‘ఆయన వేరే దారి లేదన్నారు, నేను మార్గం ఉందన్నాను’ - ఎలాన్ మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్ ఏమేం చెప్పారు?

ఎలాన్ మస్క్, డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్, డోనల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం బిలియనీర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్‌తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనిలో ట్రంప్ తన రాజకీయ ప్రచారం, ప్రత్యర్థులు, అనేక ఇతర అంశాలపై ఎలాన్ మస్క్‌తో సుదీర్ఘంగా సంభాషించారు.

ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూ సాంకేతిక సమస్యలతో 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా మొదలైంది.

దీనికి ఎక్స్‌పై సైబర్ దాడే కారణమని మస్క్ ఆరోపించారు. ఎక్స్ ఆడియో సంభాషణలో సాంకేతిక సమస్యలకు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ ఎన్నికల ప్రచారం తిరిగి వేగం పుంజుకుంటున్న వేళ ఈ సంభాషణ జరిగింది.

డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్, ట్రంప్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. గత నెలలో జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోగానే, హారిస్ ప్రచారం ఊపందుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌‌

ఫొటో సోర్స్, AP

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌‌పై దాడి జరిగింది.

కాల్పులు జరిగిన చోట మళ్లీ ప్రచారం

సోమవారం ట్రంప్ ఎక్స్‌లో మస్క్‌తో సంభాషిస్తూ ''సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం గల ఇలాంటి వేదిక ఉండటం ఆనందంగా ఉంది" అన్నారు.

ట్రంప్ గతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై సందేహలు వ్యక్తం చేస్తూ ఫెడరల్ సబ్సిడీలను వెనక్కి తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల ట్రంప్‌కు మస్క్ మద్దతు ఇచ్చారు. ఇపుడు, కార్లను తయారు చేసే టెస్లా సంస్థ చాలా ‘‘గొప్పది’’ అని ట్రంప్ అన్నారు.

2021 జనవరి 6 క్యాపిటల్ అల్లర్ల తర్వాత ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను అప్పటి ట్విటర్ యాజమాన్యం తొలగించిన సంగతి తెలిసిందే.

ఇపుడు అదే సోషల్ మీడియా వేదికలో ట్రంప్, మస్క్‌ల సంభాషణ కీలకంగా మారింది.

గత నెలలో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై హత్యాయత్నం, ఇజ్రాయెల్‌ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ వంటిది అమెరికా వద్ద కూడా ఉండాలన్న ఆలోచన, వలసలు తదితర అంశాలను ఈ ఇంటర్వ్యూలో చర్చించారు.

నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తాను గెలిస్తే మొదటి చర్యగా ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను మూసివేసి, ఆ బాధ్యతను రాష్ట్రాలకు బదిలీ చేస్తామని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు.

తనపై కాల్పులు జరిగిన పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.

బట్లర్‌లో తన ప్రసంగాన్ని "నేను ఇంతకుముందు చెబుతున్నట్లు..." అంటూ ప్రారంభిస్తానని ఆయన చమత్కారంగా అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌ల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఆ ఇద్దరూ "తెలివైనవాళ్లు, దుష్టులు" అని అన్నారు.

యుక్రెయిన్‌పై దాడి చేయవద్దని పుతిన్‌కు సలహా ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు.

"ఆయన వేరే దారి లేదన్నారు, నేను మార్గం ఉందని చెప్పాను" అని ట్రంప్ అన్నారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, REUTERS/MIKE BLAKE

మస్క్-ఫ్యాక్టర్ పని చేస్తుందా?

ఎలాన్ మస్క్ ఈ ఇంటర్వ్యూతో రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన గొంతుగా మారారు.

మస్క్‌కు ఎక్స్‌లో 19 కోట్ల కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. రాజకీయ వివాదాలపై ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాలను తెలియజేస్తారు.

ఇటీవల ట్రంప్ ప్రచారానికి మద్దతు ఇచ్చే కొత్త రాజకీయ కమిటీలోనూ మస్క్ పాల్గొన్నారు.

ఈ ఇద్దరి మధ్యా సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వస్తున్నాయి. గతంలో ఆన్‌లైన్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే, సోమవారం స్నేహపూర్వక వాతావరణంలో ఈ సంభాషణ జరిగింది.

రెండు గంటల సంభాషణ ముగిసే సమయానికి, మస్క్ ట్రంప్‌కు తన మద్దతును పునరుద్ఘాటించారు. రిపబ్లికన్ ప్రచారానికి మద్దతు ఇవ్వాలని తటస్థ ఓటర్లకు పిలుపునిచ్చారు.

ప్రజల కోసం ఉత్తేజకరమైన, స్పూర్తిదాయకమైన భవిష్యత్తు ఎదురు చూస్తోందని ఆయన అన్నారు.

డొనల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు.

ఎక్స్‌లో మస్క్ సొంత పోస్టులను పరిశీలిస్తే, ఆయన దశాబ్ద కాలంలో రాజకీయంగా యూటర్న్‌లు తీసుకున్నట్లు తెలుస్తుంది.

గతంలో మస్క్ మాజీ అధ్యక్షులు ఒబామా, క్లింటన్, జేఎఫ్‌కేలను బహిరంగంగా సమర్థించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఆయన నిధులు విరాళంగా ఇచ్చారు.

2020 నాటికి ఆయన జో బైడెన్‌కు "అయిష్టంగా" ఓటు వేసినట్లు తెలిపారు.

నాలుగేళ్ల తర్వాత అంటే గత జులైలో మస్క్ ''2020లో ఎవరినైతే వ్యతిరేకించానో ఆ వ్యక్తికి పూర్తిగా మద్దతిస్తున్నాను" అని తెలిపారు.

డెమొక్రాట్లే తనను మార్చారని, గతంలో తాను మద్దతు ఇచ్చిన పార్టీని "ఉగ్రవాదులు హైజాక్ చేశారు" అని అన్నారు.

అయితే ఈ యూటర్న్‌కు కారణం కేవలం రాజకీయ అభిప్రాయ భేదాలే కాకుండా వ్యాపార కారణాలూ లేకపోలేదు.

2022లో మస్క్ కొందరు ప్రముఖ డెమొక్రాట్‌లు తనపై ఎలాంటి కారణం లేకుండా దాడులు చేస్తున్నారని, తన కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థలకు తగిన మద్దతు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)