సేఫ్టీ ఆడిట్ అంటే ఏమిటి? ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని ఓ పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని ఓ పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదం తర్వాత కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్‌పై విస్తృత చర్చ జరుగుతోంది.

సేఫ్టీ ఆడిట్ సరిగా జరగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ఇక నుంచి కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ జరిపిస్తామని ప్రభుత్వం కూడా చెబుతోంది.

ఈ విషయంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.

‘‘పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ గురించి సెప్టెంబర్‌లో చర్చించాలనుకున్నాం. కానీ, ఈ నెల చివరిలోనే ఈ విషయంపై కంపెనీల ప్రతినిధులతో మాట్లాడతాను'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’లో జరిగిన ప్రమాదం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

ఫొటో సోర్స్, screen grab/BBC

ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు మూతపడతాయేమోనని యజమానులు ఆందోళన చెందుతున్నారని, దీని గురించి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.

కంపెనీలలో సేఫ్టీ ఆడిట్ అంశంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.

‘‘గత ప్రభుత్వం ఏం చేసిందన్నది మాకు అనవసరం. ఇప్పుడున్న కంపెనీలన్నింటిలో సేఫ్టీ ఆడిటింగ్ జరగాలి. సేఫ్టీ ఆడిట్ జరిగితే ముందస్తు భద్రత చర్యలు ఏం తీసుకున్నారనేది తెలుస్తుంది’’ అన్నారు.

రాబోయే రోజుల్లో కచ్చితంగా సేఫ్టీ ఆడిట్ జరుగుతుందని బీబీసీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.

ఇంతలా చర్చ జరుగుతున్న ఈ సేఫ్టీ ఆడిట్ అంటే ఏమిటి? కంపెనీల్లో ఇది ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేయాలి? ఎవరు చేస్తారు? అనే విషయాలపై చర్చ జరుగుతోంది. ఆ వివరాలను ఒకసారి ఇక్కడ చూద్దాం..

అచ్యుతాపురం ప్రమాదం

సేఫ్టీ ఆడిట్ అంటే..

భారతదేశంలో 1948లో ఫ్యాక్టరీల చట్టం అమల్లోకి వచ్చింది.

కంపెనీలు లేదా పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ స్వయంగా చేయించుకోవాలని ఈ చట్టంలో ఎక్కడా లేదు.

సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని చట్టంలో ఉంది. ఆఫీసర్‌ను ఎలా నియమించుకోవాలి? వారికి ఉండాల్సిన అర్హతలేంటనేది? ఏపీ ఫ్యాక్టరీస్ రూల్స్ చెబుతున్నాయి.

1986లో మాన్యుఫ్యాక్చర్, స్టోరేజీ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్ రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

దీన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వన్యప్రాణి మంత్రిత్వ శాఖ రూపొందించింది.

ఈ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీలనేవి మూడు విభాగాలు లేదా కేటగిరీలుగా ఉన్నాయి.

  • అత్యంత ప్రమాదకరమైనవి
  • ఒక మోస్తరు ప్రమాదకరమైనవి
  • తక్కువ ప్రమాదకరమైనవి

ఈ కేటగిరీల వారీగా నిర్దేశిత సమయం ప్రకారం సేఫ్టీ ఆడిట్ చేయించడం తప్పనిసరి అని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన కనెక్ట్ ఐటీ సొల్యూషన్స్ సేఫ్టీ ఆపరేషన్స్ మేనేజర్ పెద్దోజు నాగరాజు.

కనెక్ట్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ లారస్ ల్యాబ్స్, మెగా ఇంజినీరింగ్, గ్లాండ్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలకు సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలకు సంబంధించి ప్రతి 12 నెలలకోసారి థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ చేయించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆ నివేదికను ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించాలి.

ఒక మోస్తరు, తక్కువ ప్రమాదకరమైన పరిశ్రమలను ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులే ఏడాదికోసారి తనిఖీ చేయాలి.

అలా తనిఖీ చేసిన నివేదికను సంబంధిత కంపెనీకి ఇవ్వాలి. దానిపై తమ వివరణతో కూడిన నివేదికను ఆయా కంపెనీలు తయారు చేసి మళ్లీ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అవసరమని తనిఖీల తర్వాత ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు అభిప్రాయపడితే, కంపెనీలు థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు పెద్దోజు నాగరాజు.

అన్ని కంపెనీలూ ఏడాదికోసారి సేఫ్టీ ఆడిటింగ్ చేయించుకోవడం మంచిదని పర్యావరణవేత్త, కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు.

‘‘ఏటా సేఫ్టీ ఆడిటింగ్ చేయించుకుంటే మేలు జరుగుతుంది. దానివల్ల పరికరాల సామర్థ్యం తెలుస్తుంది. ఎందుకంటే నీరు, వాయువు, అగ్ని వంటి వాటిని పైపులైన్లు, ట్యాంకులు ఏ మేరకు తట్టుకోగలవు అనే విషయాలు తెలుస్తాయి’’ అని చెప్పారు.

అగ్నిమాపక పరికరాలు

ఫొటో సోర్స్, Getty Images

సేఫ్టీ ఆడిట్‌లో ఏమేం తనిఖీ చేస్తారంటే..

సేఫ్టీ ఆడిట్ అంటే ఒక కంపెనీలోని యంత్ర పరికరాలు, పరిసరాలు, విద్యుత్తు, నీటి వినియోగం, బాయిలర్లు, రియాక్టర్లు, పైపులైన్లు, ఉద్యోగుల భద్రత.. ఇలా అన్నింటి పనితీరును పరిశీలించడం.

సేఫ్టీ ఆడిట్ సందర్భంగా పరిశ్రమలలో ఏయే అంశాలపై తనిఖీ చేయాలనే విషయంపై ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది.

ఐఎస్ (ఇండియన్ స్టాండర్డ్) 14489:1998లో మూడో అధ్యాయంలో ప్రత్యేకంగా ఆ అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆడిట్ పేరుతో ఇది ఉంటుంది.

దీని ప్రకారం 278 ప్రశ్నలతో సేఫ్టీ ఆడిట్ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.

అచ్యుతాపురం సెజ్ ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

సేఫ్టీ ఆడిట్‌లో ఏయే అంశాలపై ప్రశ్నలు ఉంటాయంటే..

అన్ని కంపెనీలకు మొత్తం అన్ని ప్రశ్నల పరంగా పరిశీలన చేసి రాయాల్సిన అవసరం ఉండదు. కంపెనీల స్వరూపం, తయారీ ఉత్పత్తులు, ఉద్యోగుల సంఖ్య బట్టి ఏయే అంశాలు వర్తిస్తే వాటిని తనిఖీ చేయాలి.

సేఫ్టీ ఆడిట్‌లో ఏయే అంశాలపై ప్రశ్నలు ఉంటాయనేది ఒకసారి పరిశీలిస్తే..

  • కంపెనీలో సేఫ్టీ విభాగం పనితీరు, సేఫ్టీ కమిటీల ఏర్పాటు-సమావేశాల నిర్వహణ, సేఫ్టీ బడ్జెట్
  • ప్రమాదాల లెక్కింపు, పరిశోధన, పరిశీలన, సేఫ్టీ తనిఖీలు
  • సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ట్రైనింగ్, పీరియాడిక్ ట్రైనింగ్, సేఫ్టీ కమ్యూనికేషన్/మోటివేషన్/ప్రమోషన్)
  • ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స)
  • కంపెనీ తరఫున ఆరోగ్య కేంద్రం నిర్వహణ
  • సాధారణ పని పరిస్థితులు (హౌస్ కీపింగ్, శబ్దం, వెంటిలేషన్, వెలుతురు)
  • ప్రమాదాల గుర్తింపు, నియంత్రణ
  • సాంకేతిక అంశాలు (సేఫ్ ఆపరేటింగ్ నిబంధనలు, పని స్వరూపం-విధానం, వ్యర్థాల పారబోత, వ్యక్తిగతంగా భద్రత, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ)
  • ఆపదలో స్పందించడం
  • కంపెనీ లే అవుట్, స్థలం విభజన
  • స్టాటిక్ ఎలక్ట్రిసిటీ
  • పైపులైన్ల నిర్వహణ
  • కొత్త యంత్ర సామగ్రి పరిశీలన
  • ట్యాంకుల స్టోరేజీ
  • మెటీరియల్ నిర్వహణ
  • గ్యాస్ సిలిండర్స్ నిల్వ ఉంచే ప్రాంతం
  • కంపెనీలో ఒకరికొకరు సమాచారం అందించుకునే పద్ధతి
  • రవాణా
  • వ్యర్థాల నిర్వహణ
  • ఉద్యోగులకు సంబంధించిన సౌకర్యాల కల్పన

సేఫ్టీ ఆడిట్ చేయడానికి అర్హతలేంటి?

సేఫ్టీ ఆడిట్ ఎవరు చేయాలి.. వారికి ఉండాల్సిన అర్హతలేంటనే దానిపై ప్రత్యేకంగా నిబంధనలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రూపొందించలేదని చెప్పారు పెద్దోజు నాగరాజు.

‘‘ఐఎస్ (ఇండియన్ స్టాండర్డ్) 14489:1998 లో సేఫ్టీ ఆడిట్‌లో ఏయే అంశాలు తనిఖీ చేయాలో మాత్రమే ఉంది. దాన్ని తనిఖీ చేసే వ్యక్తులకు ఉండాల్సిన అర్హతల వివరాలు లేవు. కేంద్రం జారీ చేసిన సేఫ్టీ ఆడిట్ నిబంధనలకు తగ్గట్టుగా.. ఆ ఆడిట్ చేసే వ్యక్తుల అర్హతలు రూపొందించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిపై మహారాష్ట్ర, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించుకున్నాయి. ప్రస్తుతం వాటిని అనుసరిస్తూనే ఏపీ, తెలంగాణలో సేఫ్టీ ఆడిట్ చేసే వ్యక్తులకు ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇస్తోంది’’ అని ఆయన చెప్పారు.

కంపెనీల పరంగా ఏయే టెస్టులు చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలనే దానికి సంబంధించిన వివరాలు, అధీకృత వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లతో ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ వెబ్ సైట్లో ప్రత్యేక జాబితా ఉంటుందని వివరించారు.

కంపెనీలలో మెకానికల్, ఫైర్, కెమికల్, ఎలక్ట్రికల్.. ఇలా అన్ని అంశాలు సేఫ్టీ ఆడిట్లో తనిఖీలు చేయించుకోవచ్చని పెద్దోజు నాగరాజు చెప్పారు.

ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌

సేఫ్టీ ఆడిట్ జరగకపోతే..

నిబంధనల ప్రకారం సమయానుసారం సేఫ్టీ ఆడిట్ చేయించకపోతే 15 రోజుల్లో చేయించమని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ నోటీసు ఇవ్వాలి.

అప్పటికీ చేయించకపోతే షోకాజ్ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునే అధికారం ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్‌కు ఉంటుంది.

రసాయనాలు వినియోగిస్తుంటే ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ చట్టంలోనూ ఉందని చెప్పారు రామకృష్ణారావు.

‘‘ప్రమాదకర రసాయనాలు అనుకోకుండా బయటకు వస్తే వెంటనే అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ ఉండాలి. కంపెనీలు నిర్దేశిత సమయానుసారం సేఫ్టీ ఆడిట్ రూల్స్ ప్రకారం తనిఖీలు చేయించుకోవాలి’’ అని చెప్పారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి..

సేఫ్టీ ఆడిట్ జరగలేదని తెలిస్తే ఉద్యోగులు, సిబ్బంది ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి.

కంపెనీలలో సేఫ్టీ కమిటీ మీటింగ్స్ జరుగుతుంటాయి. అందులో సేఫ్టీ ఆడిట్ జరగడం లేదనే విషయాన్ని ఉద్యోగులు లేవనెత్తవచ్చు.

ఒకవేళ ఈ సమావేశాలు జరగకపోతే కంపెనీల్లో సేఫ్టీ సలహా సంఘాలు ఉంటాయి. వాటికి చెప్పే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుందని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

నేరుగా ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ లేదా ఇన్‌స్పెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)