‘సోషల్ మీడియాలో మెషిన్‌గన్‌లను అమ్మేస్తున్నారు’

ఏకే47 రైఫిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

యెమెన్‌లోని ఆయుధ డీలర్లు కలష్నికోవ్‌లు, పిస్టల్స్, గ్రనేడ్‌లు, గ్రనేడ్ లాంచర్‌లను విక్రయించడానికి బహిరంగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ను ఉపయోగించుకుంటున్నారు.

ఈ డీలర్లు రెబల్ బృందం అయిన హూతీల నియంత్రణలో ఉన్న రాజధాని సనా, ఇతర ప్రాంతాలలో ఉన్నారు.

ఇరాన్ మద్దతు గల హూతీలను ఉగ్రవాదులని పేర్కొంటూ అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు వాళ్లపై నిషేధం విధించాయి.

"ఈ ఆయుధ డీలర్లు హూతీల తరపున పనిచేయడం నమ్మలేకపోతున్నాం" అని యెమెన్‌లోని మాజీ బ్రిటిష్ రాయబారి ఎడ్మండ్ ఫిట్టన్-బ్రౌన్ అన్నారు. ఆయన ఇప్పుడు కౌంటర్ ఎక్స్‌ట్రీమిజం ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు.

టైమ్స్ వార్తాపత్రిక చేసిన పరిశోధనలో, ఇలాంటి అనేక యెమెన్ అకౌంట్లకు బ్లూ టిక్‌ ఉన్నట్లు వెల్లడైంది.

టైమ్స్, బీబీసీ రెండూ ‘ఎక్స్‌’ స్పందన కోసం ఆ సంస్థను సంప్రదించాయి. కానీ ఇప్పటివరకు ఎటువంటి జవాబు రాలేదు.

ఎలాన్ మస్క్ 2022లో ఎక్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్లాట్‌ఫామ్‌లో చాలా మంది కంటెంట్ మోడరేటర్‌లను తొలగించారు.

యెమెన్ వినియోగదారులే లక్ష్యంగా ఈ ప్రకటనలు ఎక్కువగా అరబిక్‌లో ఉంటున్నాయి. యెమెన్‌లో తుపాకుల సంఖ్య జనాభా కంటే మూడు రెట్లు ఉంటుందని అంచనా.

బీబీసీ పరిశోధనలో యెమెని రియాల్, సౌదీ రియాల్ రెండింటిలో ఆయుధాల ధరలను పేర్కొనడం కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆకట్టుకునేలా ప్రకటనలు

ఆయుధాల పక్కన ఉన్న పదాలు సైతం కొనుగోలుదారులను ఆకర్షించేలా ఉన్నాయి.

"అత్యున్నమైన పనితనం, అత్యద్భుతమైన వారంటీ" అని ఒక ప్రకటనలో కనిపించింది. రాత్రిపూట చిత్రీకరించిన ఒక వీడియోలో, 30-రౌండ్ల మ్యాగజైన్‌ను ఆటోమేటిక్‌గా పేల్చడం చూపించారు.

మరొక ప్రకటన పాకిస్తాన్‌లో తయారు చేసిన గ్లాక్ పిస్టల్‌ ఒక్కొక్కటి సుమారు 75 వేల రూపాయలకు లభిస్తుందని పేర్కొంది.

ఈ ప్రకటనలు తుపాకులు, ఇతర చట్టవిరుద్ధమైన వస్తువులను విక్రయించే డార్క్ వెబ్‌లో కాకుండా, ఎక్స్‌లో అందరికీ కనిపించేలా బహిరంగంగా ఉంటున్నాయి.

ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హూతీలకు మద్దతు ఇచ్చే కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూకేలోని ఎన్‌జీఓ టెక్ ఎగైనెస్ట్ టెర్రరిజం అనే సంస్థ విజ్ఞప్తి చేసింది.

గిరిజన మైనారిటీలు అయిన హూతీలు 2014లో యెమెన్‌లో ప్రభుత్వాన్ని తొలగించి అధికారంలోకి వచ్చారు.

అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది.

ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లు, క్షిపణులను కలిగిన హూతీలు 2023 చివరి నుంచి ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు.

ఇది గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చేందుకే అని హూతీలు చెబుతున్నా, చాలా నౌకలకు ఇజ్రాయెల్‌తో ఎటువంటి సంబంధాలు లేవు.

ఓడలపై హూతీల దాడులను ఆపడంలో యూఎస్ నేతృత్వంలోని నావికా దళం విఫలమైంది. ఇది సూయజ్ కాలువ మీదుగా జరిగే వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)