ఆడుకుంటూ తప్పిపోయాడు.. 5 రోజుల తరువాత అడవిలో దొరికాడు

ఫొటో సోర్స్, Vietnamese state media
- రచయిత, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ న్యూస్
వియత్నాంలో తోబుట్టువులతో ఆడుకుంటూ తప్పిపోయిన ఓ ఆరేళ్ల బాలుడు ఐదు రోజుల తర్వాత దట్టమైన అడవిలో దొరికాడు.
డాంగ్ టియన్ ల్యామ్ అనే బాలుడిది యెన్ బై ప్రావిన్స్.
ఆగస్ట్ 17న తన తొమ్మిది మంది తోబుట్టువులతో కలిసి సెలయేటి దగ్గర ఆడుకునే సమయంలో కొండ ప్రాంతాల్లోకి తిరుగుతూ.. అక్కడ కనిపించకుండా పోయినట్లు స్థానిక మీడియా చెప్పింది.
అడవికి దగ్గర్లో ఉన్న దాల్చినచెక్క పంటను కోసే సమయంలో పిల్లాడి ఏడుపు వినిపించడంతో స్థానిక రైతులు బుధవారం ఈ బాలుడిని గుర్తించారు.
అడవిలో కర్ర పెండ్లం పొదల్లో కూర్చుని బాలుడు కనిపించాడు. బాలుడు తప్పిపోయిన ప్రాంతానికి అది 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రైతులు గుర్తించేటప్పటికి బాలుడు చాలా నీరసంగా ఉన్నాడు. కనీసం నిల్చోలేని పరిస్థితిలో కనిపించాడు.
‘‘నేను చాలా అలసిపోయాను. నిల్చోలేకపోతున్నా. ప్లీజ్ నన్ను ఎత్తుకోండి’’ అని ల్యామ్ అన్నట్లు 52 ఏళ్ల రైతు లి వాన్ నాంగ్ చెప్పారు.

చెట్ల ఆకులు, పండ్లు, సెలయేటి నీటిని తాగి ల్యామ్ బతికినట్లు చెప్తున్నారు.
అడవి నుంచి బయటికి తీసుకొచ్చాక ఈ బాలుడికి స్థానికులు కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
బాలుడు వేసుకున్న ఎర్ర టీ-షర్ట్, షార్ట్ పూర్తిగా మాసిపోయాయి.
‘‘తప్పిపోయిన తర్వాత, ఇంటికి వెళ్లే దారిని కనుగొనలేకపోయానని బాలుడు చెప్పినట్లు’’ లోకల్ న్యూస్ సైట్ డాన్ ట్రీకి నాంగ్ తెలిపారు.
ఎక్కువ దూరం నడవడం వల్ల, బాలుడు ఇంటికి వెళ్లే దారిని గుర్తించలేకపోయాడని చెప్పారు.
ల్యామ్ ప్రాణాలతో బయటపడటం అద్భుతమని పోలీసులు చెప్పారు. కుటుంబం వద్దకు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు శుభాకాంక్షలని ఫేస్‌బుక్ పోస్టులో అధికారులు రాశారు.
సోషల్ మీడియాలో ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత, చాలా మంది ల్యామ్ కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాక, సహాయ సిబ్బంది ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పారు.
కనిపించకుండా పోయిన ఈ బాలుడిని వెతికేందుకు పోలీసు అధికారులు, సైనికులు, స్థానిక వలంటీర్లతో కలిపి 150 మందికి పైగా సిబ్బందిని సెర్చ్ ఆపరేషన్ కోసం అధికారులు పంపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














