‘సముద్రంలో పడిపోయిన నా ఏడాది కూతురిని రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని ఈదుకుంటూ వచ్చాను’

ఫొటో సోర్స్, EPA
ఇటలీలోని సిసిలీ తీరంలో మునిగిపోయిన పడవలో ఉన్న ఒక తల్లి తన బిడ్డను కాపాడుకున్న తీరును వివరించారు. నీళ్లలో మునిగిపోకుండా బిడ్డను చేతులతో పైకెత్తి పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున లగ్జరీ విహార పడవ ‘బయేసియన్’ నుంచి రక్షించిన 15 మందిలో షార్లెట్ గోలున్‌స్కి, ఆమె ఏడాది కూతురు ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ బ్యాంక్ చైర్మన్ జొనాథన్ బ్లూమర్, బ్రిటిష్ టెక్ టైకూన్ మైక్ లించ్ సహా ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు.
10 మంది సిబ్బంది, 12 మంది పర్యటకులతో ప్రయాణిస్తున్న 56 మీటర్ల పొడవైన ఈ విహార పడవ బయేసియన్ పలెర్మో తీరానికి సుమారు కిలోమీటరు దూరంలో మునిగిపోయింది.
ప్రమాదం నుంచి బయటపడిన షార్లెట్ ఇటలీ వార్తాపత్రిక ‘లా రిపబ్లికా’తో మాట్లాడారు. ప్రమాద సమయంలో డెక్‌పై ఉన్నందువల్లే తమ కుటుంబం ప్రాణాలతో బయటపడిందని ఆమె చెప్పారు.

"ఉరుములు, మెరుపులు, అలల కారణంగా మా పడవ ఊగిపోయింది" అని ఆమె తెలిపారు. తాము నీళ్లలోకి జారిపోవడానికి ముందు ప్రపంచం అంతం అయినట్లు అనిపించిందని ఆమె అన్నారు.
"రెండు సెకన్ల పాటు నా కూతురు నా చేతుల్లోంచి సముద్రంలోకి జారిపోయింది. అయితే నేను తేరుకుని, ఆ అలల ఉద్ధృతిలోనే ఆమెను గట్టిగా పట్టుకున్నాను" అని ఆమె చెప్పినట్లు ఆ వార్తాపత్రిక పేర్కొంది.
‘నా శక్తినంతా ఉపయోగించి నీళ్లలో తేలుతూ, నా కూతురు మునిగిపోకుండా నా రెండు చేతులతో ఆమెను పైకెత్తి పట్టుకున్నాను’ అని షార్లెట్ తెలిపారు.
‘అప్పుడంతా చీకటిగా ఉంది. నీళ్లలో నేను కళ్లు కూడా తెరవలేకపోయాను. నేను సహాయం కోసం అరిచాను, కానీ నా చుట్టూ ఇతరుల అరుపులు మాత్రమే నాకు వినిపించాయి’ అని ఆమె అన్నారు.
అదృష్టవశాత్తూ ఒక లైఫ్‌బోట్‌లో గాలి నింపి 11 మంది అందులోకి ఎక్కగలిగారు. షార్లెట్, ఆమె భాగస్వామి, కుమార్తె క్షేమంగా బయటపడ్డారు, వారిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, Facebook
సమీపంలోని మరో పడవ కెప్టెన్ కార్స్‌టెన్ బోర్నర్ ఈ ఘటన గురించి చెప్తూ.. లైఫ్ బోట్‌లో వస్తున్న కొందరిన తమ సిబ్బంది రక్షించారన్నారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
విహార పడవ ఒక వైపు ఒరిగిపోయి కొన్ని నిమిషాల్లోనే మునిగిపోయిందని చెప్పారు.
ఈ పడవ మునిగిపోవడం చూసిన ఫిషింగ్ ట్రాలర్ కెప్టెన్ ఫాబియో సెఫాలూ తాను చూసింది మీడియాకు చెప్పారు.
తాను ఫిషింగ్‌కు వెళ్లబోతుండగా మెరుపులు మెరవడంతో హార్బర్‌లోనే ఉండిపోయానని చెప్పారు.
‘ఉదయం 4.15 గంటలకు మాకు సముద్రంలో ఒక పెద్ద వెలుతురు కనిపించింది. అక్కడికి 10 నిమిషాల తరువాత మేం సముద్రంలోకి వెళ్లాం. కొద్దిదూరం వెళ్లగానే ఒక పడవ మొత్తం సముద్రంలో మునిగిపోతూ కనిపించింది. అయితే, అక్కడ మాకు మనుషులెవరూ కనిపించలేదు’ అన్నారు ఫాబియో.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














