద్ధం చేశాయంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకుడు
మేజర్ విలియం బ్రౌన్ 1947లో గిల్గిత్ స్కౌట్స్ బ్రిటిష్ కమాండర్. అప్పుడే ఏర్పడిన స్వతంత్ర పాకిస్తాన్‌లో, 'ఆజాద్ కశ్మీర్' పేరుతో జరగనున్న మరో స్వతంత్ర తిరుగుబాటులో ఆయన భాగం కాబోతున్నారు.
"కశ్మీర్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయబోతున్నారని గిల్గిత్‌లో ఒక పుకారు పుట్టింది. దీంతోపాటు స్కౌట్స్ తిరుగుబాటు చేసే అవకాశముందనే ప్రచారమూ మొదలైంది’’ అని బ్రౌన్ చెప్పారు.
‘పాకిస్తాన్ జిందాబాద్’, ‘కశ్మీర్ మహారాజు డౌన్ డౌన్’ అనే నినాదాలను గవర్నర్ ఇంటితో సహా ప్రతిగోడపైనా రాశారు.
‘‘తన ఇంటిపై రాసిన నినాదాలను గవర్నర్ స్వయంగా తుడిచివేయడం నేను చూశాను. కానీ తరువాత రోజు ఉదయానికల్లా మా ఇంటి గేటు దగ్గరా నినాదాలు రాశారు’’ అని బ్రౌన్ చెప్పారు.
ఈ ప్రాంతంలో గిల్గిత్‌తో పాటు స్కర్దు నగరం కూడా ఉంది. ఇప్పుడీ ప్రాంతం పాకిస్తాన్ పాలిత గిల్గిత్-బాల్టిస్తాన్‌లో భాగంగా మారింది.
ఈ కథ 1947లో గిల్గిత్‌లో మొదలైంది.
అది భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందిన సమయం.
కానీ, జమ్ము కశ్మీర్ సహా కొన్ని రాజ సంస్థానాల విలీనం వివాదాస్పదంగా మారింది.
ఆ సమయంలో గిల్గిత్‌లో ఉన్న మేజర్ బ్రౌన్ తను రాసిన ‘గిల్గిత్ రెబెలియన్: ద మేజర్ హూ మ్యూటినీడ్ ఓవర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో దీని గురించి రాశారు.
1947 అక్టోబర్ 25 సాయంత్రం కశ్మీర్‌కు సైన్యాన్ని పంపాలని భారత్ నిర్ణయించిందనే వార్త తెలిసింది.
అంతకు కొన్నిరోజుల ముందు 'గిరిజన దళాలు' ముజఫరాబాద్ మీదుగా కశ్మీర్‌పై దాడి చేసి శ్రీనగర్ సమీపానికి చేరుకున్నాయి.
గిల్గిత్-బాల్టిస్తాన్ ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది.
సోషియాలజీ అధ్యాపకుడు సయీద్ అహ్మద్ తన పుస్తకం 'ది గిల్గిత్-బాల్టిస్తాన్ కానండ్రమ్: డైలమాస్ ఆఫ్ పొలిటికల్ ఇంటిగ్రేషన్'లో అప్పట్లో జమ్మూకశ్మీర్ నాలుగు భాగాలుగా అంటే జమ్మూ ప్రావిన్స్, కశ్మీర్ ప్రావిన్స్‌తోపాటు గిల్గిత్, లద్దాఖ్ జిల్లాలుగా ఉండేదని రాశారు.
కానీ 1935లో బ్రిటిషర్లు గిల్గిత్ పాలనను డోగ్రా పాలకుడి నుంచి 60 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. బాల్టిస్తాన్ మాత్రం డోగ్రా ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేది.
భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందడానికి సరిగ్గా రెండు వారాల ముందు బ్రిటన్ హఠాత్తుగా ఈ లీజును రద్దు చేసింది. దీని తరువాత 1947 జులై 30న కశ్మీర్‌లో పని చేసే బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ స్కాట్ గిల్గిత్ చేరుకున్నారు.
ఆయనతోపాటు బ్రిగేడియర్ ఘన్‌సారా సింగ్ ఉన్నారు. ఆయనను కశ్మీర్ మహారాజు గవర్నర్‌గా నియమించి గిల్గిత్‌కు పంపారు.
అప్పటికి తన సంస్థానాన్ని పాకిస్తాన్ లేదా భారతదేశంలో విలీనం చేేసే విషయంలో కశ్మీర్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


ఫొటో సోర్స్, THE GILGIT REBELLION/BOOK
గిల్గిత్ తిరుగుబాటు
బ్రిటిష్ పాలన అంతం కావడంతో కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ మహారాజుకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.
గిరిజనులు శ్రీనగర్‌పై దాడి చేసిన తరువాత, మహారాజు 1947 అక్టోబరు 27 న కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
మేజర్ బ్రౌన్ పుస్తకం ప్రకారం, గిల్గిత్ స్కౌట్స్ అప్పటికే ఒక విప్లవ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తరువాత 1947 అక్టోబర్ 31న 'ఆపరేషన్ దితా ఖేల్' పేరుతో తిరుగుబాటు ప్రారంభించారు.
ఆ తిరుగుబాటు గిల్గిత్ సమీపంలోని బొంజి నుంచి ప్రారంభమైంది. అక్కడ మీర్జా హసన్ ఖాన్ నాయకత్వంలో కశ్మీర్ రాష్ట్ర సైన్యానికి చెందిన ముస్లిం సైనికులు 6 వ కశ్మీర్ పదాతిదళానికి చెందిన సిక్కు కంపెనీలపై దాడి చేశారు.
మరోపక్క, గిల్గిత్‌లో కొంత ప్రతిఘటన తర్వాత గవర్నర్ ఘన్‌సారా సింగ్ సుబేదార్ మేజర్ బాబర్‌కు లొంగిపోయారు.
మేజర్ బ్రౌన్ కూడా ఈ పత్రంపై సంతకం చేసినట్లు పేర్కొన్నారు.
1947 నవంబరు 1న గిల్గిత్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇది బేషరతుగా పాకిస్తాన్ లో విలీనమైంది.
1947 నవంబరు 16 న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి సర్దార్ మొహమ్మద్ ఆలంఖాన్ రాజకీయ ప్రతినిధిగా గిల్గిత్ చేరుకున్నారు.

ఫొటో సోర్స్, THE GILGIT REBELLION/BOOK
భారత్, పాకిస్తాన్ వ్యూహాలు
ఆ సమయంలో మేజర్ అస్లాం ఖాన్ (తరువాత బ్రిగేడియర్ అయ్యారు) గిల్గిత్‌లో నియమితులయ్యారని పాకిస్తానీ రిటైర్డ్ బ్రిగేడియర్ మసూద్ అహ్మద్ ఖాన్ రాశారు. ఆయన అక్కడి పరిస్థితిని అంచనా వేసిన తర్వాత స్థానిక స్కౌట్స్ తో కలిసి రజాకార్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. దీని కింద, నాలుగు వేర్వేరు దళాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకదానికి 'ఐ బెక్స్ ఫోర్స్' అని పేరు పెట్టారు.
సముద్ర మట్టానికి 7400 అడుగుల ఎత్తులో సింధు నది ఒడ్డున ఉన్న స్కర్దు నగరం వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైందని మసూద్ అహ్మద్ ఖాన్ చెప్పారు.
స్కర్దును అదుపులోకి తీసుకోవడం అవసరమని పాకిస్తాన్, భారతదేశం రెండూ గ్రహించాయి. అయితే ఆ రోజుల్లో గిల్గిత్ నుంచి స్కర్దు వరకు దాదాపు 260 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 20 రోజులు పట్టేది.
బాల్టిస్తాన్ ప్రాంతానికి స్కర్దు రాజకీయ కేంద్రం. కశ్మీర్‌లోని లద్దాఖ్ తహసీల్ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉండేది. ఏటా వజరత్ సిబ్బంది ఆరునెలలు అక్కడ గడిపి, మరో ఆరునెలలు లేహ్‌లో ఉండేవారు.
మేజర్ షేర్ జంగ్ థాపా నేతృత్వంలో ఆరు బెటాలియన్ల బృందం లేహ్ లో ఉందని 'డిబాకిల్ ఇన్ బాల్టిస్తాన్’ పుస్తక రచయిత కుమార్ మహాజన్ తెలిపారు.
గిల్గిత్‌లో తిరుగుబాటు వార్త తెలియగానే ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి కల్పించి స్కర్దు భద్రత కోసం బయలుదేరమని ఆదేశించారు.
మహాజన్ ప్రకారం, షేర్ జంగ్ థాపా 1947 డిసెంబరు 3న స్కర్దు చేరుకునేటప్పటికి, తనకు స్థానికంగా బలం లేదని గ్రహించారు. మరిన్ని బలగాలను కోరగా తిరస్కరించి, చివరి వ్యక్తి వరకు, చివరి రౌండ్ వరకు పోరాడాలని చెప్పారు.
దీంతో షేర్ జంగ్ థాపా నగరం వెలుపలి భాగాన్ని ముట్టడించారు.

ఫొటో సోర్స్, THE GILGIT REBELLION
భారత సైన్యం వస్తే స్కర్దు చేజారుతుంది
ఆ సమయంలో స్కర్దులో ఉన్న లద్దాఖ్ జిల్లా మేజిస్ట్రేట్ అమర్‌నాథ్ సైతం భారత సైన్యాన్ని లద్దాఖ్, కార్గిల్, స్కర్దులకు వేగంగా తరలించడానికి విమానాలు ఎక్కడ ల్యాండ్ కావాలో చెప్పారని మహాజన్ చెప్పారు.
కానీ, ఆ సమయంలో భారత సైన్యం కశ్మీర్‌లో ఇతర అంశాల్లో నిమగ్నమై ఉందని, భారత వైమానిక దళం వద్ద ఉన్న విమానాలు ఆ ప్రదేశాల్లో ల్యాండ్ కాలేకపోవడం ఒక సమస్య అని ఆయన చెప్పారు.
అహ్మద్ హసన్ డానీ పుస్తకం 'తారిఖ్-ఇ-షుమాలీ ఇలాఖాజాత్' (ఉత్తర ప్రాంతాల చరిత్ర) ప్రకారం, భారత సైన్యం శ్రీనగర్ ద్వారా స్కర్దుకు చేరుకుంటే, ఈ నగరం వారి చేతుల్లోంచి జారిపోతుందని మేజర్ అస్లాం ఖాన్‌కు కూడా తెలుసు. పైగా ఆయనకు చాలా తక్కువ సమయం ఉంది.
కానీ, స్కర్డు సమీపంలో ఉన్న రోండో రాజు సహకారంతో, క్రమబద్ధమైన ప్రణాళికతో మేజర్ ఎహ్సాన్ నేతృత్వంలోని ఐ బెక్స్ ఫోర్స్ మొదటి రక్షణ దిగ్బంధాన్ని అధిగమించి స్కర్డు చేరుకోవడంలో విజయం సాధించింది
బొంజి నుంచి తప్పించుకున్న 6వ జమ్మూ కశ్మీర్ పదాతి దళాలను స్కర్దు పట్టణంలోని ఖర్పోచో కోటలోని గ్రౌండ్ పాయింట్ 8853 వద్ద కంటోన్మెంట్ చుట్టుపక్కల మోహరించారు.
ఈ పరిస్థితులలో బ్రిగేడియర్ ఫకీర్ సింగ్ నేతృత్వంలోని భారత హైకమాండ్ శ్రీనగర్ నుంచి స్కర్దుకు రెండు అదనపు కంపెనీల బలగాలను పంపింది.
1948 ఫిబ్రవరి 11 న స్కర్దు కంటోన్మెంట్‌పై మొదటి దాడి జరిగింది. దీనిలో రెండు వైపుల నుంచి భారీగా కాల్పులు జరిగాయి.
బి.చక్రవర్తి రాసిన 'స్టోరీస్ ఆఫ్ హీరోయిజం' పుస్తకం ప్రకారం, 1948 ఫిబ్రవరి 11న ఐ బెక్స్ ఫోర్స్‌కు, కోట రక్షణ దళాలకు మధ్య ఆరు గంటల యుద్ధం తర్వాత, దాడి చేసినవారు వెనుదిరిగారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడ మరిన్ని దాడులు జరిగాయని, అందులో పాయింట్ 8853తో సహా సగం స్థానాన్ని స్వాధీనం చేసుకున్నారని మసూద్ ఖాన్ చెప్పారు.
ఇంతలో లొంగిపోయిన సైన్యాన్ని రక్షించేందుకు బ్రిగేడియర్ ఫకీర్ సింగ్ నేతృత్వంలో బ్రిగేడ్ స్కర్దూకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం కార్గిల్-స్కర్దు రహదారి మీదుగా రెండు ప్లటూన్లు వస్తున్నాయని, అక్కడ భారత సైనికులపై దాడి చేసి కాల్పులు జరిపారని తెలిపారు.
భారత సైనికుల మీద పైనుంచి భారీ రాళ్ల వర్షం కురిపించారు.
వెలుతురు సరిగా లేకపోవడంతో బ్రిగేడియర్ ఫకీర్ సింగ్, ఆయన సలహాదారు కొంతమంది సైనికులతో తప్పించుకోగలిగారని, చాలామంది సింధు నదిలో దూకి మునిగిపోయారని తెలిపారు.

ఫొటో సోర్స్, DEBACLE IN BALTISTAN/BOOK
ముగిసిన యుద్ధం
మహాజన్ అభిప్రాయం ప్రకారం, స్కర్దులో ముట్టడిలో ఉన్న భారత సైనికులకు, వారి కమాండర్ షేర్ జంగ్ థాపాకు మనోధైర్యంతోపాటు ఆహార పదార్ధాల సరఫరా కూడా తగ్గిపోయింది.
ఆ సమయంలో భారత వైమానిక దళం కోటకు కొంతమేర సామగ్రి చేరవేయగలిగింది.
ఇంతలో మేజర్ ఎహ్సాన్ కార్గిల్, జోజిలా వైపు కొన్ని దళాలను పంపారు. మే 1948లో ఐ బెక్స్ ఫోర్స్ ఎస్కిమో ఫోర్స్ సహాయంతో కార్గిల్, ద్రాస్‌లను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాయి.
ఆ తర్వాత భారత సైన్యం తీసుకున్న చర్యతో వారు వెనుదిరగాల్సి వచ్చింది.
ఇంతలో ప్రిన్స్ మతౌల్ ముల్క్ మేజర్ బుర్హానుద్దీన్ నేతృత్వంలో చిత్రాల్ స్కౌట్స్, చిత్రాల్ బాడీగార్డ్స్‌కు చెందిన 300 మంది సైనికులు స్కర్దుకు చేరుకున్నారు. లొంగిపోవాలంటూ మతౌల్ ముల్క్ సందేశం పంపినా ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు.
1948 ఆగస్టు మధ్య నాటికి స్కర్దు సైనికదళం అధ్వాన స్థితిలో ఉందని చందర్ బి.ఖండూరి రాశారు.
ఆయన రాసిన దాని ప్రకారం ‘‘1948 ఆగస్టు 13న, స్కర్దులో ఉన్న కశ్మీరీ, భారత దళాలు చిన్నచిన్న బృందాలుగా కోటను విడిచిపెట్టాయి."
"1948 ఆగస్టు 14న, ఐదు నెలల ముట్టడి తరువాత, లెఫ్టినెంట్ కల్నల్ థాపా, కెప్టెన్ గంగా సింగ్, కెప్టెన్ పి.సింగ్, లెఫ్టినెంట్ అజిత్ సింగ్, 250 మంది సైనికులు లొంగిపోయారు" అని పేర్కొన్నారు.
చరిత్రకారుడు డాక్టర్ అహ్మద్ హసన్ డాని ప్రకారం, కల్నల్ మతౌల్ ముల్క్ నాయకత్వంలో చిత్రాల్ సైనికుల సహాయంతో అంతిమ విజయం సాధించారు.
1948 ఆగస్టు 14 మధ్యాహ్నం ఒంటి గంటకు చారిత్రాత్మక కొండ ఖిలా ఖర్పోచోపై పాకిస్తాన్ జెండా ఎగురవేశారు. దీంతో దక్షిణ బాల్టిస్తాన్‌తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత ఉత్తర ప్రాంతాలలో స్కర్దు కూడా భాగంగా మారినట్లయింది.
మేజర్ ఎహ్సాన్ అలీకి పాకిస్తాన్ ప్రభుత్వం సితారా-ఎ-జురాత్‌ను అందించగా, లెఫ్టినెంట్ కల్నల్ షేర్ జంగ్ థాపాకు భారతదేశంలో మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.
యుద్ధం ముగిసిన తరువాత, ఆయనను, ఇతర ఖైదీలను భారతదేశానికి తిరిగి పంపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














