మహారాష్ట్ర: బదలాపూర్‌లో ఏం జరిగింది, వేలాదిమంది ప్రజలు రైల్వేస్టేషన్‌ను ఎందుకు ముట్టడించారు?

థానే జిల్లాలోని బదలాపూర్ పట్టణంలో లైంగిక వేధింపుల ఘటనపై నిరసన

ఫొటో సోర్స్, Rahul Ransubhe/BBC

ఫొటో క్యాప్షన్, చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం
    • రచయిత, దీపాలీ జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘కొన్నిగంటల్లో ముఖ్యమంత్రి మారిపోతారు. కొన్నిగంటల్లో ప్రభుత్వం కూడా మారిపోతుంది. కానీ మహిళల భద్రతకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. కేవలం మహిళలపై జరిగే అకృత్యాల విషయంలో మాత్రమే కేసుల నమోదు వెంటనే జరగదు. బదలాపూర్ ఘటనలో తల్లిదండ్రులను పోలీసుస్టేషన్‌లో గంటలకొద్దీ కూర్చోపెట్టారు. ప్రభుత్వం, అధికారులు మహిళల భద్రత విషయాన్ని పట్టించుకోవడం లేదు’’ అని రైలుపట్టాలపై నిరసనకు దిగిన మహిళల్లో ఒకరు బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

మహారాష్ట్ర థానే జిల్లా బదలాపూర్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం (ఆగస్టు20)నాడు ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ నిరసనకు దిగారు. రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. రైలుపట్టాలపై ఆందోళనకు దిగడంతో కొన్ని గంటల పాటు రైళ్లకు అంతరాయం కలిగింది.

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, బదలాపూర్ ఘటన ప్రజలలో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన ప్రజలను అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

నిందితునికి ఉరిశిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రజాగ్రహాన్ని చూసిన పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి చీకటి పడేటప్పుడు పోలీసులు లాఠీలను ఉపయోగించి రైలుపట్టాలపై ఉన్న నిరసనకారులను చెదరగొట్టారు.

ఆ సమయంలో పోలీసులు, నిరసనకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకున్నారు. మరోపక్క ఈ ఘటనకు బాధ్యులైన వారిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బదలాపూర్‌లో ఘటన

ఫొటో సోర్స్, BBC/ Rahul Ransubhe

ఫొటో క్యాప్షన్, చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా ఆందోళనకు దిగిన బదలాపూర్ ప్రజలు

అసలేం జరిగింది?

బదలాపూర్‌లోని ఒక ప్రముఖ పాఠశాలలో 4 ఏళ్లు, 6 ఏళ్ల చిన్నారులపై స్కూల్‌లో పనిచేసే స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఇద్దరు బాలికలు పరీక్షల కోసమని ఆగస్టు 13న పాఠశాలకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 16న ఈ ఇద్దరు బాలికల్లో ఒకరు తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆగస్టు 17న నిందితుడిని అరెస్ట్ చేశారు.

స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్‌ను, క్లాస్ టీచర్‌ను, ఒక మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేసింది.

ఇద్దరు బాలికల్లో ఒకరు స్కూల్‌కి వెళ్లేందుకు నిరాకరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసిన 10 నుంచి 11 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు బాలికల తల్లిదండ్రులు తెలిపారని ఇండియా టుడే రిపోర్టు చేసింది.

మంగళవారం ఈ ఘటనపై ‘బదలాపూర్ బంద్’కు పిలుపునిచ్చారు ఆ ప్రాంత ప్రజలు. వేలాది మంది ప్రజలు స్కూల్ ముందు నిరసనకు దిగారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

తరువాత రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. రైలుపట్టాలపైన నిరసనకు దిగారు. పోలీసులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, రైలు పట్టాలపై నుంచి తొలగేందుకు నిరసనకారులు ఒప్పుకోలేదు.

ఈ ఘటనలో తొలుత చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన బదలాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని థానే పోలీసు కమిషనర్‌ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.

థానేలో నిరసనలు

ఫొటో సోర్స్, Rahul Ransubhe/BBC

ఫొటో క్యాప్షన్, నిందితుడికి తక్షణం ఉరిశిక్ష విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు

‘పిల్లలను బడికి పంపాలంటే భయపడుతున్నాం’

స్కూల్లో లైంగిక వేధింపుల విషయమై ఆగస్టు 16న బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్‌కు వెళితే కేసు నమోదు చేసేందుకు వారిని 12గంటల సేపు పోలీసుస్టేషన్‌లోనే కూర్చోపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిందితుడిని తక్షణమే ఉరితీయాలని మహిళలు, ఇతర ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాలుపంచుకున్న ఓ మహిళ బీబీసీతో మాట్లాడుతూ ‘‘పెద్దనోట్ల రద్దు కొన్ని గంటల్లో జరిగిపోయింది. ప్రభుత్వం పెద్దపెద్ద చట్టాలు తెచ్చింది. కానీ మహిళల భద్రతను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ఘటనల విషయంలో నిందితుడికి మరణ శిక్ష పడేలా చట్టాలు ఉండాలి. 4, 5 ఏళ్ళ చిన్నారులపై లైంగిక వేధింపులకు దిగాడంటే నిందితుడికి చట్టం అంటే ఏమాత్రం భయంలేదని అర్ధమవుతోంది’’ అని చెప్పారు.

‘‘పిల్లలను బడికి పంపాలంటే భయపడుతున్నాం. ప్రభుత్వం పిల్లల భద్రతకు పూచీ ఇవ్వగలదా’’ అని మరొకరు ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ’

బదలాపూర్ ఘటనపై మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్‌తో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిందితునికి త్వరితగతిన శిక్షపడేందుకు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలన్నారు. ఒకవేళ పాఠశాల యాజమాన్యంలో లోపముంటే, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైలు పట్టాలపై నిరసన తెలుపుతున్న వారు శాంతియుతంగా ఉండాలని ఏక్‌నాథ్ షిండే కోరారు.

బదలాపూర్ ఘటనపై విచారణకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్తి సింగ్‌ను నియమిస్తూ దేవేంద్ర ఫడణవీస్ ఆదేశాలు జారీ చేశారు. చార్జ్‌షీటు దాఖలు చేసిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితీ తట్కరే స్పందించారు. ‘‘బదలాపూర్‌ ఘటన హేయమైంది, ఖండించదగినది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారించేలా ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు.

‘‘మహిళా, శిశు సంక్షేమ శాఖ తరఫున బాలల హక్కుల సంరక్షణ కమిషన్ నుంచి రిపోర్టు తెప్పించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యా శాఖను మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.

ఈ ఘటనపై ఇప్పటి వరకు చేసిన విచారణపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ కోరింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)