‘నా కుటుంబం నా కళ్ల ముందే చనిపోయింది’ మియన్మార్ మారణకాండలో భయానక కథలు

మియన్మార్, బంగ్లాదేశ్, రోహింజ్యా ముస్లింలు, శరణార్థులు

ఫొటో సోర్స్, BBC/Aamir Peerzada

ఫొటో క్యాప్షన్, నది ఒడ్డున జరిగిన దాడుల్లో కుటుంబాన్ని కోల్పోయిన నిసార్
    • రచయిత, బంగ్లాదేశ్-మియన్మార్ సరిహద్దుల నుంచి యోగితా లిమయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు

తాము సురక్షితంగానే ఉంటామని ఫయాజ్, ఆయన భార్య భావిస్తున్న సమయంలోనే బాంబు దాడులు మొదలయ్యాయి. “మేం పడవలోకి ఎక్కేటప్పుడు వాళ్లు మాపై ఒకదాని తర్వాత ఒకటి బాంబులు వేస్తూనే ఉన్నారు”

2024 ఆగస్టు 5న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రాంతం అంతా అరుపులు, కేకలతో నిండిపోయింది. వేల మంది రోహింజ్యాలు భయంతో పరుగులు తీస్తూ మౌంగ్‌డా పట్టణానికి సమీపంలో ఉన్న నఫ్ నది వద్దకు చేరుకున్నారని ఫయాజ్ చెప్పారు.

గతంలో ఈ గ్రామాలపై దాడులు జరిగినప్పుడు ఇక్కడ ఉండే ఫయాజ్ సహా వందల కుటుంబాలకు సురక్షితంగా ఉండటానికి ఏకైక మార్గం పశ్చిమ మియన్మార్ నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకోవడమే.

తాము ఎన్ని వస్తువులు తీసుకోగలమో అన్నింటినీ బ్యాగుల్లో నింపి ఫయాజ్ వాటిని మోసుకు వస్తున్నారు. ఆయన భార్య ఆరేళ్ల కుమార్తెను మోస్తున్నారు. పెద్ద పిల్లలు వారితో పరుగులు తీస్తున్నారు. ఫయాజ్ మరదలు, ఫయాజ్ దంపతుల ఎనిమిది నెలల కుమారుడిని మోస్తూ వారి కంటే ముందు వెళ్తున్నారు.

మొదటి బాంబు పేలడంతో ఆమె మరదలు అక్కడికక్కడే చనిపోయారు. ఆమె చేతిలో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడింది.

“వాడిని పట్టుకునేందుకు నేను పరుగెత్తాను. అయితే బాంబుల మోత ఆగే వరకు మేం అక్కడే ఆగిపోవడంతో అప్పటికే వాడు చనిపోయాడు”అని ఫయాజ్ చెప్పారు.

ఇక తల్లి, భార్య, కూతురు, సోదరితో కలిసి పారిపోయేందుకు నిసార్ సాయంత్రం ఐదు గంటలకు నది ఒడ్డుకు వచ్చారు.

“మా తల మీద డ్రోన్లు ఎగరడాన్ని చూశాం. ఆ తర్వాత పెద్దగా పేలుడు శబ్దం వినిపించింది. మేమంతా నేల మీద పడుకున్నాం. వాళ్లు డ్రోన్లను ఉపయోగించి మా మీద బాంబులు వేశారు” అని నిసార్ గుర్తు చేసుకున్నారు.

నిసార్ కుటుంబంలో ఆయనొక్కరే బతికారు.

ఫయాజ్, ఆయన భార్య, కుమార్తెలు బాంబు దాడుల నుంచి తప్పించుకుని నది దాటారు. ఆయన ఎంతగా బతిమాలినప్పటికీ చనిపోయిన కుమారుడి మృతదేహాన్ని పడవలో తీసుకువచ్చేందుకు పడవ యజమాని ఒప్పుకోలేదు.

“చనిపోయిన వారిని తీసుకురావడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఆ పడవ యజమాని చెప్పారు. దీంతో నేను ఏడుస్తూనే నది ఒడ్డున ఒక గుంత తీసి నా కుమారుడిని అక్కడే పూడ్చివేసి వచ్చాను” అని ఫయాజ్ చెప్పారు.

ప్రస్తుతం వాళ్లంతా బంగ్లాదేశ్‌లో క్షేమంగా ఉన్నారు. అయితే వాళ్లను అధికారులు పట్టుకుంటే మళ్లీ వెనక్కు పంపిస్తారు.

నిసార్ ఖురాన్‌ను పట్టుకుని ఉన్నారు. తన జీవితం ఒక్క రోజులో ఎలా తలకిందులు అయిందో ఆయనకింకా అర్థం కావడం లేదు.

“ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే, ఆ రోజు నేను అసలు పారిపోయేందుకు ప్రయత్నించే వాడినే కాదు” అని నిసార్ చెప్పారు.

మియన్మార్ అంతర్యుద్ధంలో ఏం జరుగుతుందో ఒక్క ముక్కలో చెప్పడం చాలా కష్టమైన వ్యవహారం. అయితే ఆగస్టు 5 సాయంత్రం ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆ రోజు సాయంత్రం మియన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ చేరుకున్న పది మందికి పైగా రోహింజ్యాలతో మాట్లాడింది. వాళ్ల దగ్గరున్న వీడియోలను పరిశీలించింది.

రెండు గంటల వ్యవధిలోనే బాంబులు వర్షంలా వచ్చి పడ్డాయని ఆ రోజు ప్రాణాలతో బయట పడిన నిరాయుధ రోహింజ్యాలు చెప్పారు. అందులో ఎక్కువ బాంబుల్ని ప్రయోగించేందుకు డ్రోన్లను ఉపయోగించారని చెప్పారు. కొంతమంది తమపై మోర్టార్లు, తుపాకులతో కాల్పులు జరిపారని తెలిపారు.

ఆ రోజు గాయాలతో తమ దగ్గరకు వచ్చిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్‌ కేంద్రంగా నడుస్తున్న ఎంఎస్ఎఫ్ క్లినిక్ చెప్పింది. గాయపడిన వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు ఉన్నారని పేర్కొంది.

బాంబు దాడుల నుంచి బయటపడిన వారు ఇచ్చిన వీడియోలను బీబీసీ వెరిఫై బృందం పరిశీలించింది. అందులో నది పొడవునా రక్తపు గాయాలతో ఉన్న శరీరాలు ఉన్నాయి. అందులోనూ ఎక్కువగా మహిళలు, చిన్నారుల దేహాలే ఉన్నాయి. ఎంతమంది చనిపోయారనే దాని గురించిన వివరాలు తెలియలేదు. అయితే చాలా మంది చనిపోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘అరాకన్ సైన్యం దాడి చేసింది’

తమపై అరాకన్ సైన్యం దాడి చేసిందని బాధితులు చెప్పారు. మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి సైన్యాన్ని తరిమి కొట్టిన అతి పెద్ద శక్తిమంతమైన తిరుగుబాటుదారుల గ్రూప్ ఇది. వాళ్లు మొదట తమ గ్రామాలపై దాడి చేశారని, తాము పారిపోయేలా చేశారని, తాము పారిపోతుండగా నది ఒడ్డున కూడా దాడి చేశారని బాధితులు తెలిపారు.

ఈ విషయమై ప్రశ్నించేందుకు అరాకన్ ఆర్మీని బీబీసీ సంప్రదించింది. బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వారు నిరాకరించారు. అయితే ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ వారి ప్రతినిధి బీబీసీ ప్రశ్నలకు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఈ సంఘటనలు మా నియంత్రణలో ఉన్న ప్రాంతంలో జరగలేదు” అని ఆయన అన్నారు. ఈ మారణకాండకు రోహింజ్యా కార్యకర్తలే కారణమని, దారుణాలన్నీ వారు చేసి అరాకన్ ఆర్మీపై నిందలు మోపుతున్నారు” అని ఆయన ఆరోపించారు.

అయితే నిసార్ తాను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు.

“అరాకన్ ఆర్మీ అబద్దాలు చెబుతోంది. ఈ దాడులు చేసింది వాళ్లే. ఆ రోజు మా ప్రాంతంలో ఉన్నది వాళ్లు మాత్రమే. వాళ్లు కొన్ని వారాలుగా మాపై దాడులు చేస్తున్నారు. వాళ్లు ముస్లింలందర్నీ చంపేయాలని నిర్ణయించుకున్నారు” అని నిసార్ చెప్పారు.

బౌద్ధులు ఎక్కువగా ఉండే రఖైన్ రాష్ట్రంలో రోహింజ్యా ముస్లింలు మైనార్టీలు. ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. 2017లో మియన్మార్ సైన్యం వేల మంది రోహింజ్యాలను హతమార్చింది. దీన్ని ఐక్యరాజ్య సమితి “ఒక జాతి సమూల నిర్మూలనానికి అతి పెద్ద ఉదాహరణ”గా పేర్కొంది. ఈ దాడుల్లో సైన్యంతో పాటు రఖైన్ స్థానికులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు జుంటా సైనిక ప్రభుత్వం, అరాకన్ ఆర్మీ మధ్య సంఘర్షణలో తాము చిక్కుకున్నట్లు రోహింజ్యా ముస్లింలు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్, మియన్మార్, రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి బేబీ జైదుర్

‘నేనెందుకు బతికి ఉన్నానో?’

బంగ్లాదేశ్ అధికారులు తమను పట్టుకుని తిరిగి మియన్మార్ పంపే ప్రమాదం ఉన్నప్పటికీ, తాము ఎదుర్కొన్న హింసాత్మక పరిస్థితుల గురించి బీబీసీకి చెప్పాలనుకుంటున్నామని రోహింజ్యా బాధితులు తెలిపారు. ఈ విషయాలు అందరికీ తెలియాలని వారు కోరుకున్నారు. వాళ్లు నివసిస్తున్న ప్రాంతానికి చేరుకునేందుకు హక్కుల సంఘాలకు కానీ, జర్నలిస్టులకు కానీ అనుమతి లేదు.

“నా గుండె బద్దలైంది. నాకిప్పుడు ఏమీ మిగల్లేదు. నేను ఎందుకు బతికి ఉన్నానో నాకు తెలియడం లేదు” అని నిసార్ చెప్పారు.

రఖైన్‌లోని తన ఇల్లు, పొలంలో బాంబు దాడులు పెరగడంతో సంపన్నుడైన రోహింజ్యా వ్యాపారి ఒకరు ఇల్లు, పొలం అమ్మేశారు. దాడుల తీవ్రత పెరగడంతో ఆగస్టు 5న మియన్మార్ విడిచి వెళ్లాలని నిర్ణయించారు.

వీడియోలో తన కుమార్తె మృతదేహాన్ని చూపిస్తూ ఆయన కన్నీరు పెట్టారు. “నా కూతురు అల్లాను తలచుకుంటూ నా చేతుల్లోనే చనిపోయింది. ఆమె చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆమె నిద్రపోతున్నట్లే అనిపించింది. ఆమెకు నేనంటే చాలా ఇష్టం” అన్నారు.

అదే వీడియోలో ఆయన తన భార్య, సోదరిని కూడా చూపించారు. వాళ్లిద్దరూ తీవ్రంగా గాయపడి, జీవించి ఉన్నప్పుడు ఆయన ఆ వీడియో తీశారు. బాంబులు పడుతూ ఉండటంతో ఆయన వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. దాంతో వాళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు. వాళ్లు చనిపోయినట్లు ఆయనకు తర్వాత తెలిసింది.

బంగ్లాదేశ్, రోహింజ్యాలు, రఖైన్, అరాకన్ ఆర్మీ

ఫొటో సోర్స్, BBC/Aamir Peerzada

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న ఫయాజ్, ఆయన కుటుంబ సభ్యులు

‘కాల్పులు జరిపింది అరాకన్ ఆర్మీనే’

“అక్కడ ఏ ప్రాంతంలోనూ భద్రత లేదు. అందుకే నది దాటి బంగ్లాదేశ్ వచ్చాం” అని ఫయాజ్ చెప్పారు. వాళ్లు ఒక్కో ఊరు దాటే కొద్దీ బాంబులు, తుపాకీ పేలుళ్లు వారిని వెంటాడుతూ వచ్చాయి. దీంతో ఫయాజ్ నది దాటేందుకు పడవ యజమానికి తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చారు.

ఆయన చేతిలో రక్తసిక్తమై ఉన్న ఆయన కుమారుడికి సంబంధించిన ఫొటో ఉంది. "అరాకన్ ఆర్మీ కాకపోతే మాపై కాల్పులు జరిపింది ఎవరు? బాంబులు దూసుకొచ్చిన ప్రాంతాన్ని గమనిస్తే, అక్కడ అరాకన్ సైన్యం కాక ఎవరు ఉన్నారు? బాంబులు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఆరోపణలు అరాకన్ ఆర్మీ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అరాకన్ ఆర్మీ తమను తాము రఖైన్ ప్రజలందరి ప్రతినిధిగా చెప్పుకుంటుంది.

గతేడాది వరకు మియన్మార్‌లోని సాయుధ తిరుగుబాటుదారుల బ్రదర్‌హుడ్ కూటమిలో అరాకన్ ఆర్మీ భాగస్వామిగా ఉంది. సైన్యానికి వ్యతిరేకంగా ఈ గ్రూప్ భారీ విజయాలు సాధించింది. అయితే సైన్యం పరాజయాలు రోహింజ్యాలకు మరింత ప్రమాదకరంగా మారాయి. జుంటా సైనిక ప్రభుత్వం అరాకన్ ఆర్మీతో పోరాడేందుకు రోహింజ్యాలను బలవంతంగా సైన్యంలోకి తీసుకుందని వారు బీబీసీకి చెప్పారు.

జుంటా సైనిక ప్రభుత్వంతో కలిసి రఖైన్ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడాలని రోహింజ్యా మిలిటెంట్ గ్రూప్ ఏఆర్ఎస్ఏ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల అరాకన్ ఆర్మీ, రోహింజ్యాల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు దెబ్బ తిన్నాయి. దీంతో అరాకన్ ఆర్మీ రోహింజ్యాల మీద ప్రతీకార దాడులు మొదలు పెట్టింది.

జుంటా ప్రభుత్వంతో కలిసి పోరాడుతున్న ఏఆర్ఎస్ఎ మిలిటెంట్లు పారిపోయేటప్పుడు బాధితుల్లో కలిసిపోవడంతో అరాకన్ ఆర్మీ మరింత రెచ్చిపోయి దాడులు చేసినట్టు ఆగస్టు 5న దాడుల నుంచి ప్రాణాలతో బయట పడిన ఓ బాధితుడు బీబీసీకి చెప్పారు.

“సైనిక లక్ష్యాలు ఉన్నప్పటికీ, వాళ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆరోజు అక్కడ చనిపోయినవారిలో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు” అని ఫార్టిఫై రైట్స్‌ అనే మానవహక్కుల సంఘం డైరెక్టర్ జాన్ క్విన్లే చెప్పారు. ఆయన ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

“ఆగస్టు 5న యుద్ధ నేరాలు జరిగాయని నమ్మేందుకు సహేతుకమైన ఆధారాలు ఉన్నాయనిపిస్తోంది . ఈ నేరాలకు సంబంధించి అరాకన్ ఆర్మీ మీద విచారణ జరగాలి. అరాకన్ ఆర్మీ సీనియర్ కమాండర్లను బాధ్యులను చేయాలి” అని ఆయన అన్నారు.

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో పది లక్షల మందికి పైగా రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు.

‘రెండురోజులపాటు నీటిలోనే ఉన్నాం’

రోహింజ్యా కమ్యూనిటీకి ఇది ప్రమాదకరమైన సమయం. 2017లో పది లక్షల మందికి పైగా రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. అక్కడ వారు కిక్కిరిసిన, దుర్భరమైన శిబిరాల్లో జీవిస్తున్నారు.

రఖైన్ రాష్ట్రంలో యుద్ధం జనావాసాల్లోకి రావడంతో బంగ్లాదేశ్ వైపు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. అయితే ఇది 2017 కాదు. అప్పట్లో మాదిరిగా రోహింజ్యా ముస్లింల కోసం తమ సరిహద్దుల్ని తెరిచి ఉంచలేమని బంగ్లాదేశ్ చెప్పింది.

దీంతో పడవ యజమానులు, ట్రాఫికర్లకు భారీ మొత్తాలను చెల్లించగలిగిన వాళ్లే బంగ్లాదేశ్ చేరుకుంటున్నారు. ఒక్కో వ్యక్తికి 6లక్షల బర్మీస్ క్యాట్‌లు (రూ.15,473) చెల్లించినట్లు బాధితులు బీబీసీతో చెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకున్న తర్వాత అక్కడున్న సరిహద్దు దళాల జవాన్లను దాటుకుని స్థానికుల్లో కలిసిపోవడం లేదా రోహింజ్యా క్యాంపుల్లో దాక్కునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 6న ఫయాజ్, ఆయన కుటుంబం బంగ్లాదేశ్ వచ్చినప్పుడు సరిహద్దు భద్రతా దళానికి చెందిన గార్డులు వారికి భోజనం పెట్టి, వారు ఎక్కి వచ్చిన పడవలోనే తిప్పి పంపారు.

“మేము అక్కడ ఆహారం, నీరు లేకుండా నీటిలోనే తేలుతూ రెండు రోజులు గడిపాం. నేను నది నీళ్లనే నా కూతుళ్లకు తాగించాను. పడవలో ఎవరి దగ్గరైనా బిస్కెట్లు ఉంటే ఇవ్వాలని ప్రార్థించాను” అని ఫయాజ్ చెప్పారు.

మొదటి ప్రయత్నం విఫలమైనా, రెండో ప్రయత్నంలో వారు బంగ్లాదేశ్‌లోకి అడుగు పెట్టారు. బాధితులు ఎక్కువగా ఉన్న రెండు పడవలు నీట మునిగాయి. బాంబు దాడుల సమయంలో తన పది మంది పిల్లలను కాపాడుకున్న ఓ మహిళ... పడవ నీట మునిగిన ప్రమాదంలో ఐదుగురు కుమారులను కోల్పోయింది.

“నా పిల్లలే నాకు ప్రాణం. వాళ్ల గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా చనిపోవాలని అనిపిస్తుంది” అని చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ఆమె ఎనిమిదేళ్ల మనవడు ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ప్రమాదంలో చనిపోయారు.

రోహింజ్యాలు, బంగ్లాదేశ్, రఖైన్, మియన్మార్

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, నదిని దాటే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు

‘మమ్మల్ని ఆదుకోండి’

ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారి పరిస్థితేంటి? మౌంగ్‌డాలో ఫోన్, ఇంటర్నెట్ సేవల్ని వారాల తరబడి ఆపేశారు. అయితే బీబీసీ అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ వ్యక్తిని సంప్రదించగలిగింది. భద్రత దృష్ట్యా ఆయన తన పేరు బయట పెట్టవద్దని కోరారు.

“అరాకన్ ఆర్మీ మమ్మల్ని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు పంపింది. స్కూళ్లు, మసీదుల్లో ఉంచింది. నేను, మరో ఆరు కుటుంబాలతో కలిసి చిన్న ఇంటిలో ఉంటున్నా” అని ఆయన చెప్పారు.

సైన్యంతో యుద్ధం జరుగుతున్నప్పటికీ తాము 20వేల మంది పౌరుల్ని కాపాడినట్లు అరాకన్ ఆర్మీ బీబీసీకి చెప్పింది. వారికి ఆహారంతో పాటు వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపింది.

“వారి భద్రత కోసమే మేం వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చాం. ఎవరినీ ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించలేదు” అని ఏఏ ప్రతినిధి చెప్పారు.

అయితే బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించిన వ్యక్తి ఈ అంశాలను తిరస్కరించారు.

“మేము ఇళ్లు వదిలి వెళ్లకపోతే, మమ్మల్ని కాల్చేస్తామని అరాకన్ ఆర్మీ చెప్పింది. మాకు ఆహారం, ఔషధాలు ఏమీ ఇవ్వలేదు. నాకు, మా అమ్మకు జబ్బు చేసింది. అనేకమంది డయేరియాతో బాధ పడుతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు” అని చెప్పారు.

తమకు సాయం అందించాలని కోరుతూ ఆయన ఏడ్చారు.

“అక్కడ వేల మంది రోహింజ్యాలు ప్రమాదంలో ఉన్నారు. వారికి సాయం చేయండి, దయచేసి మమ్మల్ని ఆదుకోండి” అంటూ ప్రాధేయపడ్డారు.

బంగ్లాదేశ్ నదీతీరం నుంచి నిసార్ మియన్మార్ వైపు చూస్తున్నారు. అక్కడ నుంచి ఆయనకు తన కుటుంబ సభ్యుల్ని చంపేసిన ప్రాంతం కనిపిస్తోంది.

“నేనిక ఎప్పటికీ అక్కడకు వెళ్లను” అని ఆయన తనలో తానే అనుకున్నారు.

ఆమిర్ పీర్జాదా , సంజయ్ గంగూలీ అందించిన వివరాలతో

(బాధితుల విజ్ఞప్తి మేరకు వారి పేర్లు మార్చాం.)

(బీబీసీ కోసం కలెక్టివ్‌ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)