ఒరోపౌచె: విస్తృతంగా వ్యాపిస్తున్న వైరస్, దీనిని అరికట్టడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓనూర్ ఎరెమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒరోపౌచె కేసుల పెరుగుదల, దాని కారణంగా ఇటీవల చోటుచేసుకున్న మరణాలు పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ తీరును శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేదు. దీనికి ప్రస్తుతం టీకాలు, మందులు అందుబాటులో లేవు.
జులై చివరలో బ్రెజిల్‌లో బహియాకు చెందిన ఇద్దరు యువతులు ఒరోపౌచె సోకి మరణించారని అధికారులు ధ్రువీకరించారు. క్యూబా కూడా మొదటి కేసును గుర్తించింది.
ఈ వైరస్ చీకటి ఈగలు (నుసుము), దోమ కాటు ద్వారా వ్యాపించింది.ఇంతకీ, ఈ వ్యాధి వల్ల కలిగే నష్టాలు ఏమిటి? వ్యాధి నిర్ధరణ ఎలా, చికిత్స ఏమిటి?


ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఒరోపౌచె వైరస్ ?
ఒరోపౌచె అనేది కీటక కాటు ద్వారా వ్యాపించే వైరస్. ఇవి గుండుసూది మొన సైజులో ఉండే క్యులికోయిడ్స్ పారాయెన్సిస్‌గా పిలిచే చీకటీగల ద్వారా వ్యాపిస్తుంది. అమెరికాలోని అనేక ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
1955లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని ‘వేగా డి ఒరోపౌచె’ అనే గ్రామంలో మొదటి కేసు నమోదైంది.
గత 60 ఏళ్ళలో బ్రెజిల్‌లో 5 లక్షల కంటే ఎక్కువ ఒరోపౌచె కేసులు నిర్ధరణ అయ్యాయని, వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
బ్రెజిల్‌లో 2024లో ఇప్పటివరకు దాదాపు 10,000 కేసులు నమోదయ్యాయి.
2023లో ఇవి ఎనిమిది వందలు మాత్రమే. ఈ కేసుల్లో ఎక్కువ భాగం అమెజాన్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయి, ఒరోపౌచె వ్యాప్తి విస్తృతంగా కనిపించే ప్రాంతమది.
బ్రెజిల్‌తో పాటు పెరూ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా, ఫ్రెంచ్ గయానా, పనామా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బొలీవియా, క్యూబా వంటి దేశాల్లో కూడా ఇటీవల దశాబ్దాలలో ఒరోపౌచె ప్రజారోగ్య సమస్యగా మారింది.
ఐరోపాలోని స్పెయిన్, ఇటలీ, జర్మనీలలో జూన్ నుంచి కొన్ని కేసులు నమోదయ్యాయి.
అయితే ఇవి క్యూబా, బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రయాణికులలో కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా వ్యాపిస్తుంది?
ఒరోపౌచె వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కీటక కాటు ద్వారా వ్యాపిస్తుంది.
ఇది స్పర్శ, గాలిద్వారా వ్యాపిస్తుందనడానికి ఎటువంటి రుజువు లేదు.
అయితే, గర్భిణుల నుంచి వారికి పుట్టబోయే బిడ్డలకు వైరస్ సంక్రమించే అవకాశం ఉందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక హెచ్చరిస్తోంది.
పట్టణీకరణ, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు వంటి కారణాల వల్ల మానవులలో వ్యాప్తి ఎక్కువవుతోంది.
కోతులు, స్లోత్స్ వంటి జంతువులలో కూడా ఒరోపౌచె సహజంగా కనిపిస్తోంది.
ఈ వైరస్ కొన్ని పక్షులపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒరోపౌచె లక్షణాలు
ఒరోపౌచె వైరస్ సోకినవారిలో సాధారణంగా డెంగీ జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి లక్షణాలను పేర్కొంది.
- హఠాత్తుగా ఎక్కువ జ్వరం
- తలనొప్పి
- కళ్ల వెనుక నొప్పి
- కీళ్ల నొప్పులు
- చలి
- వికారం
- వాంతులు
ఈ లక్షణాలు సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటాయి.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, 60 శాతం మంది రోగులలో లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల తర్వాత కూడా తిరిగి రావచ్చు.
ఈ లక్షణాలు కూడా మునుపటి మాదిరే ఉంటాయి.
వ్యాధి తిరగబెట్టడానికి కారణాలు స్పష్టంగా తెలియవు.
తీవ్రత ఎంత?
ఒరోపౌచె జ్వరంతో బాధపడుతూ మృతిచెందిన వ్యక్తుల కేసులు మొదటిసారిగా బ్రెజిల్‌లో జూలై 25న నమోదయ్యాయి. బాధితులిద్దరూ రెండుపదుల వయసున్న యువతులే. వారికి ఇంతకుముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు.
ఈ వైరస్ గర్భంలో ఉన్నప్పుడు సోకితే పుట్టబోయే శిశువులలో మెదడు లోపాలు ఉండవచ్చని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బాధిత తల్లులకు జన్మించిన శిశువులలో నాలుగు మైక్రోసెఫాలీ కేసులను వారు గుర్తించారు.
అయితే గర్భధారణ సమయంలో వైరస్ ప్రమాదాలను నిర్థరించడానికి మరింత పరిశోధన అవసరం. ఒరోపౌచె నుంచి ఎదురయ్యే ఇతర తీవ్రమైన సమస్యలలో మెదడువాపు, మెనింజైటిస్‌లు ఉన్నాయి.
అయితే, బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు మరణాలనే అధికారికంగా ప్రకటించింది. కొన్ని దశాబ్దాలుగా ఈ వైరస్ బారిన 5 లక్షల మంది పడ్డారు.
మరణాలకు కారణం ఒరోపౌచె అని తెలియక వారిని డెంగీ,తదితర కారణాలలో చేర్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏమిటి?
ఒరోపౌచె వైరస్ సోకినవారికి చికిత్స చేసేందుకు నిర్దుష్ట మందులు లేవు.
ఒరోపౌచె ఫీవర్.. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ముప్పు అని ది లాన్సెట్ మైక్రోబ్ వర్ణించింది.
కొత్త చికిత్సలపై తగినంత పరిశోధనలు జరగడం లేదని హెచ్చరించింది.
బాధితులు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని, వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందాలని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలను తగ్గించడానికి వైద్యులు మందులను సిఫారసు చేయవచ్చు.
ఒరోపౌచె జ్వరం ఉంటే కీటక నాశినులను వాడుతూ ఉండాలి. ఇది ఇతర కీటకాలు మిమ్మల్ని కుట్టకుండా, ఇతర వ్యక్తులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
నివారణ మార్గాలేంటి?
జ్వరాన్ని నివారించడానికి టీకాలు లేవు. మిమ్మల్ని దోమలు, ఇతర కీటకాలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. దీనికోసం ఆరోగ్య నిపుణులు ఈ ప్రాథమిక జాగ్రత్తలను సూచించారు:
- దోమలు ముఖ్యంగా చీకటి ఈగల్లాంటి కీటకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
- తలుపులు, కిటికీలపై నాణ్యమైన జల్లెడ తెరలను ఏర్పాటు చేసుకోవాలి.
- శరీరంపై ఎక్కువ భాగాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.
- బయటికి కనిపించే చర్మంపై క్రిమినాశక లేపనాలు పూయాలి.
- మీ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచండి.
- పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- చనిపోయిన మొక్కలపై కీటకాలు సంతానోత్పత్తి చేయగలవు, అలాంటి మొక్కలను తొలగించండి
దోమతెరలు ఉపయోగకరమే, కానీ ఒరోపౌచె నివారణలో అంతగా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒరోపౌచెని మోసుకెళ్లే చిన్న చిన్న కీటకాలు దోమ తెరల గుండా ప్రయాణించగలవు.
వ్యాధిని వ్యాప్తి చేసే కీటకాలను నియంత్రించడంలో డెల్టామెత్రిన్, డీఈఈటీ (డై ఇథైల్ టోలు అమైడ్) వంటి కొన్ని క్రిమిసంహారకాలు ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది.
ప్రజారోగ్యం కోసం వైరస్ వ్యాప్తి చెందకముందే వాటిని నిర్ధరించడానికి, నియంత్రించడంలో సహాయపడటానికి ఒరోపౌచె కోసం పరీక్షలను మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచాలనే సూచనలున్నాయి.
అటవీ నిర్మూలన, శీతోష్ణస్థితి మార్పుల వల్ల ఒరోపౌచె కొత్త ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం పెరుగుతోంది.
డెంగీ, జికా, చికెన్ గున్యా మాదిరిగానే పట్టణాలలో మరిన్ని కేసులకు దారి తీయవచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














