జయ్ షా: 35 ఏళ్లకే ఐసీసీ చైర్మన్ ఎలా కాగలిగారు? ఆయన ముందున్న సవాళ్లేంటి

జయ్ షా, ఐసీసీ చైర్మన్‌, క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయ్ షా ఐసీసీ చైర్మన్‌గా డిసెంబరులో బాధ్యతలు చేపట్టనున్నారు
    • రచయిత, ఆనంద్ వాసు
    • హోదా, క్రికెట్ విశ్లేషకులు, బీబీసీ హిందీ కోసం

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త చైర్మన్‌గా జయ్ షా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ పదవి చేపడుతున్న అతి పిన్న వయస్కుడు జయ్ షా. ఆయన వయసు 35 ఏళ్లు.

57 ఏళ్ల లోపు వ్యక్తి ఐసీసీ చైర్మన్‌ కావడం ఇదే తొలిసారి.

1989లో మొదటి ఐసీసీ చైర్మన్‌ అయిన కోలిన్ కౌడ్రీ తన 57 ఏళ్ల వయసులో ఆ పదవి చేపట్టారు.

ఆయన తర్వాత 11 మంది ఐసీసీ అధ్యక్షులయ్యారు.

2014లో ఎన్‌.శ్రీనివాసన్‌ ఐసీసీ చీఫ్‌గా ఎన్నికయ్యాక ఆ పదవిలో ఉన్నవారిని ఐసీసీ చైర్మన్‌‌గా పిలవడం ప్రారంభించారు.

ఆయన తర్వాత మరో ముగ్గురు చైర్మన్‌‌‌ పదవి చేపట్టగా, నాలుగో చైర్మన్‌‌గా జయ్ షా నియమితులయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టీ20 ప్రపంచకప్, భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు

సోషల్ మీడియాలో మీమ్స్

ఈ స్థానానికి చేరుకున్న ఐదో భారతీయుడు జయ్ షా. ఆయన కంటే ముందు జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్.శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షులుగా ఉన్నారు.

ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జయ్ షా తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

అయితే ఐసీసీ అధ్యక్షుడిగా జయ్ షా నియమితులయ్యారని ప్రకటన వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కనిపిస్తున్నాయి.

ఆయన క్రికెట్ సంస్థలో అగ్రస్థానానికి ఎదగడంలో ఆయన తండ్రి, భారత హోం మంత్రి అమిత్ షా మద్దతు ఉందన్న అర్థం వచ్చేలా మీమ్స్ ఎక్కువగా ఉన్నాయి.

అయితే జయ్ షా ఐసీసీ అధ్యక్ష పదవికి చేరుకోవడానికి ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ బోర్డు ఆధిపత్యమే కారణం.

జయ్ షా ఇప్పటికే ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా’(బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమిత్ షా

ప్రపంచ క్రికెట్‌పై భారత్‌దే ఆధిపత్యం

బీసీసీఐకి పెద్దసంఖ్యలో ప్రేక్షకుల మద్దతు, కార్పొరేట్ సంస్థల మద్దతు ఉంది.

ఐపీఎల్ వంటి విజయవంతమైన టోర్నీలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది.

ప్రపంచంలో మరే ఇతర క్రికెట్ బోర్డుకు ఇలాంటి అనుకూలతలు లేవు.

క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా జయ్ షా కెరీర్ గ్రాఫ్ కూడా బాగుంది.

ఆయన 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జిల్లా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

2019లో బీసీసీఐలో సెక్రటరీగా చేరినప్పుడు పెద్దగా అనుభవం లేకపోయినా, ఇతరులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారు.

ఐసీసీ, బీసీసీఐకి సంబంధించి ఏవైనా క్లిష్టమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆయన క్రికెట్ మాజీ నిర్వాహకులను సంప్రదించేవారు.

ఇంకా చెప్పాలంటే,ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చిన ఎన్.శ్రీనివాసన్ నుంచి కూడా ఆయన సలహా తీసుకున్న సందర్భాలున్నాయి.

క్రికెట్‌కు సంబంధించిన విషయాలలో ఆయన భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ సూచనలపై ఎక్కువగా ఆధారపడతారు.

ఐసీసీ చైర్మన్‌‌, అంతర్జాతీయ క్రికెట్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయ్ షా

జయ్ షా ముందున్న సవాళ్లేంటి

ఐసీసీ చైర్మన్‌గా మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత, ఆయన రెండోసారి ఆ పదవిని కోరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి రావచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీసీ చైర్మన్‌‌ కంటే కూడా బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి మరింత ప్రభావవంతమైనదిగా భావిస్తున్నారు.

అయితే, ఐసీసీ చైర్మన్‌గా జయ్ షాకు చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇతర దేశాల్లో క్రికెట్‌ను వేగంగా విస్తరించాలని ఐసీసీ కోరుకుంటోంది. ఇందుకోసం ఐసీసీ దూకుడైన వ్యూహం రచించింది.

టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు అమెరికాలో నిర్వహించారు. ఇది ఖరీదైన కార్యక్రమం అయినప్పటికీ విజయవంతమైంది.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే విషయం కూడా సవాలే.

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నప్పటికీ దానికంటే ముందే జయ్ షా పదవీకాలం ముగియనుంది.

అయితే ఆయన నేతృత్వంలోనే ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహణను ఖరారు చేయాల్సి ఉంది.

ఒలింపిక్స్‌లో ఏ ఫార్మాట్ క్రికెట్‌ను చేర్చుతారు, జట్లను ఎంపిక చేసే విధానం ఏమిటి, ఎన్ని జట్లు పాల్గొంటాయి వంటి ప్రశ్నలకు జయ్ షాయే సమాధానాలు కనుక్కోవాల్సి ఉంటుంది.

ఐసీసీ టోర్నీకి సంబంధించి స్టార్ టీవీతో ప్రసార హక్కులకు సంబంధించిన అంశం కూడా జయ్ షా దృష్టికి రానుంది.

భారత క్రికెట్ జట్టు,జయ్ షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత క్రికెట్ జట్టు సభ్యులతో జయ్ షా

ఐసీసీ చైర్మన్‌గా నామినేట్ కావడంతో ఉప్పొంగిపోయాను అని ఒక ప్రకటనలో జయ్ షా పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించడానికి సభ్య దేశాలతో కలిసి నిబద్దతతో పనిచేస్తానని ఆయన తెలిపారు.

జయ్ షా మాట్లాడుతూ "క్రికెట్ బహుళ ఫార్మాట్‌లను కొనసాగించడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త ప్రపంచ మార్కెట్‌లకు మా ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లను పరిచయం చేయడం మధ్య సమతుల్యతను సాధించడం... ఇవన్నీ మా ముందున్న ముఖ్యమైన సవాళ్లు" అని ఆయన అన్నారు.

అలాగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై, ఇప్పటివరకు నేర్చుకున్న విలువైన పాఠాల ప్రకారం పనిచేయడమే కాకుండా, క్రికెట్‌పై ప్రేమను పెంచడానికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు చేయడాన్ని కూడా అలవరుచుకుంటానని ఆయన అన్నారు.

2028లో లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనడం క్రికెట్ అభివృద్ధికి ఒక మలుపు అని, ఇది ఆటను అపూర్వమైన రీతిలో ముందుకు తీసుకెళ్తుందని నేను విశ్వసిస్తున్నాను అని జయ్ షా అన్నారు.

ఐసీసీ ఇప్పటిలాగే ఇకముందు కూడా ఉంటే ప్రయోజనం లేదని ఐసీసీ ప్రస్తుత చైర్మన్, న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఇటీవల హెచ్చరించారు.

ఒకరకంగా ఇది తీవ్రమైన వ్యాఖ్య. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి జయ్ షా ఏం చేస్తారు? అన్నది ఆసక్తికరం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)