మహిళలు రాత్రివేళ మగవారు తిరిగినంత స్వేచ్ఛగా ఇంకా ఎందుకు తిరగలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘రాత్రి 11 గంటల తరువాత అలా బయటకు వెళ్ళి కాసేపు తిరిగివద్దాం’ అని నా ఫ్రెండ్ ఒకతను అడిగాడు. ఆ మాటలు విని అతని భార్య, నేనూ ఆశ్చర్యపోయాం. అతనికి ఏమైనా అయ్యిందా అనుకున్నాం. దిల్లీ లాంటి నగరంలో బాగా పొద్దుపోయాక బయట తిరగడం అంత మంచి ఐడియా కాదు.
నా ఇల్లు, నా స్నేహితుడి ఇల్లు ఒకే వీధిలో ఎదురెదురుగా ఉన్నా, రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్ళే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు. పైగా నేను సింగిల్‌గా ఉంటున్నాను.
నా స్నేహితుడి మాటలు విన్నాక నేను జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్ని మిస్ చేసుకున్నానో ఆలోచించాను.
ఒకసారి నా స్నేహ బృందంలోని మగ స్నేహితులు ముంబయి టూర్‌కు ప్లాన్ చేశారు. ఓ చలికాలపు మధ్యాహ్నం వారు నాసిక్ నుంచి ముంబయికి వెళ్ళారు. వారు అక్కడ బాగా తిరిగారు...తిన్నారు. మెరైన్ డ్రైవ్‌లో కూర్చుని సముద్రంలో ఎగసిపడే అలలను చూస్తూ ఎంజాయ్ చేశారు.
ఇదొక్కటే కాదు, మరునాడు సూర్యోదయ దృశ్యాన్నీ చూశారు. తరువాత ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయారు. .
ఈ ట్రిప్‌కు వెళ్ళి ఏళ్లు గడిచిపోయినా, ఏదైనా ప్రయాణం విషయం చర్చకు వస్తే చాలు ఇప్పటికీ దీనికి గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదెంతటి చక్కటి అనుభవమో వారు గుర్తుపెట్టుకున్నారు.
కానీ, ఆ గ్రూపులోని ఆడపిల్లలమైన మేం చెప్పడానికి ఏమీ లేదు. మేం అందులో భాగం కాదు. ఆడపిల్లలు ఊరు కాని ఊరులో ఓ రోజు రాత్రంతా బయట ఎలా తిరుగుతారు? ఎలా తిరగ్గలుగుతారు?


ఫొటో సోర్స్, Getty Images
‘మగవారి అనుభవాలు వేరు’
నా ఉద్యోగ జీవితం మొదలైనప్పటి నుంచి రాత్రికి సంబంధించి నా మేల్ ఫ్రెండ్స్ ఎన్నో అనుభవాలు చెప్పేవారు. కొందరు రాత్రంతా సిటీలో చక్కర్లు కొడతారు. నిశ్శబ్దంలో నగరాన్ని చూడటంలోని అనుభూతి వేరని వారు అనేవాళ్లు.
మరికొంతమంది రాత్రివేళ చుక్కలను, చందమామను చూడటానికి ఇష్టపడతామని చెబుతారు.
రాత్రికి సంబంధించి మగవారికి అనేక అనుభవాలు ఉంటాయి. బ్రేకప్ తరువాత కొంతమంది నగరం చుట్టూ తిరుగుతారు. కొంతమంది గంగ దగ్గరకు వెళతారు (నాసిక్‌లో నివసించే మేం గోదావరిని గంగ అని పిలుస్తాం). జీవితంలో బాధాకరమైన సందర్భాలలో రాత్రంతా అక్కడే కూర్చుంటారు.
రాత్రిపూటకు సంబంధించిన మగవాళ్ల అనుభవాలకు, ఆడవాళ్ల అనుభవాలకు తేడా ఉంది. మహిళలకు రాత్రి అంటే భయం కలిగించే అంశం.
నా స్నేహితుడి ఇంట్లో ఈ విషయంపై చర్చ మొదలైంది. అతని భార్య, నేను వేరు వేరు రాష్ట్రాలలోని చిన్న పట్టణాల నుంచి ఉద్యోగం కోసం దిల్లీకి వచ్చాం.
దిల్లీలో నాకు ఎదురైన అనుభవం ఇప్పటికీ నాకు గుర్తుంది. మయూర్ విహార్ వైపు అంటే తూర్పు దిల్లీకి వెళుతూ యమునా నదిని దాటుతున్న సందర్భంలో ఓ నిర్జనప్రదేశం మీదుగా వచ్చాం. అక్కడ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ లేదు. రోడ్డుపక్కన దట్టంగా పెరిగిన పొదలు, నిశ్శబ్దం అలుముకున్న వాతావరణం భయపెట్టాయి.
క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంతం మీదుగా వెళ్ళడం భయం గొలుపుతుంది. నేను ఎప్పుడూ ఈ రోడ్డుపై నడుస్తున్నా, ఎవరైనా నన్ను ఈ బ్రిడ్జిపై నుంచి తోసివేస్తే, ఎవరికీ ఎప్పటికీ తెలియదు కదా అని అనుకుంటూ ఉంటాను.
చీకటిపడ్డాక ఎలాంటి విషయాలు మమ్మల్ని భయపెడతాయో మగవాళ్లు కనీసం ఊహించలేరు. చీకటిపడ్డాక ఆఫీసులో పనిచేయాలంటే భయపడతాం. మెట్రోలో లేట్ నైట్ ప్రయాణించాలంటే భయపడతాం. రాత్రి 10గంటల తరువాత లిఫ్ట్ ఉపయోగించాలంటే భయపడతాం.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రి అంటే భయం
రాత్రికి సంబంధించిన నా జ్ఞాపకాలన్నీ భయంతో ముడిపడినవే.
నా స్నేహితురాలు ఓసారి మాటల మధ్యలో తాను ఎవరైనా అపరిచితుడితో, కొత్త ప్రదేశంలో మాట్లాడుతూ ఉంటే తనను రక్షించుకోవడానికి పనికివచ్చే వస్తువులు చుట్టుపక్కలా ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటానని చెప్పిన విషయం నాకు గుర్తుంది.
రాత్రి మీద మహిళలకు ఎటువంటి హక్కు లేదని మా అనుభవాలు చెబుతున్నాయి. అందుకే కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగాక ‘రీ క్లెయిమ్ ది నైట్’ ఉద్యమం పతాక శీర్షికలుగా మారింది.
రాత్రిపూట కూడా మహిళలకు హక్కులుంటాయని, ఆ సమయంలో వారి భద్రతకు పూచీ పడాలన్నదే ఆ ఉద్యమ లక్ష్యం.
కోల్‌కతాలో అర్ధరాత్రి మహిళలు వీధుల్లోకి వచ్చినప్పుడు దేశం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటోంది.
77 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా రాత్రిపూట మహిళ హాయిగా నడిచి, భద్రంగా ఉండే పరిస్థితిలేదు. అలాంటప్పుడు ఏ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి?
అసలు పగటిపూట మహిళలు బయటకు రాగలిగితే అప్పుడు రాత్రిపూట గురించి ఆలోచించవచ్చు. పగటిపూట బయటకు రావాలన్నా దానికో కారణం ఉండాలి. ఏదో పార్కులోనో, రోడ్డుపక్కనో వేయించిన పల్లీలు తింటూ అక్కడి రద్దీని ఎంజాయ్ చేస్తున్న మహిళలను ఎంతమందిని చూసి ఉంటారు? కానీ అన్నిచోట్లా మగవాళ్లు అలా కనిపిస్తారు.
మహిళలు బయటకు వెళ్ళాలంటే కారణం ఉండాలి.
మీరు ఆఫీసు నుంచి వస్తున్నారా?
స్కూల్ నుంచి మీ పిల్లలను తీసుకురావడానికి వెళుతున్నారా?
ఏదైనా కొనడానికి బయటకు వెళుతున్నారా?
హాస్పిటల్‌కు వెళుతున్నారా?
....ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు.
త్వరగా పని ముగించుకుని వెంటనే ఇల్లు చేరుకోవాలని చెబుతుంటారు. వీధుల్లో నడిచేటప్పుడు కూడా మహిళలు ఇబ్బంది పడుతుంటారు.
ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్ళడమో, లేదంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తలవంచుకుని వెళుతుంటారు. కనీసం కన్నెత్తి ఎవరినీ చూడలేని పరిస్థితి.

ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలో ఉద్యమం
‘‘అంతటా భయకంపిత వాతావరణమే ఉంది’’ అని అన్నారు నేహాసింగ్. పదేళ్ల కిందట ముంబయిలో మొదలుపెట్టిన ‘లాయిటర్ మూమెంట్ ఫర్ ఉమెన్’ను ప్రారంభించిన వారిలో ఆమె కూడా ఒకరు.
నేహాసింగ్, ఆమె సహచరులు 2014లో ముంబయిలో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. బహిరంగ ప్రదేశాలలో మహిళలకు కూడా పురుషులతో సమానంగా అన్ని హక్కులు ఉంటాయని, రాత్రివేళ బయట తిరిగేందుకు పురుషులకు ఎంత హక్కుందో మహిళలకూ అంతే హక్కుందని వీరు అంటారు.
గడిచిన పదేళ్లుగా ఆమె ఇతర మహిళలతో కలిసి ముంబయి వీధుల్లో తిరుగుతున్నారు.
‘‘మేం అక్కడికి, ఇక్కడికి తిరుగుతుంటాం. మాట్లాడుకుంటాం, నవ్వుతాం. అలసి పోయినప్పుడు రోడ్డుపక్కన కూర్చుంటాం. కొన్నిసార్లు మాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పోలీసులు తరచూ మమ్మల్ని ఆపుతుంటారు’’
‘‘వాళ్లు మమ్మల్ని సెక్స్‌వర్కర్స్ అనుకుంటారు. చాలాసేపు విచారిస్తారు. మా గుర్తింపు కార్డులు చూపాలి. ఏ పనీ లేనప్పుడు రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నారు అని వేసిన ప్రశ్నే పదేపదే వేస్తారు. ’’ అన్నారు నేహ.
రాత్రిపూట బయట ఉండే మహిళా వ్యవస్థను సమాజం, ప్రజలు అర్ధం చేసుకోవడానికే నేహాసింగ్, ఆమె స్నేహితురాళ్లు ఇలా చేస్తారు.
మరి గడిచిన పదేళ్లలో ఏమైనా మారిందా?
ఈ ప్రశ్న అడిగినప్పుడు ‘‘మగవారి ప్రవర్తన, సమాజం తీరు, లేదంటే వ్యవస్థ దృక్పథంలో ఏమాత్రం మార్పు రాలేదు’’ అని నేహాసింగ్ చెప్పారు.
‘‘నీ రక్షణ నీ బాధ్యతే అని మహిళలకు నూరిపోశారు. నీకు ఏదైనా చెడు జరిగితే, అది నీ తప్పే. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలాంటి దుస్తులు వేసుకున్నావు, ఇతరులను రెచ్చగొట్టేలా ప్రవర్తించావా అని ప్రశ్నిస్తారు’’ అని నేహా సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, X
వివాదాస్పద మార్గదర్శకాలు
కోల్‌కతా ఘటన తరువాత అసోంలోని సిల్‌చార్ ఆస్పత్రి మహిళా సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేసింది.
‘‘చీకటి ప్రదేశాలకు, ఒంటరి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. అత్యవసరమైతే తప్ప రాత్రివేళ హాస్టల్, ఇతర వసతి గృహాల నుంచి బయటకు రావొద్దు. రాత్రిపూట బయటకు వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. అపరిచితులతో సంబంధాలు పెట్టుకోవద్దు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా, సంయమనంతో ఉండాలి. తద్వారా ఎవరి దృష్టి మీవైపు మళ్లదు.’’ అని అందులో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలన్నింటినీ మహిళా ఉద్యోగులు పాటించాలి. కానీ మహిళా ఉద్యోగులతో సరిగా ప్రవర్తించాలని, వారు అభద్రతకు గురికాకుండా చూసుకోవాలని మగ ఉద్యోగులకు ఎటువంటి సూచనలూ లేవు
పురుషులు మహిళలను లైంగికంగా వేధించకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు?
దీనిపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు పెరగడంతో, ఆస్పత్రి యాజమాన్యం ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంది.
మరోపక్క లైంగిక వేధింపు వార్తలలో మీడియా వాడుతున్న భాషపై మహిళా హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మనం మహిళ అత్యాచారానికి గురైందని చెబుతాం. కానీ ఓ పురుషుడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పం.
బహుశా జరిగింది తమ తప్పు కాదని మహిళలు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు. ఎవరో చేసిన నేరానికి తాము బాధ్యులమనే విషయాన్ని వారు అంగీకరించడం లేదు.
‘‘గడిచిన పదేళ్లలో ఓ మార్పు కనిపిస్తోంది. తమపై జరిగే లైంగిక నేరాలకు తాము బాధ్యులం కాదని మహిళలు అర్ధం చేసుకుంటున్నారు. అది ఎవరో చేసిన నేరం. దీనికి తాము బాధ్యలం కాము. తమ రక్షణ కోసం సమాజం, ప్రభుత్వాలు ఏం చేశాయని వారు అడుగుతున్నారు.’’ అని నేహాసింగ్ చెప్పారు.
మహిళలు ప్రశ్నలు వేస్తున్నారు కానీ, భయాలు అలాగే ఉన్నాయంటారు నేహాసింగ్. ‘‘ఓపక్క 2024లో ఉన్నాం, మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ ఉండాలంటారు. మరోపక్క ప్రతిరోజూ మహిళలు భయం నీడలోనే బతుకుతున్నారు’’ అని ఆమె అన్నారు.
‘‘కోల్‌కతా ఘటనలో సెమినార్ హాల్‌లో ఆమె ఒక్కతే ఎందుకు నిద్రపోయిందని అడుగుతున్నారు. ఇది ఎలాంటి స్వాతంత్య్రం, ఎలాంటి సమానత్వం?’’ అని నేహా ప్రశ్నించారు.
‘‘పనికోసం, సరదా కోసం, నక్షత్రాలను చూడటానికి, తినడానికి, కారణమేదైనా నాతో సహా మహిళలందరూ రాత్రివేళ తిరగడానికి స్వేచ్ఛ కావాలి, అదీ రక్షణకు హామీ ఇచ్చే స్వేచ్ఛ కావాలి.’’ అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల స్థానం ఇంటికే పరిమితమా?
మహిళల స్థానం ఇల్లే అనే మైండ్‌సెట్ మారడం లేదు. మహిళలు గడపదాటకూడదనే ఆలోచనలు ఇంకా మారలేదు. ఈరోజుకీ మహిళలు ఇంట్లోనే భద్రంగా ఉంటారని చెబుతారు.
‘‘కానీ వాస్తవం ఏంటంటే చాలా లైంగిక వేధింపుల కేసులు ఇళ్లలోనే జరుగుతాయి. ఇలాంటి నేరాలు చేసేవారు బంధువులు, టీచర్లు, లేదంటే పరిచయం ఉన్నవారే. కానీ ఇంటి బయట అంతా సురక్షితం కాదని ఎలా చెబుతారు?’’ అని నేహా ప్రశ్నించారు.
నేహా, ఆమె సహచరులు రాత్రివేళ బయటకు వెళ్ళినప్పుడు, వాళ్లను ఫాలో అయ్యే వారు, వారిని కామెంట్ చేసేవారిలో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మగవారే ఎక్కువ. అందులో అందరూ నేరస్వభావం ఉన్నవారు కాదు. కానీ వారు రాత్రివేళ మహిళను చూడగానే వేధిస్తారు.
‘‘అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే మగవారిని మేం ఆపుతాం. వారితో మాట్లాడుతాం. మీలాగే మేం కూడా బయటకు వచ్చామని వారికి చెబుతాం. వారితో మాట్లాడిన తరువాత ఈ వ్యక్తులు రాత్రివేళ మహిళలు బయట తిరగడం ఇంత వరకూ చూడకపోవడం వల్ల రాత్రివేళ కనిపించే మహిళలతో ఎలా వ్యవహరించాలో వారికి తెలియదు. అందుకే వారు ఈల వేస్తారు, గోల చేస్తారు, మా చుట్టూ చేరతారు’’ అని నేహా చెప్పారు.
కానీ వేధించే ప్రతి వ్యక్తితో మాట్లాడే ధైర్యం ప్రతి మహిళకు ఉండదు. ఇదొక్కటే కాదు, ఒకవేళ ఆ మహిళ అతనితో మాట్లాడితే అతను ఏదైనా హాని తలపెట్టడనే గ్యారంటీ కూడా ఏమీ లేదు.
లైంగిక వేధింపుల సంఘటనలు జరిగిన ప్రతిసారీ మహిళలు వీధుల్లోకి వస్తున్నారు. కానీ ఇదేమీ ఫలితం ఇవ్వదు.
రాత్రివేళల్లో బహిరంగ ప్రదేశాలలో తిరగడం, భద్రంగా ఉండటమనే హక్కును సహజమైన విషయంగా మార్చాలి.
రాత్రిపూట బహిరంగ ప్రదేశాల్లో నడవడానికి, సురక్షితంగా ఉండే హక్కును సహజమైనదిగా చేయాలంటే ఆ సమయంలో ఆ ప్రదేశాలలో మహిళల ఉనికిని సాధారణీకరించాలి. అప్పుడే ప్రభుత్వంలో, సమాజంలో, వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది.
ఇది జరగకపోతే, నిర్మలమైన రాత్రి ఆకాశంలో చంద్రుడిని చూడాలని, చల్ల గాలిని అనుభవించాలని లేదా అర్ధరాత్రి ఖాళీ వీధుల్లో ఫుట్‌బాల్ ఆడాలనే మహిళల కలలు ఎప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














