లోధీ కాలనీ రైల్వే స్టేషన్: దిల్లీలోని ఈ చిన్న స్టేషన్‌కు, పాకిస్తాన్‌కు సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/GETTY IMAGES
- రచయిత, వివేక్ శుక్లా
- హోదా, బీబీసీ కోసం
దిల్లీలోని లోధీ కాలనీ రైల్వే స్టేషన్ ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తుంటుంది. నిజానికి దేశ విభజన తర్వాత భారత్ నుంచి వెళ్లిన లక్షలాది మందికి ఈ స్టేషన్ వీడ్కోలు పలికింది.
రాజధాని దిల్లీలో 1947 నుంచి ఇప్పటివరకు అనేక మార్పులు జరిగాయి, కానీ లోధీ కాలనీ రైల్వే స్టేషన్ ముందు భాగం మాత్రం మునుపటిలాగానే ఉంది.
ఈ స్టేషన్లో ఇప్పుడు అయిదారుగురు కనిపిస్తే గొప్పే.
దీని పక్కనే ప్రభుత్వం ఉద్యోగుల కోసం నిర్మించిన రెండంతస్తుల ఫ్లాట్లు ఉన్నాయి. 1946లో నిర్మించిన ఈ కాలనీని, బ్రిటిష్ పాలకులు దిల్లీలో నిర్మించిన చివరి కాలనీగా చెప్తారు.

లాహోర్‌కు ప్రత్యేక రైళ్లు
దేశ విభజన తర్వాత ఎంతోమంది ముస్లింలు ఈ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరి వెళ్లిపోయారు. వాళ్ల కోసం ఇక్కడి నుంచి లాహోర్‌కు ప్రత్యేక రైళ్లు నడిచేవి.
ఒకప్పటి పాకిస్తాన్ ఆల్ రౌండర్ సికందర్ బఖ్త్ తండ్రి జవాన్ బఖ్త్, ఆయన కుటుంబ సభ్యులు ఈ స్టేషన్ నుంచే పాకిస్తాన్‌కు వెళ్లారు.
జవాన్ బఖ్త్ దిల్లీలోని కరోల్ బాగ్‌లో నివసించేవారు, ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు.
1979-80 క్రికెట్ సిరీస్‌లో, ఫిరోజ్‌షా కోట్ల టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 69 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టడంతో సికందర్ బఖ్త్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోయింది.
ఆ తర్వాత ఆయన తన కుటుంబసభ్యుల ఇంటిని చూసేందుకు కరోల్ బాగ్ వెళ్లారు.
ఆ సందర్భంగా సికందర్ మాట్లాడుతూ.. అప్పట్లో తమ కుటుంబం పాకిస్తాన్‌కు వెళ్లడంపై ఊగిసలాడిందని, వెళ్లాలా? వద్దా? అనే విషయంలో కుటుంబీకులు వాదులాడుకున్నారని.. చివరకు పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Hindustan Times
విభజన సమయంలో అల్లర్లు
విభజనకు ముందు రోజులలో దిల్లీలో అల్లర్లు చెలరేగాయి.
ఒకరోజు కరోల్ బాగ్‌లో డాక్టర్ ఎన్‌సీ జోషిని ఆయన దగ్గర పనిచేసేవాళ్లలోనే ఒకరు చంపినట్లు వార్త వచ్చింది.
జోషి స్వాతంత్ర్యానికి ముందు దేశంలోని ప్రఖ్యాత సర్జన్, ఆయన 1930లో కరోల్ బాగ్‌లో ఆసుపత్రిని నిర్మించారు.
ఆయన అల్లర్లను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఆయన దగ్గర పనిచేసే వ్యక్తే ఆయనను హత్య చేశాడు. ఆయన నిర్మించిన ఆసుపత్రిని ఇప్పుడు డాక్టర్ ఎన్‌సీ జోషి మెమోరియల్ హాస్పిటల్‌గా పిలుస్తున్నారు.
1947 ఆగస్టు రెండో వారం నుంచి నవంబర్ 22 వరకు దిల్లీ - లాహోర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిచాయి.
లోధి కాలనీ స్టేషన్ నుంచి లాహోర్‌కు రోజూ రెండు-మూడు రైళ్లు నడిచేవి.
చరిత్రకారుడు ప్రొఫెసర్ జ్ఞానేంద్ర పాండే మాట్లాడుతూ, పాకిస్తాన్‌కు వెళ్లే వ్యక్తులు తమ టిక్కెట్లను కన్నాట్ ప్లేస్‌లోని 'ఎల్' బ్లాక్‌లోని పాకిస్తాన్ ప్రభుత్వ తాత్కాలిక కార్యాలయం నుంచి తీసుకునేవారు అని తెలిపారు.
లోధి కాలనీ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయేవి. కొంతమంది ప్రయాణికులు రైలు పైకప్పుపై ప్రయాణించేవాళ్లు.
దోపిడీకి గురై పురానా ఖిలా, హుమయూన్ టూంబ్ దగ్గర ఉన్న శిబిరాల్లో నివసిస్తున్న ముస్లింలను అక్కడి నుంచి పాకిస్తాన్‌కు తీసుకువెళ్లేవాళ్లు.

ఫొటో సోర్స్, Hindustan Times
అతిపెద్ద రైల్వే కాలనీ నుంచి ముస్లింల వలస
రైల్వే బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ‘‘లోధీ కాలనీ స్టేషన్‌ను వదిలిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే రైలు న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకునేది. ఇక్కడ, పాకిస్తాన్‌కు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగుల కోసం రైలుకు కొన్ని కోచ్‌లు జోడించేవాళ్లు. వాళ్లలో ఎక్కువ మంది రైల్వే ఉద్యోగులు ఉండేవాళ్లు" అని తెలిపారు.
"రాజధానిలోని అతిపెద్ద రైల్వే రెసిడెన్షియల్ కాలనీ అయిన కిషన్‌గంజ్‌లో దాదాపు 25 శాతం ఇళ్లు ఖాళీ అయ్యాయి. కిషన్‌గంజ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కాలనీగా పరిగణిస్తారు. దీన్ని 1920లో స్థాపించారు" అని చెప్పారు.
"ఇక్కడ నివసిస్తున్న వందలాది మంది ముస్లిం రైల్వే కార్మికులు పాకిస్తాన్‌కు వెళ్లారు. సబ్జీ మండి రైల్వే కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికుల కుటుంబాలు పాకిస్తాన్‌కు తరలి వెళ్లాయి" అని రవీంద్ర కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్వేజ్ ముషారఫ్ కుటుంబం సరిహద్దు ఎలా దాటింది?
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కుటుంబం కూడా ఇలాగే సరిహద్దులు దాటి ఉండొచ్చు. ఆయన తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన కుటుంబం మింటో రోడ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఉండేది.
ప్రభుత్వ ఉద్యోగులు రైలులో ప్రయాణించే వాళ్లు కాబట్టి, సయ్యద్ ముషారఫుద్దీన్ తన కుటుంబం సహా న్యూదిల్లీ స్టేషన్‌లో ప్రత్యేక కోచ్‌లను జోడించి అదే రైలులో వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు.
1947 ఆగస్టు 14న దేశ విభజన జరిగిన అనంతరం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆనందంతో పాటు దేశ విభజనపై దుఃఖావేశాలు వ్యక్తమయ్యాయి.
కన్నాట్ ప్లేస్‌లోని ప్రముఖ పుస్తక దుకాణం సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ యజమాని ఆర్‌పీ పురీ, సయ్యద్ ముషారఫుద్దీన్ అధికారిక గృహానికి వార్తాపత్రికలను పంపిణీ చేసేవారు.
పురీ ఇలా చెప్పారు: "నేను దగ్గరున్న ప్రభుత్వ నివాసాలలో వార్తాపత్రికలు వేసేవాణ్ని. ఒక రోజు నేను ముషారఫుద్దీన్ ఇంటిలో పేపర్ వేస్తుండగా ఆయన నన్ను పిలిచి, ‘పురీ భాయ్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనిద్దరికీ మంచి సంబంధం ఉంది, మేం పాకిస్తాన్ వెళ్తున్నాం’ అన్నారు.’’
ఆర్‌పీ పురీ తర్వాత కన్నాట్ ప్లేస్‌లో సెంట్రల్ న్యూస్ ఏజెన్సీని ప్రారంభించారు. ముషారఫ్ కుటుంబ సభ్యులంతా బాగా చదువుకున్న వాళ్లు అని ఆయన చెప్పారు. సయ్యద్ ముషారఫుద్దీన్ పిల్లలందరూ మింటో రోడ్‌కు సమీపంలోని కమలా మార్కెట్‌లో ఉన్న గిరిధారి లాల్ మెటర్నిటీ హాస్పిటల్‌లో జన్మించారని ఆయన చెప్పారు.
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివిన ఎస్‌ఎం అబ్దుల్లా, ఆ సమయంలో తన బంధువులతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో జనరల్ జియా ఉల్ హక్‌కు క్లాస్‌మేట్. 1947లో ఆయనకు 23 ఏళ్లు.
దిల్లీలోని పంజాబీ వ్యాపార వర్గానికి చెందిన చాలా కుటుంబాలు లాహోర్ మీదుగా కరాచీకి వెళ్లాయి.
ప్రముఖ రచయిత్రి సాదియా దెహ్లవీ మామగారు అబ్దుల్లా సాహెబ్ పాకిస్తాన్‌కు వెళ్లేటప్పుడు, కొత్త దేశం స్వర్గధామంలా ఉంటుందని చెప్పేవాళ్లు. దిల్లీలోని ముస్లిం లీగ్ నాయకులు పాకిస్తాన్‌ను స్వర్గం కంటే తక్కువ కాదు అనేవాళ్లు, కానీ కరాచీకి వెళ్లిన తర్వాత వారికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపించాయి.
ఆయన అక్కడ కొద్దిరోజులు ఉండి తిరిగి దిల్లీకి వచ్చారు. ఆయన కరాచీలోనే ఉండిపోయేంత ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. దిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, అబ్దుల్లా మళ్లీ కన్నాట్ ప్లేస్‌లోని వోల్గా రెస్టారెంట్‌లో స్నేహితులతో కూర్చోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
కరాచీలో దిల్లీ
దిల్లీ పంజాబీ వ్యాపార వర్గానికి చెందిన 85 ఏళ్ల ప్రొఫెసర్ రియాజ్ ఉమర్, గతంలో జాకీర్ హుస్సేన్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశారు.
తన దగ్గరి బంధువులు కొందరు సరిహద్దు దాటి వెళ్లారని, వాళ్లలో ఎస్ఎం అబ్దుల్లా కూడా ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయినప్పటికీ, భారత-పాకిస్తాన్ పంజాబీ వ్యాపార వర్గాలు ఇప్పటికీ సన్నిహితంగానే ఉన్నాయి. పాకిస్తాన్ వెళ్లిన వాళ్లు తమ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. వాళ్లు నిజమైన వ్యాపారులు, వాళ్లు ఉద్యోగాలు చేయరు.
వాళ్లు కరాచీలో తమ నివాసం కోసం దిల్లీ కాలనీని నిర్మించుకున్నారు. క్లిఫ్టన్ ప్రాంతంలో దిల్లీ పంజాబీ సౌదాగరన్ సొసైటీ, దిల్లీ మర్కంటైల్ సొసైటీని స్థాపించారు.
వాటిలో పంజాబీ వ్యాపార కుటుంబాల తర్వాతి తరాల వాళ్లు నివసిస్తున్నారు. వాటిలోదిల్లీ నుంచి వెళ్లిన పంజాబీ ముస్లింలకు మాత్రమే సభ్యత్వం లభిస్తుంది.
దిల్లీకి 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీలో, 70 ఏళ్ల తర్వాతా వాళ్లు దిల్లీ వాసులుగానే ఉన్నారు. వాళ్లు కరాచీలోని బర్న్ రోడ్‌లో దిల్లీ పంజాబీ సౌదాగరన్ ఆసుపత్రినీ నిర్మించారు.
సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో దిల్లీ కళాశాల కూడా ఉంది. అక్కడ స్థిరపడిన దిల్లీ వాళ్లంతా దీనిని స్థాపించారు.

ఫొటో సోర్స్, VIVEK SHUKLA
పాకిస్తాన్ వెళ్లే వాళ్లను అభ్యర్థించిన నేతలు
విభజన తర్వాత, లోధి కాలనీ రైల్వే స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాలా దేశ్‌బంధు గుప్తా, మీర్ ముస్తాక్ అహ్మద్, లాలా రూప్ నారాయణ్, చౌదరి బ్రహ్మ ప్రకాష్, సరళా శర్మ వంటి వాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లే ఉద్దేశాన్ని విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో పాకిస్తాన్‌కు వెళ్తున్న ప్రజలను అభ్యర్థించేవాళ్లు.
వాళ్ల అభ్యర్థన తర్వాత, కొంతమంది రైల్వే స్టేషన్ నుంచి తిరిగి వచ్చేవాళ్లు. కానీ చాలా మంది వెళ్లిపోయేవాళ్లు.
మీర్ ముస్తాక్ అహ్మద్‌ను చాలా శక్తివంతమైన వక్తగా పరిగణించేవాళ్లు. ఆయన దిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌గా పని చేశారు. కరోల్‌బాగ్, దర్యాగంజ్‌లో జరిగిన అనేక సభల్లో మహ్మద్ అలీ జిన్నాకు వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, VIVEK SHUKLA
లోధి కాలనీ రైల్వే స్టేషన్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
లోధి కాలనీ రైల్వే స్టేషన్ బయట దాని చరిత్ర గురించి ఏమీ రాయలేదు. దేశ విభజన అనంతరం, ఇంత పెద్ద పనికి ఈ చిన్న స్టేషన్‌ను ఎవరు, ఎందుకు ఎంచుకున్నారో ఇప్పటికీ తెలీదు.
అయితే, పాకిస్తాన్‌కు వెళ్లే ముస్లింలను ఉంచిన రెండు ప్రాంతాలు లోధీ కాలనీ స్టేషన్‌కు దగ్గరగా ఉండడం వల్లే ఈ స్టేషన్‌ను ఇంత ముఖ్యమైన పని కోసం ఎంచుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.
పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్లు పాత దిల్లీ రైల్వే స్టేషన్‌లో దిగేవాళ్లు. సరిహద్దు దాటి వచ్చేవాళ్లని పాకిస్తాన్‌కు వెళ్లే వాళ్లకు దూరంగా ఉంచాలని రైల్వే శాఖ భావించడమే దీనికి కారణం కావచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














