ఎంపాక్స్: స్వీడన్‌కూ పాకిన ఈ మహమ్మారి సెక్స్ ద్వారానూ వ్యాపిస్తుందా?

ఎంపాక్స్ దద్దుర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్‌ సోకిన వారిలో ఫ్లూ లాంటి లక్షణాలు, చర్మంపై నీటిబొబ్బలు కనిపిస్తాయి.

ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకర ఎంపాక్స్ కేసును గుర్తించినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది.

ఎంపాక్స్ క్లేడ్ 1 తీవ్రస్థాయిలో ఉన్న, వేగంగా విస్తరిస్తున్న ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో బస చేయడంతో ఆ వ్యక్తి ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారని ఏజెన్సీ తెలిపింది.

ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎంపాక్స్ తీవ్రంగా వ్యాపించడం...అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన విషయమని చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ... ఆరోగ్య అత్యవసరపరిస్థితి ప్రకటించిన కొన్ని గంటలకే ఆఫ్రికా వెలుపల ఈ కేసు గుర్తించారు.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కనీసం 450 మంది ఈ వ్యాధి బారిన పడి మరణించారు.

మధ్య, తూర్పు ఆఫ్రికాలోని ప్రాంతాలకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అంటువ్యాధి

ఫొటో సోర్స్, Reuters

మంకీపాక్సే ఎంపాక్స్

ఆఫ్రికా వెలుపల ఎంపాక్స్ బారిన పడ్డ వ్యక్తి స్టాక్‌హోమ్ ప్రాంతంలో చికిత్స పొందుతున్నారు. అయితే స్వీడన్‌లో ఓ వ్యక్తికి ఎంపాక్స్ సోకిందని....అక్కడి జనాభా మొత్తం ప్రమాదంలో ఉందని భావించాల్సిన అవసరం లేదన్నారు స్వీడిష్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ యాక్టింగ్ హెడ్ ఒలీవియా విగ్‌జెల్.

ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి కూడా.. ఎంపాక్స్ క్లేడ్ 1...వ్యాప్తి బారీస్థాయిలో ఉన్న ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో బస చేయడం వల్లే...వ్యాధి బారిన పడ్డారని ఆమె చెప్పారు.

ఎంపాక్స్‌ను అంతకుముందు మంకీపాక్స్‌గా పిలిచేవారు.

ఒకరితో ఒకరు దగ్గరగా మసలడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

సెక్స్, స్పర్శ, ఒకరితో ఒకరు దగ్గరగా మాట్లాడుకోవడం వంటివాటి వల్ల ఈ వ్యాధి వ్యాపించే అవకాశముంది.

అంటువ్యాధి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైరస్ లక్షణాలు కనిపించిన వారి నుంచి శాంపిల్స్ సేకరణ

క్లేడ్ 1బి ఎంపాక్స్

ఎంపాక్స్‌ సోకిన వారిలో ఫ్లూ లాంటి లక్షణాలు, చర్మంపై నీటిబొబ్బలు కనిపిస్తాయి. వంద కేసుల్లో నలుగురికి ప్రాణాంతకంగా మారుతుంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో ఎంపాక్స్ సాధారణ వ్యాధి.

ఈ ప్రాంతాల్లో ఏటా వేలకొద్దీ కేసులు నమోదవుతుంటాయి.

ప్రస్తుతం ఒకే సారి అనేక రకాల ఎంపాక్స్ వేగంగా వ్యాపిస్తోంది.

కానీ గత సెప్టెంబరులో గుర్తించిన అత్యంత ప్రమాదకర కొత్త రకం క్లేడ్ 1బి ఎక్కువగా విస్తరిస్తోంది.

క్లేడ్ 1లో రెండు రకాలున్నాయి. స్వీడిష్‌లో గుర్తించింది క్లేడ్ 1బి.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ క్లేడ్ 1బి మొదటి కేసు నమోదయింది.

ఆ తర్వాత బురుండి, కెన్యా, రువాండాలోనూ కేసులు నమోదయ్యాయి.

ఇప్పుడు స్వీడన్‌లో తొలి కేసు నమోదయింది.

క్లేడ్ 2 వ్యాప్తితో 2022లో ఆరోగ్య అత్యవసర స్థితి విధించారు.

ఇప్పటికే స్వీడన్‌లో 300 కేసులు నమోదయ్యాయి. అయితే వాటి తీవ్రత తక్కువగా ఉంది.

స్వీడన్‌లో నమోదయిన ఎంపాక్స్ క్లేడ్ 1బి తొలి కేసును, రోగికి అందుతున్న వైద్యాన్ని డబ్ల్యూహెచ్ఓ, యూరప్ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

స్వీడన్‌లా మిగిలిన దేశాలు వేగంగా, పారదర్శకంగా ఉండాలని అవి విజ్ఞప్తి చేశాయి. రానున్న రోజుల్లో యూరప్ ప్రాంతంలో క్లేడ్ 1 కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపాయి.

ప్రమాదకరస్థాయిలో వ్యాధి వ్యాప్తి చెందితే... వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండడం, ఎక్కువమంది మరణించడం వంటివి జరుగుతాయని స్వీడిష్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది.

అంటువ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ నుంచి రక్షణ కల్పించే టీకాలు

వేగంగా వైరస్ వ్యాప్తి

ఆఫ్రికా వెలుపల మొదటి కేసు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమని, వ్యాధి వ్యాప్తి తీవ్రత మనకు తెలిసిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఉందని పాక్స్ వైరస్ నిపుణులు డాక్టర్ జొనాస్ అల్బార్నాజ్ చెప్పారు.

ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఇమ్యునాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ ఫెర్గ్యుసన్ అంగీకరించారు. అయితే ఆఫ్రికాలో వ్యాధి తీవ్రత, వ్యాప్తి చెందుతున్న విధానం గమనిస్తే..ఇది అంత ఆశ్చర్యం కలిగించే అంశం కాదన్నారు.

ఎంపాక్స్ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విషయమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలవాలని కోరింది.

వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్నవారు, వ్యాధి సోకిన వారికి దగ్గరగా సంచరిస్తున్న వారు ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజలకు అవసరమైనన్ని టీకాలు అందుబాటులో లేవని చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

టీకాలు నిజంగా ఎవరికి అవసరమన్నది గుర్తించడం కూడా చాలా కష్టమని అంటున్నారు.

అంటువ్యాధి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ ప్రాణాంతకంగా మారుతుంది

ఎంపాక్స్ తీవ్రత పెరిగే అవకాశం

యూరప్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నమోదయిన తరహాలో స్వీడన్‌లో క్లేడ్ 1బి వేరియంట్ మరణాలు ఉండకపోవచ్చు.

ఒక దేశం నుంచి మరో దేశానికి ఎంపాక్స్ వ్యాప్తి చెందకుండా నిరోధించే వ్యవస్థ ప్రస్తుతం లేకపోవడంతో యూరప్‌తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని డాక్టర్ ఫెర్గ్యుసన్ చెప్పారు.

ఇన్‌ఫెక్షన్ సోకిన 6 నుంచి 13 రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, పుండ్లు, నరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని యురోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తెలిపింది.

కొంతమందికి లక్షణాలు తక్కువగా ఉంటే మరికొంతమందికి సాధారణంగా ఉంటాయి. వారంతా పూర్తిగా కోలుకుంటారు. అయితే రోగనిరోధక శక్తి లేని వారికి మాత్రం చాలా ప్రమాదం ఎదురవుతుంది.

ఆఫ్రికా వెలుపల తొలి కేసు నమోదయిందన్న విషయం ఆందోళన కలిగించే అంశమయినప్పటికీ అది ఊహించిందే.

మరో మహమ్మారి ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నందున... వ్యాధి వ్యాప్తిచెందకుండా

అంతర్జాతీయంగా మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో క్యాప్షన్, ఆఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO