పారిస్ 2024: పారాలింపిక్స్ క్రీడలు ఎప్పుడు మొదలయ్యాయి, ఈ క్రీడల మొదటి పేరు ఏమిటో తెలుసా?

ఫొటో సోర్స్, Abhilasha Chaudhary
పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడలు బుధవారం అధికారికంగా ప్రారంభం అయ్యాయి.
11 రోజుల పాటు జరిగే పారా విశ్వ క్రీడల్లో 4000 మందికి పైగా అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు.
ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో తెలుగు క్రీడాకారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 8న ముగింపు వేడుకలు జరుగుతాయి.


ఫొటో సోర్స్, Getty Images
పారాలింపిక్స్ ఎప్పుడు మొదలయ్యాయి?
సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు నాజీ జర్మనీ నుంచి పారిపోయిన డాక్టర్ లుడ్విగ్ గుట్‌మన్ అనే యూదు వైద్యుడు మొట్టమొదట ఈ పోటీలను నిర్వహించారు. లండన్ ఒలింపిక్స్ క్రీడా వేదికపై 1948 జులై 29న వీల్‌చెయిర్ అథ్లెట్లతో పారాలింపిక్స్ మొదలయ్యాయి. నాటి పోటీల్లో ఆర్చరీ ఈవెంట్‌లో మహిళలతో పాటు 16 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సైనికులంతా గాయపడి వైకల్యం బారిన పడివారే.
లుడ్విగ్ ఈ క్రీడలకు తొలుత ‘స్టోక్ మాండెవిల్లే గేమ్స్’ అనే పేరు పెట్టారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ మాండెవిల్లే ఆసుపత్రిలో ఆయన వెన్నెముక గాయాలకు చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ ఆసుపత్రి పేరు మీదే క్రీడలకు ఆ పేరు పెట్టారు.
ఆ తర్వాత స్టోక్ మాండెవిల్లే క్రీడలు పారాలింపిక్స్ గేమ్స్‌గా మారాయి. 1960లో రోమ్ వేదికగా ఆ పేరుతో జరిగిన తొలి పోటీల్లో 23 దేశాలకు చెందిన 400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన ఈవెంట్లు
ఒలింపిక్స్ తరహాలోనే పారాలింపిక్స్ క్రీడల్లోనూ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లే ప్రధాన ఆకర్షణ.
సెప్టెంబర్ 7న రెండు సెషన్లలో కలిపి మొత్తం 22 ఫైనల్ పోటీలు జరుగనున్నాయి.
కొత్త క్రీడలు
అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అనుమతించిన 22 క్రీడాంశాల్లో ప్రస్తుతం పోటీలు జరుగుతున్నాయి.
ఇందులో అంధుల ఫుట్‌బాల్, పారా పవర్‌లిఫ్టింగ్, వీల్‌చెయిర్ టెన్నిస్, పారా ఆర్చరీ వంటి క్రీడలు ఉన్నాయి.
కొత్తగా బ్యాడ్మింటన్, తైక్వాండో క్రీడల్ని కూడా చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక క్రీడలు
ఒలింపిక్స్‌లో లేని రెండు క్రీడలను కేవలం పారాలింపిక్స్‌లో చూడొచ్చు. అవేంటంటే గోల్‌బాల్, బోచియా.
గోల్‌బాల్ ముఖ్యంగా కంటిచూపు సరిగ్గా లేని క్రీడాకారుల కోసం.
వాలీబాల్ పరిమాణంలోని ఇండోర్ కోర్టులో ముగ్గురు చొప్పున అథ్లెట్లతో కూడిన రెండు జట్లు ఈ ఆటలో తలపడతాయి.
ఇందులో ఆటగాళ్ల కళ్ళకు గంతలు కడతారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు వేసే బంతి, తమ నెట్‌లోకి చేరకుండా శరీరం మొత్తాన్ని వాడుతూ ఆటగాళ్లు అడ్డుకుంటారు. పాయింట్లు స్కోర్ చేయడం కోసం బంతిని ప్రత్యర్థి నెట్‌లోకి పంపాల్సి ఉంటుంది.
గోల్‌బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు ప్రేక్షకులంతా పూర్తి నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే బంతి దొర్లుతూ వచ్చే శబ్దాన్ని ఆటగాళ్ళు వినగలుగుతారు. బంతిని అడ్డుకోగలుగుతారు. ఈ గేమ్‌లో వాడే బంతికి గంటలు ఉంటాయి.
వీల్‌చెయిర్ అథ్లెట్ల కోసం రూపొందించిన గేమ్ బోచియా. ఇది దాదాపు ‘బౌల్స్’ అనే ఆటలాంటిది. బ్యాడ్మింటన్ కోర్టు పరిమాణంలోని ఇండోర్ కోర్టులో బోచియా ఆడతారు.
ఎలా వర్గీకరిస్తారు?
పారాలింపిక్స్‌లో పాల్గొనే ఆటగాళ్ళను వైకల్య స్వభావం, దాని తీవ్రత ఆధారంగా ఎంపిక చేస్తారు.దీనికోసం అథ్లెట్లందరూ వైకల్య వర్గీకరణ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది.వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణుల అంచనా (అసెస్‌మెంట్) తర్వాత ఆటగాళ్లను వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఆమేరకు వివిధ కేటగిరీల ప్రకారం పోటీలను నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
శరణార్థి బృందం ఉందా?
పారిస్ పారాలింపిక్స్‌లో 8 మంది అథ్లెట్లు, ఇద్దరు గైడ్ రన్నర్లతో కూడిన శరణార్థి బృందం పాల్గొంటోంది. వీరు ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులైన 120 మిలియన్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. పారాలింపిక్స్ చరిత్రలో ఎక్కువ మంది శరణార్థులు పాల్గొంటున్న పారాలింపిక్స్ ఇవే.
2016 రియో డి జెనీరో క్రీడల్లో శరణార్థి బృందం అరంగేట్రం చేసింది.
అప్పుడు ఇద్దరు అథ్లెట్లు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందరి కళ్ళు వీరిపైనే
కరెన్ పాలోమెక్- కొలంబియా
2023లో పారిస్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ మహిళల 100మీ. పరుగు టి37 ఈవెంట్‌లో కరెన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
2024 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 200మీ. 400మీ టి38 విభాగంలో స్వర్ణాలతో పాటు, 100మీ. టి38 విభాగంలో రజతం, లాంగ్ జంప్‌లో కాంస్యాన్ని గెలుచుకున్నారు.
400మీ. పరుగును 59.4 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
ఒక్సానా మాస్టర్స్- పారా సైక్లింగ్
అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్సానా యుక్రెయిన్‌లో పుట్టారు.
చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ కారణంగా పుట్టుకతోనే ఆమెకు అనేక లోపాలు వచ్చాయి.
ఏడేళ్ల వయస్సులో ఆమెను దత్తత ఇచ్చారు. 14 ఏళ్లున్నప్పుడు ఆమె రెండు కాళ్ళను తొలగించారు.
2012లో రోయింగ్ క్రీడతో ఆమె పారాలింపిక్స్‌లో అడుగుపెట్టి కాంస్యం గెలుచుకున్నారు.
2018లో పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలను సాధించారు.
క్లెయిర్ టాగెర్ట్- బోచియా
టాగెర్ట్, 2016 రియో క్రీడలతో అరంగేట్రం చేశారు. అప్పుడు నార్తర్న్ ఐర్లాండ్ నుంచి పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలి అథ్లెట్‌గా ఆమె నిలిచారు.
ఆమెకు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు నాడీకణ సంబంధిత వ్యాధి డిస్టోనియా ఉన్నట్లు నిర్థరణ అయింది.
ఈ వ్యాధి కారణంగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.
మా లిన్- టేబుల్ టెన్నిస్
ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మా లిన్, అయిదేళ్ల వయస్సున్నప్పుడు చైనాలోని ఒక జూకి వెళ్లారు. అప్పుడు ఒక ఎలుగుబంటి దాడిచేసి, ఆయన కుడి చేతిని తినేసింది.
ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఆయన ఎడమ చేతితో టేబుల్ టెన్నిస్ ఆడటం నేర్చుకొని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచారు.
సిమోన్ బర్లామ్- పారా స్విమ్మింగ్
సిమోన్ బర్లామ్ వయస్సు 24 ఏళ్లు. ఆయన మిలాన్‌లో జన్మించారు. పుట్టినప్పుడే ఆయన రెండు కాళ్లలో ఒకటి పొట్టిగా ఉంది. తుంటి ఎముకలో సమస్య కారణంగా ఇలా జరిగింది. ఈ లోపాన్ని సరిచేయడానికి ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి.
14 ఏళ్ల వయస్సులో ఆయన స్విమ్మింగ్‌ను ఎంచుకున్నారు. 2017 వరల్డ్ చాంపియన్‌షిప్‌తో అంతర్జాతీయ పోటీల్లో అరంగేట్రం చేశారు. టోక్యో క్రీడల్లో ఆయన ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














