బంగ్లాదేశ్‌లో వరదలకు భారత్ కారణమా? అక్కడి మీడియాలో ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది
సుమంత్ సింగ్
బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చింది.
బంగ్లాదేశ్‌లోని ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లోని సుమారు 11 జిల్లాలు గత కొన్ని రోజులుగా వరదలతో ప్రభావితమయ్యాయి. దాదాపు 40 లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నారు.
ఫెని, కొమిల్లా, మౌల్వీబజార్, హబీగంజ్, చిట్టగాంగ్ జిల్లాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఇప్పటివరకు 23మంది వరదల కారణంగా మరణించారు.
రాజధాని ఢాకా,చిట్టగాంగ్ మధ్య రైలు,రహదారి కనెక్టివిటీ దెబ్బ తింది. కొండచరియలు విరిగిపడటంతో చిట్టగాంగ్, కాక్స్ బజార్ రైల్వే లైన్లూ దెబ్బతిన్నాయి.
అయితే, బంగ్లాదేశ్‌లో వరదలకు భారత్ కారణమంటూ అక్కడి ప్రజల్లో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక బంగ్లాదేశ్ మీడియా సంస్థలు తమ దేశంలో వరదలకు భారతదేశాన్ని నిందిస్తున్నాయి.
స్థానిక మీడియాతో పాటు, సోషల్ మీడియాలో అనేక మంది వరదలకు భారతదేశమే కారణమని నేరుగా నిందిస్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు సైదా రిజ్వానా హసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. సైదా ఇటీవల “నీటిని విడుదల చేయడానికి ముందు భారతదేశం కనీస సమాచారం ఇవ్వలేదు” అని ఇండియాపై ఆరోపణలు చేశారు.
అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
డంబూర్ గేట్లు తెరవడం వల్లే వరదలు: బంగ్లాదేశ్
త్రిపురలోని డంబూర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్లను ఎత్తేశారని, దాని కారణంగానే తమ దేశంలో వరదలు వచ్చాయని బంగ్లాదేశ్ అంటోంది.
ఆగస్టు 19 నుంచి త్రిపురలో భారీ వర్షాల కారణంగా గోమతి హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్లను ఎత్తేయడంపై బంగ్లాదేశ్‌లోని సోషల్ మీడియాలో అనేక వాదనలు జరిగాయి.
అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
త్రిపురలోని గోమతి నదిపై ఉన్న డంబూర్ డ్యామ్‌ను తెరవడం వల్ల బంగ్లాదేశ్‌లో ప్రస్తుత వరద పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారని, ఇది నిజం కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం: "భారత్, బంగ్లాదేశ్‌లలో ప్రవహించే గోమతి నది తీర ప్రాంతాలలో ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల నుంచి నీరు దిగువకు ప్రవహించడం వల్లే బంగ్లాదేశ్‌లో వరదలు వచ్చాయి."
బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోని త్రిపుర రాష్ట్రంలోనూ వరదల తీవ్రత అధికంగా ఉంది. వరదలకు ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాల్లో త్రిపురలోని గోమతి జిల్లా కూడా ఉంది.
గోమతి జలవిద్యుత్ కేంద్రం డంబూర్ డ్యామ్ స్లూయిస్ గేట్‌ను తెరవడం వల్ల బంగ్లాదేశ్‌లో భారీ వరదలు సంభవించాయని అక్కడి మీడియా పేర్కొంటోంది. ఆ జలవిద్యుత్ కేంద్రం త్రిపుర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఉంది.
ఫరక్కా బ్యారేజీ గేట్లను తెరవడంపైనా భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. "ఫరక్కా బ్యారేజీ గేట్లను తెరవడం విషయంలో మేం మీడియాలో వస్తున్న కథనాలను చూశాం. దీని ద్వారా 11 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు దిగువన ఉన్న గంగా/పద్మ నదికి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా ఇది మామూలుగా జరిగేదే" అన్నారు.
ఫరక్కా బ్యారేజీ మాత్రమేనని, ఆనకట్ట కాదని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
"ఇది కేవలం 40,000 క్యూసెక్కుల నీటిని ఫరక్కా కాలువలోకి మళ్లించే నిర్మాణం. గంగా/పద్మ నదిపై గేట్ల వ్యవస్థను ఉపయోగించి ఈ పనిని చేస్తారు. మిగిలిన నీరు ప్రధాన నదిలోకి ప్రవహించి బంగ్లాదేశ్‌కు వెళుతుంది."
"ప్రోటోకాల్ ప్రకారం, బంగ్లాదేశ్‌లోని సంబంధిత జాయింట్ రివర్స్ కమిషన్ అధికారులతో క్రమం తప్పకుండా, సమయానుసారంగా డేటా పంచుకుంటాము. ఈసారీ అదే చేశాం" అని భారత విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ మీడియా ఏం చెప్పింది?
బంగ్లాదేశ్ వార్తాపత్రిక 'కలేర్ కాంతో' ఆగస్టు 24న తన మొదటి పేజీలో, ‘నీటి విడుదలకు ముందు నోటిఫికేషన్ జారీ చేసే నియమానికి కట్టుబడని భారతదేశం’ అని పేర్కొంది.
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు సైదా రిజ్వానా హసన్ వ్యాఖ్యలను పేర్కొంటూ ఈ వార్త రాశారు.
"నీటిని విడుదల చేయాల్సి వస్తే, దిగువన ఉన్న దేశానికి ముందుగానే తెలియజేయాలి. తద్వారా దిగువన ఉన్న దేశం దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని, ప్రజలను ఖాళీ చేయిస్తుంది. భారత్‌తో మా ఒప్పందంలోనూ ఇదే ఉంది. కానీ ఈసారి భారత్ ఈ నియమాన్ని పాటించలేదు" అనిసైదా ఆరోపించారు.
మరో బంగ్లాదేశ్ వార్తాపత్రిక 'బోనిక్ బార్తా', ‘‘సింధు నది, దాని ఐదు ఉపనదులు భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు ప్రవహిస్తాయి. ఈ ఒప్పందం లక్ష్యం ఈ నదీజలాలను రెండు దేశాల మధ్య సక్రమంగా పంచుకోవడం’’ అని రాసింది.
అయితే ఉమ్మడి నదుల నిర్వహణపై భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం ఉన్నా, నీటిని సమానంగా పంపిణీ చేసుకోవడంపై ఎలాంటి నిర్దిష్టమైన చర్యా తీసుకోలేదని బోనిక్ బార్తా ఆరోపించింది.
"1972లో భారతదేశం, బంగ్లాదేశ్ స్నేహం, సహకారం, శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, జాయింట్ రివర్ కన్జర్వేషన్ కమిషన్ (జేఆర్‌సీ) ఏర్పడింది. అయితే, 52 సంవత్సరాల తర్వాత కూడా ఈ కమిషన్ రెండు దేశాల నదులలో నీటి పంపకాన్ని నిర్ధరించడంలో ఎలాంటి పాత్రను పోషించలేకపోయింది’’ అని ఈ పత్రిక పేర్కొంది.
అదే సమయంలో బంగ్లాదేశ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వరదల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని భారతదేశంలోని నిపుణులు భావిస్తున్నారు.
"బంగ్లాదేశ్ మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది" అని దిల్లీలోని రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్‌ఐఎస్)లో పనిచేస్తున్న ప్రొఫెసర్ ప్రబీర్ డే అన్నారు. ‘‘ భారతదేశంలోని డ్యామ్‌ల నుంచి నీరు విడుదల చేయడం వల్లే బంగ్లాదేశ్‌లో వరదలు వచ్చాయని సోషల్ మీడియాలో వచ్చింది, అదంతా తప్పుడు సమాచారం’’ అన్నారు ప్రబీర్.
వరద హెచ్చరిక గురించి ప్రబీర్ డే మాట్లాడుతూ, "భారీ వర్షాలు కురుస్తాయని, వరదలు సంభవించవచ్చని భారతదేశం చాలాసార్లు వాతావరణ సూచన చేసింది, కానీ బంగ్లాదేశ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. దీనికి భారతదేశం బాధ్యత వహించదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, TRIPURA GOVERNMENT
డంబూర్ డ్యామ్ గేటు తెరవడం వల్ల వరద వచ్చిందా?
బంగ్లాదేశ్‌లో వరదల కారణంగా భారత్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తర్వాత, త్రిపుర విద్యుత్ మంత్రి కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు.
విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ, "డంబూర్ డ్యామ్ గేటు తెరిచే అంశంపై ఏం రాసినా అది కేవలం ప్రచారం మాత్రమే. అలాంటి కథనాలు నిరాధారమైనవి. గోమతి జల విద్యుత్ కేంద్రం కింద నిర్మించిన డంబూర్ డ్యామ్‌కు సంబంధించి ఏ గేటునూ తెరవలేదు" అన్నారు.
‘‘ఈ కేంద్రంలో నిర్మించిన రిజర్వాయర్ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 94 మీటర్లు, నీటి మట్టం దాటితే అదనపు నీరు గేటు నుంచి దానికదే బయటకు వెళ్లిపోతుంది, నీటిమట్టం తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా గేట్లు మూసుకుపోతాయి,’’ అని ఆయన చెప్పారు.
డంబూరు డ్యాం నుంచి నీటి విడుదలకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం నీటి మట్టం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువగా ఉండడంతో రెండు గేట్ల నుంచి నీరు బయటికి ప్రవహిస్తోంది. దీంతో సంబంధిత ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు,’’ అన్నారు.
భారీ వర్షాల కారణంగా బంగ్లాదేశ్, త్రిపురలో వరదలు సంభవించాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రొఫెసర్ ప్రబీర్ డే మాట్లాడుతూ, "భారతదేశం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయలేదు, అధిక వర్షాల కారణంగా డ్యామ్ నిండి, నీరు ప్రవహించింది. బంగ్లాదేశ్‌లోని కొమిల్లా, చిట్టగాంగ్, నోఖాలీ, ఫెని ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలు కాబట్టి, ఇక్కడ వరదలు వచ్చాయి. అదే సమయంలో మన దేశంలో, త్రిపురలోనూ వరదలు వచ్చాయి’’, అన్నారు.

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
షేక్ హసీనా భారత్‌కు రాక ముందు నుంచి ఆగ్రహం
భారత్‌పై బంగ్లాదేశ్ కోపానికి కారణం కేవలం వరదలు మాత్రమే కాదు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం తర్వాత, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చి ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ.. షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేసింది.
కానీ, బంగ్లాదేశ్‌లో హసీనాపై అనేక కేసులు నమోదైనప్పటికీ, రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింతల ఒప్పందం ప్రకారం ఆమెను వెనక్కి పంపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని దిల్లీలోని పరిశీలకులు అంటున్నారు.
షేక్ హసీనాను అప్పగించాలనే డిమాండ్ తర్వాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "మనం అప్పగించాలనడం పూర్తిగా ఊహాజనిత అంశం. అలాంటి ఊహాజనిత విషయాలకు సమాధానం చెప్పే సంప్రదాయం లేదు" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














