‘యుక్రెయిన్ వద్ద బందీలుగా 100 మంది రష్యా సైనికులు’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జాన్‌లుకా అవనీనా, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, బీబీసీ న్యూస్
రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని చుట్టుముడుతూ తమ సైన్యం మరింత ముందుకు వెళ్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.
కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో 100 మంది రష్యా సైనికులను యుక్రెయిన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని యుక్రెయిన్ మిలటరీ టాప్ కమాండర్ ఒలెక్సాండర్ సిరిస్కై ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీకి తెలిపారు.
రష్యాలోని 1,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని యుక్రెయిన్ టాప్ కమాండర్ అంతకుముందు ప్రకటించారు.
యుద్ధంలో తాము సరిహద్దులు దాటి సాధించిన అతిపెద్ద విజయం ఇదని ఆయన అన్నారు.
రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం యుక్రెయిన్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ప్రమాదకర ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామని కమాండర్ ఒలెక్సాండర్ సిరిస్కై చెప్పారు.
రష్యా ఇతరులకు యుద్ధం తెచ్చిపెట్టిందని, ఇప్పుడా యుద్ధం ఆ దేశానికే తిరిగి వస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ దాడులపై స్పందించారు. దీన్ని తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే చర్యగా ఆయన పేర్కొన్నారు.
‘‘మన భూభాగం నుంచి శత్రువును తరిమికొట్టండి’’ అని రష్యా బలగాలకు పుతిన్ ఆదేశాలిచ్చారు.


సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
యుక్రెయిన్ దాడులు జరుగుతున్న పశ్చిమ రష్యా ప్రాంతం నుంచి స్థానికులను పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రత కోసం 59,000 మందిని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందిగా సూచించారు.
కుర్స్క్ ప్రాంతంలోని 28 గ్రామాలపై యుక్రెయిన్ బలగాలు నియంత్రణ సాధించాయని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ పుతిన్‌తో జరిగిన సమావేశంలో తెలిపారు.
యుక్రెయిన్ దాడుల్లో 12 మంది చనిపోయారని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వివరించారు.
కొన్ని రోజుల క్రితం రష్యాలోని 30 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లిన యుక్రెయిన్ బలగాలు అకస్మాత్తుగా దాడులకు దిగాయి.
రష్యాలో 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇప్పుడు తమ బలగాలు నియంత్రిస్తున్నాయని యుక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ చెప్పిన మాటలపై కొందరిలో సందేహాలున్నాయి.
ఆ ప్రాంతం మొత్తం యుక్రెయిన్ ఆధీనంలో ఉందంటే అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్’ నమ్మడం లేదు.
యుక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలో 12కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చాయని, 40కిలోమీటర్ల వేగంతో ముందుకెళ్తున్నాయని తాము రష్యా నేతతో చెప్పామని అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు.
ఈ ప్రమాదకర దాడి వల్ల యుక్రెయిన్‌కు నైతిక బలం పెరిగిందని ఆ దేశం భావిస్తోంది. అయితే ఈ వ్యూహం యుక్రెయిన్‌కు సరికొత్త ప్రమాదాలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
మాస్కో నుంచి ప్రతీకారం తప్పదా..?
యుక్రెయిన్ చొరబాటుపై మాస్కో చాలా కోపంగా ఉందని, యుక్రెయిన్ పౌర ఆవాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు తీవ్రం చేసే అవకాశముందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ బ్రిటిష్ మిలటరీ అధికారి చెప్పారు.
కలహాలు సృష్టించడం, అసమ్మతిని పెంచి పోషించడం, ప్రజలను భయపెట్టడం, రష్యా సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం శత్రువు అంతిమ లక్ష్యాల్లో ఒకటని అధ్యక్షుడు పుతిన్ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆరోపించారు.
మన భూభాగం నుంచి శత్రువులను తరిమికొట్టడమే రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యమని అధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ అన్నారు.
1,21,000 మంది ప్రజలను వాళ్ల ఇళ్ల నుంచి ఖాళీ చేయించామని స్మిర్నోవ్ తెలిపారు. యుక్రెయిన్ బలగాలు ఆక్రమించిన ప్రాంతంలో ఇంకా 2,000 మంది రష్యా పౌరులు ఉన్నారని పుతిన్‌తో చెప్పారు.
‘‘వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు’’ అని ఆయన చెప్పారు.
క్షిపణుల నుంచి తప్పించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. కిటికీలు లేని, మందపాటి గోడలున్న గదుల్లో తలదాచుకోవాలని సూచించారు.

వాళ్లింటికే వచ్చిన యుద్ధం
కుర్స్క్ పక్కనే ఉన్న బెల్గోరోడ్ ప్రాంతం నుంచి ఒక్కరోజే 11,000 మంది సరిహద్దులకు దగ్గరగా ఉన్న క్రస్నోయార్క్ జిల్లాకు వెళ్లిపోయారని గవర్నర్ వ్యాచెస్లవ్ గ్లాడ్‌కోవ్ చెప్పారు.
ఆ ప్రాంతం మొత్తం క్షిపణుల దాడి జరిగే ప్రమాదముందని ఇంతకుముందు ఆయన హెచ్చరించారు. బేస్‌మెంట్‌లలో తలదాచుకోవాలని ప్రజలను కోరారు.
యుక్రెయిన్ బలగాల దాడులపై జెలియన్‌స్కీ ప్రసంగించారు. చాలా ఘోరంగా పోరాడాలని పుతిన్ అనుకుంటే...రష్యా కచ్చితంగా శాంతిని ఆచరించాల్సి ఉంటుందని జెలియన్‌స్కీ వ్యాఖ్యానించారు.
‘‘రష్యా ఇతరులను యుద్ధంలోకి నడిపిస్తే..ఇప్పుడది వాళ్ల ఇంటికే వచ్చింది. యుక్రెయిన్ ఎల్లప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటుంది. మేం కచ్చితంగా శాంతికే కట్టుబడి ఉంటాం’’ అని జెలియన్‌స్కీ చెప్పారు.
చిన్న చొరబాటు జరిగిందని రష్యా సరిహద్దు దళాలు ప్రాథమిక స్థాయిలో తెలిపాయి. అయితే వేలాది బలగాలు ఆపరేషన్‌లో భాగమయ్యాయని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.
రష్యాకు వీలయినంత ఎక్కువ నష్టం కలిగించడం, రష్యాలో పరిస్థితులను అస్థిరపరచడం యుక్రెయిన్ బలగాల లక్ష్యమని ఒక అధికారి న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో చెప్పారు.
పుతిన్ రాజకీయ జీవితంపై ప్రభావం
యుక్రెయిన్ చొరబాటు పుతిన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందని నాటోలో అమెరికా మాజీ అధికారి కర్ట్ వోకర్ బీబీసీ న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌లో చెప్పారు.
అధ్యక్షుడు పుతిన్ వల్ల, ఆయన యుద్ధం చేస్తున్న విధానం వల్లే రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ చొరబడిందని ఆయన అన్నారు.
‘‘రష్యాలో సంపన్నులు, సాధారణ ప్రజలెవరూ ఈ దాడుల వల్ల ఏమీ కోల్పోరు. రష్యా భూభాగంపై దాడులు జరిపేలా పుతిన్ రెచ్చగొట్టారు. దీనివల్ల ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అదే ఏదో తేడాగా కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.
సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ యుక్రెయిన్ తెలివి, తెగింపులకు నిదర్శనమని జెలియన్‌స్కీతో జరిగిన సమావేశంలో అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ అన్నారు. యుక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు అందించడం ద్వారా ఆ దేశానికి సాయం చేయాలని అధ్యక్షుడు బైడన్ యంత్రాంగాన్ని ఆయన కోరారు.
కుర్స్క్ ప్రాంతంలోకి అసలు యుక్రెయిన్ ఎలా ప్రవేశించగలిగిందని రష్యాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని, అప్రమత్తంగా ఉండాలని రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించే ఒక బ్లాగర్ యురి పొడొల్‌యక చెప్పారు.
యుక్రెయిన్‌కు గట్టిగా బదులు చెప్పడానికి రష్యా బలగాలు ఎక్కువ సమయం తీసుకోబోవని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మరియా జఖరోవా చెప్పారు.
డ్రోన్లతో బెలారస్ గగనతలంలోకి ప్రవేశించామని యుక్రెయిన్ చెప్పడంతో...బెలారస్ అప్రమత్తమయింది. రష్యా మిత్రదేశమైన బెలారస్... సరిహద్దుల్లో భారీగా భద్రతాబలగాలను మోహరించామని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














