సరిపోదా శనివారం రివ్యూ: నాని సినిమాలో ‘యాక్షన్’ సరిపోయిందా?

సరిపోదా శనివారం

ఫొటో సోర్స్, YOUTUBE/SCREENGRAB

ఫొటో క్యాప్షన్, నాని
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

ఎమోషనల్ స్టోరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతూ, తన ప్రతి సినిమాలో కథే హీరోగా ఉండేలా జాగ్రత్త తీసుకునే నటుడు నాని.

ఇక వివేక్ ఆత్రేయ, ‘రొమాంటిక్ కామెడీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు. వీరి ఇద్దరి కాంబినేషన్‌లో ‘సరిపోదా శనివారం’ సినిమా వచ్చింది.

గతంలో వివేక్ ఆత్రేయ, నానితో ‘అంటే సుందరానికి’ అనే సినిమా తీశారు.

ఈసారి వివేక్ ఆత్రేయ, తన జోనర్ నుంచి పూర్తిగా యాక్షన్‌లోకి షిఫ్ట్ అయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు
సరిపోదా శనివారం

ఫొటో సోర్స్, YOUTUBE/SCREENGRAB

ఫొటో క్యాప్షన్, ఎస్‌జె సూర్య విలన్ పాత్రను పండించారు.

కథ ఏంటి?

చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే సూర్య(నాని) తన తల్లి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అతనికి, శనివారానికి ఉన్న సంబంధం ఏమిటి?

సోకులపాలెంపై దయ (ఎస్‌జే సూర్య)కు కోపం ఎందుకు?

సోకులపాలెం కోసం సూర్య, దయ ఎలా ప్రత్యర్థులుగా మారారు? అన్నదే కథ.

సరిపోదా శనివారం

ఫొటో సోర్స్, YOUTUBE/SCREENGRAB

కోపం అనేది హీరోకు బలంగా ఉన్న ఈ సినిమాను నాని స్టయిల్‌లో తీశారు.

ఈ సినిమాలో సూర్య కోపం అనేక అంశాలతో కలిసి కలగాపులగం అయిపోతుంది. తనను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే, తన వారిని ఇబ్బంది పెట్టే అంశాలపై సూర్యకు కోపం వస్తుంటుంది. దాదాపు గంటన్నర రన్ టైమ్ వరకు ఈ కోపం 'హీరో వర్సెస్ విలన్' ఎలిమెంట్‌గా మారదు. అది ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి ప్రేక్షకులు కథను ఊహించేస్తారు.

ఇప్పటి వరకు ‘వి’, ‘దసరా’ తప్ప మిగిలిన సినిమాల్లో సరదాగా, చక్కటి కామెడీ టైమింగ్‌తో ఉండే హీరోగానే నాని నటించాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌తో లవ్ ట్రాక్, ఫ్యామిలీతోనూ అలాగే ఉంటాడు. ఇలా సరదా మనిషిగా నాని చాలా సహజంగా ఉన్నాడు. కానీ, హఠాత్తుగా తన వారి కోసం కోపంగా మారడమనేది అతని స్వభావంగా ఈ సినిమాలో కనిపించదు.

ఇంకో పక్క ఒకరి మీద కోపాన్ని తన అధికారాన్ని ఉపయోగించి వేరే వారి మీద చూపించే క్యారెక్టర్ దయది. ఈ రెండు పాత్రలకు ఎమోషనల్ డెప్త్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ లేదు. అందువల్ల ఈ ఇద్దరు ఎంత బాగా నటించినా స్టోరీలో ఉన్న ఎమోషన్‌ని కనెక్ట్ చేయలేకపోయింది.

'సోకులపాలెం' ప్రాంతంలో ప్రజలు దయ వల్ల పడే బాధలు మాత్రమే ఈ కథకు బలమైన ఎమోషన్‌గా ఉన్నాయి. హీరో, విలన్‌ల కోపం ఈ 'సోకులపాలెం'చుట్టూ తిరిగేలా చేసి ఫస్ట్ హాఫ్‌లో చేసిన తప్పు కొంతవరకు సెకండ్ హాఫ్‌లో రెక్టీఫై చేసినట్టు అనిపిస్తుంది. ఇది మొత్తం కథను మోయకపోయినా స్టోరీకి స్ట్రాంగ్ ఎమోషన్‌ను కనెక్ట్ చేయడానికి కొంత సపోర్ట్ ఇచ్చింది. సూర్యను 'యాంగ్రీ యంగ్ మ్యాన్'గానూ, దయను 'ఫ్యూరియస్ బీస్ట్'గా చూపించడంలో 'సోకులపాలెం' బ్యాక్ డ్రాప్ కొంతవరకు పర్లేదనిపించేలా చేసింది.

ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా ఎస్టాబ్లిష్ చేయడానికి ‘ఎర్ర గుడ్డ’ని ఉపయోగించారు. దానికి ఒక మంచి ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ, స్టోరీ మొత్తం ఆ ఎమోషన్‌ను క్యారీ చేసే బలమైన సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా లేవు.

సరిపోదా శనివారం

ఫొటో సోర్స్, YOUTUBE/SCREENGRAB

నాని ‘యాక్షన్’ ఎలా ఉంది?

సరదాగా హుందాగా తప్ప గంభీరమైన పాత్రల్లో నాని ఎక్కువగా నటించలేదు. ప్రతి సినిమాలోనూ అదే ‘నాని’ మార్క్‌గా ఉంటుంది. కానీ, ఈ ‘సరిపోదా శనివారం’ జోనర్ వేరు. కొంతవరకు నాని మార్క్ మ్యాజిక్ చేసినా, కథా పరంగా ఎక్కువసేపు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందులోనూ లవ్ ట్రాక్, కొంత నాని కామెడీ టైమింగ్ కూడా ఈ డైనమిక్ అప్పీల్ ఉన్న సినిమాలో కలిసిపోవడంతో ప్రేక్షకులు ఆశించే ఒక ‘సీరియస్ అండ్ యాక్షన్ కమిటెడ్ నాని’ కొన్ని చోట్ల మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ తరహా సినిమాల్లో చేయడానికి నాని ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది.

‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి దాదాపుగా స్టోరీ మొత్తం రివీల్ అయిన ఫీలింగ్ కలుగుతూనే ఉంది. దీనికి తగ్గట్టే సినిమాలో కథ ట్రైలర్‌ను మించి లేదు. దానికి యాడింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి తప్ప సర్‌ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా ఎక్కడా అనిపించకపోవడం కొంత నిరాశ పరిచిన అంశం.

నానిస్ గ్యాంగ్ లీడర్‌లో నానితో జంటగా నటించిన ప్రియాంకా అరుళ్‌ మోహన్ ఈ సినిమాలో మళ్ళీ నానితో జత కట్టారు. లవ్ ట్రాక్‌లో ఈ ఇద్దరి కాంబినేషన్ బావుంది. కొంత ఇన్నోసెన్స్‌తో లవ్ స్టోరీస్‌లో నటించే నాని ఇందులో కూడా లవ్ ట్రాక్‌లో అదే ఫార్ములాను పాటించారు. లవ్ స్టోరీ వరకు ఈ ఇద్దరి నటన బావుంది. మెయిన్ స్టోరీలోని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా మాత్రం నాని కొన్ని చోట్ల తేలిపోయారు.

సరిపోదా శనివారం

ఫొటో సోర్స్, YOUTUBE/SCREENGRAB

విలన్‌గా ఎస్‌జే సూర్య అద్భుత నటన

ప్రతినాయక పాత్రలో ‘దయ’గా ఎస్‌జే సూర్య అద్భుతంగా నటించారు. ఈ పాత్ర వాకింగ్ స్టయిల్, ఎవర్నీ పట్టించుకోనితనం, క్రూరత్వం, కళ్ళతోనే తనలోని ‘వికెడ్‌నెస్’ను ప్రెజెంట్ చేయగలగడం, రౌద్రం.. మొత్తం మీద ఎక్కడా వంక పెట్టలేని రీతిలో తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు ఎస్‌జే సూర్య. కాకపోతే, ఈ పాత్ర ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్ గ్రౌండ్ మీద ఉండి ఉంటే ఇంకా బావుండేది.

ఈ సినిమాకు స్క్రీన్ అప్పీల్ విషయంలో కాస్టింగ్ ప్రధాన ఆకర్షణ అనే చెప్పవచ్చు. సాయికుమార్, అభిరామి, అజయ్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సుప్రీత్ రెడ్డి, అజయ్ ఘోష్ , శివాజీ రాజా లాంటి వారి పాత్రలతో ప్రేక్షకులు వెంటనే ఎంగేజ్ అవుతారు. తమకున్న పరిధిలో వీరందరూ బాగానే నటించారు. కానీ ఈ సినిమాలో వారి పాత్రలు బలంగా లేవు.

‘సరిపోదా శనివారం’ అనేది ఒక ఇంటెన్స్ యాక్షన్ సినిమా. కథ వేగంగా నడిస్తేనే ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. కానీ, ఈ సినిమాలో స్టోరీ చాలా వరకు స్లోగా నడుస్తుంది. బలమైన నేపథ్యం ఎస్టాబ్లిష్ అవ్వలేదు. హీరో పాత్ర సూర్య, విలన్ పాత్ర దయల చర్యల వెనుక బలమైన కారణాలు లేవు. స్టోరీ లాగింగ్, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే సన్నివేశాలు పెద్దగా లేవు. దాంతో ఏదో సాగతీత కథలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథ కాస్త వేగంగా సాగినా ప్రేక్షకులు కథను ముందుగానే ఊహించేస్తారు.

ప్లస్‌లు - మైనస్‌లు

ప్లస్ పాయింట్స్

  • జేక్స్ బేజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • లవ్, కామెడీ ట్రాక్స్‌లో నాని టైమింగ్
  • ఓపెనింగ్ సీన్స్‌లో 'తల్లి -కొడుకుల 'ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్
  • దయ (ఎస్‌జే సూర్య) మ్యానరిజం, డైలాగ్ డెలివరీ

మైనస్ పాయింట్స్

  • కామెడీ ఎలిమెంట్స్ వల్ల సీరియస్ ఎలిమెంట్స్ మెయిన్ ట్రాక్ తప్పడం
  • ఫస్ట్ హాఫ్ మొత్తం లాగింగ్, సెకండ్ హాఫ్‌ను ప్రేక్షకులు ఊహించగలగడం
  • హీరో, విలన్ క్యారెక్టర్లను బలంగా రూపొందించకపోవడం

స్లో స్టోరీ పేసింగ్

కథ బాగానే ఉంది. పాత్రలు తమ పరిధిలో బాగానే నటించారు. కానీ, స్క్రీన్ ప్లే బలంగా లేదు. సీరియస్ ఎలిమెంట్స్‌తో మలుపులు తిరగాల్సిన కథ కామెడీ ట్రాక్ ఎక్కింది.

కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్ లేవు. ఫస్ట్ హాఫ్‌లో మెయిన్ స్టోరీ ట్రాక్ ఎక్కలేదు.

ఇలా మొత్తం మీద 'సరిపోదా శనివారం' అంచనాలు అందుకోలేక పోయింది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)