పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వినేశ్ ఫొగాట్, కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్

భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న తర్వాత 100 గ్రాములు అధిక బరువు ఉన్నారన్న కారణంతో ఆమె అనర్హతకు గురయ్యారు.
శనివారం ఉదయం దిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన తర్వాత వినేశ్ ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
విమానాశ్రయం నుంచి బయటికి రాగానే ఆమె తన తల్లిని హత్తుకుని ఏడ్చారు.
రెజ్లర్లు సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా ఆమెకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చారు.
వినేశ్‌ను సాక్షి కౌగలించుకున్నప్పుడు ఆమె కన్నీళ్లు ధారలా కారాయి. వినేశ్ స్పందన కోసం మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆమె ఆ సమయంలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.

దిల్లీలో ఘన స్వాగతం
వినేశ్‌కు స్వాగతం పలికే సమయంలో కాంగ్రెస్ నేత దీపేందర్ హుడా కూడా ఉన్నారు. ఓపెన్ టాప్ కారులో వినేశ్ ఫొగాట్‌తో పాటు దీపేందర్ హుడా నిల్చుని కనిపించారు.
జాట్ ఆర్గనైజేషన్స్, రైతు సంఘాల నేతలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు.
‘‘వినేశ్ చాంపియన్. అందుకే, ఆమెకు చాంపియన్ స్థాయిలో స్వాగతం లభించింది. పతకం పొందడం, పొందకపోవడం అనేది అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, రోడ్డు నుంచి పోడియం వరకు ఆమెను తీసుకెళ్లిన తీరు దేశమంతా చూసింది’’ అని బజ్‌రంగ్ పునియా అన్నారు.
‘ఇవాళ చాలా గొప్ప రోజు. దేశం కోసం, మహిళల కోసం ఆమె చేసింది అద్భుతం. మీరంతా ఆమెకు ప్రేమ, గౌరవం ఇస్తారని ఆశిస్తున్నా. ఇంతవరకు ఒక్క ఓటమి కూడా లేని రెజ్లర్‌ను వినేశ్ ఓడించారు. మాకు వినేశ్ చాంపియన్’ అని సాక్షి మాలిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మహిళల భద్రత కోసం నిరసన’
పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్ర నిరాశ ఎదురైన తర్వాత శుక్రవారం వినేశ్ ఫొగాట్ ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.
నాలుగు పేజీల లేఖలో తన కెరీర్‌తో సంబంధం ఉన్న చాలా మందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
‘పరిస్థితులు వేరేలా ఉంటే, నేను 2032 వరకు రెజ్లింగ్‌ను కొనసాగించేదాన్ని’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరినా, 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పతకానికి దూరమైంది.
తనకు ఉమ్మడిగా రజత పతకమైనా ఇవ్వాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(కాస్) కొట్టివేసింది.
ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు గతంలో జరిపిన ఆందోళనల్లో వినేశ్ ఫొగాట్ కూడా పాల్గొన్నారు.
‘‘గత ఏడాదిన్నర, రెండేళ్లలో నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. జీవితం పూర్తిగా ఆగిపోయినట్లు నాకనిపించింది. మా ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి మాకు మార్గం లేదు’’ అని వినేశ్ తన లేఖలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రిని గుర్తుకు చేసుకున్న రెజ్లర్
ఈ సందర్భంగా వినేశ్ ఫొగాట్ తన తండ్రిని గుర్తుకు చేసుకున్నారు. కలలు చెదిరిపోయినప్పుడు కలిగే బాధను ఆమె షేర్ చేసుకున్నారు. తన ఈ పోరాటంలో, కెరీర్‌లో మద్దతుగా నిలిచిన భర్త సోమ్‌వీర్‌కు వినేశ్ ధన్యవాదాలు తెలిపారు.
వినేశ్ రాసిన లేఖలో ఇంకేం ఉందంటే..
- పెద్ద జుట్టు, చేతిలో మొబైల్ ఫోన్.. ప్రతి సాధారణ యువతి కనే కలలను నేనూ కన్నాను.
- మా నాన్న ఒక సాధారణ బస్సు డ్రైవర్. తాను రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నప్పటికీ, నన్ను మాత్రం విమానంలో ఎగిరేలా చూడాలనుకున్నారు. మా అమ్మకు, నేను స్వతంత్రంగా ఉండటం ఇష్టం. తన పిల్లలు సొంత కాళ్లపై నిలబడాలనుకుంది.
- నాన్న చనిపోయిన కొన్ని నెలల తర్వాత, అమ్మకు స్టేజ్ 3 క్యాన్సర్ నిర్ధరణ అయింది.
- మంచి వ్యక్తులకు దేవుడు ఎప్పుడూ చెడు జరిగేలా చూడడని నా తల్లి తరచూ చెప్పేవారు. నేను సోమ్‌వీర్‌ను కలుసుకున్నప్పుడు దీన్ని బాగా నమ్మాను. తన సహకారంతో నన్ను జీవితంలో ఈ స్థానంలో నిల్చోబెట్టారు సోమ్‌వీర్. నా ప్రతి పనిలో ఆయన మద్దతు ఉంటుంది.
- క్రీడల్లో తనకు సహకరించిన డాక్టర్ దిన్షా పార్దివాలాకు, ఆయన మొత్తం బృందానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.
‘‘మేం లొంగిపోలేదు. గడియారం ఆగిపోయింది అంతే. సమయం సరైంది కాదు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ, నిజం కోసం నేనెప్పుడూ పోరాడతానని నాకు తెలుసు. చెప్పడానికి చాలా ఉంది. కానీ, దీనికి పదాలు సరిపోవు. సమయం సరైందిగా అనిపించినప్పుడు మరోసారి మాట్లాడతాను. మేం వెనక్కి తగ్గలేదని, మా ప్రయత్నాలు ఆగిపోలేదని మాత్రం నేం చెప్పాలనుకుంటున్నా’’ అని వినేశ్ ఫొగాట్ తన లేఖలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














