మధ్యప్రదేశ్: ఆవులను నదులలోకి, కొండలపైనుంచి ఎందుకు తోసేస్తున్నారు?

ఆవులు

ఫొటో సోర్స్, Shuraih Niazi

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లో ఆవులను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తరిమికొట్టారనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
    • రచయిత, సురైహ్ నియాజీ
    • హోదా, భోపాల్ నుంచి, బీబీసీ కోసం

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి ఆవులను తరిమికొట్టారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఆవులను నదిలోకి తరిమికొడుతున్న వీడియో వైరల్ అయిన తరువాత నిందితులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

బమ్‌హౌర్ ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జి కింద పొంగిపొర్లుతున్న నదిలోకి ఆవులను తరిమికొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. చాలా ఆవులు నదీ ఉధృతికి కొట్టుకుపోయాయి.

కొన్ని ఆవులకు కాళ్లు విరిగిపోగా, మరికొన్ని ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఆవుల సంఖ్య 20 వరకు ఉంటుందని, వాటిలో సుమారు ఆరు ఆవులు చనిపోయాయని స్థానికులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు

నదిలోకి తరిమికొట్టిన ఆవుల సంఖ్య ఎంతనేది విచారణ తరువాతే స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

రైల్వే బ్రిడ్జి కింద కొంతమంది, వీధి పశువులను తరిమేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని సబ్ డివిజనల్ పోలీసు అధికారి నాగౌద్ విదిత దాగర్ తెలిపారు.

‘‘అక్కడికక్కడే విచారించి నలుగురిపై కేసు నమోదు చేశాం. ఇందులో ముగ్గురు ఒకే చోట నివాసం ఉంటారు. ఒకరు మైనర్. అతన్ని కూడా నిందితుడిగా చేర్చాం’’ అని విదిత తెలిపారు.

అరెస్టయిన వారిలో బేటా బాగ్రీ, రవి బాగ్రీ, రాంపాల్ చౌధరీ ఘటనాస్థలికి సమీపంలోని ఒక గ్రామంలో ఉంటారు. నలుగురు నిందితులపై 4/9 గోవధ నిషేధ చట్టం, బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 325 (3/5) కింద కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లో వీధి ఆవులు

ఫొటో సోర్స్, Shuraih Niazi

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లో వీధి పశువుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

వెలుగులోకి అనేక ఉదంతాలు

వీధి పశువులు పంటలను ధ్వంసం చేస్తున్నాయనే ఆందోళనతో నిందితులు ఈ పని చేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.

ఇంతకు ముందు కూడా రేవా జిల్లాలో డజన్ల కొద్దీ ఆవులను కొండపైకి తీసుకెళ్లి అక్కడ నుంచి వాటిని కిందకు తోసేశారు. ఈ ఘటనలో చాలా ఆవులు చనిపోగా, చాలా వాటి కాళ్లు విరిగాయి. క్రూరమైన ఇలాంటి అనేక ఉదంతాలు ఈ ప్రాంతంలో వెలుగు చూశాయి.

ప్రస్తుతం ఇలాంటి కేసులు సర్వసాధారణంగా మారాయని ఈ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త శివానంద్ ద్వివేది అన్నారు.

"యంత్రాల వాడకం వల్ల ఆవులు, ఎద్దుల ఉపయోగం పూర్తిగా తగ్గిపోయింది. పాలు ఇచ్చినంత కాలం మాత్రమే ప్రజలు ఆవులను పెంచుకుంటారు. ఆ తర్వాత వాటిని వదిలేస్తారు. ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుల అవసరం లేనందున వాటిని రోడ్లపై విడిచిపెడుతున్నారు. వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అని ఆయన అక్కడి పరిస్థితిని వివరించారు.

ఆవులు

ఫొటో సోర్స్, Shuraih Niazi

ఫొటో క్యాప్షన్, వీధి పశువులు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

వీధి పశువులతో ప్రమాదాలు

మధ్యప్రదేశ్‌లో వీధి పశువుల సమస్య తీవ్రంగా మారుతోంది. రోడ్లపై అడ్డంగా నిలబడే పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోగా, గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు నష్టం కలుగుతోంది.

భోపాల్‌లో ఆగస్టు 10న రోడ్డుపై పడుకున్న ఒక ఆవును ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రత్యూష్ త్రిపాఠి చనిపోయారు. ప్రత్యూష్ తన స్నేహితుడి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా చీకట్లో రోడ్డుపై ఉన్న ఆవు కనిపించలేదు. ఆవు కొమ్ము ఆయన తొడలోకి చొచ్చుకుపోయింది. ఆసుపత్రికి తరలించినా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు.

భోపాల్‌కు చెందిన 60 ఏళ్ల మున్నీ బాయి సోన్కర్, అటవీ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇటీవల ఆమె పని ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో నలుగురు ఉన్నారు. అందులో ముగ్గురు గాయపడ్డారు. మున్నీబాయి ఆటో కింద నలిగిపోయారు. వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మధ్యప్రదేశ్‌లోని రహదారులపై ఇలాంటి ప్రమాదాలు రోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆవుల కోసం 1,563 గోశాలలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఆమోదం పొందిన గోశాలల సంఖ్య 3200 కంటే ఎక్కువే ఉంటుంది. గోశాలలు భారీగా ఉన్నప్పటికీ, వివిధ జాతీయ రహదారులపై వేలాది వీధి పశువులు కనిపిస్తాయి. రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఈ పశువులు మరణించడమే కాకుండా మనుషులు కూడా గాయాల పాలవుతున్నారు. చాలా సందర్భాల్లో ప్రాణాలూ కోల్పోతున్నారు.

మధ్యప్రదేశ్‌లో వీధి ఆవులు

ఫొటో సోర్స్, Shuraih Niazi

ఫొటో క్యాప్షన్, వీధి పశువుల సమస్య పరిష్కారానికి 2వేల మంది వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

వీధి పశువుల సమస్య పరిష్కారం కోసం 15 రోజుల పాటు ఒక ప్రత్యేక ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది.

గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేసినా ఫలితం కనిపించలేదు.

వీధి పశువుల నియంత్రణపై తమకు అందిన సూచనలను ఈ ప్రత్యేక ప్రచారంలో ఉపయోగిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం 2,000 మంది వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. వాలంటీర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు గౌరవ వేతనం అందజేస్తారు.

రోడ్లపై వదిలేసిన పశువులను వీధి పశువులు అని పిలవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆవులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్

‘వీధి పశువులు కాదు’

వీధి పశువులను నిరాశ్రయ పశువులుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలు వెలువరించారని మందసౌర్ మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ సిసోదియా తెలిపారు.

ఈ సమస్యను ఎదుర్కోవాలంటే నగరాల్లో ఆవుల సంరక్షణ కేంద్రాలు నిర్మించాలని, గ్రామాల్లో గోశాలలు ఉన్నా నగరాల్లో అవి లేకపోవడంతో రోడ్లపై ప్రమాదాలు పెరుగుతున్నాయని యశ్‌పాల్‌ సింగ్‌ సిసోదియా అన్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో మొత్తం 1.87 కోట్ల ఆవులు ఉన్నాయి.

గోశాలల కోసం ప్రభుత్వం 252 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఆవులకు సంబంధించి అధ్యయనం చేశామని, మధ్యప్రదేశ్‌లో కనీసం పది లక్షల ఆవులు రోడ్లపై జీవిస్తున్నాయని అందుకే ఈ పరిస్థితి ఏర్పడుతోందని మధ్యప్రదేశ్ గోసంవర్థక, పశువుల ప్రోత్సాహక బోర్డు మాజీ అధ్యక్షుడు స్వామి అఖిలేశ్వరానంద గిరి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)