‘‘నా పిల్లలు ఆకలి అంటున్నారు, నేను చేయగలిగేది ఏడవడం మాత్రమే’’ స్వదేశంలో అగమ్యగోచరంగా అఫ్గాన్ల పరిస్థితి

టెంట్ కింద రోజినా, ఆమె ఇద్దరు పిల్లలు
ఫొటో క్యాప్షన్, గుడారం కింద రోజినా, ఆమె ఇద్దరు పిల్లలు
    • రచయిత, హఫిజుల్లా మారూఫ్, కవూన్ ఖామోష్
    • హోదా, బీబీసీ అఫ్గాన్ సర్వీస్, బీబీసీ వరల్డ్ సర్వీస్
    • నుంచి, కాబూల్ నుంచి

ఎలాంటి పత్రాలు లేకుండా అఫ్గాన్ శరణార్థిగా రహమతుల్లా 46 ఏళ్ల పాటు పాకిస్తాన్‌లో ఉన్నారు. వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. ఏళ్లుగా ఆ ప్రదేశాన్ని తన ఇంటిగా భావించారు.

గత నెలలో ఆయనకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు.

పత్రాలు లేని శరణార్థులు పాకిస్తాన్‌ను వీడి వెళ్లాలని ఆ దేశపు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో, వేలమంది అఫ్గాన్లు బలవంతంగా తిరిగి తమ స్వదేశానికి రావాల్సి వచ్చింది.

‘‘నాకు చాలా ఆందోళనకరంగా ఉంది. అమ్మ నాపైనే ఆధారపడి ఉంటున్నారు. ఒకవేళ వారు నన్ను జైలులో పెడితే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అనే దిగులు ఉంది’’ అని ఆయన అన్నారు.

తన 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి టోర్ఖమ్ బోర్డర్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. ఉష్ణోగ్రతలు 43 సెంటిగ్రేడ్‌కు చేరుకున్న సమయంలో తోపుడు బండిపై వయసు పైబడిన తన తల్లిని తీసుకువచ్చారు. సోవియట్ దండయాత్రకు కాస్త ముందు 1978లో ఆమె అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

‘మానవతా సంక్షోభం’

‘‘నేను నా జీవితంలో ఎక్కువ సమయం పాకిస్తాన్‌లోనే గడిపాను. చిన్నప్పుడు పాకిస్తాన్ వెళ్లి, ముసలిదాన్ని అయ్యాక తిరిగి వచ్చాను’’ అని రహమతుల్లా తల్లి 85 ఏళ్ల నౌర్నమా గుర్తు చేసుకున్నారు.

‘‘మమ్మల్ని కొట్టి, దేశం నుంచి తరిమికొట్టారు. ఇది మా నిర్ణయం కాదు’’ అని పాకిస్తాన్ నుంచి బలవంతంగా తరిమివేసిన బాధను నౌర్నమా గుర్తుకు చేసుకున్నారు.

చాలామంది శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శరణార్థుల జనాభాలో అఫ్గాన్లు ఒకరని ఐక్యరాజ్య సమితి చెప్పింది.

ఎలాంటి డాక్యుమెంట్లు లేని మరో 10 లక్షల మంది ఆఫ్గాన్లను తమ దేశం నుంచి పంపించివేస్తామని పాకిస్తాన్ తెలిపింది.

ఇరాన్ సైతం శరణార్థులను పంపించేస్తోంది.

ఈ బహిష్కరణలు అఫ్గానిస్తాన్‌లో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

తన కుటుంబం పేదరికంలో, ఎలాంటి ఆశ్రయం లేకుండా ఆకలి మంటలతో ఉండాల్సి వస్తుందని రహమతుల్లాకు తెలుసు. తమ పిల్లలకు చదువులు అందవు. తన కుటుంబానికి మరో దారి లేదు, ఈ తలరాతను ఎదుర్కోవాల్సిందే.

‘‘ఇది చాలా బాధాకరం. నిజం చెబుతున్నా, ఇది మమ్మల్ని బాగా బాధిస్తోంది. మళ్లీ మొదట్నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి’’ అని రహమతుల్లా అన్నారు.

పాకిస్తాన్‌లో 40 లక్షల మందికి పైగా ఆఫ్గాన్లు నివసిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, రహమతుల్లా కుటుంబంతో సహా 17 లక్షల మంది డాక్యుమెంట్లు లేకుండా ఆ దేశంలో ఉన్నట్లు తేలింది.

సీమాంతర ఉగ్రవాదం విపరీతంగా పెరుగుతున్నట్లు చెబుతూ 2023 నవంబర్‌లో పాకిస్తాన్ తన దేశంలో నివసిస్తున్న అఫ్గాన్లను బహిష్కరించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 7 లక్షల మంది తన దేశం నుంచి పంపించేసింది.

రహమతుల్లా, ఆయన తల్లి నౌర్నమా
ఫొటో క్యాప్షన్, తన తల్లి 86 ఏళ్ళ నౌర్నమాతో రహమతుల్లా

భవిష్యత్ అంధకారం

అఫ్గానిస్తాన్ భూమిపై అడుగు పెట్టిన తర్వాత, శరణార్థులు తమ పేర్లను యూఎన్‌హెచ్‌సీఆర్, పలు ఎన్‌జీవోల వద్ద నమోదు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో, సిమ్ కార్డులు, తాత్కాలిక ఆశ్రయం, రవాణా, ఆహారం, తదితర అత్యవసర సేవలను పొందుతున్నారు. అనిశ్చితికరమైన భవిష్యత్‌తో ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు.

24 ఏళ్ల రోజినా సఫీ పాకిస్తాన్‌లోనే పుట్టి పెరిగారు. జనవరిలో ఆమె ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ఒక చెత్త గుడారం కింద నివసిస్తున్నారు.

పాకిస్తాన్‌లో బహిష్కరణకు గురైన సుమారు సగం మంది ప్రజలు తూర్పు అఫ్గానిస్తాన్‌లోని అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్న నంగర్హార్ ప్రావిన్స్‌లో ఉంటున్నారు.

రోజినా అఫ్గానిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, ఆమెకు వెళ్లేందుకు ఏ ప్రాంతం లేదు. ఆమె బంధువులు వారి ఇంటి వెనుకాల ఒక గుడారం వేసుకుని ఉండేందుకు అనుమతించారు. జలాలాబాద్ నగరంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఆమె ఉంటున్న ప్రాంతానికి మేం వెళ్లినప్పుడు, అక్కడ గార్డెన్‌లో నాలుగు గుడారాలు కనిపించాయి. ఈ గుడారాల్లో మరో నాలుగు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి.

‘‘నేను ఇక్కడ మా అత్తామామలతో ఉంటున్నా. నా కూతురు, కొడుకుతో ఉండేందుకు వారు ఒక గుడారమిచ్చారు. నేను ఈ పరిస్థితిని అసలు ఊహించలేదు’’ అని చెప్పారు.

ఆమె కూతురు మరియంకు నాలుగేళ్లుంటాయి. పాకిస్తాన్‌లో తన తండ్రి కనిపించకుండా పోయినప్పుడు, మరియం తన తల్లి కడుపులో ఉంది.

ఆమె భర్తకు ఏమైందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ, తన భర్తను అరెస్ట్ చేశారని రోజినా చెబుతున్నారు.

సరిహద్దుకు దగ్గర్లో అఫ్గాన్ శరణార్థులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ డైలీ నుంచి వచ్చిన వందలమంది అఫ్గాన్ శరణార్థులు

2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ చేతుల్లోకి రాకముందు , రోజినా స్వచ్ఛందంగా అఫ్గాన్‌కు వచ్చారు. కానీ, తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె తిరిగి పాకిస్తాన్‌కు పారిపోయి వచ్చారు. గత మూడేళ్లలో వేలమంది అఫ్గాన్లు ఆ దేశం విడిచి పెట్టారు.

తన పిల్లల ఆర్థిక అవసరాలతో పాటు ఇంటి ఖర్చుల కోసం రోజినా అంతకుముందు పాకిస్తాన్‌లో టైలర్‌గా పనిచేసేవారు. కానీ, తాలిబాన్ ఆధీనంలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో రోజినా లాంటి మహిళలకు ఉపాధి దొరకడం అంత తేలిక కాదు. అక్కడ మహిళలు పనిచేసేందుకు లేదా చదువుకునేందుకు అనుమతించడం లేదు.

కమ్ముకున్న కారు మేఘాలు

అఫ్గానిస్తాన్ ప్రస్తుతం తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 90 శాతం మంది జనాభా దారిద్య్ర రేఖ దిగువనే నివసిస్తున్నారు.

నిరుద్యోగం కారణంగా వేలాది మంది ఆ దేశాన్ని వీడుతున్నారు. ఈ వలస దేశాన్ని మరింత అస్థిరతకు గురి చేస్తుందని సహాయక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

‘‘అంతర్జాతీయ నిధులు మూడింట ఒక వంతు పడిపోయాయి. అఫ్గానిస్తాన్‌కు నిధుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మానవతా అత్యవసర పరిస్థితులతో పోటీ పడాల్సి ఉంటుంది’’ అని అఫ్గానిస్తాన్‌కు కొత్తగా యూఎన్‌హెచ్‌సీఆర్ డైరెక్టర్‌గా నియమితులైన అరాఫత్ జమాల్ అన్నారు.

ప్రస్తుత సంక్షోభాన్ని తాము ఒక్కళ్లం ఎదుర్కోలేమని తాలిబాన్ అథారిటీలు కూడా ఒప్పుకున్నాయి. పాకిస్తాన్ నుంచి వస్తోన్న శరణార్థులను తట్టుకునేందుకు రాబోయే ఏళ్లలో తమకు మద్దతు అవసరమని నంగర్హార్‌కు తాలిబాన్ శరణార్థ డైరెక్టర్ బాజ్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అన్నారు.

నంగర్హార్‌కు తాలిబాన్ శరణార్థ డైరెక్టర్ బాజ్ మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్
ఫొటో క్యాప్షన్, తాలిబాన్ శరణార్థ డైరెక్టర్ బాజ్ మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్

‘‘మాతో 60 లేదా 70 సహాయక సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. జాబితా పెద్దగా ఉంది. పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి. కానీ, ఆ సాయం సరిపోవడం లేదు’’ అని అబ్దుల్ రహ్మాన్ అన్నారు.

పాకిస్తాన్ నుంచి బలవంతంగా తమ దేశానికి పంపివేసిన శరణార్థుల కోసం కనీసం ఐదేళ్ల పాటు నిరంతరాయంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్తాన్‌లో ఐరాస 1.8 బిలియన్ డాలర్లను అంటే రూ.15,113 కోట్ల వెచ్చించింది. కానీ, ఏళ్ల తరబడి సాయం ఇవ్వడం వైఫల్యానికి దారితీస్తుందని, ప్రజలు దీర్ఘకాలంలో తమ సొంత కాళ్లపై నిలబడాలని ఐరాస అభిప్రాయపడింది.

‘‘అఫ్గానిస్తాన్‌ను నమ్మేందుకు అంతర్జాతీయ సమాజానికి ఐరాస భరోసా కల్పించాలి. ప్రస్తుతం నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం దేశంపై . కారు మేఘాలు కమ్ముకున్నాయి. కానీ, అత్యంత దారుణ పరిస్థితుల్లో కూడా మనం ఆశను కలిగించాలి’’ అని అరాఫత్ అన్నారు.

మహిళల హక్కులపై ఆంక్షలు, బాలికా విద్యపై నిషేధం, ప్రజా ప్రభుత్వం లేకపోవడం,మానవ హక్కుల ఉల్లంఘన తదితర అంశాలు తాలిబాన్ పాలనలోని అఫ్గానిస్తాన్‌ను నమ్మేందుకు అంతర్జాతీయ సమాజం వెనుకాడటానికి ఒక కారణం.

జలాలాబాద్ శివారులో, రోజినా తన నాలుగేళ్ల కూతురు మరియంను చేతితో పట్టుకుని ఉన్నారు.

‘‘నా భర్త లేకుండా ఇలా బతకడం కష్టమే. రొట్టె, బట్టల కోసం నా పిల్లలు అడుగుతున్నారు. నేను చేయగలిగిందంతా ఏడవడమే. అంతా దుఖమే. నేనేం చేయాలి?’’ అని అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)