మల్లారెడ్డి, ఒవైసీ, రాజేశ్వర్‌రెడ్డి.. ఎవరికీ మినహాయింపు లేదు: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

బీబీసీతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్
ఫొటో క్యాప్షన్, బీబీసీతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘పార్టీలకు సంబంధం లేకుండా అందరి విషయంలో హైడ్రా పనితీరు ఒకే విధంగా ఉంటుంది. ఎవరికీ మినహాయింపు లేదు. మల్లారెడ్డి అయినా.. ఒవైసీ అయినా.. రాజేశ్వర్‌రెడ్డి అయినా.. వారు ఏ పార్టీలో ఉన్నారనేది అప్రస్తుతం’’ అని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను జులైలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల చెరువులు, నాలాలు, పార్కు స్థలాల్లో నిర్మించిన పలు భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్.కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన వ్యవహారం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మల్లారెడ్డి, ఒవైసీ, రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి వంటి నాయకులకు సంబంధించిన కళాశాలల భవనాలు కూల్చివేతకు సమయం ఇస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్, హైడ్రా, ఏవీ రంగనాథ్

ఫొటో సోర్స్, telangana.gov.in

ఫొటో క్యాప్షన్, హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటున్న రంగనాథ్

‘హైడ్రా అంటే కూల్చివేతలేనా?’

బీబీసీ: హైడ్రా అంటే కూల్చివేతలే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అసలు హైడ్రా లక్ష్యాలు ఏమిటి?

రంగనాథ్: హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదు. హైడ్రా లక్ష్యం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (విపత్తుల నిర్వహణ లేదా విపత్తుల నుంచి ప్రజలను రక్షించడం). అదే మా ప్రాథమిక విధి. హైదరాబాద్ లాంటి నగరంలో గతంలో భారీ వర్షాలు వస్తే వరదలు వచ్చి ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడం చూస్తుండేవాళ్లం. కానీ, ఇప్పుడు చిన్నపాటి వర్షాలకే ఆ పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాలు మునిగిపోయి ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఆ సమయంలో మా సిబ్బంది వెంటనే స్పందించి వరద నీరు పారేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నాలాలు, చెరువులు కబ్జాకు గురై కుంచించుకుపోవడమే ముంపు తీవ్రత పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. నాలాల నుంచి చెరువుల్లోకి రావాల్సిన నీరు రోడ్లపైకి రావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

బీబీసీ: చెరువుల్లో ఆక్రమణలు కూల్చివేస్తున్నారు సరే, మరి ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగించే బాధ్యత ఎవరిది? చెరువును పునరుద్ధరించే పని హైడ్రా చేస్తుందా?

రంగనాథ్: చెరువుల్లో కట్టడాలను కూల్చివేసినప్పుడు ఆ నిర్మాణ వ్యర్థాలు తొలగించడమూ ఎంతో ముఖ్యం. అయితే, మేం కూల్చివేస్తున్న సమయంలో సంబంధిత కట్టడాలకు చెందినవారు కోర్టులకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు.. వెంటనే అక్కడి నుంచి మా సిబ్బంది వెనక్కి రావాల్సి వస్తోంది. నిర్మాణ వ్యర్థాలు తొలగించే విషయాన్ని స్టేటస్ కో లో చేర్చవద్దని కోర్టులకు విన్నవిస్తాం. వ్యర్థాలు తొలగించడమే కాదు, చెరువును పూర్వస్థితికి తీసుకురావడమూ హైడ్రా చేస్తుంది.

నాగార్జున, హైడ్రా, ఎన్ కన్వెన్షన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సినీ నటుడు నాగార్జునకు చెందిన 'ఎన్' కన్వెన్షన్‌ను కూల్చివేసిన హైడ్రా

‘అపార్ట్‌మెంట్స్, ఇళ్లపైనా చర్యలుంటాయా?’

బీబీసీ: చెరువుల్లో కట్టడాలకు అధికారులు అనుమతులిచ్చారు. అలా అనుమతిచ్చిన అధికారులపై చర్యలకు హైడ్రా సిఫార్సు చేస్తోందా?

రంగనాథ్: నిబంధనలకు విరుద్ధంగా చెరువుల ఎఫ్.టి.ఎల్. బఫర్‌జోన్‌లో అనుమతులు ఇచ్చిన అధికారులపై కచ్చితంగా క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పాం. అంతేకాదు, సర్వే నంబర్లు మార్చివేయడం, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లేకుండా నిర్మాణానికి అనుమతించిన అధికారులు కూడా బాధ్యులవుతారు. త్వరలోనే ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. అప్పుడు మేమే నేరుగా చర్యలు తీసుకుంటాం.

బీబీసీ: హైడ్రా లక్ష్యం వాణిజ్య పరమైన భవనాలేనా లేక చెరువుల ఎఫ్.టి.ఎల్. , బఫర్ జోన్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ఇళ్లపైనా చర్యలు తీసుకుంటుందా?

రంగనాథ్: ఎలాంటి పరిస్థితుల్లోనూ పేదలు, మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు. వాణిజ్య పరమైన భవనాలు, కన్వెన్షన్లు, రిసార్టులు, స్పోర్ట్స్ కాంప్లెక్సులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇల్లు అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి వాణిజ్యపరమైన భవనాలతో వాటిని పోల్చడానికి లేదు. కాలేజీలు ఎఫ్.టి.ఎల్‌‌ పరిధిలో ఉంటే కచ్చితంగా కూల్చాల్సిందే. అలాగని విద్యా సంవత్సరం మధ్యలో కూల్చివేస్తే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే ప్రతి విషయాన్నీ మానవత్వంతో ఆలోచించి సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేసుకుని, ముందుకు వెళుతున్నాం.

బీబీసీ: మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఒవైసీకి చెందిన కళాశాలలకు నోటీసులు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ భవనాల విషయంలో హైడ్రా విధానం ఏమిటి?

రంగనాథ్: పార్టీలకు సంబంధం లేకుండా అందరి విషయంలో చట్టం ఒకేలా ఉంటుంది. ఎవరికీ మినహాయింపు లేదు. మల్లారెడ్డి, ఒవైసీ, రాజేశ్వర్ రెడ్డి.. ఎవరైనా, వారు ఏ పార్టీలో ఉన్నారనేది అప్రస్తుతం. విద్యార్థుల భవిష్యత్తునే చూస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాలు తొలగించాలి. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి.

హైదరాబాద్, హైడ్రా, జంట జలాశయాలు, కాల్వలు, నీటి కుంటలు, చెరువులు
ఫొటో క్యాప్షన్, చెరువులు, నాలాలను పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టిన వారికి హైడ్రా నోటీసులు ఇస్తోంది.

‘జీహెచ్ఎంసీ,నెక్లెస్‌రోడ్డు సంగతేంటి?’

బీబీసీ: భవనాలు కూల్చివేసే ముందు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఎన్ కన్వెన్షన్ విషయంలో నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టారని సినీ నటుడు నాగార్జున ఎక్స్ వేదికగా విమర్శించారు. నోటీసులు ఇచ్చే అధికారం హైడ్రాకు ఉందా?

రంగనాథ్: గతంలో జీహెచ్ఎంసీలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చే బాధ్యత వారికి ఉండేది. హైడ్రా అనేది జీవో (గెజిట్ ఆర్డర్) ప్రకారం ఏర్పాటైంది కనుక నోటీసులు ఇవ్వడం లేదు. కానీ, జీహెచ్ఎంసీ, స్థానిక మున్సిపాలిటీలు, ఇతర శాఖలు నోటీసులు ఇస్తున్నాయి. త్వరలో హైడ్రా చట్టం రాబోతోంది. అప్పుడు హైడ్రా తరఫునే నేరుగా నోటీసులు ఇస్తాం. నోటీసులు ఇవ్వకుండా కూల్చారని చెప్పడం కరెక్టు కాదు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కట్టడాలు ఉంటే కూల్చివేయవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. జీహెచ్ఎంసీ చట్టం 405 రూల్ ప్రకారం కూడా చెరువులు, నాలాల స్థలాల్లో శాశ్వత లేదా తాత్కాలిక నిర్మాణాలుంటే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయవచ్చని ఉంది.

బీబీసీ: హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే జీహెచ్ఎంసీ, నెక్లెస్ రోడ్డు ఉన్నాయని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దీనిపై హైడ్రా తరఫున ఏం చెబుతారు?

రంగనాథ్: అవన్నీ ప్రభుత్వ నిర్మాణాలు. ప్రజాప్రయోజనార్థం నిర్మించినవి. 50 ఏళ్ల కిందట కట్టినవి. ఇవి నాలాలపై లేదా బఫర్ జోన్‌లో కట్టి ఉండొచ్చు. అలాగని చెరువులో కట్టిన వాటితో పోల్చి చూడకూడదు. ఎన్ కన్వెన్షన్ లాంటివి వాణిజ్యపరమైనవి. అవసరాలు, ప్రయోజనాలు.. ఈ రెండింటిని చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

బీబీసీ: హైడ్రాని రాష్ట్రమంతటా విస్తరించే ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? మీ తరఫు నుంచి ప్రతిపాదనలు ఏమైనా పంపిస్తున్నారా?

రంగనాథ్: హైడ్రా తరఫు నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదు. కానీ, రాష్ట్రమంతటా విస్తరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ ఆక్రమణలపై ప్రజలు విసిగిపోయారు. హైడ్రా వంటి స్వతంత్ర వ్యవస్థను తీసుకురావడంతో ప్రజలు కూడా అన్ని చోట్లకూ విస్తరించాలని కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)