అఫ్గానిస్తాన్ కొత్తచట్టాలు: ‘‘మహిళలు బహిరంగ ప్రదేశాలలో మొహం కూడా కనిపించకుండా దుస్తులు ధరించాలి, బిగ్గరగా మాట్లాడకూడదు...’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీ హుస్సేనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
“ధర్మ పరిరక్షణ, చెడు నిర్మూలన” లక్ష్యంగా అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు కొత్త చట్టాలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా మాట్లాడటం, మొహం కనపడేలా దుస్తులు ధరించడాన్ని నిషేధించారు.
తాలిబాన్లు తీసుకువచ్చిన ఈ కొత్త చట్టాలను ఐక్యరాజ్య సమితి ఖండించింది. “కొత్త చట్టాలు అఫ్గానిస్తాన్ భవిష్యత్ పట్ల నిరుత్సాహ దృష్టి కోణంతో ఉన్నాయి” అని ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఈ చట్టాలకు తాలిబాన్ల అధినాయకుడు హైబతుల్లా అఖుంజాదా ఆమోదముద్ర వేశారు.
గతంలో ధర్మ ప్రచారం, చెడు నిర్మూలన బాధ్యతలను పర్యవేక్షించే విభాగాన్ని ప్రస్తుతం మొరాలిటీ శాఖగా పిలుస్తున్నారు.
కొత్త చట్టాలకు దేశంలో ఎవరూ అతీతులు కారని అఫ్గానిస్తాన్ స్పష్టం చేసింది.
కొత్త చట్టాల ప్రకారం అఫ్గాన్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు. వారు ఏం తింటున్నారు. ఏం తాగుతున్నారు లాంటి వ్యక్తిగత అంశాలలోనూ జోక్యం చేసుకునే అధికారం “మొహ్తసబీన్” ( తాలిబాన్ మొరాలిటీ పోలీసు)కు ఇచ్చారు.
కొత్త చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో మహిళలు బిగ్గరగా మాట్లాడటాన్ని “చెడు ప్రవర్తన”గా భావిస్తారు. “తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలెవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే, ఆమె తన స్వరాన్ని, శరీరాన్ని దాచుకోవాలి” అని కొత్త ఆంక్షలు చెబుతున్నాయి.
మొరాలిటీ శాఖ షరియా అమలు పేరుతో ఇప్పటికే ఇలాంటి ఆంక్షలను పెట్టింది. ఈ నిబంధనలను పాటించని వేల మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతోంది.
షరియా చట్ట నిబంధనలన్నీ మొరాలిటీ శాఖ ద్వారా అమలు చేస్తున్నామని, 2022లో తాలిబాన్ల సుప్రీం లీడర్ ఆదేశాల ఆధారంగానే కొత్త చట్టాలను తీసుకువచ్చినట్టు తాలిబాన్లు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
కొత్త చట్టంలో ఏముంది?
“పురుషుల్ని రెచ్చగొట్టకుండా, వారు చెడుగా ప్రవర్తించకుండా ఉండేలా” మహిళలు మొహంతోపాటు తమ శరీరాన్నంతటినీ పూర్తిగా ఎలా కప్పి ఉంచుకోవాలో ఈ చట్టం చెబుతోంది.
కొత్త చట్టం ప్రకారం
- మహిళలు శరీరం మొత్తం పూర్తిగా దుస్తులతో కప్పుకోవాలి.
- ‘‘రెచ్చగొట్టడానికి కారణమయ్యే” మొహాన్ని కూడా పూర్తిగా కప్పుకోవాలి.
- మహిళల గొంతు వారి ప్రైవేటు భాగంగా భావిస్తారు. అది బహిరంగ ప్రదేశాలలో వినిపించకూడదు. ‘అవ్రా’ అనే అరబిక్ పదానికి శరీరంలోని ప్రైవేటు భాగం అని అర్థం. దాన్ని తప్పనిసరిగా కప్పి ఉంచాలి. ‘అవ్రా’ అంటే స్త్రీ, పురుషుల శరీరంలో ఏదైనా భాగం కావచ్చు. దాన్ని బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించకూడదు.
- మహిళలు బహిరంగంగానే కాకుండా వారి ఇళ్లలోనూ పాటలు పాడకూడదు, పెద్దగా చదవకూడదు.
- మహిళల దుస్తులు పలుచగా, పొట్టిగా, బిగుతుగా ఉండకూడదు
- స్త్రీలు తమ శరీరాన్ని, మొహాన్ని రక్త సంబంధం లేదా వివాహబంధంలేని వ్యక్తులకు కనిపించకుండా దాచుకోవాలి.
పురుషులు స్త్రీల శరీరం, మొహాన్ని చూడటాన్నీ నిషేధించారు. అలాగే మహిళలు కూడా పురుషుల వైపు చూడకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
పురుషుల మీద కొత్త ఆంక్షలు
కొత్త నైతిక చట్టాలు పురుషుల మీద కూడా పరిమితులు విధించాయి. పురుషులు వీధుల్లోకి వచ్చినప్పుడు తమ శరీరాన్ని పొట్ట నుంచి మోకాళ్ల వరకు కప్పుకుని ఉండాలి. చట్టంలో పురుషుల శరీరాన్ని కూడా ప్రైవేటు భాగంగా గుర్తించారు.
షరియా ప్రకారం పురుషులు తమ జుట్టును స్టైల్‌గా పెంచుకోవడానికి లేదా కత్తిరించుకోవడానికి అనుమతి లేదు. అఫ్గానిస్తాన్‌లోని అనేక రాష్ట్రాల్లో సెలూన్లు, బార్బర్లపై నిషేధం విధించారు. పురుషులు, షేవింగ్, లేదా గడ్డాన్ని ట్రిమ్ చేయించుకోవడం కూడా నేరం. కొత్త నిబంధనల ప్రకారం గడ్డం పొడవుగా ఉండాలి. మొరాలిటీ చట్టం ప్రకారం టై ధరించడం కూడా నేరం.
మొరాలిటీ పోలీసులకే బాధ్యత
అఫ్గానిస్తాన్‌లోని అన్ని ప్రావిన్సుల్లోనూ కొత్త చట్టం అమలు బాధ్యత మొహ్తసబీన్( మొరాలిటీ పోలీసులు)లకు అప్పగించారు. చట్టం అమలులో వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వారే కోర్టులకు హాజరుపరుస్తారు.
ఈ చట్టం అమలుతో వారికున్న కార్య నిర్వాహక అధికారాలు గతంలో కంటే బాగా బలోపేతం అవుతాయి. వారికి తాలిబాన్ అధినాయకుడి పూర్తి మద్దతు ఉంది.
వారు కావాలనుకుంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలను నోరెత్తకుండా చెయ్యగలరు. సంగీతాన్ని పూర్తిగా ఆపేయగలరు. షరియా చట్టం ప్రకారం మహిళలు హిజాబ్ ధరించకుండా కానీ, లేదా నాన్న కానీ, సోదరుడు కానీ, లేదాభర్త తోడు లేకుండా ఒంటరిగా ట్యాక్సీల్లో ప్రయాణిస్తుంటే ఆ ట్యాక్సీలను ఆపే హక్కు మొరాలిటీ పోలీసులకు ఉందని చట్టం చెబుతోంది.
కారులో స్త్రీ, పురుషులు పక్క పక్కన కూర్చునేందుకు అనుమతి లేదు.

ఫొటో సోర్స్, QUDRATULLAH RAZWAN/EPA-EFE/REX/Shutterstock
ఫోటోలపై నిషేధం
కొత్త చట్టం ప్రకారం జీవించి ఉన్నవారి, జీవం ఉన్న వాటి ఫొటోలు తీయడం, వాటిని ముద్రించడం, లేదా అలాంటి ఫొటోలను తమ వద్ద ఉంచుకోవడం నిషేధం. ఉదాహరణకు కుటుంబసభ్యుడు, లేదా ఒక పక్షి లేదా ఒక జంతువు ఫోటోలు తీయడమూ నిషేధమే.
కొత్త చట్టం ప్రకారం జీవించి ఉన్న వారి విగ్రహాలను అమ్మడం, కొనడం కూడా నిషేధం.
టేప్ రికార్డర్లు, రేడియోలు, సంగీతం వినడం లాంటివి షరియా చట్టానికి ద్రోహం చెయ్యడమేనని కొత్త చట్టం చెబుతోంది. జీవించి ఉన్నవారి చిత్రాలను రూపొందించడం, చూడటాన్నీ నిషేధించారు.
అయితే కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా, ధర్మ ప్రచారం, చెడు నిర్మూలన విభాగం మంత్రి మొహమ్మద్ ఖలేద్ హనఫితో పాటు తాలిబాన్ ప్రభుత్వంలో అధికారులందరూ కెమెరాల ముందు కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శలు
ఎవరైనా ఒక వ్యక్తి తప్పుబట్టదగిన చర్యలకు పాల్పడితే వాటిని దైవిక భావనకు వ్యతిరేకంగా నిర్థరిస్తూ వారికి జరిమానా, మూడురోజుల జైలుశిక్ష విధించవచ్చని చట్టం చెబుతోంది.
అయితే చట్టం అమలుపై చాలా విమర్శలు వచ్చాయి.
“ కుటుంబ సభ్యులు కాని పర పురుషులను చూడటం లేదా తమకు ఇష్టమైన వారి ఫొటో దగ్గర ఉంచుకోవడం లాంటి వాటిని వ్యతిరేకించడం సరికాదు” అని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ అధిపతి రొజా ఒటున్‌బయేవ చెప్పారు.
అదుపులోకి 13వేలమంది
తాలిబాన్ ప్రభుత్వం మతపరమైన పరిపాలనను అమలు చేస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు, రాజధాని కాబూల్‌లో ఈ చట్టాన్ని పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నారు.
కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ మీద తాము పని చేస్తున్నట్లు మొరాలిటీ శాఖకు చెందిన వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు. ఏదేమైనప్పటికీ, చట్టంలోని ఇతర నిబంధనలు దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలు చేస్తున్నారు.
అఫ్గానిస్తాన్ ప్రభుత్వ విభాగాల్లో ధర్మ ప్రచారం, చెడు నిర్మూలన శాఖ క్రియాశీలకంగా పని చేస్తోంది.
షరియాను పాటించనందుకు మొరాలిటీ పోలీసులు తాత్కాలికంగా 13 వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు గతేడాది ఆ శాఖ ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














