అచ్యుతాపురం సెజ్ ప్రమాదం: ‘‘మావాళ్ళు బతికున్నారో చనిపోయారో తెలియడంలేదు, బాడీలనూ చూపించడంలేదు’’- బాధిత కుటుంబసభ్యుల కన్నీటి వేదన

అచ్యుతాపురం సెజ్‌లోని 'ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్'లో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగిన భారీ ప్రమాదంలో 17 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
నిన్నటి నుంచి తమ వారి కోసం ఎదురుచూస్తున్న బాధితుల కుటుంబీకులు కంపెనీ గేటు వద్ద కూర్చొని హృదయ విదారకంగా విలపిస్తున్నారు. కనీసం తమ వారి మృతదేహాలను చూపించాలంటూ రోదిస్తున్నారు.
ఏదైనా సమాచారం తెలుస్తుందనే ఆశతో కంపెనీ వద్దకు వచ్చినట్లు బీబీసీ తెలుగుతో బాధితుల కుటుంబ సభ్యులు చెప్పారు.
తమవారు అసలు బతికే ఉన్నారా? లేక చనిపోయారా? లేదా ఏదైనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా? ఏ ఆసుపత్రికి తరలించారో చెప్పాలని, మృతదేహాల్ని తమకు అప్పగించాలంటూ వారంతా కోరుతున్నారు.
తొలుత ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించినా, సాల్వెంట్ లీకేజీ వల్ల ప్రమాదం సంభవించినట్టు హోం మంత్రి అనిత తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా పూర్తయ్యాయని ఆమె చెప్పారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, స్వయంగా తాను ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని చెప్పారు
ఎస్ఈజెడ్ లోని చాలా కంపెనీలకు సేఫ్టీ ఆడిటింగ్ జరగడం లేదని, సేఫ్టీ ఆడిటింగ్ చేస్తే అసలు ఈ కంపెనీ యాజమాన్యాలు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు.


‘‘నిన్న అంబులెన్స్‌లో తీసుకెళ్లారు, ఇప్పటివరకు జాడ లేదు’’
‘‘నిన్న ఉదయం బాక్స్ కడితే బాక్స్ తీసుకొని వచ్చాడు. నిన్న మధ్నాహ్నం రెండున్నరకు ప్రమాదం జరిగిందని తెలియగానే మేం ఇక్కడికి వచ్చాం. అంబులెన్స్‌లో వేసుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటివరకు జాడ లేదు, ఆచూకీ లేదు. మనిషి గురించి ఏమీ తెలియట్లేదు. ఏం జరిగిందో తెలియక నేనూ, పిల్లలు కుమిలిపోతున్నాం.
ఈ ప్రమాదం జరిగినట్లుగా కంపెనీ వాళ్లు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఏమీ చెప్పలేదు. ఆయన పేరు చిన్నారావు. ఇక్కడ ఆరేళ్లుగా పెయింటర్‌గా పని చేస్తున్నారు. నేను చాలా మందికి ఫోన్ చేశాను. ఎవరూ ఫోన్ ఎత్తలేదు.
మా బావ కూడా ఇదే కంపెనీలో పని చేస్తారు. ఆయనకు ఫోన్ చేసి అడిగితే, ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయనను ఇప్పటివరకు మేమెవ్వరం చూడలేదు. నాకు ఒంట్లో బాగుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరూ పోషిస్తారు? ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అని చిన్నారావు భార్య లోవమ్మ బీబీసీ తెలుగుకు చెప్పారు.

‘‘మా బావ బతికున్నారో, చనిపోయారో’’
తమ వారి గురించి ఏమైందో తెలియక, వారి గురించి ఎవర్నీ అడగాలో తెలియక బాధితుల కుటుంబ సభ్యులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ ఘటనలో వేగి సన్యాసిరావు కూడా చనిపోయారు. ఆయన కోసం కుటుంబసభ్యులంతా ఎదురు చూస్తున్నారు. ఆయన చనిపోయినట్లుగా భావిస్తున్నామని ఆయన మరదలు దేవి అన్నారు.
‘‘ఇంకా ఏమీ తెలియలేదు, చనిపోయారని మేం అనుకుంటున్నాం. మా బావగారు సన్యాసిరావును గుర్తించడం కోసం మావాళ్లు కేజీహెచ్‌కు వెళ్లారు. ఆయన చనిపోయారా?లేదా? అనేది కూడా మాకు ఇంకా స్పష్టంగా తెలియదు.
కేజీహెచ్‌లో మృతదేహాలు ఉన్నాయని తెలిసి మా వాళ్లు అక్కడికి వెళ్లారు. లోపల ఉన్నారేమో అని మేం ఇక్కడికి వచ్చాం. మృతదేహాలన్నింటినీ ఆసుపత్రులకు పంపించేశామని చెబుతున్నారు. మేం చాలా ఆసుపత్రులు తిరిగాం. ఏ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నవారిలో మా బావగారి పేరు లేదు’’ అని దేవి వివరించారు.

‘‘మృతుల్లో మా నాన్న పేరుంది, కానీ బాడీని చూపించడంలేదు’’
‘‘సన్యాసిరావు మా నాన్నగారు. ప్రమాదం జరిగిందని మాత్రమే మాకు చెప్పారు. మా నాన్న ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారనే వివరాలేమీ మాకు ఎవరూ చెప్పలేదు.
ఏ ఆసుపత్రికెళ్లినా మా నాన్న కనిపించలేదు. చనిపోయినవారి జాబితాలో మా నాన్న పేరుంది. కానీ, ఆయన బాడీని మాకు చూపించలేదు.
ఆయనకు ఏమైందో తెలియదు. ఎవరినైనా అడుగుదామంటే మా దగ్గరకు ఎవరూ రాలేదు. ఏమీ తెలియట్లేదు. ఎవర్నీ అడగాలో కూడా మాకు తెలియదు. నిన్నటి నుంచి ఇలాగే ఏడుస్తూ కూర్చున్నాం’’ అని సన్యాసిరావు కూతురు వాసంతి విలపించారు.

‘అన్నయ్యను చివరి చూపు చూడలేకపోయా’
ఎంతో దూరం నుంచి అన్నయ్యకు రాఖీ కట్టాలని వచ్చాను. కానీ ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయా. తరువాత రోజు నేను నిద్రలేచే సరికే అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా అన్నయ్యను పొద్దున్నే చూడలేకపోయా అని ప్రమాదంలో మృతి చెందిన టెక్నిషియన్ వెంకటసాయి చెల్లెలు కిరణ్మయి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
‘‘రాఖీ కట్టడానికి అంత దూరం నుంచి వచ్చాను. ఆ రోజురాత్రి 9.30గంటలైపోయింది. దీంతో రాఖీ కట్టాకా నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. నెక్ట్స్ డే ఆఫీసుకు వెళ్ళిపోయాడు.రాత్రి ఆఫీసు నుంచి వచ్చాక కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు.తరువాత నిద్రపోయాడు.నేను ఉదయం 8గంటలకు నిద్రలేచే సరికే మా అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఒకసారి మొహం కూడా చూడలేదు. ఎవరి నుంచి ఎటువంటి అధికారిక సమాచారమూ లేదు. వీళ్ళు, వాళ్ళు చెప్పడమే తప్ప మా అన్నయ్య ఏమయ్యాడనే విషయం మాకు యాజమాన్యం నుంచి తెలియలేదు. ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా వారు స్పందించలేదు.’’ అని ఆమె చెప్పారు.
నా కొడుకును చూడకుండా ఇంటికి వెళ్ళను అని వెంకటసాయి తల్లి చెప్పారు.
దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు. నిన్నటి నుంచే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టాం ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అని ఆమె భోరుమన్నారు.
మృతుల వివరాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














