రూ. 5.28 కోట్లు ఇచ్చి ఈ టోపీ కొన్నారు.. దీని కథేంటంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ ఫిలిప్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండియానా జోన్స్ సిరీస్‌లోని ‘టెంపుల్ ఆఫ్ డూమ్’ హీరో హారిసన్ ఫోర్డ్ ధరించిన టోపీ రికార్డు ధరకు అమ్ముడైంది. ఏకంగా 6,30,000 డాలర్లు(సుమారు రూ. 5.28 కోట్లు) ధర పలికింది.
‘టెంపుల్ ఆఫ్ డూమ్’ చిత్రంలో హారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్రలో నటించారు.
అందులో ఫోర్డ్ ధరించిన ఈ ‘బ్రౌన్ ఫీల్ ఫెడోరా’ టోపీని గురువారం లాస్ ఏంజెలిస్‌లో వేలం వేశారు.
ఈ టోపీ 6,30,000 డాలర్లకు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 5.28 కోట్లు.
ఇదే వేలంలో స్టార్ వార్స్, హ్యారీ పోటర్, జేమ్స్ బాండ్ తదితర పాపులర్ సినిమాలలో ఉపయోగించిన వస్తువులను విక్రయించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు ధరించారు?
సినిమాలో హారిసన్ ఫోర్డ్‌ది సాహసోపేత పురావస్తు శాస్త్రవేత్త పాత్ర. కూలిపోతున్న విమానం నుంచి దూకే సీన్‌లో ఆయన ఈ టోపీని ధరించి కనిపించారు.
ఆ సీన్‌లో విమానంలో ఆయనతో పాటు విల్‌హెల్మినా "విల్లీ" స్కాట్ అనే నైట్‌క్లబ్ గాయని ఉంటారు. ఆ పాత్రను కేట్ క్యాప్‌షా పోషించారు. అదే విమానంలో 12 ఏళ్ల షార్ట్ రౌండ్ కూడా ఉంటాడు, ఆ పాత్రను కీ హుయ్ క్వాన్ పోషించాడు.
ఈ ముగ్గురు చైనా క్రైమ్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.
పైలట్ విమానాన్ని ధ్వంసం చేయడంతో, అందులో ఉన్న ఈ ముగ్గురూ కిందకి దూకడానికి రాఫ్ట్ ఉపయోగిస్తారు. ఆ రాఫ్ట్ సాయంతో ముగ్గురు సురక్షితంగా మంచుపర్వతంపై పడి జారుతూ తప్పించుకుంటారు.
నిర్మాత జార్జ్ లూకాస్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలో, అదనపు చిత్రీకరణ సమయంలోనూ ఈ టోపీని ఉపయోగించినట్లు వేలం సంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
హీరో డూప్ దగ్గరే టోపీ
1984లో విడుదలైన ‘టెంపుల్ ఆఫ్ డూమ్’ సినిమాలో హారిసన్ ఫోర్డ్ ‘స్టంట్ డూప్’ అయిన డీన్ ఫెర్రాండినీ కూడా ఈ ఫెడోరా టోపీని ధరించారు.
ఆ సమయంలో తీసిన ఫోటోలతో పాటు టోపీని విక్రయించారు.
ఫెర్రాండిని గత ఏడాది మరణించారు, ఆయన వ్యక్తిగత సేకరణలోనే ఈ టోపీ ఉంది.
మొదటి ఇండియానా జోన్స్ చిత్రం "రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్"లో ఉపయోగించిన టోపీకి ఇది కొత్త వెర్షన్.
ఈ టోపీ పై భాగం కొంచెం భిన్నంగా ఉంటుంది. దీనిని లండన్‌లోని ‘హెర్బర్ట్ జాన్సన్’ టోపీ కంపెనీ తయారు చేసింది. టోపీ లోపల లైనింగ్‌లో "ఐజే" (ఇండియానా జోన్స్) అనే బంగారపు అక్షరాలు ఉన్నాయి.

హెల్మెట్ రూ. 2.64 కోట్లు
వేలంలో మరికొన్న పాపులర్ సినిమాల వస్తువులను విక్రయించారు. 1983లో విడుదలైన స్టార్ వార్స్ చిత్రం "రిటర్న్ ఆఫ్ ది జేడీ"లోని ఇంపీరియల్ స్కౌట్ ట్రూపర్ హెల్మెట్ సుమారు రూ.2.64 కోట్ల (315,000 డాలర్లు)కి అమ్ముడైంది.
"హ్యారీ పోటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్"లో డేనియల్ రాడ్‌క్లిఫ్ ఉపయోగించిన లైట్-అప్ మంత్రదండం సుమారు రూ. 44.9 లక్షలకు అంటే 53,550 డాలర్లకు కొనుగోలు చేశారు.
ఇక 2012లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం "స్కైఫాల్"లో ప్రధాన పాత్ర డేనియల్ క్రెగ్ ధరించిన సూట్ సుమారు రూ.29.35 లక్షలకు విక్రయించారు.
అభిమానులను వారు ఇష్టపడే చారిత్రక వస్తువులతో ‘వేలం హౌస్’ కనెక్ట్ చేయడం గర్వంగా ఉందని ప్రాప్‌స్టోర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాండన్ అలింగర్ అన్నారు.
హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం 2021లోనూ ఇండియానా జోన్స్ సంబంధించిన ఒక టోపీని వేలం వేశారు. దానిని రూ.2.5 కోట్లకు విక్రయించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














