భాగ్యశ్రీ జాదవ్: ‘విష ప్రయోగం’ వీల్ చెయిర్‌కే పరిమితం చేసినా పారాలింపిక్స్‌లో భారత్ సత్తా చాటడానికి సిద్ధమవుతున్న యువతి

ఫొటో సోర్స్, Prakash Kamble
- రచయిత, నితిన్ సుల్తానే
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘క్లిష్టమైన పరిస్థితుల కంటే ఎక్కువగా నా సొంత వాళ్లే నన్ను బాధపెట్టారు. మిమ్మల్ని పదేపదే ఎవరైనా తక్కువ చేసి చూస్తున్నప్పుడు, ఆత్మాభిమానం, గౌరవం విలువేంటో మీకు అర్థమవుతుంది’ అన్నారు భాగ్యశ్రీ జాదవ్.
మహారాష్ట్రకు చెందిన పారా అథ్లెట్ ఈమె. పారిస్‌లో జరగబోయే పారాలింపిక్స్‌లో భారత ఫ్లాగ్ బేరర్ భాగ్యశ్రీయే.
ఆగస్ట్ 28 నుంచి జరగబోయే పారిస్ పారాలింపిక్స్‌లో భారత కంటింజెంట్‌కు భాగ్యశ్రీ నేతృత్వం వహిస్తారు.
తన జీవితంలో అత్యంత ముఖ్యమైన దశలో శాశ్వత అంగవైకల్యం పాలయ్యారు భాగ్యశ్రీ.
కానీ, ఆమెలోని సంకల్ప బలం, పట్టుదల ఈ అడ్డంకులను అధిగమించేలా చేశాయి. అంతేకాదు, ఆమె విజయాలు భారత్‌కు గర్వకారణంగా నిలిచాయి. ఆమెను పారిస్ పారాలింపిక్స్ వరకు నడిపించాయి.
పారిస్‌కు బయలుదేరే ముందు భాగ్యశ్రీ తన కథను బీబీసీతో పంచుకున్నారు.
‘ప్రతి విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తరువాత ఇలాంటి విజయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది’ అని భాగ్యశ్రీ అన్నారు.
ఆమె పడిన ఇబ్బందుల గురించి ఆమెకు సోదరుడి లాంటివారైన ప్రకాశ్ కంబ్లే బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Facebook
‘తండ్రిలా చూసుకున్న మేనమామ’
నాందేడ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో 1985 మే 24న పుట్టారు భాగ్యశ్రీ. ఆమె తల్లిదండ్రులు మాధవ్‌రావు, పుష్పబాయ్ జాదవ్ వ్యవసాయదారులు.
మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కరవు కారణంగా వారు కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో మేనమామ ఆనంద్‌రావు జాదవ్ ఆమెను పెంచి, పోషించే బాధ్యతలు తీసుకున్నారు.
జాదవ్ కుటుంబంలో మూడు తరాల్లో భాగ్యశ్రీయే తొలి ఆడపిల్ల కావడంతో ఆమె అంటే అందరికీ ఇష్టం. జాదవ్ ప్రాథమిక విద్యాభ్యాసం సొంతూరిలోనే సాగింది.
ఆ తరువాత సమీపంలోని కాలేజీలో 12వ తరగతి చదువుకున్నారు. 2004లో తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి కావడంతో చదువు ఆగిపోయింది.

‘విష ప్రయోగంతో జీవితం తలకిందులైంది’
పెళ్లయిన కొద్దికాలానికే ఆమె జీవితం ప్రమాదంలో పడిందని.. ఆమె విషప్రయోగానికి గురయ్యారని ప్రకాశ్ ‘బీబీసీ’తో చెప్పారు.
‘‘2006లో భాగ్యశ్రీపై విషప్రయోగం జరిగింది. రెండు వారాల పాటు కోమాలోనే ఉన్నారు. ఆమె బతకదేమోనని అంతా భయపడ్డారు’’ అని ప్రకాశ్ గుర్తుచేసుకున్నారు.
భాగ్యశ్రీ చివరికి కోమా నుంచి బయటపడ్డారు. కానీ పారలైజ్ అయ్యారు. తన సొంత కాళ్లపై తాను నిలబడలేని పరిస్థితికి చేరారు.
తన భర్త తండ్రే తనపై విషప్రయోగం చేశారన్న అనుమానంతో ఆమె ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.
ఆమె ఆరోపణలేవీ ఇంతవరకు రుజువు కాలేదు. భరణం కోరుతూ ఆమె వేసిన పిటిషన్ ఇంకా కోర్టులో విచారణలో ఉంది.

ఫొటో సోర్స్, Prakash Kambale
21 ఏళ్ల వయసులో వైకల్యానికి గురైన ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అహ్మద్‌పూర్‌లో‘డిప్లొమా ఆఫ్ ఎడ్యుకేషన్’లో చేరారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు చిన్నప్పటి నుంచి అండగా ఉన్న మేనమామ గుండెపోటుతో మరణించారు.
అనంతరం భాగ్యశ్రీ సొంతూరును విడిచిపెట్టి బీఏ చదవడానికి నాందేడ్‌లోని ఒక హాస్టల్‌లో చేరారు.
నాందేడ్‌లో ఉండగా ముక్కులో కణితి ఏర్పడడంతో ఆమెకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యేది. ముంబయిలోని జేజే హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశాక ఆమె ఈ సమస్య నుంచి బయటపడ్డారు.
ఇన్ని సవాళ్ల మధ్య ఆమె ప్రకాశ్ కంబ్లేను కలిశారు. ఆయన ఆమెకు అండగా నిలిచారు.
డిగ్రీ చదువుతూనే రోజువారీ ఖర్చుల కోసం ఇంటింటికి వెళ్లి చీరలను అమ్మారు.
ప్రకాశ్ ఆమెకు సొంత అన్నలా మారారు.

ఫొటో సోర్స్, Facebook
స్పోర్ట్స్ కెరీర్ అప్పుడే మొదలైంది
తన కాళ్లు మళ్లీ పనిచేసేలా చేయడానికి భాగ్యశ్రీ వైద్యులను సంప్రదించారు. చిన్నచిన్న వ్యాయామాలు చేస్తే పరిస్థితి మెరుగుపడొచ్చని కొందరు వైద్యులు సూచించారు.
దాంతో అప్పటికి హోంగార్డుల ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేసే ప్రకాశ్ ఆమెకు అక్కడి మైదానంలో వ్యాయామాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఆమె పట్టుదలను, సంకల్ప బలాన్ని చూసిన కొందరు ప్రకాశ్ స్నేహితులు, ఆమెను క్రీడల్లో చేర్చమని చెప్పారు.
వివిధ పోటీల గురించి తెలుసుకుని చివరకు జావెలిన్ త్రో, షాట్ పుట్ ఆడాలని నిర్ణయించారు.
2017 మేయర్స్ కప్ టోర్నీ కోసం 2016 నుంచి సిద్ధం కావడం ప్రారంభించారు.
భాగ్యశ్రీ కోసం ప్రత్యేక వీల్‌చెయిర్‌ను కొన్నారు ప్రకాశ్. ఆ చెయిర్ నుంచే ఐరన్ బాళ్లను, జావెలిన్‌ను విసరడం సాధన చేశారు.
నాందేడ్ భాగ్యనగర్ హోమ్ గార్డుల క్రీడా మైదానంలో ఆమె చేసిన సాధనతో రెండు క్రీడల్లోనూ నైపుణ్యం సంపాదించారు.
2017లో పుణేలో జరిగిన మేయర్స్ కప్ తొలి టోర్నమెంట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ రెండు ఈవెంట్లలో బంగారం, కాంస్య పతకాలను సాధించారు. ఇదే ఆమె క్రీడా కెరీర్‌కు పునాది.

ఫొటో సోర్స్, Prakash kambale
అమ్మ బంగారం అమ్మి పోటీలకు..
పుణేలో బంగారు పతకం గెలిచాక వివిధ పోటీల్లో పాల్గొనేందుకు సాధన చేయడం ప్రారంభించారు భాగ్యశ్రీ.
అనంతరం 2018లో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో షాట్ పుట్‌లో బంగారు పతకం సాధించారామె.
చండీగఢ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్యం సాధించారు.
2019లో చైనాలో జరిగిన పారా ఓపెన్ చాంపియన్‌షిప్‌కు ఆమె ఎంపికయ్యారు. డబ్బులు లేకపోవడంతో తల్లి మంగళసూత్రం, ఆభరణాలను తాకట్టు పెట్టి వెళ్లారు. అక్కడ ఆమె రెండు కాంస్య పతకాలు సాధించారు.
చైనాలో ఆమె సాధించిన విజయం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.
అనంతరం ఏషియన్ చాంపియన్‌షిప్, పారాలింపిక్స్ వంటి వాటిపై ఫోకస్ చేశారు. కానీ, కరోనా రావడంతో తిరిగి నాందేడ్‌కు రావాల్సి వచ్చింది.
2020లో సాధన చేసే సమయంలో చేతికి గాయమైంది. ఆమె ఇక క్రీడలను ఆపేయాలని డాక్టర్ చెప్పారు. కానీ, భాగ్యశ్రీ అలా చేయలేదు. చికిత్స తీసుకుంటూనే, ఆమె సాధన చేశారు.
‘‘భాగ్యశ్రీ చాలా పట్టుదల గల మనిషి. ఏ పనైనా చేసేదాకా వదలదు’’ అని ఆమె ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శుభాంగి పాటిల్ అన్నారు.
క్రీడలపై ఏమాత్రం అవగాహన, పరిజ్ఞానం లేకుండా 2016లో ఈరంగంలో అడుగుపెట్టిన భాగ్యశ్రీ ఏడేళ్ల కంటే తక్కువ సమయంలోనే రెండోసారి భారత్ తరఫున పారాలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
పారిస్ పారాలింపిక్స్‌లో భారత త్రివర్ణ జెండాను పట్టుకుని దేశ కంటింజెంట్‌కు నేతృత్వం వహించే అవకాశాన్ని పొందారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














