స్విట్జర్లాండ్: అందమైన సరస్సుల అడుగున టన్నుల కొద్దీ బాంబులు, బయటకు తీసేందుకు ఐడియా ఇస్తే భారీ నగదు బహుమతి

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఇమోజెన్ ఫౌక్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్విట్జర్లాండ్‌లోని లూసర్న్, టున్, నూచాటెల్ సరస్సుల్లో స్వచ్చమైన అల్పైన్ జలాల కింద ఏముందో తెలిస్తే వాటిని చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో వచ్చే పర్యటకులు ఆశ్చర్యపోతారు.
పురాతన ఆయుధాలను పడేయడానికి స్విట్జ ర్లాండ్ సైన్యం ఈ సరస్సులను డంపింగ్ కేంద్రాలుగా వాడుకుంటోంది. దీనివల్ల ఆ ఆయుధాలు సురక్షితంగా ఉంటాయని భావిస్తోంది.
లూసర్నేసరస్సులోనే 3,300 టన్నుల మందుగుండు సామాగ్రి ఉన్నట్టు అంచనా. నుచాటెల్ సరస్సు జలాల కింద 4,500 టన్నులు ఉన్నాయి. వీటితో స్విస్ వైమానిక దళం 2021 వరకు బాంబుదాడులలో శిక్షణ పొందింది..
ఈ మందుగుండు సామాగ్రిలో కొన్ని 150 నుంచి 220 మీటర్ల లోతులో ఉన్నాయి. అయితే నుచాటెల్ సరస్సుల్లో కొన్ని నీటి ఉపరితలం నుంచి కేవలం ఆరేడు మీటర్ల లోతులోనే ఉన్నాయి.
సరస్సుల అడుగున ఉన్న ఆయుధాలను బయటకు తీసేందుకు మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వారికి దాదాపు 50వేల స్విస్ ఫ్రాంకులు (రూ. 49.36 లక్షలు) బహుమతిగా ఇస్తామని స్విట్జర్లాండ్ రక్షణ విభాగం ప్రకటించింది.
సురక్షితమైన, పర్యావరణ హితమైన మూడు ఉత్తమ పరిష్కారాలకు ఈ సొమ్ము అందిస్తామని తెలిపింది. అయితే ఆయుధాలను బయటకు తీసేందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
రెట్టింపు ప్రమాదం
స్విట్జర్లాండ్‌లోని బ్రింజ్ సరస్సు సహా మిగతా సరస్సుల్లో ఆయుధాలను పారవేస్తున్న విషయం కొన్ని దశాబ్దాలుగా అందరికీ తెలుసు. అయితే ఇటీవలి కాలంలో ఇది ఎంత వరకు సురక్షితమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సరస్సుల అడుగున ఉన్న ఆయుధాల గురించి ప్రభుత్వానికి సలహా ఇచ్చిన రిటైర్డ్ స్విస్ జియాలజిస్ట్ మార్కోస్ బసర్ పదేళ్ల కిందటే వీటిపై పరిశోధన చేశారు. ఆ ఆయుధాల వల్ల ఎదురయ్యే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ పరిశోధనా వ్యాసం రాశారు.
మందుగుండు వల్ల రెండు ప్రమాదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటిది, అవి నీటి అడుగున ఉన్నప్పటికీ పేలే ప్రమాదం ఉంది. చాలా సందర్భాలలో సైన్యం వాటి ఫ్యూజులను తొలగించకుండానే నీటిలో పడేసేది.
మరొక సమస్య ఏమిటంటే నీరు, మట్టి కలుషితంగా మారితే మందుగుండు సామాగ్రిలోని విషపూరితమైన డైనమైట్లు కూడా కలుషితమై అవి సరస్సులోని నీరు, దాని అవక్షేపాలను ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంది.
సరస్సుల అడుగున ఉన్న ఆయుధాలను బయటకు తీయడానికి సాధ్యమయ్యే సాంకేతిక విధానాలపై జరిపిన అధ్యయనంలో, వాటి వెలికితీత సమయంలో సరస్సు జీవావరణ వ్యవస్థకు తీవ్ర ప్రమాదం కలగవచ్చని వెల్లడైంది.

ఫొటో సోర్స్, vbs
సమస్యల చరిత్ర
స్విస్ సైన్యం తన మందుగుండు సామగ్రి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని మిథోల్జ్ గ్రామంలో1947లో భారీ పేలుడు జరిగింది. అప్పట్లో అక్కడ అత్యంత ప్రముఖమైన పర్వతాలలో ఒకదానిపై సైన్యం నిల్వ చేసిన 3,000 టన్నుల మందుగుండు సామగ్రి పేలింది.
ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మిథోల్జ్ నాశనం అయింది. పేలుడు శబ్దం 160 కిలోమీటర్ల దూరంలోని జ్యూరిచ్ వరకు వినిపించింది.
పర్వతంలో పాతిపెట్టిన పేలని 3,500 టన్నుల ఆయుధాలు ఏమాత్రం సురక్షితంగా లేవని మూడేళ్ల క్రితం సైన్యం తెలిపింది. వాటిని తొలగిస్తామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ ప్రారంభం అయితే మిథోల్జ్ వాసులు పదేళ్ల పాటు వారి ఇళ్లను వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో స్విట్జర్లాండ్ అనుసరించిన రక్షణ వ్యూహాలపై అనుమానాలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యర్ధుల దండయాత్రలను నిరోధించేందుకు వంతెనలు, సొరంగాలలో ల్యాండ్ మైన్లను అమర్చడం లాంటివి ఉన్నాయి. అయితే వంతెనలపై మీద వచ్చే భారీ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉందని, కొన్ని వంతెనల కింద ల్యాండ్‌మైన్లను త్వరగానే తొలగించారు.
స్విట్జర్లాండ్ గ్రామీణ ప్రాంతాల్లో సాయుధ దళాలు పేలని ఆయుధాలను కనుక్కున్న వార్తలు గతేడాది 12శాతం పెరిగాయి.
వాతావరణ మార్పుల వల్ల హిమనీ నదాలు కరిగిపోతూ ఉండటంతో దశాబ్ధాల క్రితం ఎత్తైన పర్వతాలలో సైనికుల శిక్షణ కోసం ఉపయోగించిన ముందుగుండు బయటపడుతోంది.
స్విట్జర్లాండ్ రక్షణ వ్యూహంలో భాగంగా పెద్ద సైన్యాన్ని నిర్వహించేందుకు (స్విట్జర్లాండ్‌లో పురుషులందరూ సైన్యంలో పని చేయాల్సి ఉంటుంది) గ్రామీణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట కూడా సైనికులకు శిక్షణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, VBS
ఖర్చే కాదు, సమయమూ ఎక్కువే
స్విట్జర్లాండ్‌లోని సరస్సుల నుంచి ఆయుధాలను తొలగించే పని సుదీర్ఘమైనదే కాకుండా సంక్లిష్టమైనది. అయితే వాటిని బయటకు తీసేందుకు ఎవరో ఒకరు వాటిని ప్రమాదరహితంగా, పర్యావరణ హితంగా ఎలా బయటకు తియ్యవచ్చనే దానిపై ఒక ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆయుధాలను డంప్ చేస్తున్నప్పుడు సైన్యం దాని గురించి ఆలోచించి ఉండాల్సిందని కొందరు అంటుంటే, దశాబ్దాలుగా జియాలజిస్టులు సైన్యానికి చెబుతున్న వాటిని పాటిస్తే బావుండేదని మరి కొందరు అంటున్నారు.
ఆయుధాలను బయటకు తీసుకు వచ్చే మార్గాల కోసం ఇప్పుడు వేగంగా కృషి చేస్తున్నారు. స్విస్ రక్షణ విభాగం కోరుతున్న పరిష్కారాలను ఔత్సాహికులు 2025 ఫిబ్రవరిలోగా సమర్పించవచ్చు. ప్రజల నుంచి వచ్చిన ఈ పరిష్కారాలను 2025 మార్చిలో నిపుణుల బృందం రహస్యంగా అధ్యయనం చేసి ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది.
ఏప్రిల్‌లో ముగ్గురు విజేతలను ప్రకటిస్తారు.
“ప్రజల నుంచి వచ్చిన ఉత్తమ ప్రతిపాదనలను వెంటనే అమలు చెయ్యం . వాటి అమలులో సాధ్యా సాధ్యాల పరిశీలన, ఆయుధాల వెలికితీతలో పరిశోధన జరుగుతుంది” అని ప్రభుత్వం తెలిపింది.
యుద్ధ కాలంలో పేలని ఆయుధాల నిర్వహణ విషయంలో బ్రిటన్, నార్వే, డెన్మార్క్ అనుభవాలను పరిశీలించాలని బసర్ సూచిస్తున్నారు.
అంటే బసర్ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఐడియాలు ఇస్తారా? ఇదే విషయమై బీబీసీ ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు.
"లేదు, నాకు ఇప్పుడు చాలా వయసైపోయింది.. అయితే మీకు ఏదైనా సలహా కావాలంటే, నేను సంతోషంగా చెప్తాను." అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














