పారాలింపిక్స్‌లో తెలుగు క్రీడాకారులు.. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం, అయినా వెనుకడుగు వేయలేదు

ఫొటో సోర్స్, Ganesh
- రచయిత, తులసిప్రసాద్ రెడ్డి, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ఉన్నారు.
నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకరు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
రోయింగ్, సైక్లింగ్, షాట్ పుట్ క్రీడల్లో వీరు పోటీ పడుతున్నారు.

కొంగనపల్లి నారాయణ: మందుపాతర పేలి పాదం తెగిపోయినా
కొంగనపల్లి నారాయణది నంద్యాల జిల్లా ప్యాపిలి.
సైన్యంలో పనిచేస్తూ ప్రమాదంలో పాదం పోగొట్టుకున్న ఆయన అనంతరం క్రీడలపై దృష్టి పెట్టి పారాలింపిక్స్ వరకు వెళ్లారు.
పారా రోయింగ్ మిక్స్ పీఆర్3 విభాగంలో నారాయణ పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు.
శుక్రవారం(ఆగస్టు 30)న ఆయన ఈ విభాగంలో పోటీ పడ్డారు.
పతకం సాధించనప్పటికీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
నారాయణ తండ్రి వెంకటస్వామి, తల్లి సుంకమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. 1989లో ప్యాపిలిలో పుట్టిన నారాయణ ఇంటర్ వరకు చదువుకున్నారు.
‘‘స్కూల్లో చదివే రోజుల నుంచే నాకు క్రీడలంటే ఇష్టం. కబడ్డీలో రాష్ట్ర స్థాయిలో అండర్-19కి సెలక్ట్ అయ్యాను. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయాను’’ అని నారాయణ బీబీసీతో చెప్పారు.
ఇంటర్ పూర్తి కాగానే 2007లో ఆర్మీలో చేరారు. బెంగళూరులో శిక్షణ పూర్తయిన తర్వాత 2009లో హైదరాబాద్ లో మెదటి పోస్టింగ్ వచ్చింది.
తర్వాత అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా నారాయణ పనిచేశారు. 2013లో జమ్ముకశ్మీర్‌లో పోస్టింగ్ వచ్చింది. 2015లో ఎల్ఓసీ ప్రాంతంలో మందు పాతర పేలుడులో నారాయణ తీవ్రంగా గాయపడడంతో ఆయన ఎడమ కాలు పాదం పూర్తిగా తొలగించారు.
కృత్రిమ కాలు అమర్చుకోవడానికి పుణె వెళ్లిన నారాయణ అక్కడ వైకల్యం ఉన్న ఎంతోమందిని క్రీడల వైపు వెళ్లేలా చేసిన గౌరవ్ దత్తాను కలిశారు.
ఆయన నారాయణను క్రీడల వైపు ప్రోత్సహించారు.
మొదట జావెలిన్ ప్రయత్నించిన నారాయణ తన కాలు పరిగెత్తడానికి వీలుగా లేకపోవడం, రన్నింగ్ కష్టంగా ఉండడంతో రోయింగ్‌కు మారారు.
2018లో రోయింగ్‌కు మారిన తర్వాత నారాయణ అంతర్జాతీయ స్థాయిలో 8 పతకాలు సాధించారు.
‘‘ఆర్మీ రోయింగ్ నోడ్ అని ఉంటుంది. అందులో సర్వీస్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. నేను అక్కడే ప్రాక్టీస్ చేశాను. ఎక్కడైనా గేమ్స్ ఆడడానికి వెళ్లాలంటే రోయింగ్ ఫెడరేషన్ వాళ్లే తీసుకుని వెళతారు. పారిస్ రావడానికి కూడా వాళ్లే నాకు సాయం చేశారు’’ అని నారాయణ చెప్పారు.
‘‘2016 నుంచి పారా క్రీడల్లో ఉన్నాను. ప్రస్తుతం ఆర్మీ జాబ్‌లో కంటిన్యూ అవుతున్నాను. మరో ఏడాదిన్నరలో నా సర్వీస్ అయిపోతుంది’’ అన్నారు నారాయణ.


అర్షద్ షేక్: ప్రమాదంలో ఎడమ కాలు పోగొట్టుకుని..
ఈసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న మరో తెలుగు క్రీడాకారుడు నంద్యాలకు చెందిన అర్షద్ షేక్.
నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అర్షద్, ఇస్మాయిల్ నసీన్ దంపతులకు 1993లో జన్మించారు. వీరిది మధ్యతరగతి కుటుంబం.
బీఏ పూర్తి చేసిన అర్షద్ విద్యాభ్యాసం అంతా నంద్యాలలోనే సాగింది. చిన్నతనం నుంచీ చురుగ్గా ఉండే అర్షద్ 2003లో నుంచి క్రీడల్లోకి అడుగుపెట్టారు.
అర్షద్ మొదట తైక్వాండో రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా రాణించారు.
2004లో జరిగిన ఒక ప్రమాదంలో ఎడమకాలు మోకాలు వరకు కోల్పోయారు.
ఓవైపు చదువుకుంటూనే క్రీడా పోటీల్లో కూడా పాల్గొనేవారు. ఆర్థిక ఇబ్బందులతో ఒక ఆసుపత్రిలో చిన్న ఉద్యోగం చేసిన అర్షద్ అక్కడ ఉన్నవారు తనను ప్రోత్సహించడంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు.
పారా సైక్లిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్న అర్షద్‌కు ఆదిత్య మెహతా ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ సాయంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సైక్లింగ్ చేశారు.
పారా సైక్లిస్ట్‌గా అర్షద్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. 2022, 2024లో రెండు సార్లు ఏసియన్ గేమ్స్ లో పాల్గొన్న అర్షద్ షేక్ ఇప్పటివరకు 12 పతకాలు సాధించారు. అందులో 6 స్వర్ణ పతకాలు ఉన్నాయి.
పారా సైక్లింగ్‌లో పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు భారతీయుల్లో అర్షద్ షేక్ ఒకరు.
పారిస్ పారాలింపిక్స్‌లో పారా సైక్లింగ్‌లో అర్షద్ షేక్ నాలుగు ఈవెంట్లలో పోటీపడనున్నారు, పురుషుల C2 వ్యక్తిగత టైమ్ ట్రయల్, రోడ్- పురుషుల C1-3 టైమ్ ట్రయల్, C2 రోడ్ రేస్, వ్యక్తిగత పర్స్యూట్.
"నేను రోడ్, ట్రాక్ ఈవెంట్‌లలో పోటీ పడుతున్నాను. భారతదేశం కోసం పతకాలు గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది అని" బీబీసీతో అర్షద్ అన్నారు.

రొంగలి రవి: ఎగతాళి చేసినవారే గర్వంగా చెప్పుకొంటున్నారు
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో షాట్ పుట్‌లో భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన రొంగలి రవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
“మాకు వ్యవసాయమే జీవనాధారం. మా వాడికి ఆటలంటే ఉన్న శ్రద్ధ చూసి...అతడి ఖర్చుల కోసం కొంత పొలాన్ని కూడా అమ్మేశాం. మాకు పొలం అమ్మేశామనే బాధ లేదు. మా అబ్బాయి సాధిస్తున్న విజయాలు, ఆట కోసం పడుతున్న తపనే సంతోషాన్ని ఇస్తుంది.” అని రవి తల్లి రొంగలి మంగ బీబీసీతో చెప్పారు.
ఒకప్పుడు ‘పొట్టోడు’ అని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మా ఊరోడు అని గొప్పగా చెప్పుకుంటున్నారని ఆమె తెలిపారు.
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని చిరికివానిపాలెం గ్రామం రవి స్వస్థలం.
ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పారా గేమ్స్ గురించి తెలుసుకున్న రవి 2014 నుంచి పారా స్పోర్ట్స్‌పై దృష్టి పెట్టి బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో 2015 లో బెంగళూరులో జరిగిన నేషనల్ పారా బ్యాడ్మింటన్ స్పోర్ట్స్‌లో డబుల్స్‌లో రజతం, సింగిల్స్‌లో కాంస్యం సాధించారు.
2016లో హరియాణాలో జరిగిన పారా బ్యాడ్మింటన్ నేషనల్‌లో డబుల్స్, సింగిల్స్‌లో రజతం, 2017 డబుల్స్‌లో రజత పతకం సాధించారు.
ఆ తరువాత షాట్ పుట్, జావెలిన్ త్రోలపై దృష్టి పెట్టి శిక్షణ పొందారు.
“2018లో హరియాణాలో జరిగిన 18వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో షాట్ పుట్ లో రవి బంగారు పతకం సాధించారు. ఈ క్రమంలోనే రవికి అంతర్జాతీయ మ్యాచ్‌లకు పంపించేందుకు పొలం అమ్మాల్సి వచ్చింది” అని తల్లి మంగ చెప్పారు.
ఆ సమయంలో సివిల్ సర్వీసెస్ వైపు వెళ్దామని కోచింగ్ జాయిన్ అయ్యారు. కానీ అతడి మనసంతా క్రీడలపైనే ఉంది. దాంతో క్రీడల్లోనే ఏదైనా సాధించాలని సివిల్స్ కోచింగ్ మానేసి మళ్లీ క్రీడలపైనే దృష్టి పెట్టారు.
2021లో బెంగళూరులో జరిగిన 19వ జాతీయ పారా అథ్లెటిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. రవిలోని ప్రతిభను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రవికి కోచింగ్ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటివరకు జాతీయ స్థాయి వరకే పరిమితమైన రవి 2021లో దుబయిలో జరిగిన ఫజా పారా ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 4వ స్థానంలో నిలిచారు. 2022లో పోర్చుగల్‌లో జరిగిన ఐవాస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో, షాట్ పుట్ విభాగాల్లో పాల్గొని రెండింటిలోనూ రజత పతకాలు సాధించారు. 2023 జూన్ లో పారిస్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో 5వ స్థానంలో రాణించారు. దాంతో పారా ఆసియా క్రీడలకు దేశం నుండి ఎంపికయ్యారు.
2023 నవంబర్‌లో చైనాలో జరిగిన పారా ఏసియా గేమ్స్ లో షాట్ పుట్ ఎఫ్-40 విభాగంలో 9.92 మీటర్ల దూరం విసిరి రజతం సాధించి.. ప్రధాని మోదీ నుంచి అభినందనలు అందుకున్నారు.
28 ఏళ్ల రవి బెంగళూరులోని ఇన్ కమ్ టాక్స్ విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














